ఈ వారం కథ

పాలకపక్షం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోటార్ సైకిల్‌ను ఇంటి గేటుముందు ఆపి, తాళం వేసి, లోపలికి అడుగుపెట్టాను. పొద్దున ఏడింటికి ఇంటినుండి బయలుదేరినవాడిని.. ఇప్పుడు సాయంత్రం ఏడు అయ్యింది. చాలా తిరుగుడు అయ్యింది కాని చాలా తృప్తిగా ఉంది. రెండు కొత్త కాంట్రాక్ట్‌లు దొరికాయి ఇవాళ.
నేను పెట్టిన కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీసింగ్ సెంటర్ ఇప్పుడిప్పుడే ఒక గాడిన పడుతోంది. నగరంలోని దాదాపు పది చిన్న చిన్న ఆఫీసులు, కంపెనీలకు మేమే సర్వీసింగ్ , విడి భాగాల సప్లై చేస్తున్నాం.
కానీ ఇవాళ దొరికిన ఈ కాంట్రాక్ట్ చాలా పెద్ద కంపెనీది. మెయిన్ ఆఫీస్ కాక నగరంలో ఇంకా పది బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి వాళ్ళకి. అన్నిట్లో కలిపి దాదాపు రెండు మూడు వందల సిస్టమ్స్. వాటన్నిటి ఏన్వుల్ మెయింటనెన్స్ కాంట్రాక్టు మాకిచ్చారు. మాలాంటి చిన్న యూనిట్‌కి చాలా పెద్ద ఒప్పందం అది. వాళ్ళ సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్... ఒక లేడీ.. నార్త్ ఇండియన్ అనుకుంటా... ‘‘మా పాత సర్వీస్ ప్రొవైడర్స్‌తో విసిగిపోయాము. మీరు కొత్తవాళ్ళైనా క్వాలిటీ సర్వీస్ ఇస్తారని నమ్మి మీకిస్తున్నాం. ఆ నమ్మకం మీరు నిలబెట్టాలి మిస్టర్ విష్ణు’’ అంది.
‘‘నో ఇష్యూస్ మేడం! హండ్రెడ్ పర్సెంట్ ప్రాంప్ట్ అండ్ క్వాలిటీ సర్వీస్ మేడం! ట్వెంటీఫోర్ /సెవెన్ అవైలబిలిటీ మేడం’’. సేవా రంగంలో సాధారణంగా వాడుతుండే భాష బాగానే వంటపట్టింది నాకు. ఆవిడా ఇంప్రెస్ అయినట్టుంది. చిరునవ్వుతో తల పంకించి వీడుకోలు చెప్పింది.
ఇంకో కాంట్రాక్ట్ ఒక చిట్‌ఫండ్ కంపెనీది. రెండూ ఒకే రోజు కుదరటంతో నా ఆనందం ఇంకా రెట్టింపు అయ్యింది.
బండి శబ్దం విన్నట్టుంది, గుమ్మంలోనే చిరునవ్వుతో ఎదురయ్యింది అమ్మ. తెచ్చిన స్వీట్ పాకెట్ అమ్మ చేతికి అందించాను. ‘‘ఏమిట్రా స్వీటు తెచ్చావు?’’ పాకెట్ బల్లమీద పెట్టి మంచినీళ్ళు అందిస్తూ అడిగింది.
‘‘రెండు పెద్ద కాంట్రాక్టులు దొరికాయమ్మా’’ వంటింట్లో వున్న నా భార్య సుమన కూడా వినేట్లు అన్నాను.
‘‘అలాగా! అమ్మ విశాలంగా నవ్వింది. ‘‘అవునా?’’ సంభ్రమంగా అంటూ సుమన కూడా ముందుగదిలోకి వచ్చింది. నేను నవ్వుతూ ‘‘అవును.. మొన్న చెప్పాను చూడు.. జీవీఆర్ గ్రూపు ఆఫ్ కంపెనీస్ అని.. వాళ్ళే’’ సుమనతో ఇంకా ఏదో చెప్పబోతుంటే అమ్మ మధ్యలో అందుకుంది.
‘‘వాడికి నీళ్ళు పెట్టావా స్నానానికి? పాపం పొద్దుననగా వెళ్ళాడు.. టీ తాగుతావంట్రా? లేదా స్నానం చేసి భోంచేసేస్తావా.. ఏమే అయిపోయిందిగా వంటా..’’ మళ్ళీ సుమన వైపు తిరిగి అడిగింది.
‘‘ఆ.. అయిపోవచ్చింది. నీళ్ళు పెడతాను’’ వంటింటిలోకి వెళ్లిపోయింది సుమన. అప్పుడే పక్కింటి నుండి నాన్నా అంటూ పరుగెత్తుకొచ్చిన నా మూడేళ్ల కూతురు వర్షితని ఎత్తుకొని ముద్దుపెట్టుకుంటూ ‘‘టీ వద్దు.. చాలా టీలు అయినాయి ఇవాళ’’ అని అమ్మతో అంటూ ‘‘నానమ్మ స్వీటు ఇస్తుంది వెళ్ళు...’’ వర్షితకి చెప్పి బెడ్‌రూంలోకి నడిచాను.
స్నానం చేసి వచ్చాక.. ‘‘రారా.. వేడి వేడిగా తినేద్దువుగాని...’’ పిలిచింది అమ్మ.
‘‘అందరం కలిసి తిందాంలే’’ అన్నాను.
‘‘అదిగో పిల్లకి పెడుతోంది కదా అది.. అదొక పట్టాన తింటుందా.. గంట పడుతుంది.. తరువాత మేమిద్దరం కలిసి తింటాంలే. నీకు వడ్డించేసా, రా!’’ హడావుడి పెట్టింది. వరండాలో కూర్చుని వర్షితకి అన్నం పెట్టడానికి తిప్పలు పడుతున్న సుమన వంక ఒకసారి చూసి లోపలికి నడిచాను.
అమ్మ కొసరి కొసరి వడ్డిస్తూ, తింటున్నంతసేపూ ఆ మాటా ఈ మాటా చెబుతూనే వుంది. ‘‘దసరా వస్తోంది కదా.. పెద్దక్కా, చిన్నక్కా వాళ్ళని పిలుద్దామా? చాలా రోజులయ్యింది వాళ్ళు వచ్చి.. బట్టలు కూడా తీసుకుంటే బాగుంటుందేమో.. అవునూ.. మామయ్య వాళ్ళు బియ్యం వేయించుకున్నారు.. బాగున్నాయి.. బాగా ఒదుగు అవుతున్నాయట.. మనమూ ఓ రెండు బస్తాలు వేయించుకుందామా.. అయ్యో! అప్పుడే పెరుగా.. కూర వేస్కో’’ అంటూ ఇంకా వెయ్యబోతే ‘‘చాలు చాలు.. ఇంకా మీరు తినాలి కదా’’ అంటూ వారించాను.
‘‘ఆ.. మాకెంత కావాలి’’ తేలిగ్గా అనేసింది అమ్మ.
అమ్మ చెప్పే కబుర్లకి ఊ కొడుతూ భోజనం ముగించాను.. నా మనసంతా పొద్దుటి విషయాలపైనే వుంది.
****
కొత్త కాంట్రాక్టు వచ్చిన రెండు నెలల్లోపే మేము మా పాత రెండు గదుల ఇరుకు ఇంట్లో నుండి రెండు పడగ్గదుల కొత్త ఇంట్లోకి అద్దెకి మారాము. ఇంకో నెల తిరిగేసరికి ఇంట్లోకి సోఫాసెట్టూ, నలభై రెండు ఇంచుల కలర్ టీవీ వచ్చి చేరాయి. అవి చూసి అమ్మ ఎంత మురిసిపోయిందో! టీవీకి హారతి ఇచ్చి, బొట్టు పెట్టి మరీ ఆన్ చేయించింది. ‘‘మీ రుక్మిణత్త ఎప్పుడు వచ్చినా.. ఓ తెగ గొప్పలు చెప్పుకుంటుంది.. వాళ్ళింట్లో సామాన్ల గురించి, వాళ్ళ కొడుకు ఉద్యోగం గురించి. ఇప్పుడు రానీ చెప్తా.. ఇవన్నీ చూస్తే కళ్ళు తిరిగి పడిపోతుంది- ఒకింత కసిగా అంది అమ్మ. మళ్లీ ఆగి ‘‘మీ నానే్న ఉంటే ఎంత సంతోషించేవారో!’’ కొంత బాధగా నిట్టూరుస్తూ అంది.
నిజమే! నాన్న ఉన్నన్నాళ్ళు బాధ్యత తెలియకుండా తిరిగాను. డిగ్రీ అయ్యాక ఆ కంప్యూటర్ కోర్స్ అని..ఈ కంప్యూటర్ కోర్స్ అని తిరిగాను. అమెరికాలో జాబ్ తెచ్చుకోవాలని కలలు కంటూ రకరకాల కనె్సల్టెన్సీలకు డబ్బులు తగలేశాను. కాని ఉద్యోగం రాలేదు. చుట్టాలమ్మాయని.. వాళ్ళు తొందర పడుతున్నారని ఈలోపు సుమనతో పెళ్లి మాత్రం అయిపోయింది. బిటెక్ చదివినవాళ్ళే ఖాళీగా తిరుగుతున్నారని, కనె్సల్టెన్సీలు ఇప్పించేవన్నీ ఎప్పుడు ఊడతాయో తెలియని కాంట్రాక్ట్ ఉద్యోగాలని తెలుసుకునేలోపు హఠాత్తుగా నాన్న పోయారు.
ఇద్దరక్కల పెళ్లిళ్ళకు ఐన అప్పు, నిరుద్యోగినైన నేను, కడుపుతో ఉన్న నా భార్య, పుట్టెడు దుఃఖంతో అమ్మ మిగిలాము. అమ్మ చాలా దిగాలు పడిపోయింది. చాలా రోజులు ముభావంగా ఉండిపోయింది. నాన్నకొచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులతో నా షాపు ప్రారంభించాను. అమ్మ అనుమానపడుతానే డబ్బులిచ్చింది. ‘‘అరేయి విష్ణు.. ఇదైనా జాగ్రత్తగా కాపాడుకో.. లేకపోతే అందరం వీధిన పడతాం’’ హెచ్చరించింది.
ఒళ్ళు దగ్గర పెట్టుకుని శ్రమించాను. చిన్నతనం అనుకోకుండా ఒకటికి పదిసార్లు కస్టమర్ల చుట్టూ తిరిగి ఆర్డర్స్ సంపాదించేవాడిని. ఎందుకైనా మంచిదని సుమన పేరు మీద బీమా ఏజెన్సీ కూడా తీసుకున్నాను. మొత్తానికి అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. రెండేళ్ళలోపే నిలదొక్కుకున్నాను. మా ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడింది. ఇంటి ఖర్చంతా అమ్మే చాలా గుట్టుగా పొదుపుగా నడిపిస్తుంది. అమ్మ మొహంలో దిగులు, ముభావం, మాయమై ఇప్పుడు కాస్త ప్రశాంతత, ఉత్సాహం కనిపిస్తున్నాయి.
నా పెళ్ళైయ్యాక.. ఆ తరువాతి పెట్టుపోతల గొడవలతో అమ్మకి నాకూ మధ్య దూరం పెరిగింది. కానీ, సుమన పురుడుకని నాలుగు నెలలు పుట్టింటికి వెళ్ళడమో లేక షాపుపెట్టిన కొత్తల్లో నేను పడిన కష్టం, పని ఒత్తిడి దగ్గరుండి చూడడంవల్లో తెలీదు.. అమ్మకీ నాకు మళ్ళీ సాన్నిహిత్యం పెరిగింది. అమ్మ కూడా పాపం నాతోపాటే పొద్దునే్న లేవటం, టీ పెట్టి ఇవ్వడం నుంచి, ఎంత పొద్దునే్న బయలుదేరినా టిఫిన్ అందివ్వడం, మళ్లీ సాయంత్రం వచ్చేసరికి వేడి వేడిగా భోజనం తయారుచేసి దగ్గరుండి వడ్డించి తినిపియ్యడం చేసేది.
సుమన తిరిగి వచ్చినా ఆమెకి ఎక్కువగా పై పనులు, పాప పనులు సరిపోయేవి. సుమన అప్పుడప్పుడు రాత్రి పడగ్గదిలోకి చేరాక తన అసంతృప్తిని వ్యక్తం చేసేది. ‘‘ఎంతైనా మీరూ మీరు ఒకటి. లేచినప్పటినుండి పడుకునేదాకా మీ వెంటే ఉండి అన్నీ ఆమె చూస్తుంది. నన్ను అసలు చొరనివ్వదు. ఇష్టమైన కూరలు చేసినా, కొసరి కొసరి మీకే వడ్డించేస్తుంది. ఆ.. మనదేముంది, కష్టపడేది వాడు అంటుంది. పోనీ కాస్త ఎక్కువ వండుదామంటే, దుబారా అంటుంది. మేము లెక్కలోకే రాము’’ అని బాధపడేది. అత్తాకోడళ్ళమధ్య ఇలాంటివి సహజమేనని తేలిగ్గా కొట్టిపారేసేవాణ్ణి. ‘‘అమ్మకి మా చిన్నప్పటినుంచి ఇదే అలవాటు సుమా!.. నాన్నగారికి కూడా ఇలాగే దగ్గర కూర్చొని వడ్డించడం అలవాటు. నాన్నమీద ఈగ కూడా వాలనిచ్చేది కాదు తెలుసా! నాన్న నైట్ డ్యూటీ చేసొచ్చి పడుకున్న రోజు మమ్మల్ని అటువైపు వెళ్ళనిచ్చేది కాదు. ‘అరేయి నాన్నగారు అలసిపోయి వచ్చి పడుకున్నారు.. గోల చెయ్యకండి.. పొండి.. బయటికి పోయి ఆడుకోండి’ అని తరిమేసేది. నాన్‌వెజ్ రోజైతే ముందే నాన్నకి తీసి దాచి పెట్టేది. లేకపోతే మేము అంతా ఖాళీచేసేస్తామని భయం.. తెలుసా?’’ నవ్వుతూ సుమనకి చెప్పేవాణ్ణి.
‘‘ఎంతైనా మగమహారాజులు కదా! అందుకే ఈ మర్యాదలు. రేపు మీకో కొడుకు పుడితే.. వాడు కూడా ఆవిడ లిస్టులో చేరుతాడేమో!’’ కొంత కినుకగా అనేది సుమన.
‘‘నిజమే కదా! దానికి మన వంతు కృషి మనం చెయ్యొద్దూ!’’ అని దగ్గరకి లాక్కునేవాణ్ణి.
కాని ఏడాదిలోపే అమ్మ ప్రవర్తన మరోవిధంగా మారిపోతుందని అసలు నేను ఊహించని పరిణామాలు చాలా చోటుచేసుకుంటాయని నాకప్పుడు తెలియదు.
***
మధ్యాహ్నం రెండున్నర అవుతోంది. పడగ్గదిలో మంచంమీద దిళ్ళనానుకొని కూర్చొని ఉన్నాను. ఎదురుగా నా కోసం ప్రత్యేకంగా గోడకి అమర్చిన టీవీలో ఏదో న్యూస్ ఛానల్ నడుస్తోంది. కాని నా ధ్యాస దానిమీద లేదు.
హాల్లోంచి అమ్మ, సుమనల మాటలు వినపడుతున్నాయి. ‘‘వేసుకో.. ఇంకొంచెం వేసుకో.. నీకు చికెన్ ఇష్టం కదా..’’ అమ్మ అంటోంది సుమనతో.
‘‘అయ్యో చాలు.. నిన్న ఏజెంట్స్ మీటింగులో కూడా చికెనే పెట్టారు.. లావవుతున్నాను అనిపిస్తోంది’’ సుమన గొంతు.
‘‘ఏం లావూ? ఆమధ్య ఆక్సిడెంట్ అప్పుడు బక్కచిక్కి సగం అయిపోయావు.. ఇప్పుడు కాస్త ఫరవాలేదంతే...’’ అమ్మ. మళ్ళీ అమ్మే అంటోంది ‘‘‘చీరలవాడొస్తే, రెండు చీరలు తీస్కున్నాను. ఒకటి మంచి మిరప్పండు రంగుకి ఆకుపచ్చ రంగు అంచు.. నీకు బాగుంటుందని తీసి పెట్టాను. మూడువేలట. నేను కనకాంబరం రంగుది తీసుకున్నాను. అది వెయ్యేలే. నీకు చూపించాక ఫాల్ కుడదామని ఆగాను’’ చెప్తోంది.
‘‘అవునా! మీరు అంత తక్కువది ఎందుకు తీసుకున్నారు?’’ సుమన గొంతులో దర్పం. ఐనా టైలర్‌కి ఇచ్చేయండి. ఫాలు, బ్లౌజూ.. అన్ని కుట్టిఇచ్చేస్తుంది అన్నది.
‘‘ఎందుకూ? బ్లౌజులు మాత్రం టైలర్‌కి ఇస్తా. ఫాల్స్ నేనే కుడతాలే. వర్షిత స్కూల్‌కి వెళ్ళాక నాకు పనేముంటుంది?’’ అమ్మ చెబుతోంది.
వింటున్న నాకు, కొత్త నటులతో పాత సినిమా చూస్తున్నట్లు అనిపించింది... సారీ! వింటున్నట్టు అనిపించింది. ఇప్పుడు నా ప్రపంచం నా పడగ్గది నాలుగోడలే. మరీ అవసరమైతే తప్ప అది దాటి బయటికి రాను.. అసలు రాలేను.
అమ్మ ఇపుడు రోజులో ఇటువైపు తొంగి చూసే సందర్భాలు ఒకటో రెండో.. మాట్లాడే మాటలు కూడా తక్కువే. చెప్పానుగా.. అమ్మ మారిపోయింది.
సరిగ్గా ఏడాది క్రితం ఇదే నెలలో నాకో పెద్ద ప్రమాదం జరిగింది. ఆ రోజు రాత్రి షాపు కట్టేసి బైక్‌పై వస్తున్న నన్ను, అదుపు తప్పి వేగంగా వస్తున్న లారీ ఒకటి బలంగా గుద్దేసింది. హెల్మెట్ ఉండటంతో ప్రాణాలు దక్కినా, ఒక కాలు మాత్రం నుజ్జు అయిపోయింది. దాదాపు రెండు నెలలు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. ఎడమ కాలికి రెండు ఆపరేషన్లు జరిగాయి. మోకాలుదాకా తీసేశారు. నరకం అనుభవించాను. అమ్మ బాగా డీలాపడిపోయింది. నేను కొద్దో గొప్పో వెనకేసిన డబ్బంతా హాస్పిటల్ ఖర్చులకే అయిపోయింది. మళ్లీ మా పరిస్థితి మొదటికి వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే సుమనే కాస్త ధైర్యంగా నిలబడింది. నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే షాపు బాధ్యతలు చూసుకుంది. నేను సైడ్ బిజినెస్‌గా ఉంటుందని ఆమె పేరు మీద తీసుకున్న బీమా ఏజెన్సీ ఆమెకి బాగా కలిసొచ్చింది. కొత్తగా వచ్చిన మహిళా బ్రాంచ్ మేనేజర్ మహిళా ఏజెంట్లందరిని ప్రత్యేకంగా పిలిపించి వ్యాపారంలో బాగా ప్రోత్సహించింది. సుమన ఉన్న పరిస్థితులకు ఆమెకు ఆ వృత్తి ఎంత అవసరమో చెబుతూ, స్వయంగా పెద్ద పెద్ద క్లయింట్లను పరిచయం చేసింది.
సుమన కూడా ఆశ్చర్యకరంగా ఎవరూ ఊహించని వ్యాపార పటిమను ప్రదర్శిస్తూ చాలా పెద్ద పెద్ద పాలసీలు చేయించింది. నగరంలో పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ అంతా ఇప్పుడు సుమన పాలసీదారులు. సుమన ఇప్పుడు వాళ్ళ బ్రాంచ్‌లోనే టాప్ ఏజెంట్. ఆమెకు నెలవారి వచ్చే కమీషన్ దాదాపు లక్ష రూపాయలు. వచ్చే నెలలో ముంబైలో జరగబోయే కంపెనీ ఛెయిర్‌మెన్‌తో సన్మాన సభకు కూడా ఆమె ఎంపిక అయ్యింది. వీల్‌ఛెయిర్‌లో అయినా సరే నన్ను కూడా తీసుకువెళ్తా అంటోంది.
ఇబ్బందౌతుందేమో.. ఆలోచించుకో.. అని అమ్మ అంది. ఇప్పుడు కుటుంబానికి పోషకురాలు సుమనే!
‘‘రేపు వర్షిత స్కూల్ ఆటోవాడు రానన్నాడు. నేనేమో పొద్దునే్న ఒక పార్టీని కలవడానికి వెళ్ళాలి’’ సుమన గొంతు నా ఆలోచనలకి అడ్డుపడుతూ వినిపించింది. ఏముంది.. నేను ఆటోలో తీసుకెళ్తా.. నువ్వెళ్ళు! నేను చూసుకుంటా..’’ అమ్మ గొంతులో వినయంతో కూడిన దగ్గరతనం.
ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.. మారింది అమ్మకాదు.. అమ్మ ఎప్పుడూ ఒకేలా వుంది.. నాన్న అయినా.. నేనైనా.. ఇప్పుడు సుమన అయినా.. అమ్మది ఎప్పుడూ రాజు దగ్గర మంత్రి పాత్రే!
అమ్మ విశ్వాసం ఎప్పుడూ పాలకపక్షం వైపే! మారిందల్లా నా పాత్రే! దాన్ని మళ్ళీ ఎలాగైనా తీర్చిదిద్దుకోవాలి. అది నా చేతుల్లో వుంది. నా ఒళ్ళో వున్న లాప్‌టాప్‌లో నేను ఈమధ్యే మొదలుపెట్టిన ఆన్‌లైన్ ట్రేడింగ్ తాలూకు సైట్ ఓపెన్ అయి ఉంది. దాని వంక చూస్తూంటే.. నా మనసులో ఒక నిశ్చయం మెల్లగా బలం పుంజుకుంటోంది! *

రచయిత్రి సెల్ నెం:9908337064

-సింగరాజు రమాదేవి