ఈ వారం కథ

అంతా వికటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా చిన్నప్పుడు మా ఊళ్ళో పెడసరం పెరుమాళ్ళు అనే ఆయన వుండేవాడు. ఆయనకాపేరెందుకొచ్చిందంటే, ఎవరితో ఏ మాట మాట్లాడినా మహాపెడసరంగా వుండేది. అన్నింటికీ పెడర్థాలు తియ్యడం, అవతలివాళ్ళ బుర్ర బ్రద్ధలుకొట్టడం ఆయనకు నచ్చిన వ్యాయమక్రీడ. ఇలాంటి పెరుమాళ్ళులు ఏ కొద్దిమందో అక్కడక్కడ వుంటుండేవాళ్ళు. అందువలన వీళ్ళను ఎవరూ పెద్దగా పట్టించుకొనేవాళ్ళు కాదు.
ఇప్పుడలా కాదు దాదాపుగా అందరూ ఇలానే తయారయ్యేరేమోనని, చూస్తున్న దృశ్యాల్ని బట్టీ, వింటున్న సంభాషణలను బట్టీ అనుక్షణం అనిపిస్తూనే వుంటోంది. మంచిమాట అంటేనే అదేదో పెద్ద తీటగా అనిపిస్తోంది.
‘బాబూ! కారు డ్రైవ్ చేసేటప్పుడు, యూట్యూబులూ, ఆ ట్యూబులూ చూస్తూ అజాగ్రత్తగా వుండకు. ట్రాఫిక్ రూల్సును తప్పకుండా పాటిస్తూ వెళ్తుండు. నిత్యం చూస్తూనే వున్నాంగా ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో?’ అంటూ ఓ కుర్రవాని తండ్రి తన సలహాగా చెబితే, దానికా తనయుడు వెంటనే తీవ్రంగా స్పందిస్తూ ‘పోతే పోతాను అంతేగా ఏమవుతుంది?’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి విసురుగా కారెక్కి వెళ్ళాడు. ఆ తండ్రి హృదయం ఎంతగా క్షోభిస్తుందో ఆ పిల్లవానికి అక్కర్లేదు. ఎంత దారుణం!
అదేమిటోగానీ, ఈ రోజుల్లో చిన్నా పెద్దా మంచీ మర్యాద అన్నీ అడుగంటి పోతున్నయ్. సంస్కారం సన్నగిల్లుతోంది. అహంకారం చీటికి మాటికీ పెల్లుబుకుతోంది. ఎందుకో ఈ మిడిసిపాటు, తమ బాగుకోసం చెప్పినా తగువులాటే!
పెళ్ళికావాల్సిన ఓ ఆధునిక యువతితో ఆమె తల్లి, నేడు సమాజంలో జరుగుతున్న అసభ్యకర సంఘటనలను చూసి తల్లడిల్లుతూ ‘చూడమ్మా, నే చెప్పేది వేళాకోళంగా తీసుకోకు. బాయ్‌ఫ్రెండ్సనీ, బడుద్ధాయి ఫ్రెండ్సనీ, హాయ్ హాయ్ అంటూ వాళ్ళను వెంటేసుకొని తిరక్కు. ప్రేమ ప్రేమ అంటూ పెనవేసుకుపోతారు. నీకు వాంతి అయ్యేదాకా, నిన్ను పెళ్లి భ్రాంతిలో పడేసి, అన్ని బజార్లూ, బలాదూరుగా తిప్పుతారు. ఆ వెంటనే నీ కంట పడకుండా పలాయనం చిత్తగిస్తారు. అసలే మాకు ఒక్కగానొక్క కుమార్తెవు. నా భయం కొద్దీ నేను చెప్పాను. ఎవర్నీ ఏమీ అనడానికి వీల్లేని రోజులుకదమ్మా! ఇవి’ అని చెబితే, అందుకా సుకుమారి ‘చాలించు నీ చాదస్తం. చదువుకున్నదాన్ని, నాకామాత్రం తెలియదా? అందరూ అలానే ఎందుకుంటారు? మీలాంటి మమీలుండబట్టే, ఆడవాళ్ళకు ఏ హక్కులూ లేకుండా దద్దమ్మల్ని చేసి ఆడిస్తున్నారు. నా విషయంలో నీకెలాంటి భయం అక్కర్లేదు. డాడీని చూడు.. ననె్నంత బాగా చూసుకొంటున్నారో!’ అంటూనే అతివేగంగా తన టూవీలర్ ఎక్కేసి తుర్రుమన్నది.
‘ఆ! ఆ! ఆయనకు బాగానే తెలుసు. అందుకే తెల్లవార్లూ నిద్రపట్టక ఛస్తున్నాడు. యూ టూ గోలతో తలబాదుకొంటూ! ఈ రోజుల్లో అందరూ అందరూగానే యున్నారు. ఏం స్పీడు యుగమో పాడుయుగం’ అనుకొంటూ విస్తుపోయిందామె.
కొంపల్లో గోలలు ఇలా తగలడితే, ఇక బయట జనం గోల అంతా ఇంతా కాదు. అన్నిట్లోను తలకాయ దూర్చి అల్లకల్లోలం అయిపోతున్నారు. ఎవడి పని వాడు చేసుకుంటూ ఎవడి మేధాశక్తితోవాడు అభివృద్ధిలోకి వచ్చి ఈ దేశాన్ని ఇంకా వున్నత స్థితిలోకి తీసుకెళ్ళాలన్న తాపత్రయం ఎవరికీ లేదు. పొరపాటున ఎవరన్నా తనకన్నా మేధావిలా కనిపిస్తే, వాడిపట్ల రాగద్వేషాల్ని పెంచుకొని వాడు పలకరించినా కూడా పలక్కుండా, ముభావంగా వుంటూ, వాడిలో లేని లోపాల్ని ఆపాదించి, వాణ్ణి ఆపాదమస్తకం దిష్టితగిలేలా చూస్తూ, వాణ్ణి ఎలా అణగద్రొక్కాలా అన్న ధోరణిలో ఆలోచిస్తూ, తమ పవిత్రమైన జీవితకాలాన్ని వృధా చేసుకొంటున్నారు. దీనివలన ఎవరికి ప్రయోజనం?
దీనికితోడు ఈ మేధావులమనుకుంటున్న వాళ్ళు కూడా, వాళ్ళ మాటల్ని పట్టించుకొని, తమ అభిప్రాయంతో వాళ్ళు ఏకీభవించకపోవడంతో, ఇంకాస్త తీవ్రంగా స్పందించి, టీవీల్లో వాళ్ళ ముందు కూర్చొని, వాళ్ళతో వాదోపవాదాలకు దిగి, నోరు పారేసుకుంటూ, అక్కడే ప్రతిరోజూ కూర్చొని కూర్చొని, కీళ్ళనొప్పులతో బాధపడుతూ, మానసిక ఆందోళనకు గురికావడంవలన, ఏ సందేశాన్ని సమాజానికి ఇస్తున్నట్లు?
ఎడ్డెం అంటే తెడ్డెం అనే వాళ్ళ గడ్డం పట్టుకొని, వాళ్ళను ఒప్పించాలని చూస్తే వాళ్ళు ఒప్పుకొంటారా? వాళ్ళున్నదే అన్ని సిద్ధాంతాలనూ రాద్ధాంతం చేసేందుకూ, పరువు మర్యాదలున్నవాళ్ళను అప్రతిష్టపాలు చేసేందుకూ, సమాజంలో వాళ్ళకు విలువలేకుండా చేసేందుకూ.. ఇంకా వీలైతే వాళ్ళకు నిలువ నీడలేకుండా చేసేందుకు అని ఆ మాత్రం వీళ్ళు గ్రహించలేరా? వాళ్ళముందు కూర్చొని చర్చోపచర్చలెందుకు? అంతా వికటం కాకపోతే! కపటం తెలియని వాళ్ళు ఈ రోజుల్లో ఎందుకూ పనికిరాదు. గమనిస్తే మంచిది!

-షణ్ముఖశ్రీ.. 8897853339