కథ

భావోద్వేగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి మొదటి భావోద్వేగం - ఏడుపు. అందుకే అది కాకుండా మిగిలినవి సంపాదించుకోవాలి కానీ వేటినీ అంటిపెట్టుకుని ఉండకూడదు - గోవిందరావు మనస్తత్వంలో అన్ని భావోద్వేగాలూ పరిపూర్ణంగా వున్నాయి. అన్నింటి వ్యవధి లిప్తపాటే! పరిపూర్ణ వ్యక్తికి ప్రతిరూపంగా కన్పిస్తాడు. తనకు నచ్చినట్లే పెరిగాడు. తనకు నచ్చినట్టు తిరిగాడు. తనకు నచ్చినట్లే చేస్తున్నాడు. అన్నీ కూడా అతనిష్టమే! తల్లిదండ్రుల ప్రేమనేది బిడ్డల మీద ఇంతకన్నా ఎక్కువగా ఇంకెక్కడ కన్పిస్తుంది. క్లీన్‌చిట్ ఉన్నవాడు.
తనకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. ఇంజనీరింగ్ కళాశాలలో మాధవిని ఇష్టపడ్డాడు. ఎప్పుడూ చలాకీగా ఉండే మాధవి అంటే ఇష్టం ఏర్పడింది. పెద్ద అందగత్తేం కాదు కాని (అందమంటే ఏమిటో నాకింకా తెలియదు.) ఆమె చలాకీతనం తనలోని మరెన్నో భావోద్వేగాలను నిద్రలేపింది. తనకి ఆమె సరైందని భావించాడు. మూడేళ్లు చిన్నది కావడం కూడా వయసురీత్యా మంచే చేసింది. వారిద్దరిని మంచి జంటగా మలిచింది.
జంటగా మారకముందే పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో కొలువు దొరికింది. మంచి జీతం, జీవితం. ప్రస్తుత యాంత్రిక జీవనంలో అత్యంత ఎక్కువ మొత్తం సంపాదించే వ్యక్తుల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు నాలుగో స్థానంలో ఉంటున్నారు. సముద్రం మీదుగా చేసే షిప్పింగ్‌లు, పొలిటీషియన్లు, రియల్ ఎస్టేట్ల తర్వాత స్థానం వారిదే. ఇంకేం కావాలి. సామాన్యుడిని అసామాన్యుడిగా మార్చేది డబ్బే! డబ్బు లేనివాడు ఎంత యోగ్యుడైనా సామాన్యుడే. డబ్బున్నవాడు అయోగ్యుడైనా అసమాన్యుడే...!
వాడుకోవడానికి కావల్సిన దానికంటే అకౌంట్‌లో ఎక్కువున్న డబ్బు, పుట్టిన జిల్లాను వదలి హైదరాబాద్‌కు మకాం మార్చేలా చేసేసింది. అనుకూలవతి తోడుండగా మనస్సుకు చింతేం ఉంటుంది. రెండేళ్లపాటు గోవిందరావు మాధవిల కాపురం అన్యోన్యంగా సాగింది. గోవిందరావు పనితనాన్ని గుర్తించిన కంపెనీ, అమెరికా వెళ్లి రెండేళ్లపాటు జాబ్ చేసే అవకాశాన్నిచ్చింది. కంపెనీ నుండి ఆఫర్ రావడం ఆలస్యం అతనిలోని భావోద్వేగం చిందులేసి, వెంటనే ఒప్పేసుకున్నాడు. శుభవార్తను శ్రీమతికి చెప్పాడు. ఆయన ఊహించని ట్విస్ట్. ఆమె అతనికో బహుమతినిచ్చింది. మూడో నెల వచ్చిందన్న శుభవార్త. భావోద్వేగాలన్నింటికీ పని చెప్పినట్లైంది. ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
అమ్మాయి, అమ్మ అయినప్పుడే పరిపూర్ణ స్ర్తి అనిపించుకుంటుంది. ఆమెనతను పరిపూర్ణ స్ర్తిగా మార్చినందుకు ఆనందం పట్టలేక పోయింది. అతన్ని తండ్రి చేస్తున్నందుకు మనస్సులోనే ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. నెల రోజుల్లోనే అమెరికా ప్రయాణం కట్టాడు. మొదటిసారి విమానం ఎక్కినందుకు, మొదటిసారి పరాయి దేశంలో అడుగుపెడుతున్నందుకు ఆయనలో కలిగిన భావోద్వేగాలు అన్నీ ఇన్నీ కావు. వాటి వేగాన్ని అందుకోలేనంతగా ఉంది తన పరిస్థితి.
ఇక్కడ మాధవికి నెలలు నిండుతున్నాయి. అక్కడ గోవింద్‌కు చెమటలు పట్టేస్తున్నాయి. డెలివరీ సమయానికైనా అమెరికా తీసుకెళ్లగలిగితే తన బిడ్డకు అమెరికా పౌరసత్వం వస్తుందని, అదో గౌరవమని భావించాడు. అందుకు తగ్గట్లుగానే పావులు కదిపాడు. రోజులు గడుస్తున్నా మాధవికి వీసా రావడం లేదు. ఏవేవో కారణాలు చెప్తున్నారు. కారణాలన్ని ఉంటాయని తెలిసిందప్పుడే..!
అతను మనస్ఫూర్తిగా కోరుకున్నది, మొదటిసారి సాధించుకోలేక పోవడంతో అతనిలో నిరాశ కలిగి, కొత్త భావోద్వేగం రుచి తెలిసింది. ఆ నిరాశలో ఆశ చిగురించేలా ఒక వార్త చేరింది. పాపాయికి జన్మనిచ్చింది మాధవి. తన రక్తం పంచుకుని, తన లోకానికొచ్చిన కన్నబిడ్డను దగ్గరుండి చూడలేక పోయానని బాధపడ్డాడు గోవింద్. ఆఫీస్‌లో పని చేస్తున్నా, ఆలోచనలన్నీ తన బిడ్డపైనే. తాము కోరుకున్నట్లే ఆడపిల్ల పుట్టినందుకు సంతోషిస్తూనే తనకేం పేరు పెట్టాలని తెగ మదనపడిపోయారు.
కొలువుల కోసం కూడా అంత ప్రయత్నించలేదేమో గాని, ఏదన్నా సాధించడానికి కూడా అంత పోరాటం చేయరేమో గాని, కన్నబిడ్డలకు పేరు పెట్టడానికి మాత్రం ప్రపంచానే్న తిరగేస్తారు. పేరు పెట్టగానే గర్వపడిపోతారు. భవిష్యత్‌ను తీర్చిదిద్దేసినట్లు సంబరపడిపోతారు. జీవితాన్ని రంజింపజేస్తూ తమ జీవితంలో

కొచ్చిన బిడ్డకు ‘రంజిత’ అనే పేరే సరైందని భావించి అదే పేరును నిర్ణయించేశారు.
సుఖప్రసవం కావడంతో తల్లీబిడ్డలు క్షేమం! వైద్యం కూడా కమర్షియల్ అయిపోయిన ఈ రోజుల్లో సుఖప్రసవం అంటే మాటలు కాదు. డబ్బు కోసం డాక్టర్లు చీటికిమాటికి ఆపరేషన్లు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. చిన్ననొప్పి అన్నా ఆపరేషన్ అంటున్నారు. డాక్టర్‌ను బాగా నమ్మేసి జనాలు కూడా ఓ కారణం. డెలివరీ ఒక తేదీని సుమారుగా నిర్ణయించినప్పుడు, అదే రోజున నొప్పులు రాకపోతే కంగారుపడిపోయి, అదేదో బ్రహ్మవాక్కు తప్పిపోయిందని ఆపరేషన్

చేసెయ్యమని జనాలు కోరడం క్షమించరాని నేరం. గర్భవతిని బరువులు మోయ్యొద్దంటే పనులేం చేయొద్దని కాదు. స్రావం జరిగేంత పనులు చేయొద్దని. అసలు ఒళ్లు కదపకపోతే కదలికలు ఎక్కడ్నుంచి వస్తాయి? పుట్టే బిడ్డలో చురుకుదనం ఎక్కడ్నుంచి పుడుతుంది? ఇది అర్థం చేసుకోలేని యువతులున్నంత కాలం తిరోగమనమే...!
రంజిత పుట్టిన సమయం సందర్భమేమో కాని మాధవికి వీసా మంజూరైంది. కాని దాన్ని వాడుకునే స్థితిలో లేదామె. తన మనసంతా రంజిత సంరక్షణ పైనే ఉంది. పెద్దలతోపాటే గోవింద్ కూడా ఓటెయ్యడంతో అమెరికా ప్రయాణాన్ని ఆపేసింది. గోవింద్ చేసే ప్రాజెక్ట్ చాలా ప్రాముఖ్యమైనది కావడంతో జీతాన్ని పెంచి ఎవ్వరికీ రెండు రోజులకు మించి సెలవులను ఇవ్వడంలేదు కంపెనీ. రంజితను చాలా రోజుల్నుంచి లాప్‌టాప్‌లోనే చూస్తున్నాడు గోవింద్. ప్రత్యక్షంగా చూసి, తన పొత్తిళ్లలోకి తీసుకోవాలనే కోరిక రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ భావోద్వేగాన్ని మాత్రం తట్టుకోలేక పోయాడు. అటువైపు పెద్దలు, మాధవి కూడా బాధపడటం మొదలుపెట్టారు. ఎన్నాళ్లని లాప్‌టాప్‌ల్లో చూస్తాడు? తండ్రికి బిడ్డను చేరవేయాలని తల్లి తాపత్రయం పెరిగిపోతోంది. బిడ్డను చేరుకోవాలని తండ్రి ప్రేమబంధాన్ని పెంచుకుంది.
పసిబిడ్డను తీసుకుని అమెరికా వచ్చెయ్యమని గోవింద్ పురమాయించాడు. భర్తను, బిడ్డను ఒకే ఫ్రేమ్‌లో చూడాలనలి ముచ్చటపడిన ఇల్లాలు వెంటనే బయలుదేరింది. ముందే వీసా ఉండడంతో, పనులన్నీ ప్రారంభమయ్యాయి. రంజితను తీసుకుని మాధవి మొదటిసారి విమానం ఎక్కింది. పరాయిదేశం వెళ్లానన్న ఆనందం కన్నా, భర్తకు తమ బిడ్డను అందించానన్న తృప్తి ఆమె మొహంలో ప్రస్ఫుటంగా కన్పించింది. మొదటిసారి కూతురిని స్వయంగా ఎత్తుకున్న గోవింద్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఆనందభరితుడయ్యాడు. కాని ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు.
దేశాలు దాటడంతో, వాతావరణంలో మార్పులు రావడంతో రంజితకు జ్వరం వచ్చేసింది. లాప్‌టాప్‌లో తండ్రిని చూసి కేరింతలు కొట్టిన రంజిత అలా డల్‌గా ఉండడంతో అతని కడుపు తరుక్కుపోయింది. మాధవి గురించి ఆలోచించాడు. ఎన్ని ఇబ్బందులు పడుంటుందో గ్రహించాడు. ఆడవాళ్ల గొప్పదనం కళ్లకు కట్టిన వైనం అది. తన గారాలపట్టి, ‘గయ్‌గయ్’మని అరవాల్సిన కూతురలా ఉండడం చూసి అతనిలో ఎప్పుడూ లేని భావోద్వేగాలు పుట్టుకొచ్చాయి.
మనిషి మొదటి భావోద్వేగం - ఏడుపు. మళ్లీ దాన్ని రుచి చూశాడు. ఇంట్లో కూర్చుని దీర్ఘంగా ఆలోచించి తన నిర్ణయాన్ని భార్యకు చెప్పాడు. కొత్త దేశాధ్యక్షుడు ట్రంప్ చర్యల వల్ల భయపడేదే కాక పాప ఆరోగ్యం కృంగదీసింది. సొంత దేశంలో, సొంత రాష్ట్రంలో, ‘నా’ అన్న వాళ్ల మధ్య అపురూపంగా పెరగాల్సిన కూతురిలా ఒంటరై పోతుందని అర్థమైంది. స్వగ్రామంలో రాజులా బతకాల్సిన వ్యక్తి, ఎక్కువ డబ్బు కోసమని అర్రులు చాస్తున్న విషయం అర్థమై సంపాదించింది చాలనుకున్నాడు. ప్రేమానురాగాలు కావాలి గాని, ప్రేలాపనలు కాదని గ్రహించాడు. తనకు నచ్చింది చేయడం గోవింద్ నైజం. వారం రోజుల్లో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు. తన భావోద్వేగాల్ని కట్టిపడేస్తున్న కొలువుకి స్వస్తి పలికాడు. భార్య మొహంలో వెలుగును చూశాడు. మాతృభూమి విలువ తెలుసుకున్నాడు.

===============================================================

కథలకు ఆహ్వానం

‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.

-దొండపాటి కృష్ణ .. 89853 55426