రాష్ట్రీయం

రాష్ట్రానికి రాచబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాన రహదారుల అభివృద్ధి 65వేల కోట్లు
అమరావతి -విజయవాడ చుట్టూ రింగ్‌రోడ్
పుష్కరాలలోపు దుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం
జల రవాణాను బలోపేతం చేస్తాం
ఆంధ్రకు నితిన్ గడ్కరీ వరాల జల్లు
ఉబ్బితబ్బిబ్బయన సిఎం చంద్రబాబు

విజయవాడ, డిసెంబర్ 5: రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.65 వేల కోట్లు మంజూరు చేయనున్నట్టు కేంద్ర రోడ్లు, రవాణా, రహదార్లు, నౌకాయాన మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ప్రధానంగా అమరావతి -విజయవాడ చుట్టూ రూ.20వేల కోట్ల అంచనాతో 180 కి.మీ ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.8వేల కోట్లతో ప్రతిపాదించిన 788 కి.మీ జాతీయ రహదారులను ఇప్పటికే ఆమోదించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అలైన్‌మెంట్ నిర్దేశిస్తే జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును రూపొందిస్తుందన్నారు. విజయవాడ నగరంలో దాదాపు రూ.2606 కోట్ల అంచనాలతో కూడిన దుర్గగుడి, బెంజిసర్కిల్ ప్రాంతాల్లో రెండు ఫ్లైఓవర్ల నిర్మాణం, అలాగే మచిలీపట్నం, తిరువూరు జాతీయ రహదారుల విస్తరణ పనులకు శనివారం కోలాహలంగా శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కురిపించిన హామీలకు సిఎం చంద్రబాబు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఊహించిన దానికంటే ఎక్కువ సహకారం అందించేందుకు గడ్కరీ ముందుకు వచ్చారంటూ సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకాలన్నింటికీ పూర్తిస్థాయి అంచనాలు రూపొందించి నెలలోపు పంపుతామన్నారు. అయితే కేంద్రం ప్రకటించిన అన్ని పథకాలు మూడేళ్లలోపు పూర్తి చేసేందుకు వీలుగా నిధులు విడుదల చేయాలని కోరారు. నూతన రాజధాని అమరావతిని బెంగుళూరు -హైదరాబాద్ జాతీయ రహదారికి నేరుగా కలిపే రోడ్డు నిర్మించాలని, దీనివల్ల రాయలసీమలోని ప్రధాన నగరాల నుంచి నాలుగు గంటలలోపే చేరుకోగలుగుతామన్నారు. అలాగే సముద్ర తీరంవెంబడి ఒక రహదారి నిర్మించాలని, దీన్ని జాతీయ రహదారితో వివిధ ప్రాంతాల్లో అనుసంధానించటం వల్ల రవాణా సదుపాయాలు మెరుగవుతాయని, పర్యాటక రంగం అభివృద్ధి చెందగలదన్నారు. ఈ రెండు రహదారుల నిర్మాణానికి కేంద్ర సహాయం అవసరమన్నారు. అమరావతి -విజయవాడ ఔటర్ రింగ్‌రోడ్డుకు అలాగే ఇతర ప్రతిపాదనలకు నెల రోజుల్లో సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు పంపుతామన్నారు. రాష్ట్ర పథకాలకు అనుమతులు లభించడంలో కేంద్ర మంత్రి వెంకయ్య ఎనలేని సహకారం అందిస్తున్నారంటూ కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన ఏడు మండలాల విలీనంలో వెంకయ్య పాత్ర మరువలేనిదన్నారు. రహదారులను పచ్చదంతో తీర్చిదిద్దేందుకు ప్రాజెక్టుల వ్యయంతో ప్రత్యేకంగా సమీకరించిన 1 శాతం నిధులు, 5వేల కోట్ల నుంచి కొంతమేర వ్యయంతో నిధులు రాష్ట్రానికి కేటాయించాలని ముఖ్యమంత్రి కోరారు. ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడ నగరం వరకు రహదారిని సుందరీకరించినట్లే, ఇతర రహదార్లని పచ్చదనంతో తీర్చిదిద్దుతామన్నారు. రాయలసీమ జిల్లాలకు నీటి ఎద్దడి తీర్చేందుకు నదుల అనుసంధానిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడుతూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న సిఎం చంద్రబాబు పనితనం స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం నుంచి తాడిప్రత్తికి, కర్నూలు నుండి నందికొట్టూరుకు, అనంతపురం నుంచి రాజమండ్రి మీదుగా విజయవాడకు ఎన్‌హెచ్‌లు అభివృద్ధి చేస్తామన్నారు. ఇవికాకుండా, కత్తిపూడి నుంచి కాకినాడ మీదుగా ఒంగోలుకు, విజయవాడ నుంచి ఏపీ తెలంగాణ సరిహద్దుకు, బళ్ళారి- ఆదోని మధ్య, చిత్తూరునుంచి కర్నూలుకు, మదనపల్లి -పలమనేరు మధ్య ఎన్‌హెచ్‌ల అభివృద్ధి, కొత్త ఎన్‌హెచ్‌లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఇందుకు 6,211 కోట్లు మంజూరు చేస్తామన్నారు. వీటికి అదనంగా 1350 కి.మీ పొడవుగల కొత్త ఎన్‌హెచ్‌లను ఆంధ్రకు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. వీటికోసం రూ.13,500 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. అలాగే, 800 కోట్లతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రధాన రహదార్లు, బైపాస్‌ల నిర్మాణానికి అనుమతిస్తున్నట్టు ప్రకటించారు. రాజమండ్రి మోరంపూడి జంక్షన్ వద్ద 45 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణానికి మంత్రి అంగీకారం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 3092 కి.మీ ఎన్‌హెచ్‌ల అభివృద్ధికి 50,560 కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రి తెలిపారు. జాతీయ హైవే ఆథారిటీ (ఎన్‌హెచ్‌ఎఐ) ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ట్రైనింగ్ అండ్ రిసెర్చీ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రకాశం జిల్లాలోని శివరాజ్‌నగర్‌లోను, ఇన్‌స్పెక్షన్ సర్ట్ఫికేట్ సెంటర్‌ను విజయవాడ సమీపంలోని కేసరపల్లిలోను ఏర్పాటు చేస్తామన్నారు. జల రవాణా వ్యవస్థను దేశంలోను, రాష్ట్రంలోను బలోపేతం చేస్తామన్నారు. కృష్ణా, గోదావరి నదులతోపాటు బకింగ్‌హోమ్ కాల్వను జలరవాణాలకు వినియోగించవచ్చన్నారు. దేశంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక డ్రైవింగ్ ట్రైనింగ్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వెంకయ్య ప్రశంసల జల్లు
కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కష్టపడి పనిచేసేతత్వం, ముందు చూపు, పరిపాలన దక్షత కలిగిన నాయకుడు చంద్రబాబే అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఇదేవిధంగా కొనసాగితే అక్షరక్రమంలో రాష్ట్రం ముందుంటుందన్నారు. అవకాశమున్న మేరకు రాష్ట్రానికి నిధులను మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు అనుకూల దేశంగా భారత్, పెట్టుబడులకు ఆకర్షణీయ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పేరుగాంచాయన్నారు. ఐఐఎం, ట్రిపుల్ ఐటి, కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీ సంస్థలను రాష్ట్రానికి మంజూరు చేశామన్నారు. ఈనెల 19న మంగళగిరిలో ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేయనున్నామని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఇటీవల కేంద్రం 2.23 లక్షల ఇళ్లను రాష్ట్రాలకు కేటాయిస్తే, వాటిలో 1.93 లక్షల ఇళ్లు ఆంధ్రకు కేటాయించామని మంత్రి అన్నారు. 15 నెలల కాలంలో రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు మంజూరు చేశామని, అవకాశం మేరకు సహకారం అందిస్తున్నామన్నారు. (చిత్రం)జాతీయ రహదారుల విస్తరణకు శంకుస్థాపన చేసిన అనంతరం కార్యక్రమంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ