రాష్ట్రీయం

కాటేసిన కల్తీ మందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడలో ఐదుగురి బలి * 28 మంది ఆస్పత్రిపాలు
ఏడుగురి పరిస్థితి విషమం * బార్ మేనేజర్ సహా ఏడుగురి అరెస్ట్
బార్ సీజ్.. ప్రయోగశాలకు శాంపిల్స్ * ఒరిజినల్ ఛాయిస్-120 బ్యాచ్ సీజ్

విజయవాడ, డిసెంబర్ 7: విజయవాడలో కల్తీ మద్యం ఐదుగురి ప్రాణాలు బలిగొంది. సిఎం క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలోవున్న కృష్ణలంకలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. కల్తీ మద్యం సేవించిన మరో 28మంది తీవ్ర అస్వస్థతకు గురికాగా, ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరందరికీ వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెంటిలేటర్లపై చికిత్స అందిస్తున్నారు. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తల్లి మల్లాది బాలాత్రిపురసుందరమ్మ, కుటుంబీకులు భాగవతుల శరత్‌చంద్ర, కావూరి పూర్ణచంద్రశర్మ, కావూరి లక్ష్మీసరస్వతి పేర్లతో గత పదేళ్లుగా కృష్ణలంకలో నడుస్తున్న స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్‌లో సోమవారం ఉదయం ఈ దారుణం జరిగింది. మృతులు, బాధితులంతా కాయకష్టం చేసుకుంటూ రోజువారీ కూలి డబ్బుతో జీవనం సాగించేవారే. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్‌లో బార్ నడుస్తున్నప్పటికీ ఏ అధికారీ ఇప్పటివరకు కనె్నత్తి చూడకపోవడాన్ని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఉదయం 10 గంటలకు బార్ షట్టర్ తెరచిన కొన్ని నిమిషాల్లోనే మద్యం తాగినవారు కనీసం ఇళ్లకు కూడా చేరుకోకుండా అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అందరూ ఒకే ప్రాంతానికి చెందినవారు కావటంతో కుటుంబీకులకు క్షణాల్లో సమాచారం అందటం, ఆటోలు, అంబులెన్స్‌ల్లో వారిని ప్రభుత్వాసుపత్రికి చేర్పించడం చకచకా జరిగిపోయింది. కొందరు తమ ఇళ్లకువెళ్లి వాంతులతో స్పృహతప్పి పడిపోగా, వారినీ ఆస్పత్రులకు తరలించారు. కలెక్టర్ బాబు.ఎ ఆదేశాలపై రెవెన్యూ అధికారులు గత రాత్రి ఆ బార్‌లో మద్యం తాగిన వారెవరు ఉన్నారో, వీధుల్లో ప్రచారం ద్వారా గుర్తించి అలాంటివారిని ముందస్తు జాగ్రత్తగా వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఒకరిద్దరు ఆ బార్‌కు సమీపంలోనే రోడ్డుపైపడి ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఉదయానే్న తప్పతాగి పడివున్నారులే అని రోడ్డుపై పడినవారిని ముందుగా ఎవరూ గుర్తించలేదు. అయితే నురగలు కక్కుతుండటాన్ని చూసి ఆసుపత్రికి తరలించారు. మునగాని శంకర్రావు (65), నరసా గోపి (52), బాషా (40), మస్తాన్ వలీ (32), నాంచారయ్య (55) మరణించిన వారిలో ఉన్నారు. సురభి నాగబాబు, ఎం శంకర్, మిద్దెల సన్యాసిరావు, షేక్ సైదా, ఎం అక్కునాయుడు, నాసా వెంకట గోపీకృష్ణ, షేక్ భాయ్, గంగు శ్రీను, విజ్జి వెంకట్రావు, మీసాల సాహెబ్, నక్కా బూసిరెడ్డి, నక్కల సత్యం, దువ్వా గురుస్వామి, యాకూబ్ సహా మొత్తం 28మంది అస్వస్థతకు గురికాగా, వీరిలో ఏడుగురు వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా వుంది.
బార్ సీజ్.. ఏడుగురి అరెస్ట్
రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్, జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కలెక్టర్ బాబు.ఎ, పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్, మున్సిపల్ కమిషనర్ జి వీరపాండ్యన్ తదితరులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను, మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఎక్సైజ్ మంత్రి రవీంద్ర ఆదేశాలపై అధికారులు వివిధ మద్యం బ్రాండ్ల శాంపిల్స్‌ను సేకరించి పరీక్ష కోసం ప్రయోగశాలకు పంపారు. అనంతరం బార్ మేనేజర్ రమణారావుతోపాటు మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బార్ అండ్ రెస్టారెంట్‌ను సీజ్ చేశారు.
కల్తీపై విచారణ ప్రారంభం
పలువురి మరణానికి దారితీసిన పరిస్థితులపై ఎక్సైజ్, పోలీస్ శాఖలు వేర్వేరుగా విచారణలు చేపట్టాయి. బాధితులు తాగిన మద్యంలో ప్రమాదకరమైన కలుషిత మిథనాల్ అధికంగా ఉన్నట్టు వైద్యులు నిర్థారిస్తున్నారు. మద్యంలోనే కల్తీ చేస్తున్నారని ఎక్సైజ్ అధికారులు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపిస్తుండగా, మద్యంలో కలిపి తాగిన నీరు కలుషితమైనట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. మద్యం మత్తును పెంచేందుకు కూలర్‌లోని నీటిలో మిథనాల్‌ను కలిపి ఉండొచ్చని పలువురు ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తెల్లవారుఝామున నీటిలో విషం కలిపి ఉండొచ్చని, దీనిపై సమగ్ర విచారణ జరుపాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేస్తున్నారు. హైవర్డ్ విస్కీ, డిఎస్‌పి, బ్లాక్‌పేపర్ వంటి పలురకాల బ్రాండ్ల మద్యాన్ని సోమవారం ఉదయం పలువురు తాగారు. ఒరిజినల్ ఛాయిస్ తాగినవారంతా బాధితులు కావటంతో ముందుజాగ్రత్త చర్యగా రాష్టవ్య్రాప్తంగా ఒరిజినల్ ఛాయిస్-120 నెంబర్ బ్యాచ్ మద్యం అమ్మకాలను పూర్తిగా నిలిపివేశారు. పలువురు బాధితుల భార్యలు చివరి కార్తీక సోమవారం కావటంతో సమీప శివాలయాలకు వెళ్లివచ్చేసరికి దుర్ఘటన జరిగిపోయిందంటూ కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స కోసం ఆంధ్ర, కామినేని, సెంటినీ, రమేష్ కార్డియాక్ ఆసుపత్రులకు తరలించారు. వీరి వైద్య చికిత్సకు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వం భరిస్తుందని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తున్నామని, నివేదిక అందిన వెంటనే సంఘటనకు సంబంధించిన కారణాలను గుర్తించి తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. (చిత్రం) కల్తీ మద్యం బాధితులను పరామర్శిస్తున్న సిఎం చంద్రబాబు , విలపిస్తున్న బంధువులు