Others

‘అమరజీవి బలిదానం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరజీవి బలిదానం పొట్టి శ్రీరాములు పోరాటగాథ’ అమూల్య చారిత్రక అంశాల సంకలనాన్ని డా. నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి ప్రచురించారు. ఇందులో చరిత్రలో మరుగున పడివున్న ఎందరో మేధావుల వ్యాసాలను, సందేశాలను, అభిప్రాయాలను వెలికితేవడంలో సంపాదకుడు కృతకృత్యుడయ్యాడనే చెప్పవచ్చు. నిర్భయత్వం, నిశ్చలత్వం, నిర్మలత్వం, నిజాయితీ ప్రాణవాయువులుగా చేసుకొని దైవభక్తి దేశభక్తి గాంధీజీలోని సత్యవ్రతపాలన ముప్పిరిగొన్న నిస్వార్థ జీవిగా తెలుగుజాతి ఔన్నత్యంకోసం భాషాప్రయుక్త రాష్ట్రాన్ని కాంక్షిస్తూ అమరణ నిరహార దీక్షతో ప్రాణాన్ని తృణప్రాయంగా త్యజించిన పొట్టి శ్రీరాములు జీవిత విశేషాలను అశేషంగా చెప్పిన అద్భుత సంకలనం ఈ పుస్తకం. ముప్పది సంవత్సరాలు గాంధీజీ శిష్యునిగా నిష్ఠ నియమాలతో దృఢత్వంతో పొల్లుపోని సత్యాగ్రాహిగా, శాంతి అహింసల సహవాసిగ జీవితాన్ని త్యాగనిరతితో వెళ్లదీసిన అకుంఠిత దేశభక్తుని అద్భుతగాథ ఈ సంకలనం. ఈ పుస్తకం రావాల్సిన కాలంలోనే వచ్చింది. దేశభక్తి, దైవభక్తి, రాజకీయం వ్యాపారమై అసత్యావ్రతులకు అధికారం ధనవ్యయంతో దక్కుతున్న రోజుల్లో, ఒక నిరుపేద, నిర్భాగ్యుడు, దారిద్య్ర కడలిలో ఈదుతూ, విధి వక్రీకరణతో ఆలుబిడ్డని కోల్పోయి సంసార సుఖానికి దూరమై ప్రచార రహితంగా ప్రజాప్రయోజనం కోసం జీవితాన్ని కర్పూర హారతి చేసిన ఒక త్యాగధనున్ని నిస్వార్థజీవితం కొందరికైన కనువిప్పు కలిగిస్తుందని నమ్ముదాము.
ఈ గ్రంథంలో టంగుటూరి ప్రకాశం పంతులు, బులుసు సాంబమూర్తి, విద్వాన్ ఎ.సుబ్బరాయగుప్త, వై.యస్.శాస్ర్తీ, బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్, జస్టిస్ ఆవుల సాంబశివరావు, ఎం.జె.అక్బర్, రామచంద్రగుహ మొదలగువారి వ్యాసాలు, అభిప్రాయాలు, సందేశాలు యిందులో మణిదీపాల్లా వెలుగునిస్తాయి. పొట్టిశ్రీరాములు ఆర్థికంగా పేదవాడైనా, అధికారికంగా శూన్యుడైనా ఆదర్శాల్లో, ధర్మనిరతిలో, పట్టుదలతో కార్యనిర్వహణలో మేరునగధీరుడు. నమ్మిన సిద్ధాంతాలు, ఆశయాన్ని అమలుచేయుటలో అలుపెరగని సాహసి, ముందడుగే గాని వెనుకడుగేయని ఏకాగ్రచిత్తుడు. జాతి భవిష్యత్తుకోసం మృత్యువుతోనైనా సహజీవనం చేయడానికి వెరవని క్రాంతదర్శి. పొట్టి శ్రీరాములు గూర్చి ఎక్కువమంది ఎరుగని ఎన్నో అంశాలను ఈ గ్రంథంలో తోడిపోశారు. ఆయన త్యాగం, అకుంఠిత దీక్ష, నిగ్రహశక్తిని గాంధీగారే స్వయాన మెచ్చుకున్నారు. గాంధీగారి సత్యాగ్రహ స్వర్ణ శంఖారావం, రైతు జనసేవ, అస్పృశ్యతా నివారణ, మద్యపాన నిషేధం, జాతీయ విద్య శ్రీరాములుగారిని బాగా ఆకర్షించాయి. సత్య, అహింసలతో నిర్మించిన సరికొత్త ఆయుధం సత్యాగ్రహం. ఇది తెల్లవాళ్ళ గుండెల్లో ఒణుకు పుట్టించిన ఓ గొప్ప మిసైల్. దీన్ని బాగా జీర్ణించుకున్న పొట్టిశ్రీరాములు స్వాతంత్య్రం అనంతరం ప్రజాస్వామ్యం ఏర్పడ్డ పాలకులు ఫ్యూడల్ నియంతృత్వంతోనే పాలన సాగించడాన్ని ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ సత్యాగ్రహ ఆయుధాన్ని వెలికితీశాడు. తెలుగు రాష్ట్రం కోసం నిరాహారదీక్షను 1952 అక్టోబరు 19వ తేదీ ఉ. 10 గంటలకు చెన్నపురి మైలాపూరులో వున్న మద్రాసు శాసనసభ మాజీ అధ్యక్షుడైన శ్రీ మహర్షి బులుసు సాంబమూర్తిగారి ఇంటి ఆవరణలో ప్రారంభించారు. 1952 డిసెంబరు 15వ తేదీ రాత్రి 11.20 గంటలకి పొట్టిశ్రీరాములు అమరుడయ్యాడు. కేంద్రంలో ఉన్న ప్రధాని నెహ్రూ గాని, మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి సి.రాజగోపాలాచారిగాని పొట్టిశ్రీరాములు నిరాహారదీక్షను గాని ఆయన పోరాటంయొక్క ఉద్దేశ్యాన్నిగాని పట్టించుకొన్న దాఖలాలు లేవు.
అయితే రాష్ట్ర ప్రభుత్వపు అనాగరిక ప్రవర్తనపట్ల, కుట్రల పట్ల, నిరసన తెలుపుతూ తెనే్నటి విశ్వనాథం తన రాష్ట్ర శాసనసభ సభ్యత్వానికి రాజీనామాచేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న తక్కిన మన ఆంధ్ర మంత్రులు నిస్సంకోచంగా తమ పదవుల్ని పట్టుకు వేలాడారు. జనంలో కదలిక వచ్చింది. విపరీతంగా ఆందోళనలు మొదలయ్యాయి. నెహ్రూ ఇంకెంతమాత్రం కాలయాపన చేయడానికి వీలులేని పరిస్థితుల్లో తన ఊగిసలాట విధానానికి స్వస్తిచెప్పి, కోల్పోయిన ప్రజల విశ్వాసాన్ని తిరిగి చూరగొనేందుకు నడుంకట్టి 1952 డిసెంబరు 19వ తేదీన అమరజీవి ఆత్మబలిదానం చేసిన నాలుగు రోజులకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుచేస్తున్నట్లు పార్లమెంటులో ప్రకటించారు. అయితే ఈ రాష్ట్ర ఆంధ్రులకు మదరాసు నగరం మీది ఎటువంటి హక్కులు లేకుండా బళ్ళారి జిల్లా లేకుండా 11 జిల్లాలతో ఏర్పాటుచేశారు. నూతన ఆంధ్ర రాష్ట్రం 1 అక్టోబరు 1953న ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు ఆమోదించబడింది.
పొట్టి శ్రీరాములు ఆమరణ నిరశన దీక్షచేసి ప్రాణత్యాగం చేసిందెందుకో ఈ పుస్తకంలో ఆవిష్కరించారు. అసలు సత్యాన్ని వెలికితెచ్చారు. జస్టిస్ ఆవుల సాంబశివరావు అమరజీవి స్మారకోపన్యాసంలో ‘‘నాకు తెలిసినంతవరకు శ్రీరాములుగారు ప్రారంభించిన నిరాహారదీక్ష ఈ ఆంధ్ర రాష్ట్రానికై కాదు. నా పరిజ్ఞానాన్ని బట్టి ఆ దీక్ష రాబోయే ఆంధ్ర రాష్ట్రంలో మద్రాసులోని కొంత భాగమైనా కలిసిపోవాలి. అది వారి ఆశయం. ఆ దీక్షలో ఆయన మరణించారు’’ అంటూ ఓ సత్యాన్ని వెలిగించారు. ప్రత్యేక రాష్ట్ర నిర్మాణంలో తెలుగువాళ్ళు చాలా వదులుకోవాల్సి వచ్చింది. మద్రాసులో కొంత భాగం, బళ్ళారి అటు, గంజాం జిల్లాను పోగొట్టుకోవడం ఆనాటి స్వార్థపరులైన ఆంధ్ర, తమిళనాడు నాయకుల కుట్రగానే భావించాల్సి వుంటుంది. నిస్సంకోచంగా సంకలనకర్త పూసగుచ్చినట్లు శ్రీరాములుగారి నిరాహారదీక్ష అసలు రహస్యాల్ని వెలికితెచ్చారనటంలో ఎట్టి సందేహమూ లేదు.
అమరజీవి పొట్టి శ్రీరాములు జీవిత విశేషాలను వారి కుటుంబ నేపథ్యాన్ని, వారి పేదరికాన్ని, వలసల్ని మనస్సుకు హత్తుకునే విధంగా ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు పూర్వీకులు తల్లిదండ్రులు ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలం, పెదచర్లోపల్లి పంచాయతి పడమటపల్లె గ్రామవాసులు. శ్రీరాములుగారి తల్లి మహలక్ష్మమ్మ తండ్రి గురవయ్య. ఆర్యవైశ్య కుటుంబం. చిల్లర వ్యాపారమే వృత్తిగా జీవిస్తూ 1876 ధాత కరువు సమయంలో మద్రాస్ సమీపంలో ఉన్న ‘న్యాయపాలెం’ బతుకుతెరువు వెతుక్కుంటూ వలసపోయారు. తరువాత శ్రీరామలు కుటుంబం మద్రాస్ నగరంలోని జార్జిటౌనులోని అన్నాపిళ్ళె వీధిలో 163 నెంబరు ఇంటిలో చేరారు. శ్రీరాములు 1901 మార్చి 16వ తేదీన ఆ ఇంట్లో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. తండ్రి గురవయ్య మరణంతో కుటుంబ పోషణ తల్లి మహాలక్ష్మమ్మ మీద పడింది. అప్పటికే మహాలక్ష్మమ్మ పెద్ద కుమారుడు నారాయణ, కుమార్తె గురమ్మలు చనిపోయారు. గురమ్మ కుమారుడు ఎన్.ఆర్.గుప్త, శ్రీరాములు, తన తమ్ముడు రంగయ్య ముగ్గురు బిడ్డల్ని మహాలక్ష్మమ్మ శ్రమశక్తితో పెంచి పోషించి చదివించింది. బొంబాయిలో శ్రీరాములు రైల్వేలో శానిటరీ ఇంజినీరుగా ఉద్యోగిస్తూ భార్యకు పుట్టిన బిడ్డ మరణించడంతో సాంసారిక బంధాలు పటాపంచలై లోకంలో ఏకాకిగా మిగిలిపోయాడు. గాంధీజీ సిద్ధాంతాలపట్ల ఆకర్షితుడైన పొట్టి శ్రీరాములు తను ఏకాకిని కాదని లోకమంత బలగం తనకుందని నమ్మి ఉద్యోగానికి రాజీనామాచేసి గాంధీజీ సిద్ధాంతాల బాట పట్టాడు. ఆయన అనుంగు శిష్యుల్లో ఒకడుగా మారాడు. అహింసా సిద్ధాంతంతో శత్రువులలో హృదయ ప్రవర్తన తీసుకురావచ్చునని నమ్మి ఆచరించిన కార్యదీక్షా దురంధరుడు పొట్టి శ్రీరాములు.
గుజరాత్‌లో సర్దార్ వల్లభభాయ్ పటేల్ స్థాపించిన ‘శ్రమజీవి సంఘం’ తోను అనుబంధం పెట్టుకున్నాడు శ్రీరాములు. ఆదర్శప్రాయమైన జీవితం గడుపుతూ తప్పుకు తాళం వేయని మనస్తత్వంతో నిక్కచ్చిగా జీవితాన్ని వెళ్లదీసిన మహాత్యాగి శ్రీరాములు. ఆత్మార్పణతో దురహంకార, దుర్బుద్ధి రాజనీతిపరుల కళ్ళు తెరిపించిన అమరజీవి శ్రీరాములు. టంగుటూరి ప్రకాశం పంతులుగారు ‘‘శ్రీరాములుగారిని మనం దక్కించుకోలేకపోయాం. మన చేతులుమీదుగా మనం అతన్ని చంపేశాం. అతను చాలా గొప్పవాడు. గాంధీగారు పోయాక సత్యాహింసలు అంటే నవ్వులపాలయ్యాయి. సత్యాహింసలకి మళ్ళీ ప్రాణప్రతిష్ట చేసిన పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని బలిదానంచేసి మనందరికీ చక్కని గుణపాఠం చెప్పాడు’’ అంటూ కీర్తించారు.

- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఫోన్: 9948774243