రాష్ట్రీయం

దత్తత పల్లెల్లో సౌరకాంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

60శాతం బిల్లుల ఆదా *తక్కువ పెట్టుబడితో లాభాలు

సంగారెడ్డి, నవంబర్ 22: ఒకప్పుడు ఏ ఇంటిపై చూసినా టీవీ యాంటెన్నాలు దర్శనమిచ్చేవి. ఇప్పుడు సౌరశక్తిని విద్యుత్‌గా మార్చే ప్యానెళ్లు జిగేల్‌మంటున్నాయి. ఈ విషయంలో సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావు దత్తత తీసుకున్న ఎర్రవల్లి, బంజెరుపల్లి పల్లెలు వందడుగుల ముందున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన దీన్ దయాళ్ గ్రామీణ విద్యుదీకరణ పథకాన్ని సద్వినియోగపర్చుకోవడంలో మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి దేశంలోనే నంబర్ 1గా నిలిస్తే, సిద్దిపేట మండలంలోని బంజెరుపల్లి రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఈ రెండు పల్లెల్లో సోలార్ విద్యుదుత్పత్తితో కరెంటు అవసరాలు నెరవేర్చుకుంటూ, అసలు విద్యుత్ చార్జీలను 60శాతం తగ్గించుకుంటున్నారు. కేంద్ర పథకాన్ని అందిపుచ్చుకుని ఈ రెండు గ్రామాలూ అవసరాలు తీరుకుంటున్నాయి. 500 వాట్ల సోలార్ విద్యుత్ ఏర్పాటుకు 82,900 అవసరం అవుతుంది. ఇందులో లబ్దిదారుని వాటా 8,290, సబ్సిడీ 22,383 కాగా మిగిలిన 52,227 రూపాయలను సిఎస్‌ఆర్ ఫండ్ నుంచి చెల్లిస్తున్నారు. 250 వాట్ల విద్యుదుత్పత్తికి రెండు ప్యానళ్లు, 300 వాట్ల సామర్థ్యం కలిగిన రెండు బ్యాటరీలు, 850 వాట్ల సామర్థ్యంతో కూడిన ఇనె్వర్టర్లు అందిస్తారు. లబ్దిదారులు నివాసముండే ఇళ్లు ఏదైనా సరే సౌరశక్తిని ఉత్పత్తి చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుందని మెదక్, నిజామాబాద్ జిల్లాల నెడ్‌క్యాప్ డిఎం రామేశ్వర్‌రావు పేర్కొన్నారు. ఈ పథకాన్ని అమలు చేసే గ్రామాన్ని ఏ బ్యాంకు దత్తత తీసుకుంటుందో అదే బ్యాంకుకు నిధులు సమకూర్చనున్నారు. కిలోవాట్ సౌర విద్యుదుత్పత్తితో కంప్యూటర్, టీవీ, ట్యూబ్‌లైట్లు, వాటర్‌హీటర్, ప్యాన్లు తదితర విద్యుత్ పరికరాలు ఉపయోగించుకోవచ్చు. ఎర్రవల్లి గ్రామంలో 440 కుటుంబాలుంటే ఇప్పటి వరకు 110 ఇళ్లలో కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుదుత్పత్తి పరికరాలు అమర్చుకున్నారు. మరో 30మంది దరఖాస్తులు చేసుకున్నారు. సిఎం కెసిఆర్ గ్రామాన్ని దత్తత తీసుకుని పెంకుటిల్లు లేని గ్రామంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఇప్పటికే ఉన్న పెంకుటిళ్లను కూల్చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తికాగానే వందశాతం సోలార్ విద్యుదుత్పత్తి సాధించేందుకు నెడ్‌క్యాప్ ద్వారా ప్రయత్నాలు సాగుతున్నాయి. సిద్దిపేట మండలం బంజెరుపల్లిలో 130 ఇళ్లుండగా ఇప్పటివరకు వంద ఇళ్లలో పథకాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. 60 శాతం విద్యుత్ బిల్లులు ఆదా అవుతున్నాయని పలువురు లబ్దిదారులు పేర్కొంటున్నారు. పగటిపూట ట్రాన్స్‌కో సరఫరా చేసే విద్యుత్‌ను ఎంతమాత్రం వినియోగించుకోవడం లేదు. పగలు ఉపయోగించుకోగా మిగిలిన విద్యుత్‌ను రాత్రి సమయంలో రెండు గంటల పాటు సద్వినియోగం చేసుకునే సౌలభ్యం లభించింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే జిల్లాలోని మరిన్ని గ్రామాలను ఎంపిక చేసి పథకాన్ని విజయవంతం చేసే ఆలోచనలో అధికార్లు ఉన్నారు. ఎర్రవల్లి గ్రామ వీధుల్లో 80 సౌరశక్తి దీపాలు అమర్చేందుకు భారత్ హెవి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బిహెచ్‌ఇఎల్) యాజమాన్యం ముందుకొచ్చి అవసరమైన నిధులను నెడ్‌క్యాప్‌కు అందించింది. ప్రభుత్వ సంక్షేమ గృహాల్లోనూ సౌర విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం.
కెసిఆర్ వరాలు
ఎర్రవల్లికి కెసిఆర్ వరాలు కురిపిస్తున్నారు. గ్రామం జీవితాంతం రుణపడివుంటుంది. గ్రామంలోనే కాదు, ప్రజా హృదయాల్లో చీకట్లూ పారదోలేందుకు సౌర విద్యుత్ దోహదపడుతోంది. నెలాఖరుతో
ముగుస్తున్న పథకం గడువు పెంచాలని సిఎంను కోరతా. ప్రజలకు అవగాహన కల్పించడంలో నెడ్‌క్యాప్ అధికారుల కృషి అభినందనీయం.
భాగ్య బాల్‌రాజ్, ఎర్రవల్లి సర్పంచ్
మంత్రి ఆజ్ఞ శిరసావహించాం
ఆర్ శాంత, బంజెరుపల్లి ఎంపిటిసి
చీకట్లు తొలగించి వెలుగులు నింపుకోవాలన్న మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన ఆజ్ఞను గ్రామస్తులంతా శిరసావహించాం. గ్రామంలో ప్రతి ఇంటికీ సౌర విద్యుత్ అందుబాటులోకి తెచ్చాం. గతంలో 600 రూపాయల కరెంటు బిల్లు వస్తే ఇప్పుడు 100నుంచి 150కి తగ్గింది. సేవలను వినియోగించుకోని వారు ఇప్పుడు బాధపడుతున్నారు.
సోలార్ పవర్ లాభదాయకం
పొన్నోజి వెంకటేష్, ఎలక్ట్రీషన్ ఎర్రవల్లి
కొనేళ్లుగా ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నా. సులభతరమైన పద్ధతిలో సోలార్ విద్యుత్ ఉపయోగించే సౌలభ్యం లభించింది. ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, టీవీలు, కంప్యూటర్లు సౌరశక్తితో వాడుకోవచ్చు. విద్యార్థులకు మరింత ఉపయుక్తం.
(చిత్రం) జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నివాసాల వద్ద అమర్చిన సౌర విద్యుత్ ప్యానెల్స్ (ఇన్‌సెట్‌లో) ఎర్రవల్లి సర్పంచ్ భాగ్య బాల్‌రాజ్