కథ

తూర్పున సూరీడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పశ్చిమాన ఆకాశం పండు ముత్తయిదువు లాగా హృద్యంగా ఉంది, అస్తమించే భానుడి వింత సోయగాన్ని సంతరించుకుని. యధాలాపంగా అటు దిక్కు చూసిన రంగారావు మనస్సు ఒక్క క్షణం తను పడుతున్న మనోవేదనను మరిచిపోయి, మురిసిపోయి, వూళ్లో వున్న తల్లిని గుర్తుకు తెచ్చింది.
అవును, అమ్మ ఈ సమయంలో వాతావరణం, తన ఆరోగ్యం రెండూ ఎలా వున్నా, స్నానం చేసి, మల్లెపూవు లాంటి తెల్లచీర, ముద్దబంతి పూవు రంగు అంచు వున్నది కట్టుకుని, తులసి కోట వద్ద దీపం పెడుతూ వుండి వుంటుంది.
తను ఎరిగిన ఈ నలభై ఏళ్ల పైచిలుకు కాలంలో ఈ దినచర్యలలో ఎట్టి మార్పూ లేదు.
ఆ సమయంలో తల్లి వదనంలో ప్రస్ఫుటించే ప్రశాంతత లోకం అంతా మంచిదే అన్న భావనను కలిగిస్తుంది తనలో.
ఇంతలో నడుస్తున్న తన కాలికి ఓ చిన్న రాయి ఎదురుదెబ్బ తగలటంతో ఇహ లోకంలోకి రాక తప్పలేదు రంగారావుకు.
దానితోపాటు తన సందిగ్ధత తీరి ఏదో ఒక మార్గం కూడా గోచరించింది.
‘సరే, చూద్దాం ప్రయత్నించి’ అనుకుంటూ ఇంటి వైపు తిరిగాడు.
* * *
రంగారావు, రూపమతి ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులు. అమెరికాలో గత పదిహేను సంవత్సరాలుగా ఉంటున్నారు. ఒక్కతే కూతురు వారికి, రాఙ్న. ప్రస్తుతం పదమూడేళ్ల ప్రాయంలో ఉంది.
రంగారావు జననం, పెంపకంలో పల్లెటూరి వాతావరణం, నిత్యజీవన విధానం బీజం వేసుకుని ఉంటే, రూపమతిది పూర్తిగా నగర జీవనం. చదువులు ముగించుకుని, ఉద్యోగ రీత్యా పరిచయం, ఆ పరిచయం పెళ్లికి దారి తీసింది. ఈ లోపల అమెరికాకు వలస. రాఙ్న అమెరికాలోనే పుట్టి పెరిగింది. ఏదో మూడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇండియాకు ఒక నెల కోసం పోయి రావటం తప్ప, పూర్తిగా అమెరికాలోనే స్థిరపడ్డారని చెప్పవచ్చు.
రోజులు గడుస్తూనే వున్నా, రంగారావుకు ఏదో అసంతృప్తి. రూపమతి మాత్రం పూర్తిగా అక్కడ ఇమిడిపోయింది. సంసారంలో వాదనలు లేక శాంతి నిండి ఉండటానికి వీలయినంతగా రంగారావు సర్దుకుపోవటం అలవాటు చేసుకున్నాడు. అసలు పెద్ద విషయాలు అంటూ లేవు వారి మధ్య స్పర్థలు పెరగటానికి, కొద్దిపాటి చిన్నచిన్న సంస్కృతి నేర్పిన అలవాట్లు, చేర్చిన భావనలు తప్ప. ఉదాహరణకు, సెలవు రోజు అయినా తెల్లవారుఝామున ఐదింటికి లేచే అలవాటు రంగారావుది. ఏడు గంటలు కొట్టందే లేవదు రూప. సరే, తన కాఫీ, టిఫిన్లతోపాటు భార్యకి, కూతురికి కూడా ఏర్పరచి వుంచటం మొదలుపెట్టాడు. ఇట్లా చిన్నచిన్న సర్దుబాటు అలవాట్లు అన్న మాట. మన దేశంలో ఇప్పుడిప్పుడు మొదలుపెట్టారు కానీ, పాశ్చాత్య దేశాలలో మొగవాడు కూడా చాలా ఇంటి పనులు పంచుకుంటూ ఉంటాడు. కాలు మీద కాలేసుకుని పేపరో, టీవీ రిమోటో చేతిలో పట్టుకుని కూర్చోకుండా, ఆడవారూ సంపాదన బాధ్యత పంచుకుంటూ వుండగా.
* * *
రోజులు ఇలాగే నడిచిపోతే ఎలా వుండేదో కానీ, ఓ తిరకాసు వచ్చి పడింది వారి జీవితంలో, పై వాడి సంకల్పమో, ప్రారబ్దమో గానీ.
అనుకోకుండా రంగారావు ఫ్రాన్సుకు, రూపమతి నెదర్లాండ్స్‌కు వెళ్లాల్సి వచ్చింది, ఆఫీస్ పని మీద, అదీ ఆరు నెలల కోసం. ఉద్యోగాలలో పై స్థాయికి చేరుకుంటున్నారు ఇప్పుడిప్పుడే. వెళ్లలేము అని అనలేని పరిస్థితి. పోనీ మానేసి ఇంకోచోట చేరే ప్రశ్న కూడా లేదు. ఒకటే ప్రదేశంలో ఇద్దరినీ వుంచుతారు అన్న నమ్మకం తక్కువ కాబట్టి. అందుకని పోవాల్సిందే. మరి రాఙ్న యేమి చేయాలి, ఎక్కడ ఉంచాలి, ఒక్కదాన్ని ఇంట్లో వదిలివేయడమా, వంటి పలు ఆలోచనలు. హాస్టల్‌లో వేద్దాము అని రూపమతి అంటోంది. ఆరు నెలల చదువు పోతే పోయింది, నీతో తీసుకెళ్లు అంటాడు రావు. కుదరదు అని ఆమె. హాస్టల్ వద్దు అని రావు.
ఇప్పుడిప్పుడే మొగ్గ తొడుగుతున్న ముద్ద మందారం రాఙ్న, తోటమాలి సంరక్షణ అవసరం అని ఇద్దరికీ తెలుసు కానీ, ఆ సంరక్షణ ఎక్కడ సరిగ్గా ఉంటుంది అన్న ఆలోచనలోనే విభేదం ఇద్దరిలో.
అదిగో, ఆ సందిగ్ధంలో ఆలోచిస్తూ, నడుస్తున్నప్పుడే రంగారావుకు వేరే మార్గం తట్టింది.
ఆ రాత్రి, భార్యతో అన్నాడు.
‘నువ్వు కాదు అనకుండా ఉంటే నాకు ఒక మార్గం తట్టింది. ఈ ఆరు నెలలు రాఙ్నని మా అమ్మానాన్న దగ్గరకు పంపిస్తాను. కాస్త మన సంస్కృతి, సంప్రదాయం, జీవన విధానం కూడా చూసి వస్తుంది. ఇప్పటి దాకా ఇక్కడి జీవితమే గొప్పది అనుకుంటోంది తను. అసలు వేరే దేశాలలో ప్రజలు ఎట్లా బతుకుతున్నారు, వారి సంస్కృతి ఎట్లాంటిది అన్నది తనకు తెలీదు, ఏదో అప్పుడప్పుడు చిన్నగా వున్నప్పుడు చుట్టపు చూపుగా వెళ్లి రావటం తప్ప. ఈ వయసు సరి అయిన వయసు చూడటానికి, ఒక అవగాహన తెచ్చుకోవడానికి. తరువాత తన జీవితంలో చాలా ఉపయోగపడుతుంది కూడాను. ఏమంటావు?’
‘ఆ పల్లెటూరి వాతావరణంలో ఇమడగలదా తను, అసలు ఆ జీవితం, ఆ పద్ధతులు తనకు తెలీదు. ఇక్కడి జీవితం బాగా అలవాటుపడ్డది. అక్కడి దుమ్ము, ధూళి, జనాన్ని చూసి ఏవగించుకుంటుందేమో. అసలు ఇక్కడి స్నేహితులను, చదువును వదిలి వెళ్లటానికి ఒప్పుకుంటుందో, లేదో కూడా సందేహమే’
‘నీకు అభ్యంతరం లేదూ అంటే చాలు, తనతో మాట్లాడి ఒప్పించే బాధ్యత నాది’
‘ప్రయత్నించండి’
మరునాడు, రాఙ్నతో ‘నీతో కాసేపు మాట్లాడాలి రా నేను’ అన్నాడు రావు.
‘ప్రొసీడ్ డాడ్. చెప్పేయండి’
‘బామ్మకు కాస్త అనారోగ్యంగా వుందట. ఒక రెండు నెలలు నిన్ను పంపించమంది. తనకి తోడుగా నువ్వు వుంటానని, అదీగాక ఇటు తాతగారికి, అటు తాతగారికి కొన్ని రోజులు నీతో సరదాగా గడపాలని ఉందట. నీవు ఓకే అంటే ఏర్పాటు చేస్తాను’
‘ఏదో వెళ్లి రమ్మంటే ఓ టెన్ డేస్ కోసం అంటే తట్టుకోవచ్చు కానీ, ఆ ఇండియానీ నేను భరించలేను డాడ్. దట్ టూ ఫర్ టూమంత్స్, నో డాడ్, ఐ కాంట్. సారీ’
‘చూశారా’ అన్నట్లు అతని వంక చూసింది రూపమతి.
మెల్లిగా తలూపాడు రావు, ఆగు అన్నట్లుగా.
‘అమ్మడూ..’ ఆ పిలుపు చాలు, రాఙ్నకి, విషయం కొంచెం గంభీరమైనది, అంత తేలిగ్గా కొట్టేయాల్సింది కాదు అని తెలియటానికి.
‘అమ్మడూ, నా మాట విను ముందు. తరువాత నువ్వు చెప్పు. నువ్వు వెళ్లు, బామ్మ దగ్గరకు. చూడు. నీవు అక్కడ ఉండలేను అనుకుంటే, కొద్ది రోజులు అమ్మమ్మ వాళ్ల దగ్గర ఉండు. అక్కడా ఉండలేను అనుకుంటే నాకు ఫోన్ చెయ్యి. నీ రిటర్న్ టికెట్ తీసుకుంటా. మళ్లా రెండు మూడు రోజుల్లో ఇక్కడికి వచ్చేద్దువుగాని. ఇక్కడకు వచ్చి తరువాత ఏమిటి అంటే అది అప్పుడు నేను, మీ అమ్మ కలిసి డిసైడ్ చేస్తాం. సరేనా, ఇప్పుడు చెప్పు’
‘ఓకే డాడ్. మీరు చెప్పిన ఈ మాట నాకూ నచ్చింది. ఓకే. ఐ విల్ గో టు ఇండియా. లెట్‌మీ సీ. యెన్ని రోజులు వుండగలనో..’
రూపమతి వైపు ఇప్పుడు చూశాడు రావు. ఆమె మూతి మూడు వంకరలు తిప్పింది.
* * *
రాఙ్నని హైదరాబాద్ విమానాశ్రయంలో అమ్మమ్మ తాతగారు రిసీవ్ చేసుకున్నారు. ఆ రోజుకు అక్కడ వుండి మర్నాడు ప్రొద్దునే్న కార్లో బయలుదేరారు ముగ్గురూ అమలాపురం దగ్గర్లో వున్న పల్లెటూరికి, బామ్మ తాతగారింటికి.
విజయవాడ దాకా వున్న విశాలమైన రోడ్డును చూసి పర్లేదే అనుకుంది రాఙ్న. ఆ తరువాత చిక్కటి పచ్చదనం, కొబ్బరి తోటలు, నీటి కాలువలు ఆహ్లాదంగా కనిపించాయి. మరీ తను అనుకున్నంత మురికిగా లేదు సుమీ అనుకుంది.
ఇంటి ముందు కారు ఆగీ ఆగగానే ఎదురు వచ్చారు బామ్మ తాతగార్లు. ఆ ముసలామె కళ్లల్లోని ఆప్యాయత, వుబికిన రెండు ఆనంద బాష్పాలు చూడగానే అర్థమయింది రాఙ్నకి ఆమె ఎంతగా తన కోసం ఎదురు చూసిందో. ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న ఆమె కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయింది.
‘ఇహ మీరు కదిలితే, మీతోపాటు మేమూ లోపలకి వస్తాము’ అంటూ హాస్యంగా అన్నారు వియ్యంకుడు, అందరూ నవ్వుతుండగా.
బయటి ప్రహరీ గేటు నుండి లోపలి ముఖద్వారం వరకూ విశాలమైన బహిప్రదేశం. ఒకపక్క పెద్ద వేపచెట్టు. ఒకవైపు పూలమొక్కలు. వీటి మధ్యగా గేటు నుండి తలుపు వరకు పెద్దపెద్ద ముగ్గులు, రంగులు అద్ది, వాటి మధ్య తీరయిన అక్షరాలతో వెల్కమ్ రాఙ్న, అని ఇంగ్లీషులో. అంటే తన కోసమే ఆ అలంకరణ అని తేలిగ్గా అర్థం అయింది. దానికి తోడు, తనతో వచ్చిన తాతగారు ‘బామ్మగారు బాగానే కష్టపడ్డారు. మనవరాలిని స్వాగతించటానికి’ అన్న మాట మనసుకు తాకింది.
‘లేదండీ అన్నగారూ. నేను కష్టపడలేదు, నడుము నొప్పి కదా. పనిమనిషితో వేయించాను’
‘అవును బావగారూ! నిజమే. కాకపోతే అవన్నీ అయ్యే వరకూ, కర్రపెత్తనం చేస్తూ అక్కడే నుంచుంది తను. మిగతా పనులు అన్నీ వదిలిపెట్టి మరీనూ’ ఇంకో తాతగారు, మురిపెంగా భార్య వంక, మనవరాలి వంక చూస్తూ.
వీరందరూ అరమరికలు లేకుండా ఎంత తేలిగ్గా, హాయిగా మాట్లాడుకుంటారు, మనసు విప్పి, అని వింతగా గమనిస్తూ వారి మాటలు వింటోంది రాఙ్న. ‘తను అనుకున్నంత భయంకరంగా మాత్రం లేదు, ఇక్కడి పరిస్థితి’ అని కూడా అనుకుంది.
భోజనాలు అవీ కూడా అంతే సరదాగా, ఆత్మీయత నిండి, వాటితోనే రుచి ఎక్కువ చేశాయి. తనకు మాత్రం, చక్కగా కలిపి, ఒక కంచంలో స్పూన్‌తో సహా ఇచ్చారు, వారు అందరూ కలుపుకుని చేత్తో తింటూ, కబుర్లు చెప్పుకుంటూ, తననీ నీకు ఏవి ఇష్టం అని అడుగుతూ.
‘బామ్మగారూ, ఇహ నుంచి నేనూ మీలాగే తింటాను’
‘ముందర ఆ గారూ అన్న పదం ఇంకోసారి అనను అంటేనే, బామ్మా అను, నాకు ఆనందంగా ఉంటుంది. ఆ గారు అన్న మాట నీకూ నాకూ దూరం సూచిస్తుంది. ననే్న కాదు, తాతా అని నోరారా పిలువు. మాకు అదే కావాలి. మీ అమ్మమ్మకు కూడానూ’
‘కరెక్ట్’ అన్నారు మిగతా వారు అందరూ ఒకటేసారి.
అలాగే అన్నట్లు తలూపింది రాఙ్న.
ఆ రోజు అలా గడిచిపోయింది. మర్నాడు భోజనాలు కాగానే, మళ్లా ఓ వారం పది రోజుల్లో తిరిగి వస్తామని చెప్పి అమ్మమ్మ తాతగారు హైదరాబాద్ వెళ్లిపోయారు.
* * *
ఆ రోజు సాయంత్రం ఓ అయిదుగురు ఇంచుమించు రాఙ్న వయసు వున్న ఆడపిల్లలు వచ్చారు. బామ్మగారు పిలిపించారు. వారు వేసుకున్న దుస్తులను అబ్బురంగా చూసింది రాఙ్న.
రంగురంగుల లంగాలు, ప్లయిన్ జాకెట్లు, వాటి మీద పలచటి ఓణీలు కొంగులు బొడ్డులో దోపుకుని మరీ.
ఎంతో బాగున్నాయి అనిపించింది. ఒకసారి తను వేసుకున్న జీన్స్, టాప్ వైపు అలా చూసుకుంది.
ఇది గమనించిన బామ్మగారు, ‘ఆ బాటలు బాగా వున్నాయి అనిపించిందా నీకు’ అని అడిగారు. అవును అన్నట్లుగా తలూపింది.
‘దానిదేముంది, రేపు నీవూ అట్లాంటికవే వేసుకుందువులే’
‘నిజంగానా!’
‘నీతో అబద్ధం ఎందుకు చెప్తాను, నువ్వు నా ముద్దుల మనవరాలివి కదా’
‘మరి.. మరి’ తన సందేహం ఎట్లా చెప్పాలో తెలియలేదు.
‘పిచ్చిదానా.. నీకు ఇష్టంగా వేసుకుంటావేమో నని ఓ నాలుగు జతలు తయారుచేయించాను. నీ కొలతలు మీ అమ్మని అడిగి, నిన్ను మెల్లిగా అడుగుదామని ఆగాను’
ఒక్కసారిగా బామ్మగారి మెడ చుట్టూ చేయి వేసి, బుగ్గ మీద ముద్దు పెట్టింది రాఙ్న. ‘ఈ పల్లెటూరి ముసలామె ఎంత శ్రద్ధగా, లోతుగా ఆలోచించిందో, తనను అన్ని విధాల మనస్సు సంతోషంగా ఉంచటానికి.
ఇంట్లో అమ్మ అమ్మే కానీ, కొన్ని విషయాలు తను నోరు తెరిచి అడగాలి. ఇంత లోతుగా గమనించదు తన ఇష్టాయిష్టాలు. అవసరాలు. బహుశా టైమ్ లేకపోవటం కూడా కారణం అయి ఉండవచ్చు. లేక తెలియకపోయి కూడా వుండవచ్చు. పట్నంలో పెరిగిందిగా తను కూడా.
ఆ అయిదుగురు తొమ్మిది, పది తరగతుల్లో చదువుతున్నవారే. ఒకరినొకరు పరిచయాలు చేసుకున్నారు. వాళ్లంతా తనను ఒక మామూలు తమ తోటి పిల్లగా మాట్లాడారే తప్ప, తనను ప్రత్యేకంగా, వింతగా అస్సలు చూడకపోవటం అతిగా నచ్చింది రాఙ్నకి. ఒకోసారి తను తెలుగు మాట కోసం తడబడుతున్నా, సరైన మాట అందించారే తప్ప హేళనగా చూడలేదు. ఆలోచిస్తే వారి పెంపకంలోని విశిష్టత ఇట్టే అర్థమవుతుంది. ఎంతో కలివిడిగా, స్నేహంగా మసలుకుని బాగా నచ్చేశారు రాఙ్నకి.
చీకటి పడి ఇహ ఇళ్లకు వెళ్లే ముందర ఒక అమ్మాయి అడిగింది, ‘రేపు మేమంతా తెల్లవారుజామున లేచి అట్ల తద్ది పండుగ చేసుకుంటాము. నువ్వూ లేచి, మాతో కలుస్తావా?’ అని.
‘అంటే..?’
‘బామ్మగారిని అడుగు, నీకు వివరంగా చెప్తారు’ అని వెళ్లిపోయారు.
లోపల ఏదో పనిలో ఉన్న బామ్మగారి దగ్గరకు వెళ్లి అడిగింది రాఙ్మ. ‘బామ్మా, రేపు అదేదో పండగ అట కదా’ అని.
‘అవును తల్లీ, అట్లతద్దె అంటారు. అసలు తదియ అనాలి. కానీ నానుడిలో అలా తద్దెగా మారింది. ఆ రోజు చక్కగా ఆడపిల్లలు అందరూ తెల్లారే లేచి, అట్లు అమ్మవారికి నైవేద్యం పెట్టి, తరువాత ఎన్నో రకాల ఆటలు ఆడుకుంటారు. మామూలుగా అయితే మన వేప చెట్టుకి ఉయ్యాల వేసి ఊగుతూ, ఇంకా వేరే రకాల ఆటలు వారికి నచ్చినవి ఆడుకుంటారు. ముందు రోజు రాత్రి చక్కగా చేతులకి, కాళ్లకి గోరింటాకు పెట్టుకుంటారు..’
‘గోరింటా...?’
‘అది వొక చెట్టు ఆకు. చక్కగా మెత్తగా దానిని రుబ్బి, చేతులకి, కాళ్లకి పెట్టుకుని కొన్ని గంటలు ఉంచుకుని కడుగుకుంటారు. అప్పుడు ఎర్రగా మెరుస్తూ ఉంటాయి. ఎంత ఎర్రగా పండితే, అంత మంచి మొగుడు వస్తాడు అట’
‘నేనూ పెట్టుకుంటాను. నువ్వు నాకు పెడతావా బామ్మా’
‘నీకూ మంచి మొగుడు రావాలి అన్న కోరిక ఉందన్న మాట’
‘పో బామ్మా...’ మొదటిసారి సిగ్గుపడ్డది రాఙ్న.
* * *
ఇంటి నాలుగు గోడల మధ్యా కొద్దిగా పరిచయం వున్నా, కొత్త ప్రదేశం, కొత్త పరిచయాలు, కృత్రిమత లేని కలివిడి ప్రవర్తనలు మెల్లిగా రాఙ్నలోని బెరుకు, సందేహం, వైముఖ్యాన్ని తొలగించి ఆసక్తిని కలిగించాయి. ఇంటి మటుకు సరే, బయట వూరిలో వారు ఎట్లా ఉంటారు, వూరు ఎట్లా ఉంటుంది అన్న కుతూహలం రేకెత్తించి, బామ్మగారితో ఒక రోజు, తనూ కొత్త స్నేహితులతో పాటు బడికి వెళ్లి వస్తాను అనిపించింది.
వెళ్లిరా అన్నారు బామ్మగారు. తాతగారు ముందు వెళ్లి ప్రధాన ఉపాధ్యాయులతో మాట్లాడి వచ్చారు. ఒక రెండు రోజులు తమ మనవరాలు తొమ్మిదో తరగతిలో స్నేహితులతోపాటు కూర్చుంటుంది అని. బోధనా పద్ధతులు, పుస్తకాలు అన్నీ వేరే విధమే. అన్నిటికన్నా అబ్బాయిలు ఒక ప్రక్క, అమ్మాయిలు ఒక ప్రక్క కూర్చోవటం వింతగా అనిపించింది. అంతకన్నా వింత, వీరూ వారూ ఎక్కువగా కలిసి మాట్లాడుకోకపోవటం. ఒకరిద్దరి దొంగచూపులు, ముసిముసి నవ్వులు. అన్నీ వింతగా, కొత్తగా, ఏదో వేరే లోకంలోవున్నట్లు.
ఆగలేక, బడి నుంచి తిరిగి వస్తుంటే, స్నేహితులను అడిగింది ‘మీరూ, అబ్బాయిలూ మాట్లాడుకోరా అసలు. మీకు బాయ్‌ఫ్రెండ్స్ ఉండరా’ అని.
‘బాయ్‌ఫ్రెండ్స్!! ఛంపేస్తారు ఇంట్లో తెలిస్తే. చదువు మానిపిస్తారు. పట్టణాలు, నగరాలలో మామూలు అయింది కానీ, ఇంకా పల్లెటూర్లకు పాక లేదు ఈ కొత్త సంస్కృతి. ఇప్పుడిప్పుడే, సినిమాలు చూసి ఓహో, ఇట్లా కూడా వుంటారు అన్న మాట అని తెలుసుకున్నాము.’
‘మరీ అంత దూరం అవసరమా, అదీ స్నేహంగా ఉండటానికి?’
వారూ ఏమీ జవాబు చెప్పలేదు దీనికి.
ఆ రాత్రి, అదే ప్రశ్న బామ్మగారిని అడిగింది. ఏ మాట అయినా సూటిగా పెద్దవారిని అడగటం చిన్నతనం నుంచీ తనకు నేర్పించారు, తల్లీ తండ్రీనూ.
బామ్మగారు చెప్పారు అతి సౌమ్యంగా, ‘నువ్వు కొంచెం ఓపిగ్గా విను మరి నా సమాధానం. మన భారతీయ సంస్కృతిలో శీలం, అంటే పురుషుడిది గానీ స్ర్తిది కానీ కేరెక్టర్‌కు ఒక ప్రాధాన్యత ఉంది. స్ర్తి పురుషులు ఒకరికొకరు కట్టుబడి, అన్యోన్యంగా ఉండాలి కడదాకా అని ఒక సంప్రదాయం. అలా అని, పాశ్చాత్య దేశాలలో విచ్చలవిడిగా వున్నారని నేను అనటం లేదు. కానీ నచ్చకపోతే, లేక మధ్యలో భేదాభిప్రాయాలు వస్తే విడిపోవటం సర్వసాధారణం అక్కడ. అదీ చెడ్డది అనీ నేను అనను. కలసి అనుక్షణం కొట్టుకునే కంటే విడిగా శాంతిగా ఉండటమే మేలు ఏమో ఇద్దరికీ. కానీ భర్త గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు అని భార్య, భార్యకు సోమరిపోతు తనం ఎక్కువ అని భర్త విడిపోవటం మంచిది కాదు గదా. అసలు మనిషి జీవితం అంటేనే సర్దుకుపోవటం. పిల్లలతో పెద్దలు, పెద్దలతో పిల్లలు, ఆడామగా, చుట్టాలు బంధువులు, ఇంట్లో బయటా ఆఫీస్‌లో సర్దుకుపోతేనేగా, శాంతిగా బ్రతకగలిగేది. ఒక ఉదాహరణ చెప్తా విను. తన పై అధికారి ఎప్పుడూ ముక్కులో వేలు పెట్టుకుంటాడు, అని ఉద్యోగం మానేస్తారా ఎవరైనా. అదే భార్యాభర్తలలో ఒకరికి ఆ అలవాటు వుంటే, దాని కారణంగా విడిపోతాం అనవచ్చు. అంటే ఉద్యోగం అవసరం కాబట్టి సర్దుకుపోతాము. అదే జీవిత భాగస్వామి అంటే, ఇంకొకరు దొరకరా, దొరకకపోయినా స్వాతంత్య్రంగా బ్రతకలేమా, అన్న ఒక ధీమా. ఇహ సర్దుకుపోవటం ఏముంది? ఇవన్నీ వయసు పెళ్లి ఈడుకు వచ్చినాక, పెళ్లి అయినాక కదా, దానికి నేను అడిగిన ప్రశ్నకు లింకు ఏమిటి అని అడగవచ్చు నువ్వు. మీ వయసు ఇప్పుడు చిన్నతనమూ కానిది, అటు పరిపక్వతా లేనిది. శరీరంలో ఎన్నో మార్పులు వస్తూ వుంటాయి. ఏవేవో ఆలోచనలు, కోరికలు కలిగే వయస్సు ఇది. ఈ వయస్సులో ఆ కోరికలకు కట్టడి చేయటం నేర్చుకుంటే, రేపు పెద్ద అయి మీ నిర్ణయాలు మీరు తీసుకునే వయస్సులో మీరు సరి అయిన నిర్ణయం తీసుకోగలరు. ఆ కట్టడి చేయటం అన్నది కోరికలు తీర్చుకునే అవకాశాలను దూరంగా వుంచితే తేలిగ్గా అలవడుతుంది అని. అంతే.
ఓ అబ్బాయితో స్నేహంగా వుండి, నాలుగు మాటలు మాట్లాడటం తప్పు కాదు. ముమ్మాటికీ. కానీ ఆ అబ్బాయి ఎలాంటి వాడు, అతని మనస్సులో ఏదన్నా దురాలోచన ఉందా అన్నది తెలుసుకోవటానికి మీకు అనుభవం, విజ్ఞత లేవు కదా. అలాగే మీకున్నట్లే అబ్బాయికి కోరికలు అన్నవి వుంటాయిగా. మీరు చొరవ చూపించకపోయినా, అతను చూపించవచ్చు. ఇదేమిటో, ఈ అనుభవం ఎట్లా ఉంటుందో అన్న ఆలోచన మిమ్మల్నీ ముందుకు నెట్టవచ్చు. కొద్ది దూరం అనుకున్నవారు, ఆగలేకపోవచ్చు. పూర్తిగా వికసించని మొగ్గలు మీరు. పరపరాగానికి పూలు, తుమ్మెదలు కావాలి. మొగ్గ పనికిరాదు. అందుకనే కొంచెం సంరక్షణ. కొంచెం ఎడంగా వుంచే జాగ్రత్త. అదీ మారుతోంది అనుకో. సినిమాలు, టీవీలు వచ్చి, ఇంటింట్లో అక్కడ అట్లా, ఇక్కడ ఇట్లా అని చెప్తూ, వారి స్వలాభం కోసం కోరికలు రెచ్చగొట్టే దృశ్యాలు చూపించటం మూలంగా.. ఏదో మత్తు, ఏదో కావాలి అన్న కోరిక, ఎట్లా ఉంటుందోనన్న కుతూహలం, చిన్నపిల్లల్ని పెద్ద పనుల వైపు నెడుతుంటే.
అందుకే వీలయినంత జాగ్రత్తలు తీసుకోవటం. ఆ తరువాత పెద్దలు పిన్నలతో కూర్చుని అన్ని విషయాలు సంకోచం లేకుండా చర్చించటం వగైరాలు. అక్కడి నాగరికతలో తల్లిదండ్రులు ఈ విషయాలు బోధిస్తారు. ఇక్కడి తల్లిదండ్రులు చాలా మటుకు ఈ పని చెయ్యలేరు. ఒక విధమైన మానసిక అడ్డంకి. అందుకే ఈ విధంగా విడిగా ఉంచటం.
ఇప్పటికే చాలా చెప్పాను. నీకు ఎంత అర్థం అయింది అన్నది కూడా ఆలోచించకుండా. ఇహ పడుకో. ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే సంకోచం లేకుండా అడుగు. నాకు తెలిసినంత మటుకు చెప్తా.’
ఆ రాత్రి కలత నిద్రే అయింది ఇద్దరికీ.
* * *
కూతురు వారం రోజులలో తిరిగి వచ్చేస్తాను అంటుంది అని అనుకుంది రూపమతి.
రంగారావు ఓ ఇరవై రోజుల వరకూ ఫర్వాలేదు, ఆ తరువాత వచ్చేస్తాను అంటే ఎలా సర్ది చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు.
ప్రతి ఆదివారం తలో గంటా కబుర్లు చెప్తోంది కానీ రాఙ్న వస్తాను అన్న మాట అనకపోవటం వింతగానే తోచింది ఇద్దరికీ. ఏమాటకామాట చెప్పాలి అంటే, ‘అత్తగారు ఏం మాయ చేసిందో, కూతురికి ఏం మత్తుమందు పెట్టిందో’ అని కూడా మనసులో అనుకుంది రూపమతి.
ఆరు నెలలూ ఇట్టే గడిచిపోయినయి. అమెరికాకు తిరిగి వెళ్లే ముందు, ఇద్దరూ కూడబలుక్కుని ఇండియాకు వచ్చారు, కూతుర్ని తిరిగి తమతో తీసుకుని పోదామని.
రాఙ్న చెప్పిన మాట విని వారి స్పందన నేను వర్ణించలేక మీ విజ్ఞతకు వదిలి పెడుతున్నాను.
‘నాన్నా (డాడ్ అని కాదు సుమా) నేను నా చదువు మొత్తం పూర్తి అయ్యేవరకూ, బామ్మ దగ్గరే వుంటాను. చదువుతోపాటు జీవితంలో నేర్చుకోవలసిన ముఖ్య పాఠాలు ఇంకా వున్నాయి బామ్మ దగ్గర. మీరే వీలు వున్నప్పుడు వచ్చి పోతుండండి.
*
కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.netకు మెయల్‌లో పంపాలి.

-నండూరి రామచంద్రరావు