మెయిన్ ఫీచర్

జరామరణములు ఆద్యంతములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
461. అజో నిత్య ఇతి బ్రూతే వ్రుతిరేషా త్వమోఘవాక్‌
తదాత్మనా తిష్ఠతో‚స్య కుతః ప్రారబ్ధకల్పనా॥
పై శ్లోకములో ఉల్లేఖించబడిన కఠోపనిషత్తులోని మృత్యుదేవత బోధన ఇలా ఉన్నది- ‘‘న జాయతే మ్రియతే వా విపశ్చి న్నాయం కుతశ్చిన్న భభూవ కశ్చిత్‌ అజో నిత్యః శాశ్వతో‚యం పురాణో న హన్యతే హన్యమానే శరీరే॥ (మేధావీ, జ్ఞాత అయిన ఈ ఆత్మ దేనివలవన ఉత్పన్నమైనది కాదు, శరీరము కృశించినా, నశించినా ఇది శాశ్వతము; జరామరణములు, ఆద్యంతము లు లేని సనాతనమైనది- క. ఉ.1-2-18).
దీని ఆధారముగా భగవద్గీతలో చేసిన ఉపదేశము కూడ ఆ విధముగానే ఉన్నది ‘‘నా జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతో‚ యం పురాణో న హన్యతే హన్యమానే శరీరే॥ (ఆత్మ పుట్టేది గాని, చనిపోయేది గానీ కాదు. ఒకప్పుడు ఉండేదీ, మరొకప్పుడు ఉండనదీ కూడా కాదు. ఆత్మకు జన్మ లేదు, ఏ పరిణామమూ చెందదు. ఎప్పుడూ ఒకే విధంగా ఉండే ఆత్మ శాశ్వతము మరియు సనాతనము. శరీరము చంపబడిననూ ఇది చావదు, అనగా దేహము నశించిననూ, ఆత్మకు నాశనము లేదు.
దేహమే ఆత్మ అనే భావన ఉండే అజ్ఞానికి, ప్రారబ్దమునకు ఆధారభూతమైన దేహ సంబంధమైన బుద్ధ్యాదులతో తాదాత్మ్యము కలుగుతున్న కారణంగా ప్రారబ్దము సంభవమే. కాని, సద్రూపమైన ఆత్మలో నిరంతరము బ్రహ్మాత్వ భావనతో స్థిరుడై ఉండే ఆత్మజ్ఞానికి ప్రారబ్దము కల్పించబడదు.
462. ప్రారబ్దం సిధ్యతి తదా యదా దేహాత్మనా స్థితిః
దేహాత్మభావో నై వేష్టః ప్రారబ్దం త్యజ్యతామతః
శరీర స్యాపి ప్రారబ్ద కల్పనా భ్రాంతి రేవ హి
దేహాత్మ భావన ఉండే అజ్ఞాన స్థితిలో ప్రారబ్ద ఫలము అనుభవించవలసిందే. దేహాత్మభావనను త్యజించి, బ్రహ్మాత్మ భావనను స్వీకరించిన తత్త్వవేత్తకు ప్రారబ్దము అంతమగుట నిశ్చితము. యథార్థతః శరీరానికి ప్రారబ్దమును ఆపాదించటం కూడా భ్రాంతి మాత్రమే.
ఈ విషయం రానున్న శ్లోకంలో విశదీకరించబడింది.
462. అధ్యస్తస్య కుతః సత్త్వం అసత్త్వస్య కుతో జనిః
అజాతస్య కుతో నాశః ప్రారబ్ద మసతః కుతః
అధ్యసించబడినదానికి ఉనికి లేదు. జన్మలేనపుడు మరణము లేదు. అయితే, ప్రారబ్దము యొక్క ఉపభోగము మాత్రము అంగీకరించవలసినదే. ప్రారబ్దమును అంగీకరించకపోయిన, కొందరు మనుష్యులుగాను, కొందరు పశువులుగాను, మరికొందరు తిర్యగ్ జంతువులుగా జన్మలను ఎందువలన ఈ లోకంలో పొందుతున్నారో చెప్పబడదు. ఎవరి కర్మను, జ్ఞానప్రాప్తిని అనుసరించియే వారికి జన్మ లభ్యవౌతున్నట్లు శ్రుతి నిర్థారిస్తున్నది. ‘యోనిమనే్య ప్రపద్యంతే శరీరాత్వాయ దేహినః, స్థాణునే్య ను సంయంతి యథాకర్మ యథాశ్రుతమ్’ (వారి వారి కర్మఫలము, జ్ఞానఫలమును అనుసరించి కొందరు మాతృగర్భంలో శరీర ధారణ, కొందరు వృక్షాది స్థావరములుగాను జన్మను పొందుతున్నారు. అయితే పారమార్థిక దృష్ట్యా జగత్తు మిథ్య, అసద్వస్తువు; దానికి ఉనికి లేదు. అందువలన, ఉనికిలేని జగత్తుకు ప్రారబ్ధము ఉండుట అసంభవము. అదేవిధంగా, లౌకిక దృష్టిలోనే దేహానికి ప్రారబ్దము. పారమార్థికంగా, దేహానికీ ప్రారబ్దములేదని గ్రహించవలెను.
464. జ్ఞానేనాజ్ఞానకార్యస్య సమూలస్య లయో యది
తిష్ఠత్యయం కథం దేహ ఇతి శంకావతో జడాన్
సమాధాతుం బాహ్యదృష్ట్యా ప్రారబ్దం వదతి శ్రుతిః
యథార్థ జ్ఞానప్రాప్తితో అజ్ఞానము సమూలముగా నశించును. అందువలన, ఆత్మదర్శికి ప్రపంచ ప్రవిలయననము అనంతరము దేహము యొక్క మనుగడ (జీవనము) ఉండుటకు ఆధారము లేదు. ‘తావదేవ చిరం యావన్నవిమోక్ష్య’ అనే శ్రుతి (ప్రాపంచిక) దృష్టితో వ్యవహరించే, సందేహములున్న మందబుద్ధులను మాత్రమే ఉద్దేశించి చెప్పినదని గ్రహించుట సమంజసము. అసద్వస్తువులైన దేహాదులు మిథ్యా రూపములు. వాటిని సత్యమని బోధించుట ఉపనిషత్తుల తాత్పర్యము కాదు. దేహమే మిథ్యైతే ప్రారబ్దము ఉండదు కదా!
465. న తు దేహాది సత్యత్వ బోధనాయ విపశ్చితామ్
యతః శ్రుతేరభిప్రాయః పరమార్థైగోచరః
శ్రుతి యొక్క అభిమతము దేహాదుల సత్యత్వమును జ్ఞాన సంపన్నులైన పండితులకు బోధించుటకొరకు కానే కాదు. పరమార్థమును తెలియజేయటమే శ్రుతి ఉద్దేశము. సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మము మాత్రమే పరమార్థము. అందువలన, పరబ్రహ్మ తత్త్వమును సుస్పష్టముగా బోధించుట మాత్రమే శ్రుతి తాత్పర్యమని గ్రహించవలసి వున్నది.
ఇంకాఉంది