రాష్ట్రీయం

26న ఎఒబి బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రా, ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి పిలుపు
జి.మాడుగుల, డిసెంబర్ 6: బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 26న ఎఒబి బంద్ పాటించాలని ఆంధ్రా, ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చంద్రవౌళి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఈనెల 21 నుంచి 27 వరకు నిరసన వారాన్ని పాటించాలన్నారు. ఆదివారం విశాఖ జిల్లా జి.మాడుగుల విలేఖరులకు ఈ కమిటీ నుంచి ఒక పత్రికా ప్రకటన అందింది. బాక్సైట్ తవ్వకాల జీవో తాత్కాలిక ఉప సంహరణ ప్రజల ఆగ్రహం వల్లే అని అన్నారు. ఆదివాసీల్లో చీలికలు సృష్టించి ఒక వర్గానికి ప్యాకేజి ప్రకటించి తమకు మద్దతుదారులుగా మార్చుకుంటున్నారన్నారు.
దుర్గమ్మ భక్తులకు ఉచితంగా అమ్మవారి కుంకుమ
విజయవాడ ,డిసెంబర్ 6: జనవరి 1నుండి అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఉచితంగా అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు అందజేయాలని ఆలయ ఇఒ నరసింగరావు నిర్ణయించారు. కేవలం మహారాష్టల్రోని షిర్డి క్షేత్రంలో సాయిబాబాను దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చే భక్తులకు బాబా విభూది ప్యాకెట్‌ను ఆ దేవస్థానం వారు ఉచితంగా అందచేస్తారు. నూతన సంవత్సరం కానుకను జనవరి 1నుండి అమ్మవారిని దర్శించుకున్న భక్తులందరికీ ఉచితంగా అమ్మవారి కుంకుమ ప్యాకెట్‌ను దేవస్థానం తరఫున అందచేయనున్నారు. దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కె మాణిక్యాలరావు సిఫారసుతో రాష్ట్రంలో దుర్గగుడి ఇవో ఈ నూతన కార్యక్రమాన్ని అమ్మవారి సన్నిధిలో ప్రవేశపెడుతున్నారు. నిత్యం అమ్మవారి సన్నిధికి సుమారు 25వేల మంది భక్తులు వస్తున్నట్లు అధికారుల అంచనా.
క్వారీలో విరిగిపడిన కొండచరియలు
ఇద్దరు కూలీలు దుర్మరణం
అడ్డతీగల, డిసెంబర్ 6: తూర్పుగోదావరి జిల్లాలో మెటల్ క్వారీలో ప్రమాదవశాత్తు కొండచరియలు విరిగిపడి ఆదివారం ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. ఏజెన్సీలోని అడ్డతీగల మండలం గొంటువానిపాలెం గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలిలావున్నాయి.. గొంటువానిపాలెం గ్రామ సరిహద్దుల్లో గిరిజన సొసైటీ కార్పొరేషన్ ఇండస్ట్రీ పేరుతో మెటల్ క్వారీ నడుస్తోంది. దీని నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా ఉందని గ్రామస్థులు రంపచోడవరం ఆర్డీవోకు గతంలో ఫిర్యాదుచేశారు. దీంతో ఆర్డీవో సత్యవాణి స్పందించి, దానిని మూయించివేశారు. ఆర్డీవో ఇటీవలే బదిలీ కావడంతో మూడు రోజుల క్రితం నుండే దీనిని మళ్లీ నిర్వహిస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. ఆదివారం క్వారీలో కొండ చరియలు విరిగిపడటంతో తుమ్మలపల్లి బాపనయ్య (40), కర్రి వీరవెంకటరమణ (28) మృతిచెందారు. అడ్డతీగల సిఐ ముక్తేశ్వరరావు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.
జీవకోనలో పోలీసుల తనిఖీలు
తిరుపతి, డిసెంబర్ 6: బ్లాక్‌డే, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాయలసీమ డిఐజి సత్యనారాయణ, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాధ్‌జెట్టి ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం స్థానిక జీవకోనలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఆదివారం బ్లాక్‌డే కావడంతో శనివారం అర్ధరాత్రి నుంచే నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తిరుపతి రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణునివాసం, ఇతర హోటళ్లలో సైతం తనిఖీలు చేశారు. స్వయంగా డిఐజి రంగంలోకి దిగడంతో డిఎస్పీ రవిశంకర్ పర్యవేక్షణలో, సిఐ, ఎస్‌ఐలు దాదాపు 150 మంది బృందాలుగా విడిపోయి తనిఖీల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక జీవకోన, మాధవినగర్, సత్యనారాయణపురం తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి తనిఖీ చేశారు. ఇంటిలోని వివరాలు, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులు పరిశీలించారు. గుర్తింపుకార్డులు లేనివారిని అదుపులోకి తీసుకుని విచారించారు. అద్దె ఇళ్లల్లోని వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా డిఐజి సత్యనారాయణ మాట్లాడుతూ ఈనెల 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని, బ్లాక్ డే సందర్భంగా తామీ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇంటి యజమానులు తమ ఇళ్లల్లో అద్దెకు ఉన్నవారి వివరాలను సమీప పోలీస్‌స్టేషన్లలో అందించాలని కోరారు. వాటి ఆధారంగా పాత నేరస్థులు ఎవరైనా ఉంటే గుర్తించడానికి సాధ్యపడుతుందని అన్నారు. ఇందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్‌జెట్టి మాట్లాడుతూ తనిఖీల సందర్భంగా ఎలాంటి రికార్డులు లేని 20 వాహనాలను తాము స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కాని వస్తువులు కాని కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.