మెయిన్ ఫీచర్

అజ్ఞానంతోనే బంధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
ముందు సూచించినట్లు మొసలి నది ఒడ్డుకు, నది లోపలకు తిరుగుతున్నట్లు, బంధవిముక్తి పొందని వానికి సంసారచక్రంలో భ్రమణ తప్పదని పునరుద్ఘాటింపబడుతున్నది.
147.
బీజం సంస్కృతిభూమి జన్మ తు తమో దేహాత్మధీ రంకురః
రాగః పల్లవమమ్బు కర్మ తు వపుః స్కంధో‚ సవః శాఖికాః
అగ్రా ణీన్ద్రియ సంహతిశ్ఛ విషయాః పుష్పాణి దుఃఖం ఫలం
నానాకర్మ సముద్భవం బహువిధం భోక్తాత్ర జీవఃఖగః॥
ఈ శ్లోకంలో భగవత్పాదులవారు శరీరధారుణ్ణి ఒక పక్షితోను, సంసారమును వృక్షంతోను సరిపోలుస్తూ అత్యంత మనోహరంగా వర్ణించారు. సంసారమనే వృక్షమునకు మూలము అజ్ఞానము తప్ప ఇంకొకటికాదు. దేహమును ఆత్మగా నిశ్చయించే బుద్ధి అంకురము కాగా అనురాగము దాని చిగురు. కర్మలే, ఫలాసక్తితో వృక్షము పెరుగుటకు పోసే నీరు. శరీరమే, చెట్టు మధ్య భాగమైన స్కంధము. ప్రాణములు కొమ్మలు, ఇంద్రియ సముదాయము అగ్రములు (కొనలు) విషయములు పుష్పములు పలు దుఃఖములే నానావిధ కర్మలవలన పొందిన ఫలములు. వాటిని భోక్తగా అనుభవించే శరీరధారుడే పక్షి.
148.
అజ్ఞానమూలో‚ య మనాత్మబన్ధో
నైసర్గికో‚ నాదిరనన్త ఈరితః
జన్మాప్యయవ్యాధి జరాధిదుఃఖ
ప్రవాహతాపం జనయత్యముప్య॥
శరీర బంధమునకు అజ్ఞానమే మూలము. అజ్ఞానము అనాది. జన్మః స్వభావసిద్ధిముగా ప్రాప్తించును. జనన మరణములు, రుగ్మత, ముసలితనము ఇత్యాది సమస్త క్లేశములు ఒకదాని వెంబడి మరొకటి జీవితములో ఎదుర్కొనవలసి వచ్చును. ఈ సంసార జీవనప్రవాహంలో పడిన వ్యక్తికి దుఃఖతాపము అనివార్యవౌను.
149. నాస్రె్తై ర్న శెస్రె్తైరనిలేన వహ్నినా
చేత్తుం న శక్యో న చ కర్మకోటిభిః
వివేకవిజ్ఞాన మహాసినా వినా
ధాతుః ప్రసాదేన శితేన మంజునా॥
ఈశ్వరేచ్ఛానుసారము ప్రాప్తించిన సంసార బంధమునకు హేతువు అజ్ఞానము. అందువలన ఈ బంధమును వివేకము, జ్ఞానము అనే పదునైన కత్తితోనే దానిని ఛేదించ శక్యము. ఇతర అస్తశ్రస్తమ్రులు కాని, వాయువు కాని, అగ్ని (హవనాదులు) కాని, వేదోక్తములగు శతకోటి కర్మలు కాని, అజ్ఞాన నివృత్తినిచేయలేవు.
‘జ్ఞానాదేవ తు కైవల్యమ్’ (జ్ఞానముతోనే కైవల్యము)అని సద్గురువుల ఉపదేశం. ‘జ్ఞానప్రసాదేనవిశుద్ధసత్త్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః’అని శ్రుతి వచనం (జ్ఞానార్జనతో చిత్తశుద్ధిని సాధించిన యోగులు తదేక ధ్యానముతో అవయవ రహిత నిష్కల పరమాత్మ సాక్షాత్కారమును చేసికొందరు- ము.ఉ.3-1-8).
150. శ్రుతిప్రమాణైకమతేః స్వధర్మ
నిష్ఠా తయైవాత్మవిశుద్ధి రస్య
విశుద్ధశుద్ధేః పరమాత్మవేదనం
తేనైవ సంసారసమూలనాశః॥
సంసారబంధము పూర్తిగా నాశనమగుటకు ముందుగా శ్రుతి ప్రమాణము పై పూర్తి విశ్వాసము అనివార్యము. శ్రుతి వాక్యము లందు ఏకమతము ఉన్నవాడు, స్వధర్మమును తప్పి చరించడు. తన ధర్మమును పాటించేవానికి, చిత్తశుద్ధి, విశుద్ధబుద్ధి లభించును. విశుద్ధబుద్ధితో యథార్థజ్ఞానము ప్రాప్తించును. పరమాత్మ స్వస్వరూపజ్ఞానముతో, భవబంధము శేష రహితముగా అంతమగును. ‘‘స్వధర్మేనిధనం శ్రేయః పరధర్మో భయావహ.’’అని స్మృతి ప్రమాణము (తన ధర్మమందు మరణము పొందుటయే మేలు. పరధర్మము భయంకరమైనది - భ.గీ.3-35.)
151. కోశైరన్నమయాద్వైః పంచభిరాత్మా న సంవృతో భాతి
నిజ శక్తి సముత్పన్నై? శైవలపటలై రివాంబు వాపీస్థమ్‌॥
అజ్ఞానము, ఆత్మజ్ఞానమునకు ఎట్లు ప్రతిబంధకము అగుతున్నదో ఒక దృష్టాంతముతో ఈ శ్లోకములో రూఢి చేయబడినది.
ఆత్మ స్వరూపము. దానిని ఆవరించి పంచకోశములైన అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు ఉన్నవి. కోశపంచకము జడపదార్థ సముదాయము. కోనేరులో నీరు నాచుతో కప్పబడి తన స్వరూపమును ఎట్లు కోల్పోవునో, అట్లే అజ్ఞానముచే ఆవృతమైన ఆథ్మ ప్రకాశించదు.
152. తచ్ఛైవాలాపనయే సమ్యక్సలిలం ప్రతీయతే శుద్ధమ్‌
తృష్ణా సంతాపహరం సద్యః సౌఖ్యప్రదం పరం పుంసామ్‌॥
నాచును తీసివేసి కోనేరును శుభ్రపరచిన పిదప, నీరు పరిశుభ్రమై, ఎట్టి అడ్డంకులు లేక స్వచ్ఛముగా కన్పడుతూ, జనుల దప్పికను తీర్చి వారికి మిక్కిలి సంతోషమును చేకూర్చును.
153. పంచానామపి కోశానా మపవాదే విభాత్యయం శుద్ధః
నిత్యానందైకరసః ప్రత్యగ్రూపః పరం స్వయంజ్యోతిః॥
పంచకోశములను పూర్తిగా అసద్వస్తువులుగా నిషేధించిన, వాటన్నింటికన్నను లోపల హృదయాంతరాళములో ఉన్న, కేవలము నిత్యానంద స్వరూపము, స్వయంజ్యోతిస్స్వరూపము, అత్యంత శ్రేష్ఠము, నిర్మలమైన ఆత్మ ఏ ప్రతిబంధకములు లేక ప్రకాశించును.
154. ఆత్మానాత్మవివేకః కర్తవ్యో బన్ధముక్తయే విదుషా
తేనైవానన్దీ భవతి స్వం విజ్ఞాయ సచ్చిదానన్దమ్‌॥
విద్యావంతుడు బంధవిముక్తికొరకు ఆత్మానాత్మ వివేకముతో కర్తవ్యమెఱిగి, శాశ్వతము, సత్యజ్ఞానానందమయమైన స్వస్వరొపమును తెలిసికొనును.
- ఇంకావుంది...