రాష్ట్రీయం

మరీ ఇంత దుర్భిక్షమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరవుపై కేంద్ర బృందం సభ్యుల విస్మయం.. సాయం అందేలా చూస్తామని భరోసా

నిజామాబాద్, డిసెంబర్ 7: వ్యవసాయరంగంలో ఆదర్శంగా నిలిచే నిజామాబాద్ జిల్లాలో ఇంతటి తీవ్ర స్థాయిలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని తాము ఎంతమాత్రం ఊహించలేకపోయామని, జిల్లా అధికారులు పంపించిన నివేదికల కంటే మరింత ఎక్కువ స్థాయిలో కరవు తీవ్రత ఉన్నట్టు తమ క్షేత్ర స్థాయి పర్యటన సందర్భంగా గమనించామని కేంద్ర కరవు బృందం సభ్యులు పేర్కొన్నారు. మహరాజ్‌కుమార్ నేతృత్వంలో ఐఎఎస్ అధికారి దినకర్‌బాబు, ఓందత్త శర్మ, ఓంకిశోర్‌లతో కూడిన నలుగురు సభ్యుల బృందం సోమవారం కరవు పరిశీలన నిమిత్తం జిల్లాలో పర్యటించింది. ముందుగా భిక్కనూరు ఎంపిడిఓ కార్యాలయానికి చేరుకున్న ఈ బృందానికి కలెక్టర్ యోగితారాణా స్వయంగా కరవు పరిస్థితుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా సవివరంగా తెలియజేశారు. రాష్ట్రంలోనే అత్యల్ప వర్షపాతం నమోదు కావడం, మునుపెన్నడూ లేని రీతిలో 20మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోవడం, 900అడుగుల లోతు వరకు బోర్లు తవ్వినా నీరు రాని వైనం, ఖరీఫ్‌లో సగానికి పడిపోయిన పంటల సాగు విస్తీర్ణం, నీటి నిల్వలు లేక బోసిపోయిన జలాశయాలు, తాగునీటి ఇక్కట్లు, పశుగ్రాసం కొరత, వ్యవసాయ కూలీల వలసలు తదితర అంశాలను గణాంకాలతో సహా కరవు బృందం దృష్టికి తెచ్చారు. కరవు నివారణ పనుల కోసం 1255.35కోట్ల రూపాయల ప్రతిపాదనతో ప్రభుత్వానికి నివేదికలు పంపించామని అన్నారు. జిల్లా అధికారులతో భేటీ అనంతరం కేంద్ర కరవు బృందం సభ్యులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రత్యక్షంగా కరవు తీవ్రతను గమనించారు. భిక్కనూరు మండలం కాచాపూర్‌లో ఎండిపోయిన పెద్దచెరువును, దోమకొండ మండలంలోని బీబీపేట చెరువు, లింగంపల్లిఖుర్దు తదితర వాటిని సందర్శించి ఎండిన చెరకు పంటను పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలను పలుకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల రైతులు ఎండిన చెరకు, ఇతర పంటలను చేతబట్టుకుని కరవు బృందం సభ్యులకు చూపిస్తూ తమ దైన్య స్థితిని వివరిస్తుంటే వారు చలించిపోయారు. కాచాపూర్‌కు చెందిన మర్రి చిన్నరాములు అనే రైతు మాట్లాడుతూ, పంటలు ఎండిపోవడంతో తామంతా ఏదైనా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నామని, ప్రభుత్వం ఆదుకుంటామని భరోసా ఇవ్వడంతో ఆ ఆలోచనను విరమించుకున్నామని కేంద్ర బృందం ఎదుట ఆవేదన వెలిబుచ్చాడు. కాగా, జిల్లాకు ప్రధాన ఆధారంగా ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్‌స్టోరేజీకి దిగువన పడిపోగా, ఈ జలాశయాన్ని జిల్లా అధికారులతో పాటు జహీరాబాద్ ఎంపి బిబి.పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌సింధేలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కరవు బృందానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న మహరాజ్‌కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో ఇంతటి దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని తాము ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చని పంటలతో అలరారే నిజామాబాద్ జిల్లాలోనే ఇంత తీవ్రంగా కరవు పరిస్థితులు ఉంటే, మిగతా జిల్లాలలో మరింత దారుణంగా కరవు ఛాయలు అలుముకుని ఉంటాయన్నారు. తీవ్ర ప్రతీకూలతలు నెలకొని ఉన్నందున జిల్లాకు పెద్ద మొత్తంలో సహాయం అందించాల్సిందిగా కోరుతూ ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తామని, రైతులు, జిల్లా ప్రజలు ఏమాత్రం అధైర్యపడవద్దని కేంద్ర కరవు బృందం సభ్యులు భరోసా కల్పించారు. వారి వెంట జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు. కాగా, నిజామాబాద్‌లో రెండు రోజుల పర్యటనకు హాజరైన కరవు బృందం మంగళవారం సదాశివనగర్ మండలంలో కరవు పరిస్థితులను పరిశీలించిన మీదట మెదక్ జిల్లాకు బయలుదేరి వెళ్లనుంది. (చిత్రం) కరవు గురించి కేంద్ర బృందానికి వివరిస్తున్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణా