రాష్ట్రీయం

భావనపాడుతోనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్టుకు భూములిచ్చి సహకరించండి జన చైతన్యయాత్రలో సిఎం బాబు పిలుపు
శ్రీకాకుళం, డిసెంబర్ 7: ఆదాయం పెరిగితేనే జీవన ప్రమాణాలు పెరుగుతాయి. జీవన ప్రమాణం పెరగాలంటే పరిశ్రమలు రావాలి. తద్వారా ఉపాధి అవకాశాలు కలగాలి. అందుకు భావనపాడులో పోర్టు నిర్మించాలి. ఇందుకు రైతులు సహకరించి భూములివ్వాలి. భూములిస్తే ఊర్లు పోవు, భవంతులొస్తాయి. ప్రపంచ వాణిజ్యపటంలో భావనపాడు అగ్రప్రాంతంగా నిలవాలి. అదే శ్రీకాకుళం జిల్లాలో పేదరిక నిర్మూలనకు మార్గమని సిఎం చంద్రబాబు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరులో సోమవారం జరిగిన జన చైతన్యయాత్ర సభలో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిండుమనస్సుతో ఆశీర్వదించాలని కోరారు. ముందుగా గ్రామంలోని వీధుల్లో పాదయాత్ర నిర్వహించి వృద్ధ మహిళలు బత్తిన మహాలక్ష్మి, పోతలపల్లి సరస్వతి, ఉపడపల్లి ఆదిలక్ష్మిలతో మాట్లాడారు. వృద్ధాప్య పింఛన్లు సక్రమంగా అందుతున్నాయా? అని ఆరా తీశారు. ఎవరికీ రూపాయి లంచం ఇవ్వకుండానే పింఛన్లు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. అంతేకాకుండా పింఛను ఐదురెట్లు పెరిగిన తర్వాత వృద్ధుల నెలవారీ ఖర్చులకు ఇబ్బంది లేకుండా ఉందా? అంటూ ఆరా తీశారు. వీటన్నింటికీ వృద్ధ మహిళలు సంతోషంగా ఉందంటూ జవాబిచ్చారు. నెయ్యిల శాంతి, పి శీతమ్మ అనే మహిళలతో మాట్లాడుతూ దీపం పథకం అందుకున్నారా? అని అడిగారు. గుజుజ అచ్చెన్న అనే వ్యక్తి తనకు అంత్యోదయ కార్డు రాలేదని సిఎంకు ఫిర్యాదు చేయగా, స్థానిక మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుంటూ సాంకేతిక సమస్యలవల్ల ఇవ్వలేకపోయారని, ఒకటి రెండు రోజుల్లో ఇప్పిస్తానంటూ చెప్పారు. పాదయాత్ర ముగించుకుని బహిరంగ సభలో మాట్లాడుతూ 30ఏళ్లుగా జిల్లాకు వస్తున్నా అదే ఆదరణ ఇక్కడి మత్స్యకారుల్లో కన్పిస్తోందన్నారు. శ్రీకాకుళంలో పేదరికం పూర్తిగా నిర్మూలిస్తానని భరోసాఇచ్చారు. జిల్లాలో తలపెట్టిన భావనపాడు పోర్టుపై అపోహలు వద్దని, పోర్టువస్తే పేదలంతా బాగుపడతారన్నారు. అమరావతి నిర్మాణానికి అక్కడి రైతులు 30వేల ఎకరాల పైచిలుకు భూమి ఇవ్వడంవల్లే, భూముల ధరలు భారీగా పెరిగాయన్నారు. అభివృద్ధి జరిగితే ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. భావనపాడు పోర్టువస్తే ఉద్యోగాలు వస్తాయని, భూమి విలువ పెరగాలంటే పరిశ్రమలను ఆహ్వానించాలని, అలా జరగాలంటే భావనపాడు పోర్టు నిర్మాణం జరగాలన్నారు. శ్రీకాకుళంలో సగం విస్తీర్ణం కలిగినంత పోర్టు సింగపూర్‌లో ఉందని, ముడి సరుకులు దిగుమతి చేసుకుని, వస్తువులుగా తయారుచేసి, పోర్టు ద్వారా ఎగుమతి చేసి అభివృద్ధి పథంలో దూసుకువెళ్లిందన్నారు. అలాగే దుబాయ్ కూడా ఒకే పోర్టుతో ప్రపంచ దేశాలన్నింటినీ ఆకర్షిస్తోందన్నారు. అటువంటి అవకాశం భావనపాడుకి దక్కుతుందని, అభివృద్ధిలో అగ్రప్రాంతంగా నిలుస్తుందన్నారు. పోర్టు నిర్మాణంతో మత్స్యకారులకు, రైతులకు అన్యాయం జరగదని, మీ అందరికీ తన రక్షణ ఉంటుందని భరోసా ఇచ్చారు. భావనపాడు పోర్టుకు ఉద్యోగాల కోసం వివిధ ప్రాంతాల నుంచి జనం వచ్చేంతటి ప్రగతి సాధించాలంటే ఇక్కడ రైతుల సహకారం కావాలని సిఎం కోరారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా భావనపాడులో పోర్టు నిర్మాణం జరుగుతుందని, అందుకు మంచి మనసుతో రైతులు, మత్స్యకారులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, తెదేపా అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు, స్థానిక ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ, ఎంపి రామ్మోహన్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. (చిత్రం) వజ్రపుకొత్తూరులో సిఎం చంద్రబాబుకు బొట్టుపెడుతున్న మహిళ