కథ

అన్-ఫిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథల పోటీలో
ఎంపికైన రచన
**

‘డాక్టర్ కృతి... చీఫ్ డాక్టర్‌గారు నిన్ను అర్జంట్‌గా రమ్మంటున్నారు’ ఎవరో చెప్పారు ఆమెతో. ఎవరు చెప్పారో గమనించలేదు కృతి. ఎందుకంటే... ఎవరు చెప్పారన్న దానికంటే ఏం చెప్పారన్నది ముఖ్యం!
ఎందుకు పిలిచారో అర్థమైంది. ఈ రోజు ఆపరేషన్ థియేటర్‌లో జరిగిన దాని గురించి తిట్టడానికి! అదురుతున్న ఆమె గుండెల లయలో ఆమె మెడలో ఉన్న స్టెతస్కోప్ ఎగిరెగిరి పడుతోంది.
చీఫ్ డాక్టర్‌గారి రూం చేరుకునేసరికి ముఖం మీద చెమటంతా ఏప్రాన్ మీద పడి ఖరాబు అయిపోయింది.
‘డాక్టర్ వౌక్తిక్ ఎం.ఎస్’ అని రాసి ఉన్న డోర్‌పై చెయ్యి పెట్టగానే ఆమె చేత్తోపాటూ తలుపు కూడా వణుకుతూ తెరచుకుంది.
డాక్టర్ వౌక్తిక్ అలవాటుగా హెల్త్ మేగజైన్ చదువుకుంటున్నాడు. తలుపు తెరిచింది ఎవరా అని చూడలేదు. బహుశా అలా అడగకుండా తలుపు తెరిచేది ఆమేనని అతడు భావించి ఉండొచ్చు.
‘డాక్టర్ కృతి.. నువ్వు ఎంబిబిఎస్ ఎక్కడ చదివావు?’ డాక్టర్ వౌక్తిక్ హెల్త్ మేగజైన్ చదువుతూ కృతిని అడిగాడు.
ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు అతను ఆమె వైపు చూడకుండా మేగజైన్ వైపు మాత్రమే చూస్తున్నాడు.
‘ఉస్మానియాలో సర్’ బెరుకుగా చెప్పింది కృతి.
‘మరి ఎంబిబిఎస్‌లో నీకు స్టిచెస్ వెయ్యడం నేర్పలేదా?’ అని అంటూ ఆమెవైపు కోపంగా చూశాడు.
కృతి తలదించుకుంది.
‘వై ఆర్ యూ లుకింగ్ డౌన్ డామ్ ఇట్! లుక్ ఎట్ మీ...’ పుస్తకం పక్కన పడేసి ఆమె వైపు ఇంకా ఎర్రగా చూశాడు.
‘సర్జరీ మొత్తం నేనే చేశాను. ఆఖర్లో నీకు స్టిచెస్ వెయ్యమన్నాను. అంతే.. అది కూడా సరిగ్గా చెయ్యలేకపోయావ్. స్టిచెస్.. బ్లడీ స్టిచెస్...’ స్టిచెస్ అన్న మాటని వత్తి పలికాడు వౌక్తిక్.
కబేలాకి తరలించబడుతున్న మూగజీవిలా కృతి తలదించుకుని ఉంది.
‘ఎంబిబిఎస్ అయిపోయి పి.జి. సీట్ రాకుండా ఖాళీగా ఉన్న నీలాంటి వాళ్లందరూ తక్కువ సేలరీకి వచ్చేస్తారని హాస్పిటల్ వాళ్లు మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. మీరేమో పని చేతకాకపోయినా స్ట్ఫైండ్‌కి ఆశపడి డాక్టర్లుగా చేరి పేషెంట్స్‌తోపాటు మా ప్రాణాలు కూడా తీస్తారు’
‘సారీ సార్’ తలదించుకునే అంది.
‘యూ ఆర్ అన్-్ఫట్ టు బి ఎ డాక్టర్’
‘.... ...’
కురవడానికి సిద్ధంగా ఉన్న మేఘాల్లా ఉన్నాయి ఆమె కళ్లు!
వౌక్తిక్ ఫోన్ రింగ్ అయ్యింది.
‘హలో.. ఎస్ సార్.. చెప్పండి పర్లేదు.. ఒ.కె. వైడల్ టెస్ట్ రిపోర్ట్ ఏంటి? టైఫాయిడా? హా.. సరే... భయపడాల్సింది ఏం లేదు. నేనొక ఆపరేషన్ చెయ్యాలి. మీరు ఏం అనుకోకపోతే నా అసిస్టెంట్‌తో మందులు పంపిస్తాను. థాంక్యూ సార్...’
ఫోన్ కట్ చేసి.. ‘మేయర్‌గారు ఫోన్ చేశారు. వాళ్లబ్బాయికి టైఫాయిడట. వాళ్ల ఇంటి అడ్రస్ నీకు వాట్సాప్ చేస్తాను. అర్జెంట్‌గా వెళ్లి ఈ ఇంజెక్షన్ చేసి రా’ అంటూ ప్రిస్కిప్షన్ మీద ఏదో రాశాడు.
‘ఓకె సార్’ అంది బెదురుతూ.
‘ఆయనకి నేను ఫ్యామిలీ డాక్టర్‌ని. నేనొక సర్జరీ చెయ్యాలి. అందుకే నిన్ను పంపిస్తున్నాను. దయచేసి నా పరువు తీయకు. నీకు స్టిచెస్ వెయ్యడం ఎలాగూ రాదు. కనీసం ఇంజక్షన్ చెయ్యడమైనా వచ్చని నేను అనుకుంటున్నాను. నా నమ్మకాన్ని నిలబెడతావా?’
‘తప్పకుండా సార్’
‘హా.. బైదివే.. ఇది ఐ.వి. ఇంజెక్షన్. అంటే ఏంటో తెలుసా?’
‘ఎస్ సార్.. మజిల్‌కి కాకుండా నరానికి ఇచ్చే ఇంజక్షన్’
‘గుడ్.. నీకు కనీసం ఇదైనా తెలిసినందుకు సంతోషం! కచ్చితంగా నరానికే ఇవ్వాలి. అర్థమైందా?’
‘అర్థమైంది సార్’ అని కృతి అనగానే మళ్లీ మేగజైన్ తీసుకుని చూడటం మొదలుపెట్టాడు. దాని అర్థం ‘ఇక వెళ్లు’ అని కృతి అర్థం చేసుకుని అతని గదిలో నుంచి బయటకి వచ్చేసింది.
* * *
ఫార్మసీ కుర్రాడికి ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది. అతడు ఇంజక్షన్ ఏంపిల్ కోసం వెతకడానికి లోపలికి వెళ్లాడు.
ఇందాక కురవాల్సిన కన్నీళ్ల వాన ఇక్కడ కురిసింది. వెంటనే తమాయించుకుంది. వౌక్తిక్ తనను అన్-్ఫట్ అని అన్న మాట సర్జికల్ నైఫ్‌లా ఆమె గుండెను కోస్తున్నట్లనిపించింది.
‘నిజంగా నేను అన్-్ఫట్టా’ అనుకుంది.
‘ఏంటి మేడమ్.. ఏదో ఆలోచిస్తున్నారు?’ ఆమె ముఖంలోని ఖంగారు గమనించి అడిగాడు ఫార్మసిస్ట్.
‘ఏం లేదు.. మేయర్‌గారి అబ్బాయికి ఒంట్లో బాగోలేదట. వెళ్లాలి’ అని చెప్తూ కర్చ్ఫీతో గడ్డం పై నుంచి గొంతు వారగా జారే స్వేద బిందువును తుడుచుకుంది.
‘వాడా...! వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండండి మేడమ్’ అన్నాడతను హెచ్చరికగా.
‘ఏం’ అన్నట్లు క్వొశ్చన్ మార్క్ గుర్తులా ఆమె కనుబొమ్మలు కలిసాయి.
‘మీకు తెలియదా మేడమ్? ఆ మధ్య వాడొక అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు’ అని అతడు చెప్పగానే ఆమె భయంతో గజగజమంది.
‘మరీ.. వాడ్ని జైల్లో పెట్టలేదా?’ అసంకల్పితంగా అడిగింది.
‘పెట్టారండీ.. కానీ పద్దెనిమిదేళ్లు నిండని పసిగుడ్డు అని జువైనల్ చట్టం కింద విడుదల చేశారండి’ వెటకారంలో కోపం కలిసిన వాక్యం ఆమెకు వేడిగా తగిలింది.
‘అలాంటి నీచుడికి నేను వైద్యం చెయ్యాలా?’ అనుకుంది. చెయ్యకపోతే వౌక్తిక్ ఊరుకుంటాడా? అయినా రోగి ఎలాంటి వాడైనా వైద్యం చెయ్యడం తన ధర్మమని గుర్తు తెచ్చుకుని, డబ్బులిచ్చి సిరంజి, ఏంపిల్.. బ్యాగ్‌లో హడావిడిగా కుక్కుకుని చిల్లర కూడా తీసుకోవడం మర్చిపోయి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
డాక్టర్ వౌక్తిక్ పంపించిన అడ్రస్‌ను, తన కారు జిపిఎస్‌లో ఫీడ్ చేసి మేయర్ కొడుకు ఫ్లాట్ వైపు కారు పోనిచ్చింది.
* * *
అరగంట తర్వాత...
మేయర్ కొడుకు ఫ్లాట్ డోర్ బెల్ కొట్టింది కృతి. రెండు నిమిషాలకు అతను తలుపు తీశాడు.
ఆమెను ఎగాదిగా చూసి.. ‘రా’ అని లోపలికి వెళ్లిపోయాడు.
డాక్టర్ పైన.. అందులోను ఒక అమ్మాయి పైన అతడు చూపించిన మర్యాద (?) చూసి ఆమె ఆశ్చర్యపోయింది.
ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు.
‘కొత్తగా చేరావా?’ అడిగాడతను. అవునన్నట్లు తలూపింది.
‘అనుకున్నాను... మొత్తానికి భలే పిట్టని పట్టింది ఉష. మీ కంపెనీకి ఫుల్ గిరాకీ’ వికారంగా నవ్వాడతను.
‘ఎక్స్‌క్యూజ్‌మీ’ అతడి వాగుడు భరించలేని అప్రసన్నత.. ఆ మాటలో కనపడింది.
‘చాల్‌చాల్లెవే... ఇంగ్లీష్ మాట్లాడితే క్లాస్ ఫిగర్ అనుకుంటాననుకున్నావా? నీకో నిజం చెప్పనా.. మన దగ్గర డబ్బులున్నాయన్న మాటేగానీ నేనూ మాసే..’
‘షటప్... నేను ఎవరనుకుంటున్నారు?’ ఆమెలో సహనం నశించింద. కొంచెం గ్యాప్ ఇచ్చి ‘నేను డాక్టర్ని’ అంది.
‘డా..క్ట..రా’ అన్నాడు సాగదీస్తూ. ‘ఎందుకొచ్చావ్?’ అన్న మాటని చివర్లో తగిలించాడు.
‘మేయర్‌గారు, డాక్టర్ వౌక్తిక్‌కి ఫోన్ చేసి ఎవరికో టైఫాయిడ్ అని చెప్పారు. నేను ఆయన జూనియర్‌ని. అతను నన్ను పంపించారు’ అంది. అతను ఏం మాట్లాడకపోయేసరికి ‘ఇంతకీ పేషెంట్ ఎవరు?’ మళ్లీ తనే అంది.
‘ఏంటీ...’
‘అదే.. ఒంట్లో బాగోనిది ఎవరికి అని’ ఆమె, తనలోని విసుగును అణచుకోవడానికి ప్రయత్నిస్తోంది.
‘నాకే’ అన్నాడతను వెటకారంగా.
‘ఓకే’ అని బ్యాగ్‌లో నుంచి ఇంజెక్షన్ సిరంజ్, ఏంపిల్ తీసింది.
‘ఏంటది ఇంజక్షనా? నాకు వద్దు’
‘వద్దంటే!’
‘వద్దంటే నేను చేయించుకోను అని’ ఆ మాటకి అతని పళ్లకున్న గార పట్టింది.
‘చేయించుకోకపోతే జబ్బు తగ్గదు’ అని చెప్పి తన మానాన తాను సిరంజిలో మందును ఎక్కిస్తోంది.
‘తగ్గకపోయినా ఫరవాలేదు. కానీ నువ్వు నాకు ఇంజక్షన్ చేస్తానంటే నేనొప్పుకోను’
‘ఇంజక్షన్ చెయ్యకపోతే మా సార్ ఒప్పుకోరు’ అంది వౌక్తిక్‌ని గుర్తుకు తెచ్చుకుంటూ.
‘ఒప్పుకోక ఏం చేస్తాడేంటి?’
‘నా ఉద్యోగం పీకేస్తాడు’
‘సరిగ్గా దొరికింది నాకు’ అనుకున్నాడు.
‘సరే.. నేను ఇంజక్షన్ చేయించుకోవాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి.. అర్థమైందా?’ అని వెకిలిగా నవ్వాడు.
అతడి ఉద్దేశం అర్థమైన కృతి బెదరలేదు. భయపడలేదు. కానీ లేచి వెళ్లిపోదామని అనుకుని సిరంజ్‌ని టీపాయ్ మీద పడేసింది. బ్యాగ్ భుజాన తగిలించుకుని పైకి లేచింది.
‘నీ కష్టం ఉంచుకోనులే డబ్బులిచ్చేస్తా’ అన్నాడు.
ఇంక వాడి ముఖం చూడ్డం ఇష్టంలేక వెనక్కి తిరిగి మెయిన్ డోర్ వైపు నడుస్తూండగా అతడు వెనుక నుంచి ఆమె భుజంపై చెయ్యి వేశాడు.
ఆమె కోపాన్ని అణచుకుని నవ్వుతూ వెనక్కి తిరిగింది. అతని చేతిని తన చేతిలోనికి తీసుకుంది. ఆమె అతని వలలో పడిందని అతను అనుకునేలోగా తన ఎడమ చేతితో అతడి బొటన వేలుని, కుడిచేత్తో చిటికెన వేలుని పట్టుకుని వెనక్కి వంచింది. వంచుతున్నప్పుడు ఆమె కుడి మోచేత్తో అతడి గెడ్డం కింద బలంగా కొట్టింది. ఆమె కుడికాలితో అతడి ఎడమ కాలుని ముందుకు లాగింది. ఈ మూడు చర్యలు అర సెకనులో జరిగేసరికి, అతడికి అర్థమయ్యేలోగా కింద పడ్డాడు.
జ్వరం వల్ల వచ్చిన నీరసానికి తోడు ఆమె కొట్టిన దెబ్బల వల్ల అతడు పైకి లేవలేకపోయాడు. అతడి గొంతు పట్టుకుంది. నలిపేద్దామన్నంత కోపం వచ్చింది. కానీ ఆ గొంతులోని వెచ్చదనం అతడు తన పేషెంట్ అన్న విషయాన్ని ఆమెకు గుర్తు చేసింది.
అతడు బాధతో మూల్గుతున్నాడు. అతడి నుదుటిపై చేతిని ఆనించి జ్వరాన్ని పరీక్షించింది. టీపాయ్ పైన ఆమె పడేసిన ఇంజక్షన్ తీసుకుంది. ‘నరానికి మాత్రమే ఇవ్వాలి’ అని డాక్టర్ వౌక్తిక్ అన్న మాటలు గుర్తొచ్చి అతడి మోచేతి నరానికి ఇంజక్షన్ చేసి అక్కడి నుంచి బయటపడింది.
* * *
మర్నాటి ఉదయం...
కృతి ఫోన్ మోగింది. వౌక్తిక్ నుంచి కాల్. భయపడుతూనే ఆన్సర్ చేసింది.
‘అర్జంట్‌గా మా ఇంటికి రా’ అన్న వౌక్తిక్ వాయిస్ వినపడి కట్ అయిపోయింది.
* * *
గంట తరువాత.. వౌక్తిక్ ఇంట్లోకి కృతి అడుగుపెట్టింది. వౌక్తిక్ సోఫాలో కూర్చొని ఏదో చదువుకుంటున్నాడు. అదే గదిలో వౌక్తిక్ అయిదేళ్ల కొడుకు, కింద కూర్చొని తన పుస్తకంలో ఏదో రాసుకుంటున్నాడు.
‘సర్..’
‘మేయర్‌గారి అబ్బాయి ఫ్లాట్‌కి వెళ్లావా?’ ఆమె వైపు చూడకుండానే అడిగాడు వౌక్తిక్.
‘ఎస్ సర్..’
‘హౌ ఈజ్ ది పేషెంట్’
‘వీక్‌గా ఉన్నాడు సార్’
‘టైఫాయిడ్ పేషెంట్‌కి ఏం ఇంజక్షన్ ఇవ్వాలి’ ఆమెకి ఆందోళన ఎక్కువవ్వడం మొదలైంది.
‘క్లోరంఫెనికాల్ సర్’
‘కదా... మరి క్లోరంఫెనికాల్ ఇంజక్షన్ చెయ్యమని పంపిస్తే నువ్వేం చేసావ్?’ అతడి పంటి కింద నలిగిన కోపం, దవడ నరంగా ఉబ్బింది.
‘మీరు రాసినట్లే.. క్లోరంఫెనికాల్ నరానికి చేశాను సార్’
‘నువ్విచ్చింది క్లోరంఫెనికాల్ కాదు క్లోరోక్విన్. మలేరియా వచ్చిన పేషెంట్‌కి ఇవ్వాల్సిన డ్రగ్‌ని నువ్వు టైఫాయిడ్ పేషెంట్‌కి ఇచ్చావ్.. అది కూడా నరానికి!’ వౌక్తిక్ కోపంతో ఊగిపోతున్నాడు.
‘తర్వాత ఏం జరిగిందో తెలుసా? అతను చనిపోయాడు. కాదుకాదు.. నువ్వే నీ మూర్ఖత్వంతో అతడ్ని చంపేసావ్’ అతను పిచ్చిపట్టినట్టు అరుస్తూంటే కృతికి మతిపోయింది.
‘నిన్న ఈవినింగ్ లక్కీగా మన హాస్పిటల్‌కి తీసుకువచ్చారు కాబట్టి సరిపోయింది. వాళ్ల నాన్నకు నిజం చెప్పకుండా మేనేజ్ చేశాం. అదే అతను వేరే హాస్పిటల్‌కి వెళ్లుంటే...’
‘సర్.. మీరు ప్రిస్క్రిప్షన్‌లో రాసిందే నేను ఇచ్చాను సార్’ ఆమె భయంతో వణుకుతోంది.
‘తప్పంతా నువ్వు చేసి నన్ను అంటున్నావా? ఏదీ ప్రిస్క్రిప్షన్ చూపించు’ అని అతను అనగానే ఆమె భయపడుతూ ప్రిస్క్రిప్షన్ బయటకు తీసింది. అందులో అతను రాసింది చూస్తే ఆమెకు ఆ పదం ఏమిటో పోల్చుకోలేకుండా ఉంది.
‘సి’ అన్న అక్షరం మాత్రమే స్పష్టంగా ఉంది. కొంచెంసేపు పరీక్షగా చూస్తే హెచ్, ఎల్ కూడా అర్థమయ్యాయి. మొదటి ఆరు అక్షరాలు క్లోరో అని అర్థం చేసుకోవడానికి ఆరు నిమిషాలు పట్టింది.
‘ఎంతసేపు చదువుతావ్?’ అని ఆమె చేతిలో నుంచి కాగితం లాక్కున్నాడు.
‘ఇదిగో... క్లోరంఫెనికాల్ అని రాసాను కదా’
‘అని మీకు మాత్రమే అర్థమైతే చాలా డాక్టర్’ వౌక్తిక్ ముందు ఆమె గొంతు తొలిసారి పెగిలింది.
‘మీరు రాసిందేవిటో నేను పోల్చుకోవడానికే అయిదు నిమిషాలు పట్టింది. ఆ మెడికల్ షాప్ వాడికి ఎలా అర్థవౌతుంది సార్? మీ రాత అర్థంకాక వాడు క్లోరంఫెనికాల్ బదులు క్లోరోక్విన్ ఇచ్చాడు’
‘అంటే.. వాడు ఏమిస్తే అది తీసేసుకుంటావా?’
‘అసలు నిన్న ఏం జరిగిందంటే..’ తన పరధ్యానానికి కారణం వివరించబోయింది.
‘చెప్పింది చాలు... నిన్ను ఉద్యోగం నుంచి తీసెయ్యమని ఆర్డర్స్ వచ్చాయి. ఈ నెల నువ్వు పని చేసిన ఫైవ్ డేస్‌కి నీకు ఎవౌంట్ సెటిల్ చెయ్యమన్నారు. కానీ నీకు డబ్బులివ్వడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆ డబ్బుతో నీకు డ్రగ్స్ టెక్స్ట్‌బుక్ తెప్పించాను. మళ్లీ జాగ్రత్తగా చదువు. నువ్వు నెక్స్ట్ వెళ్లబోయే హాస్పిటల్‌లో పేషెంట్స్ అయినా బతికి ఉంటారు’
ఆ పుస్తకం తీసుకుని కృతి విరక్తిగా నవ్వింది. అప్పటి దాకా హోంవర్క్ చేసుకుంటున్న పిల్లవాడు వీళ్ల గొడవని చూస్తున్నాడు. పిల్లవాడి దగ్గరికి కృతి వెళ్లి అతడి చేతిలోని పుస్తకం తీసుకుని వౌక్తిక్ వైపు వెళ్లింది.
‘నాకు డ్రగ్స్ టెక్స్ట్‌బుక్ అవసరమో లేదో తెలియదు కానీ మీకు మాత్రం ఈ పుస్తకం అవసరం’ అని హేళనగా నవ్వి అక్కడ నుంచి వెళ్లిపోయింది.
వౌక్తిక్ ఆ పుస్తకం వైపు చూశాడు.
ఆ పుస్తకం అట్ట మీద ‘హౌ టు ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్’ అని రాసి ఉంది.
**
రిషి శ్రీనివాస్
ప్లాట్ నెం.73, ఎంఎస్‌ఎన్ కాలనీ, విజయనగరం
7680821010/ 8792739138

రిషి శ్రీనివాస్