Others

ఆత్మగౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్లాష్‌బ్యాక్ @ 50

సుమధుర సంగీతానికి, ఉన్నత విలువలకు ప్రాధాన్యతనిస్తూ మంచి కుటుంబ కథా చిత్రాలతో విజయవంతంగా వర్ధిల్లుతున్న అన్నపూర్ణ సంస్థ నిర్మించిన చిత్రం -ఆత్మగౌరవం. 1966 మార్చిలో చిత్రం విడుదలైంది. కళాతపస్వి కె విశ్వనాథ్‌ను దర్శకుడిగా పరిచయం చేసిన చిత్రమిది. ఆదుర్తి సుబ్బారావు వద్ద అసోసియేట్‌గా, సౌండ్ డిపార్ట్‌మెంటులోనూ ప్రావీణ్యం చూపిన సౌండ్ ఇంజనీరు విశ్వనాథ్‌ను అంతకుముందు డాక్టరు చక్రవర్తి చిత్రానికే దర్శకునిగా అనుకున్నారు. కానీ దాన్ని వారు అంగీకరించక పోవటంవల్ల ఆదుర్తివారే డాక్టరు చక్రవర్తి చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ కారణంగా ఆత్మగౌరవం చిత్రానికి నిర్మాతలు మరోసారి విశ్వనాథ్‌ను దర్శక బాధ్యతలు చేపట్టమని కోరటం, వారు అంగీకరించటం జరిగింది. సెంటిమెంటుతో కూడిన రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని తీయాలని నిర్మాతల ఉద్దేశ్యం. దానికి అనుగుణంగా కథను యద్దనపూడి సులోచనారాణి, గొల్లపూడి మారుతీరావు రూపొందించారు.

=================
సంభాషణలు:
భమిడిపాటి రాధాకృష్ణ,
గొల్లపూడి మారుతీరావు
కళ:
జివి సుబ్బారావు
ఎడిటింగ్:
ఎంఎస్ మణి
నృత్యం:
సుమతీకౌశల్, బి హీరాలాల్
ఛాయాగ్రహణం:
పి సెల్వరాజ్
సంగీతం:
ఎస్ రాజేశ్వరరావు
కథకు సినిమా
అనుసరణ, నిర్మాత:
డి మధుసూదన రావు
దర్శకత్వం:
కె విశ్వనాథ్
=================
జండాపురం జమీందారు వరహాలరావు (రేలంగి). భార్య సంతాన లక్ష్మి (సూర్యకాంతం). పల్లెటూరిలో వారి పొలం సాగుచేసే రైతు రామయ్య (గుమ్మడి). తల్లి శాంతమ్మ (హేమలత). భార్య జానకి (పుష్పకుమారి), తమ్ముడు శ్రీనివాసు, మేనకోడలు సావిత్రి. పిల్లలు లేని జమీందారు శ్రీనివాస్‌ను చూచి ముచ్చటపడి దత్తత చేసుకుంటాడు. భార్య చెల్లెలి కొడుకు వేణుతో కలిసి అతన్ని పట్నంలో చదివిస్తాడు. పెద్దవాడయిన శ్రీనివాస్‌రావు (ఎఎన్నార్)కు డిబేటు పోటీలో రిటైర్డ్ జడ్జి భజగోవిందం (రమణారెడ్డి), కుమార్తె గీతాదేవి (రాజశ్రీ)తో పరిచయం ఏర్పడుతుంది. గీత వాసును ప్రేమిస్తుంది. కాని వాసు ఆమెను ఓ స్నేహితురాలిగా అభిమానిస్తాడు. వేణు (చలం) గీతను ఇష్టపడతాడు. కాని ఆమె వేణును లక్ష్యపెట్టదు. పల్లెలో ప్రసవం కష్టమైన జానకమ్మ మరణిస్తుంది. మేనకోడలు సావిత్రి (కాంచన)ని వాసుకిచ్చి పెళ్ళి చేస్తానని జమీందారు ఇచ్చిన మాట ప్రకారం వివాహం జరిపించమని రామయ్య, వరహాలరావును అడుగుతాడు. వరహాలరావు అందుకు తిరస్కరించటంతో, సావిత్రికి పెళ్ళి చేయటం కోసం, తానొక మతి స్థిమితం లేని పార్వతి (వాసంతి)ని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటాడు. ఆ పెళ్ళి తప్పించాలని సావిత్రి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. అయినా రామయ్య పార్వతిని వివాహమాడతాడు. పట్నం వెళ్ళిన సావిత్రి, గీత కారు క్రింద పడుతుంది. గీతకు సరళగా పరిచయం చేసుకుంటుంది. భజగోవిందం ద్వారా ఓ శరణాలయంలో చేరి నృత్యం నేర్చుకుంటుంది. తొలిచూపులోనే సరళను ప్రేమించిన శ్రీనివాసు, ఆమె ప్రేమను పొందుతాడు.
మొదట గీత అసూయపడినా, సరళ, వాసు మేనకోడలని తెలిసికొని వారి ప్రేమను ఆమోదిస్తుంది. తండ్రిని ఎదిరించి అయినా సావిత్రిని పెళ్ళి చేసుకుంటానని, సావిత్రి సహా జండాపురం వెళ్ళిన వాసు కొన్ని నాటకీయ పరిణామాల తరువాత అందరి అంగీకారంతో ఆమెను పెళ్లి చేసుకోవటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో వరహాలరావు గుమస్తా అప్పలాచార్యులుగా అల్లు రామలింగయ్య నటించారు. చక్కని హాస్యంతో ఆద్యంతం అలరించేలా నటించారు. వీరికి సమఉజ్జీగా చలం -వేణుగా హాస్యాన్ని, సన్నివేశానికి తగ్గ సీరియస్‌నెస్‌ను నటనలో చూపించారు. అన్నపూర్ణ సంస్థలో తొలిసారి హీరోయిన్‌గా ప్రవేశించిన కాంచన -సావిత్రిగా అమాయకతను, బెరుకును, సరళగా మామయ్యను కలుసుకున్నాక ఓ ఆత్మీయత, అతని కోరికమేరకు నృత్యం నేర్చుకుని అభినయించటం, ప్రేమలో తొలుత ముగ్ధగా, ఆ తరువాత చురుకుగా, అల్లరిగా హీరోతో సమంగా సన్నివేశాలను రక్తికట్టించింది. గీతాదేవిగా రాజశ్రీ వాసుపట్ల ప్రేమ, అభిమానం, సరళ గురించి తెలిశాక, తన ప్రేమను త్యాగం చేయటంలో ఓ హుందాతనాన్ని ఎంతో ఈజ్‌తో నటించి మెప్పించింది.
గుమ్మడి, అన్న రామయ్యగా కుటుంబంకోసం పాటుపడే వ్యక్తిగా, అనురాగం, ఆప్యాయతలు, బాధ్యతలు, సంస్కారం, ఆత్మాభిమానం లక్షణాలు ఎంతో వైరుధ్యంతో పోషించగా, జమీందారు వరహాలరావుగా రేలంగి, మంచితనం, కొంత స్వార్థం, అమాయకత్వం, స్నేహితుడు భజగోవిందం రమణారెడ్డితో కలిసి హాస్య సన్నివేశాన్ని రక్తికట్టించేలా నటించారు. ఉదా: ‘హాలూ’ అని రమణారెడ్డి ‘బాజీ’ అని రేలంగి ఒకరినొకరు సంబోధించుకోవటం, పిచ్చిపిల్ల పార్వతిగా వాసంతి చక్కని నటనను చూపగా, మిగిలిన పాత్రధారులు పాత్రోచితంగా, సూర్యకాంతం తన మార్కు ధాష్టీకంతోనూ ఆకట్టుకుంది.
తొలిసారి దర్శకత్వ పగ్గాలు చేపట్టిన కె.విశ్వనాథ్, అక్కినేని, రాజశ్రీ, కాంచనలపై అల్లరి, చిలిపితనంతో కూడిన రొమాంటిక్ సన్నివేశాలను, ధనానికి తక్కువైనా హుందాతనంగల రామయ్య పాత్ర, భార్య మరణించినా తమ్ముడు రాలేదని విచారించటం, తల్లి ఓదార్పు విషయం తెలిసి తమ్ముడు వచ్చాక, అతని మనసు అర్థంచేసుకొని ఆనందించటం మేనకోడలు సావిత్రినే వివాహం చేసుకుంటానని తల్లికి, అన్నకు వాసు చెప్పటం, ‘సంతలో గొడ్డును కాదు వారు కొన్నది. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉన్న వ్యక్తిని’ అని శ్రీనివాస్‌చే చెప్పించటం.. లాంటి సన్నివేశాలు ఎంతో పరిణితితో పట్టుతో చిత్రీకరించారు.
అక్కినేని హీరోగా చిలిపితనంతో కూడిన సన్నివేశాలలో ఎంతో ఈజ్‌తో, హుషారుగాను, సెంటిమెంటు సన్నివేశాలలో స్థిరమైన, భావుకతతో కూడిన గంభీరమైన నటనతో మెప్పించారు.
ఈ చిత్రం ద్వారా హైద్రాబాదులో ‘నృత్య శిఖర’ డాన్స్ స్కూలు నిర్వహిస్తున్న ‘సుమతీ కౌశల్’ను నృత్య దర్శకురాలిగా పరిచయం చేశారు. స్థానికంగావున్న నటీనటులకూ, సాంకేతిక నిపుణులకూ అవకాశాలు ఇచ్చారు.
ఈ చిత్రానికి పాటల కంపోజింగ్ కూడా హైద్రాబాదులోనే జరిపారు. మ్యూజిక్ డైరెక్టర్‌ను, రచయితలను హైద్రాబాదు రప్పించి అద్భుతమైన ట్యూన్స్‌తో అలరించేలా పాటలు రికార్డు చేశారు. విశ్వనాథ్ స్వయంగా దగ్గరుండి పాటలు రికార్డ్ చేయించటం విశేషం.
ఈ చిత్రం ఔట్‌డోర్ దృశ్యాల్ని హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో, రామప్ప సరస్సు, దేవాలయం (వరంగల్) వద్ద, డిండి ప్రాజెక్టు ప్రాంతాల్లో చిత్రీకరించారు.
రేలంగి, అల్లు రామలింగయ్య, హేమలత, పుష్పకుమారి, గుమ్మడి, చిన్నపిల్లలపై చిత్రీకరించిన గీతం -మా రాజులొచ్చారు/ మహరాజులొచ్చారు/ మా ఇంటికొచ్చారు’ (సినారె- గానం పి సుశీల, వసంత బృందం). కాలేజీ డిబేటులో రమణారెడ్డి, అక్కినేని, రాజశ్రీ, చలం, కాలేజీ విద్యార్థులపై చిత్రీకరించిన, అక్కినేని ఆలపించే గీతం -ప్రేమించి పెళ్ళిచేసుకో/ నీ మనసంతా హాయి నింపుకో. నల దమయంతులు, రుక్మిణి, కృష్ణులు దుష్యంతుల ప్రస్తావనతో పాట సాగుతుంది. (ఆరుద్ర- ఘంటసాల) చక్కని తోటలో రాజశ్రీ, అక్కినేనిలపై చిత్రీకరించిన గీతం -ప్రేమించనిదే పెళ్ళాడనని/ తెగ కోతలు కోసావులే’ (ఆరుద్ర- పి సుశీల- ఘంటసాల). కారులో వెళ్తూ రాజశ్రీ తన ఊహలో అక్కినేనితో కలిసి పాడే యుగళ గీతం -పరువము పొంగే వేళలో పరదాల విందుకు. చక్కని ఆకాసం, కొండలు, ఆరుబయలులో.. నదిలో పడవపైనా.. ఇలా 3 విధాలుగా చిత్రీకరణ సాగుతుంది. (సినారె- ఘంటసాల, పి సుశీల). కాంచనపై చిత్రీకరించిన గీతం -బ్రతుకే నేటితో బరువైపోయే (దాశరథి- పి సుశీల). రాజశ్రీ, కాంచనలపై చిత్రీకరించిన క్షేత్రయ్య పదం, నృత్యం -మునుపటివలె నాపై నెనరున్నదా (పి సుశీల). శరణాలయం తోటలో ఆకాశంలో జాబిలి, పాట మధ్య అక్కినేని కారులో వచ్చి కారుపై వ్రాలి కాంచనను తిలకించే విధంగా చిత్రీకరణతో సాగే గీతం -అందెను నేడే అందని జాబిల్లి నా అందాలన్నీ (దాశరథి- పి సుశీల). అక్కినేని, కాంచనలపై చిత్రీకరించిన గీతం -రానని రాలేనని ఊరకే అంటావు (ఆరుద్ర- ఘంటసాల, పి సుశీల) ఔట్‌డోర్‌లో రామప్ప దేవాలయం, చెరువుల వద్ద చిత్రీకరించిన మనోజ్ఞ గీతం, అక్కినేని, కాంచనల అభినయంతో అలరించేలా సాగుతుంది -ఒక పూలబాణం తగిలింది మదిలో తొలి ప్రేమ దీపం (దాశరథి- ఘంటసాల, పి.సుశీల). గెస్ట్‌హౌస్‌లో పూల తోటలో అక్కినేని, కాంచనలపై విడిగా చిత్రీకరించిన మరో మనోజ్ఞ యుగళ గీతం -వలపులు విరిసిన పూవులే చిలికించె తేనియలే (శ్రీశ్రీ- ఘంటసాల- సుశీల). రచనాపరంగా, సంగీతపరంగా, చిత్రీకరణతో ఈ చిత్రంలోని యుగళ గీతాలు మనోల్లాసాన్ని కలిగిస్తూ నేటికీ నిత్య నూతనాలై శ్రోతలను అలరిస్తుండటం విశేషం. ‘ఆత్మగౌరవం’ చిత్రం రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డ్స్‌లో తృతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ కథా చిత్రం స్థానాలు దక్కించుకుంది. చిత్రం ప్రేక్షకుల ఆదరాన్ని పొంది విజయం సాధించింది.

-సివిఆర్ మాణిక్యేశ్వరి