రాష్ట్రీయం

చేరువవుతున్న కాంగ్రెస్, టిడిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ ఉప ఎన్నికతో మారిన ఆలోచనా ధోరణి
టిఆర్‌ఎస్‌ను ఎదుర్కోవాలంటే అదే మార్గమంటున్న సీనియర్లు
అయోమయంలో బిజెపి, వామపక్షాలు
హైదరాబాద్, నవంబర్ 26: వరంగల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో రాజకీయ పక్షాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నందున క్రమంగా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కలుగుతుందని వివిధ రాజకీయ పక్షాలు భావించాయి. కానీ ఫలితాలు మాత్రం వారి అంచనాలను తలకిందులు చేసి టిఆర్‌ఎస్ మరింతగా బలపడుతోందని తేల్చి చెప్పాయి. ఈ నేపథ్యంలో టిడిపి, కాంగ్రెస్ నేతలు పునరాలోచనలో పడినట్టు కనిపిస్తోంది. భవిష్యత్తులో టిఆర్‌ఎస్‌పై పోరు సల్పేందుకు చేతులు కలిపే దిశగా ఈ రెండు పార్టీలూ పావులు కదుపుతున్నాయి. ఒకవైపు ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే... వచ్చే ఎన్నికల్లో టిడిపితో కలిసి పోటీ చేస్తామని కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. శాసనసభాపక్ష నేత జానారెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క సైతం టిడిపితో అనుబంధంపై ఉత్సాహం చూపించారు. ఎన్నికల సమయంలో పొత్తుల గురించి చర్చిస్తామనడం ద్వారా అవకాశాలు మూసుకుపోలేదన్న సంకేతాలు ఇచ్చారు. అంతకుముందు నుంచే టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు పలుమార్లు కాంగ్రెస్‌తో కలిసి ఉద్యమిస్తామని ప్రకటించారు. వరంగల్‌లో ప్రత్యర్థుల అందరి ఓట్లూ కలిపినా టిఆర్‌ఎస్‌కు వచ్చిన ఓట్లలో సగం కూడా రాలేదు. ప్రజల్లో టిఆర్‌ఎస్ పట్ల ఆదరణ ఇదే విధంగా ఉంటే తమ పరిస్థితి ఏమిటనే ఆలోచన విపక్షాల్లో బయలుదేరింది.
దేశంలో బిజెపికి ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఉండగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దీనికి భిన్నమైన వైఖరి. ఆంధ్రలో టిడిపి- బిజెపి కలిసే పోటీ చేశాయి. కేంద్రంలో, రాష్ట్రంలో రెండు పార్టీల మంత్రులు ఉన్నారు. అయితే ఆంధ్రలో టిడిపి, బిజెపిల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ రెండు పార్టీల బంధం ఎంత కాలం ఉంటుందో అనే సందేహాలు బయలు దేరాయి. ఆంధ్రలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడినందున తెలంగాణలో టిడిపి, కాంగ్రెస్ కలిసి పని చేసినా ఆంధ్రలో టిడిపికి పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. టిడిపితో కలిసి పోటీ చేస్తాం, కలిసి పని చేస్తాం అని కాంగ్రెస్ నాయకులు ప్రకటిస్తున్నా, ఇప్పటివరకు చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందనా వ్యక్తం కాలేదు. విపక్షాలు ఒంటరిగా టిఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడం సాధ్యం కాదు కలిసి పోటీ చేయాలని వరంగల్ ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ నాయకులు చెబుతున్నా, ఎన్నికలకు ముందే సిపిఎం ఈ ప్రయత్నం చేసింది. టిఆర్‌ఎస్‌పై ఒంటరి పోరాటం చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఊహించిన సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వరంగల్‌లో ఉమ్మడి అభ్యర్థిని పోటీకి నిలుపుదామని ప్రతిపాదించారు. అది సాధ్యం కాలేదు. ఇదిలాఉండగా టిడిపితో బంధాన్ని తెలంగాణ బిజెపి నాయకులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. వరంగల్‌లో తమకు కనీసం ఓట్లు పెరుగుతాయని ఆశిస్తే తగ్గడం ఆ పార్టీ నాయకులను ఆందోళనకు గురి చేస్తోంది. బిజెపి వల్లనే తక్కువ ఓట్లు వచ్చాయని ఫలితాల తరువాత టిడిపి నాయకులు నెపం బిజెపిపై వేశారు. చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా ఉన్న టిడిపి ఆంధ్రలో బిజెపితో, తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి పని చేయాల్సిన విచిత్రమైన పరిస్థితులు తలెత్తుతున్నాయని, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నాటికి రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి చిత్రాలు ఎన్నో జరుగుతాయని టిఆర్‌ఎస్ అగ్రనాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.