ఈ వారం కథ

కార్యేషు మంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చామంతుల రంగు వున్న చంపలపైన కలువపూల ఎరుపు మెరుపు తళతళలమంటూ వుంటుంది. కమలపువ్వులాగా పెద్దగా విచ్చుకున్న కళ్ళు, కొనలలో ములుదేరి మన్మధుడి బాణాలు విసురుతున్నట్లు వుంటాయి. నుదుటిపైన వున్న బొట్టు ఆకాశంలో ఉదయభానుడి రూపాన్ని ప్రతిబింబిస్తూ వుంటుంది. ఇంతకుమించిన శరీర సౌష్ఠవం అంతకన్నా విశిష్ట వ్యక్తిత్వం.
ఎప్పుడూ మందస్వరాన మృదు భాషణే కానీ, కరకుతనం ఆమె మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ కనిపించదు.
పెద్దయినాక ఇంత అందంగా వుంటుంది అని ముందర తెలిసినట్లు ఆమె పేరు లావణ్య లహరి అని పెట్టారు ఆమె తల్లిదండ్రులు.
కాలేజీలో చదువుతోంది. అందంగా వున్నవారు అతిశయోక్తిగా దుస్తులు ధరిస్తే అంతగా బాగోదు.
సింపుల్‌గా వున్న డ్రెస్సు ఆమెకూ, ఆ డ్రెస్సుకూ ఇంకొంచెం సౌందర్యం తెస్తాయి.
సాధారణంగా కాలేజీ బ్యూటీల వెనుక అబ్బాయిలది ఓ పెద్ద గుంపే వుంటుంది.
కానీ లహరి, సున్నితంగా, ఎవ్వరి మనసులనూ నొప్పించకుండా, గాయపరచకుండా చెప్పేసింది, తన వెంటబడి వారి కాలాన్ని వృధా చేసుకోవద్దనీ, తనకి ఏ మాత్రం ఆసక్తి లేదనీ. ఆమె ‘నో’ చెప్పిన పద్ధతి వారికి నచ్చి, ఆమె పట్ల స్నేహపూరిత గౌరవభావం చూపారు, ఒక్కరు తప్ప. విలన్ లేని సినిమా అరుదు, కష్టంలేని జీవితం కుదరదు కదా నేటి రోజుల్లో. మనుష్యులు అందరూ మంచివారే అయితే తిరిగి రామరాజ్యపు రోజులు చూడవచ్చు. సుధీర్, అతను మాత్రం, ఆమె ‘కాదుని’ అవమానకరంగా తీసుకున్నాడు. దానికి ముఖ్య కారణం అతని అహం దెబ్బతినటం.
ఆ అహం అంత పెరగటానికి కూడా కారణం వుంది మరి.
మంచి ఎరువులు, ఇతర పోషణతో నాటిన విత్తనం ఓ బలమైన మొక్కగా మారటానికి.
చాలా చాలా డబ్బు వుండి, తగు సమయం, పాలనా ఇవ్వలేని తల్లిదండ్రులు. వారు చాలా మంచివారే అయినా, ఒక్కగానొక్క కొడుకు, తండ్రి పెద్ద వ్యాపారవేత్త. ఆయనకు ఆయన పనులు చూసుకోవటానికి రోజుకి వున్న ఇరవైనాలుగు గంటలు సరిపోవట్లేదు. పెట్టుబడులు పెట్టి, పూర్తి బాధ్యత నెత్తిన వేసుకున్నాక మధ్యలో ఆపలేరు కదా.
అంతే, అది ఒక ప్రవాహం, దానితోపాటే సాగాలి జీవన యానం.
భార్య చదువుకున్నదే కదా, కొడుకును చూసుకుంటుంది అనుకున్నాడు ఆయన. వందలకోట్ల విలువ చేసే ప్రతి డీల్‌ను పర్‌ఫెక్ట్‌గా క్లోజ్ చెయ్యగలిగిన ఆయన అంచనా మాత్రం భార్య కొడుకును చూసుకుంటుంది అన్నచోట తప్పింది, అదీ ఘోరంగా.
ఏ మనిషికైనా ఏదో ఒక విషయంలో అపజయం తప్పదుగా!
భార్యకు కొడుకుమీద వున్న ప్రేమ ఎఫెక్టు పెంపకంమీద పడింది. కొడుకు కోరిక ఏది అయినా తీరకుండా ఉండలేదు, ఈనాటిదాకా. అందుకే సుధీర్ అహం దెబ్బతింది.
‘‘నన్ను కాదంటావా, నువ్వెంత, చూడు నీ పని ఏం చేస్తానో’’ అనుకున్నాడు తనలో తనే.
మనిషి జ్ఞానం విజ్ఞానాన్ని పెంపొందిస్తే, అదే విజ్ఞానాన్ని, అదే సాంకేతిక పురోగతిని, తిరోగతికి దారితీసేటట్లు చేసే మనుష్యులు కూడా ఉన్నారుగా మరి. విజ్ఞత లేక, విజ్ఞానం వెర్రితలలేసినవారు.
మార్ఫింగ్ ఆఫ్ ఫొటోస్- అంటే ఒక ఫొటో తీసుకుని, దానిలోని వ్యక్తుల ముఖాలు మార్చి, ఒక వ్యక్తి పక్కనవున్నవారిని సైతం తీసేసి ఇంకో వ్యక్తి ఫొటోను అతికించి- ఇలా రకరకాలుగా తిమ్మిని బొమ్మిని చేసి, మనుష్యులను నమ్మించవచ్చు. మోసం, దగా చేయవచ్చు. పరువు తీయవచ్చు. ముఖపుస్తకం (ఫేస్‌బుక్)లో ఇంకొకరిని ‘డి ఫేస్’ చేయడం కొంతమందికి ఓ వినోదం అయిపోయింది.
ఇలా ఎవరో చల్లిన బురద కడుక్కోవచ్చు కానీ జాప్యం జరుగుతుంది. ఈ లోపల జరగవలసిన నష్టం జరిగిపోతుంది. అదే జరిగింది ఇక్కడనూ, కాలేజీలో చాలామందే చూసారు ఆ ఫొటోలను. కంటికి కనిపించిందే నిజమని గుడ్డిగా నమ్మే లోకమాయె. ఎవరో ఒకరిద్దరు తప్ప అందరూ నమ్మారు. ఇక్కడ సుధీర్ జీన్స్ (జన్యుకణాలు)లో అతని తండ్రి తెలివి కనిపించింది. ఒక్క ఫొటో కూడా ఎవరి దగ్గర వుండకుండా, తిరిగి తీసుకున్నాడు. అందరూ మేము చూసామంటే మేము చూసాం అనగలరే కానీ, నమూనాకు ఒక్క ఫొటో, రేపు పోలీసులకుగానీ, కోర్టులో గానీ సాక్ష్యంగా చూపలేరు.
‘‘దేర్ ఈజ్ నో ఎవిడెన్స్, సాక్ష్యం లేదు’’- ఖరీదైన వకీళ్లకు తమ క్లయింట్‌ను తప్పించడం చాలా తేలిక. కాబట్టి ఫిర్యాదు వుండదు, శిక్షా వుండదు, ఇంకేం చెయ్యగలదు!
లహరి పరువు అలలుగా కొట్టుకుపోతుంది, లావణ్యం వనె్న తగ్గుతుంది. రేపెవ్వరూ ఆమెను జీవిత భాగస్వామిగా ఒప్పుకోరు. ఇక అప్పుడు తన కాళ్ల దగ్గరికి రాకుండా ఎక్కడకు పోతుంది? రాకపోయినా సమస్య లేదు, పగ తీరిందిగా. ఈ విషయం కాలేజీలో చదివే పిల్లలకు, వారి స్నేహితులమధ్యే వుండిపోయింది, పెద్దవారికి తెలీకుండా.
ఈ కథ వ్రాస్తున్న బాబాయిను, నాకు ఎలా తెలిసిందంటే, ఇరవై ఇరవై అయిదు సంవత్సరాలుగా నేనూ, లహరి వాళ్ళు పక్కపక్క ఇంటివాళ్లం. ఒక్క కుటుంబ సభ్యులే కాదు, మా రెండు కుటుంబాల బంధువర్గంవారు కూడా ఒకరికి ఒకరు పరిచయమయ్యేంతగా కలిసిపోయాము. మల్లెచెట్టు తీగల్లాగా కలిసిపోయినాయి రెండు కుటుంబాలు. ఆ తీగలకు పూసిన పూలు మా రెండు కుటుంబాలకూ సౌరభాలని అందిస్తూ, కంటికి, మనస్సుకి ఆహ్లాదం కలిగిస్తూ వుంటాయి.
‘లాల’ - అదే లావణ్య లహరికి నేను పెట్టుకున్న ముద్దుపేరు. ఆమెకు నామకరణం అయిన నాటినుంచి, ఆ పాపాయిని ‘లాల’ అని పిలిచే హక్కు నా ఒక్కడిదే. ఆ పాప పెరిగి ఇంతపిల్ల అయినా, ఇంకెవరైనా పొరపాటున లాల అన్నారంటే చాలు- మా ఇద్దరి దండయాత్రను ఎదుర్కోవాల్సి వుంటుంది. నన్ను బాబాయ్ అని పిలుస్తుంది తను.
అదేమి చిత్రమోగానీ, దేవుడు ఒక్కొక్కసారి కొన్ని వింత అనుబంధాలు ఏర్పరుస్తుంటాడు. ఆమె తల్లిదండ్రులకన్నా నేను ఎక్కువ ‘లాల’కు. నాకామె ప్రాణం. ఏ అరమరిక లేదు, ఏ రహస్యమూ లేదు మా మధ్య. చిన్నప్పుడు పుస్తకాలూ, పెన్సిళ్లూ, బొమ్మలు- పెద్దయినాక ఇతరత్రా ఏదైనా సరే తను ఇంట్లో కూడా అడగదు, బాబాయి అంటూ నా దగ్గరకు వస్తుందే తప్ప. అటువంటి ఆప్యాయతలు వున్నచోట, ఆమె మనస్సులో చెలరేగుతున్న తుఫానులను నేను కాకపోతే ఇంకెవరు ముందుగా గుర్తిస్తారు?
రారా, అలా తిరిగివద్దాం అని ఆ రోజు తను కాలేజీ నుంచి రాగానే ఆమె ముఖ కవళికలను చూసిన తనను తీసుకుని, అప్పటికప్పుడు మేము ఎప్పుడూ వచ్చే పార్కుకు తీసుకువచ్చాను. కూర్చున్నాక అడిగాను, ‘‘ఏమైంది నాన్నా, ఇవాళ కాలేజీలో ఏదో జరిగింది, నాకు కూడా చెప్పవా?’’ అన్నాను. ఎంతో గుంభనంగా వుండే ఆ పసిదాని గుండె పగిలేటట్లు ఏడ్చింది, ఆ రోజు నా ఒళ్ళో తలపెట్టుకుని. అదే మొదటిసారి తనకంట కంటినీరు చూడటం నేను. నమ్మటం కష్టం కదూ. చిన్నప్పుడు పొరపాటున దెబ్బతగిలితే ఆ నొప్పి తగ్గేదాకా నాకు ముఖం చూపించేది కాదు, నా మనస్సు విలవిలలాడుతుందని. నా కంట కూడా నీళ్ళు కారబోయాయి కానీ, తప్పదు అంటూ జాగ్రత్తపడ్డాను. సరే మెల్లిగా నాకు చెప్పింది మొత్తం విషయం. సమయ నిబంధన లేదు మాకు. ఇద్దరమూ కలిసి వెళ్లాము అంటే ఎవరికీ ఆదుర్దా వుండదు. కావాలనే నేను కొంచెం కాలం కూడా జరగనిచ్చాను, గుండె బరువు తగ్గి, తను మామూలుగా వుండేవరకు. ‘‘ముందర నీవు ఎటువంటి కారణంతోనూ కాలేజీకి వెళ్లటం మానకు. నీవు నిజంగా ఏదో తప్పు చేశావనుకుంటారు అందరూ. నిజమే నీకు అండ, నిజమే నీకు ధైర్యం, ఎవరు ఏమి అడిగినా, ఏమి అన్నా పట్టించుకోకు. ఒక చిరునవ్వు నవ్వు, అంతే. నీవు కావు, నీకు తెలియదు ఇది మాత్రం చెప్పు నీ సన్నిహితులతో. ఇంకే సంజాయిషీ ఎవరికీ నీవు ఇవ్వవలసిన అవసరం లేదు. మామూలుగా వుండు, రోజూ ఎప్పుడు ఉండేలాగానే. అమ్మకీ, నాన్నకి ఈ విషయాలు చెప్పకు. అవసరమయిననాడు నేను చెప్తాను వాళ్లకి, సరేనా’’ అన్నాను.
‘సరే’ అన్నట్లుగా తలవూపింది.
***
నాలుగు రోజులు గడిచాయి. ఈ నాలుగు రోజుల్లో చాలా కష్టపడి సుధీర్ గురించి, అతని తండ్రి గురించి మొత్తం వివరాలు సంపాదించాను. డబ్బు వున్నా సుధీర్ తండ్రి న్యాయంగా ప్రవర్తించే మనిషి. కొంతమంది ఇతరులలాగా కాదు. నీతి, న్యాయం, ధర్మం, మానవత్వం వున్న మనిషి అని తెలిసి సంతోషమేసింది. ఆ తానులో బట్టముక్కే అయినా సుధీర్, కొంచెం కొంచెం నేతలో పొరపాటు అయి, దారపు పోగులు కొన్ని బయటకు వచ్చినవాడు, అంతే. అతిగారాబం అతనిని చెడగొట్టింది అన్నది నిజమే అయినా బాగుపడే వీలులేనంగా చెడిపోలేదతను. తెలివిగలవాడే. చూడటానికి బాగానే వుంటాడు. అహం అతని కంటికి కాటరాక్ట్‌లాగా తయారైంది కానీ పూర్తిగా గుడ్డివాడిని చేయలేదు. శస్త్ర చికిత్సలాంటిది చేయగలిగితే చాలు. తాగుడు, అమ్మాయిలతో తిరగడం లాంటి అలవాట్లు కాలేదు ఇంకా. ఫర్వాలేదు, నేను వేసుకుంటున్న పథకం సరైందనిపించింది.
ఆ రోజు మధ్యాహ్నం లావణ్య లహరి సుధీర్ తండ్రి అయిన సత్యనారాయణగారి ఆఫీసుకు వెళ్లింది. ‘కొంచెం వ్యక్తిగతంగా మాట్లాడాలి’ అని అభ్యర్థన చేసి ఆయనను ఒంటరిగా కలిసింది. ‘చెప్పమ్మా ఏమిటి విషయం, ఏమి కావాలి?’ అని మర్యాదగానే అడిగారు పెద్దాయన. మొత్తం విషయం వివరించి చెప్పింది ఆమె.
‘‘మరి ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావు? నీవు ఏమి కోరుకుంటున్నావు?’’ అని అడిగారాయన, ఆమె చెప్పింది పూర్తిగా విన్నాక.
లహరి చెప్పింది ఆయనతో, తను ఆయన దగ్గరకు ఎందుకు వచ్చిందో, ఆయన ఏమి చెయ్యాలని తను కోరుకుంటున్నదో ఓపిగ్గా అంతా విన్నాడాయన. ఆయనకు కొన్ని సందేహాలు వుంటే వాటిని అడిగి తీర్చుకున్నారాయన.
చివరికి ఆయన లహరిని అడిగాడు. ‘‘సరే, నీవు చెప్పింది విన్నాను, నేను నీతో ఏకీభవిస్తే సమస్య లేదు, ఏకీభవించకపోతే ఏమి చేస్తావు?’’
‘‘ఏమీ చేయను, ఈ విషయం ఇంతటితో మరిచిపోతాను’’ అందామె.
‘‘నిన్ను నేను మెచ్చుకుంటున్నాను. నేను ఏకీభవించకపోతే నీవేమి చేస్తావు అని అడిగింది, నా మొదటి నిర్ణయం సరియైనదా కాదా అని తెలుసుకోవడానికి మాత్రమే. నీ జవాబుతో నా నిర్ణయం సరియైనదే అని నిరూపింపబడింది. అసలు నేను ఏకీభవింపకపోవటమన్నది జరగని విషయం. నేను ఊహించగలను, నీకెవరు సలహా ఇస్తున్నారని. నీవు, నీ సలహాదారులు తీసుకున్న నిర్ణయం, చేసిన ఆలోచన నాకు కూడా చాలా నచ్చింది. నేను పూర్తిగా నీతోపాటే, కాకపోతే నీ సలహాదారుని రేపు ప్రొద్దున పదకొండు గంటలకు నన్ను కలవమని చెప్పు, మిగతాది మేము మాట్లాడుకుంటాము. ఇక నీవు తృప్తిగా వెళ్లమ్మా’’ అన్నారాయన.
నెల రోజుల లోపలే సుధీర్ వివాహమయింది అట్టహాసంగా ఊళ్ళో వున్న పెద్దలు, మిగతా బంధువుల సమక్షంలో. ఆ రోజు శోభనం ఏర్పాటు అయింది. మంచి ముస్తాబులో, చాలా అందంగా వుండి గది లోపలికి వచ్చిన భార్యను సమీపించి ఆమె చేయందుకోవాలని చేయి చాచిన సుధీర్ చెయ్యి మధ్యలోనే ఆగింది, ఆమె పలుకులు విని.
‘‘మిస్టర్ సుధీర్‌కుమార్‌గారూ, మనం పేరుకు మాత్రమే భార్యాభర్తలం. అక్కడివరకే. మీరు మీ జీవితాంతం నన్ను పొందలేరు, నన్ను తాకలేరు. మీరు నన్ను తాకిన మరుక్షణం నాకు నేను గాయాలు చేసుకుని, వాతలు పెట్టుకుని, మీరు నన్ను శతవిధాలా హింసిస్తున్నారని కోర్టులో కేసు పెడతాను. వింత వింత కోర్కెలు, అనుభవాలు కావాలని అడుగుతున్నారంటాను. అంతేకాదు, కట్నం కోసం వేధిస్తున్నారని, మీ తల్లిదండ్రులను కూడా ఇరికిస్తాను. వారు కేసు నుండి తప్పుకోవచ్చు కానీ అప్రదిష్టపాలవుతారు. మీకు మాత్రం శిక్ష పడక తప్పదు. జైలుశిక్ష ఖాయం. అంతేకాదు, మీకు ఒక స్ర్తిని సంతృప్తిపరిచే శక్తిలేదని ఓపెన్‌గా కోర్టులో చెబుతాను. నామాట ఎందుకు నమ్మరో చూద్దాం. దానితో మీకు ఇంకో అమ్మాయితో రెండో పెళ్లి కూడా కాదు. మీరు విడాకులు అడగండి, నేను ఇవ్వను. న్యాయస్థానంలో పోరాడుతాను. విడాకులు ఇచ్చినా సగం ఆస్తి నాకు వస్తుంది. మీ పరువు ప్రతిష్ఠలు గంగపాలు, మీరు జైలు పాలు. ఇహ ఇప్పుడు సాగండి ముందుకు, చెయ్యి వేస్తారా?’’ ఆ గొంతు లావణ్య లహరిది.
ఆ రోజు, ఆ తరువాత ప్రతిరోజూ మంచంమీద ఆమె, సోఫాలో అతను. ఎవరికీ చెప్పుకోలేడు. తల్లిదండ్రులకు చెబితే అంతకుముందు తను చేసిన తప్పు వారికి తెలుస్తుంది. స్నేహితులకు చెబితే తన పరువే పోతుంది. పెళ్లి అయింది కాబట్టి ఇంకో ఆడపిల్ల తనను దగ్గరకు రానివ్వదు. బయట చిరుతిండ్లు తినటం తనకు నచ్చని విషయం.
ఈ పిల్లమీద తను దొంగదెబ్బ తీయాలని ప్రయత్నం చేస్తే, ఈ పిల్ల బాహాటంగా దెబ్బతీస్తోంది, అదీ ముఖంమీద చెప్పి మరీ. జీవితంలో మొదటిసారి పెద్ద దెబ్బ తనకి. భరించాలి తప్పదు, అదీ వౌనంగా.
జీవితం యాంత్రికమయిపోయింది. తండ్రితోపాటు ఆఫీసుకు వెళ్లటం, సాయంత్రం ఆయనతోపాటే తిరిగి రావటం, తిని కాసేపు టీవీ చూసి పడుకోవటం. తను ఒక్కడూ భార్య లేకుండా బయటకు వెళ్లటం తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఉన్న భార్య తనతో రాదు. చాలా భారంగా గడుస్తోంది కాలం. ఇక వేరే గత్యంతరం లేక పూర్తిగా వ్యాపారం పనులలో నిమగ్నమయిపోయాడు. కొద్దికాలంలోనే తండ్రికి తగ్గ కొడుకనిపించుకున్నాడు చాలా విషయాలలో.
ఒక ఆర్నెల్లు గడిచినట్లున్నాయి. సుమారుగా ఎవరో ఇద్దరు ముగ్గురు స్నేహితులు చూచాయగా చెప్పారు. లహరిని ఎవరో వేరే అతనితో హోటల్‌లో, సినిమా టాకీసులో, షాపింగ్ మాల్స్‌లో చూసినట్లు. వాళ్ళ మాటను నమ్మకపోవటానికి కారణం లేదు. ఇంకేమీ మిగలలేదు తనకి. తెగించాడు.
ఒక రోజు రాత్రి తల్లిదండ్రుల గదిలోకి వెళ్లి మొత్తం ఇంతకుముందు జరిగినది, ఇపుడు జరుగుతున్నదీ మొత్తం వెళ్లగక్కాడు. తనను ఎంతో ప్రేమగా పెంచిన తల్లి ఒక్క మాట మాట్లాడలేదు. తండ్రి అన్నాడు, ‘అవును, ఆ అమ్మాయి వేరే వాళ్లతో తిరిగింది నిజం’.
‘మరి..’ సుధీర్ ఆగిపోయాడు.
‘‘ఇంతకుముందు నువ్వు అబద్ధం ఫొటోలు చూపించావు. ఇపుడు ఆ అమ్మాయి వాటిని నిజం చేస్తోంది’’.
‘‘డాడీ.. ’’ మాట రాలేదు.
‘‘ఇప్పటికైనా తెలిసిందా నీవు ఏం తప్పు చేసావో, ఎంత పెద్ద తప్పు చేశావో. ఒక అభం శుభం తెలియని ఆడపిల్ల జీవితం నాశనమయ్యేది నీవు చేసిన పనికి. ఆ పిల్ల నీ మీద కంప్లైంట్ ఇచ్చివుంటే నీ జీవితమూ నాశనమయి వుండేది. మా పరువు పోయుండేది. ఆ అమ్మాయి తెలివిగలది. వాళ్ళ బాబాయి మంచివాడు కాబట్టి. ఈ రోజు ఆమె దయవల్ల అందరం బాగున్నాం. నీకూ బుద్ధి వచ్చింది. ఆ అమ్మాయి బయటకు వెళ్లింది వాళ్ల కజిన్‌తో, అదీ నాకు చెప్పి. నీకు గుణపాఠం చెప్పాలన్న పథకం కూడా వారిదే. నా దగ్గరికి వచ్చారు. వారి మాట నాకు నచ్చింది. అర్థమయిందా నీవు ఏమి కోల్పోయి వుండేవాడివో, ఇపుడు ఎటువంటి మంచి భార్యను తెలివిగల, సహనంగల భార్యను పొందావో, పో, పోయి క్షమాపణ చెప్పి, నీ భార్యను నీవే మంచి చేసుకో.
పశ్చాత్తాపం నిజంగా కలిగితే, మనిషి ఇతరుల కాళ్లను పట్టుకోవటానికి కూడా ఆలోచించడు. కానీ ఆమె అతనిని తన కాళ్లు పట్టుకోనివ్వలేదు. జరిగినదాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా చిరునవ్వుతో క్షమించింది.

-నండూరి రామచంద్రరావు.. 9949188444