Others

తల్లిదండ్రుల పెంపకం మారుతోంది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లోని బర్కత్‌పురాలో మధులిక అనే విద్యార్థినిపై ప్రేమోన్మాది భరత్ కత్తితో కర్కశంగా దాడి చేయడం ఎన్నో ప్రశ్నలను మన ముందు ఉంచింది. అమ్మాయిలపై ఇలా ప్రేమోన్మాదులు దాడి చేయడం సర్వసాధారణంగా మారింది. గత ఏడాది జూన్‌లో జనం రద్దీగా ఉండే కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఓ యువకుడు అత్యంత కిరాతకంగా గొంతుకోసి ఓ యువతిని హతమార్చాడు. ఇలాంటి దుర్ఘటనలు జరిగినపుడు మీడియాలో ఒకటి, రెండు రోజులు వార్తా కథనాలు, చర్చలు రావడం... ఆ తర్వాత సద్దుమణగడం షరామామూలుగా మారింది.
కొందరు యువకులు ఇలాంటి వికృత చేష్టలకు దిగజారడానికి వారిలో మానసిక స్థితి సరిగాలేకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. తల్లిదండ్రులు ఇస్తున్న స్వేచ్ఛ వల్ల కొందరు యువకులు పాశ్చాత్య సంస్కృతికి, జల్సాలకు బానిసలుగా మారిపోతున్నారు. ఇంత కర్కోటకంగా, క్రూరమైన మనస్తత్వానికి వీరు దిగజారడానికి తల్లిదండ్రుల అతి గారాబమే కారణం. చిన్నప్పటి నుంచి నైతిక విలువలను నేర్పించకపోవడం మరో హేతువుగా కనిపిస్తోంది. యువకుల్లో ఇలాంటి పెడ ధోరణులను అదుపుచేయాల్సిన బాధ్యత పేరెంట్స్, టీచర్లకే కాదు.. సమాజంలోని ప్రతి ఒక్కరిపైన ఉంది. కఠిన చట్టాలు ఎన్నో ఉన్నప్పటికీ, కొన్ని కేసుల్లో శిక్షలు విధిస్తున్నప్పటికీ యువకుల్లో మార్పు రావడం లేదు.
గుండె తరుక్కుపోతుంది...
ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలైన మధులిక పరిస్థితిని చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. ‘మానవత్వం ఎక్కడికి పోయింది? ఇంతటి కిరాతకమైన దాడికి దిగడానికి ఆ యువకుడి మనసెలా ఒప్పుకొంది? ఇలాంటి దాడులకు పాల్పడుతున్న వారిని ఏం చేయాలి’- అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఆడపిల్లలు బయట స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేకుండా చేస్తున్న ప్రేమోన్మాదులను ఏంచేయాలి? పాఠశాలలో, కళాశాలలో నైతిక విలువల ప్రాధాన్యత ఎందుకు తగ్గుతోంది? మానవ సంబంధాలు ఎందుకు తగ్గిపోతున్నాయి? తల్లిదండ్రులే కాదు, అందరూ ఈ విషయమై ఒక్కసారి ఆలోచించాలి.
శ్రద్ధ తగ్గుతోంది...
నేటి ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరి జీవన విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కుటుంబ సభ్యులైన తల్లిదండ్రులను, భార్యాపిల్లల కంటే వస్తువులపై చాలామంది మోజు పెంచుకుంటున్నారు. పిల్లల పెంపకం పట్ల తల్లిదండ్రులు అంతగా శ్రద్ధ వహించడం లేదు. పిల్లలకు ఏది మంచి? ఏది చెడు? అనే విషయాలను చెప్పేవారు కరవయ్యారు. తల్లిదండ్రులు, తాతయ్య, నానమ్మలు, ఇతర కుటుంబ సభ్యుల వద్ద పిల్లలు గడిపే సమయం తక్కువయ్యింది. విద్యార్థులు పుస్తకాలపై కన్నా ఎక్కువ సమయాన్ని సెల్‌ఫోన్‌తో గడిపేందుకే కేటాయిస్తూ ఉన్నారు. యుక్తవయసు రాగానే చదువుల పేరుతో పట్టణాలకు వెళ్లి స్నేహితులతో కలసి ఉంటున్న వారు సోషల్ మీడియా ప్రభావంతో చెడుదారులలో పయనిస్తున్నారు. చదువుపైన, ఉపాధిపైన ధ్యాస లేని చాలామంది యువకులు లైంగిక కార్యకలాపాల పట్ల ఆకర్షితులవుతున్నారు. మానసిక స్థితి గతి తప్పడం మూలంగా ఏ విధంగానైనా తను కోరుకున్న అమ్మాయిని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎదుటి వ్యక్తికి కూడా ఇష్టాయిష్టాలు ఉంటాయనే ఇంగిత జ్ఞానం మరిచిపోయి ఎలాగైనాసరే తమ పంతం నెగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తారు. అలా జరగని పక్షంలో- ‘నాకు దక్కనిది ఇతరులకు దక్కకూడదు..’ అనే ఆలోచనతో అమ్మాయిలను అంతమొందించడానికి సైతం సిద్ధమవుతున్నారు. తనకు నచ్చిన యువతి ప్రేమించడం లేదని యువకులు వారిపై యాసిడ్ పోయడం, కత్తులతో దాడులకు ఎగబడుతున్నారు.
మానవత్వం మంట కలుస్తోంది...
మానవత్వం జాడ లేకుండా పోతోంది. మానవ సంబంధాల పట్ల విలువలు తగ్గుతున్నాయి. ప్రేమ అనే పదానికి నేటి యువత అర్థాన్ని మార్చేస్తున్నారు. ప్రేమ అంటే ఎదుటివారిని సంతోషంగా ఉంచడం, వారి ఇష్టాయిష్టాలను గౌరవించడం అని తెలుసుకోలేక పోతున్నారు. తమ ప్రేమను అమ్మాయిలు తిరస్కరిస్తే అది నేరమని అంటున్నారు కొందరు మృగాళ్ళు! ప్రేమ అనే మాయపొరలను సృష్టించుకొని ఉన్మాదులుగా మారుతున్న యువకులను సన్మార్గంలో ఎవరు నడిపించాలి?
ప్రేమోన్మాదం తగ్గాలంటే...
- యువత సన్మార్గంలో పెరిగే విధంగా విద్యావిధానంలో మార్పురావాలి.
- పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి.
- ప్రతిరోజు పిల్లలతో గడిపే సమయాన్ని కచ్చితంగా కేటాయించుకోవాలి. - సెలవురోజుల్లో కుటుంబ సమేతంగా కొత్త ప్రదేశాలు సందర్శించాలి.
- యుక్తవయసు పిల్లలకు సంబంధించిన స్నేహితులపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి.
- పిల్లలు దారి తప్పుతున్నట్టుగా అనిపిస్తే వెంటనే కౌనె్సలర్, సైకాలజిస్ట్‌ల సహాయాన్ని తీసుకోవాలి.
- మంచికంటే చెడును తక్కువ సమయంలో అతి తొందరగా యువకులు లోనవుతున్నారు.
- ఇంటర్నెట్‌తో ఎన్ని లాభాలున్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయని గుర్తించాలి.
- యువతకు స్నేహం, ప్రేమకు మధ్య వ్యత్యాసం తప్పనిసరిగా వివరించాలి.
- ఎక్కువ సేపుసెల్‌ఫోన్‌తోనో, కంప్యూటర్‌తోనో గడిపే పిల్లలకు కాలం విలువను తెలియజేయాలి.
ఒక్క నిమిషం ఆలోచించండి...
హత్యానేరంపై కొడుకును అరెస్ట్‌చేసి పోలీసులు తీసుకువెళ్తుంటే- ‘ఇలాంటి కొడుకును ఆ భగవంతుడు ఎందుకు ఇచ్చాడు..’ అని కన్నీరు పెట్టుకొనే తల్లిదండ్రుల శోకం చెప్పలేనిది. చేతికి అందివచ్చిన కొడుకు జైలు పాలైతే- తల్లిదండ్రుల ఆలనాపాలనా చూసేదెవరు?
జీవితమనేది మనదొక్కరిదే కాదు, మనల్ని కని, పెంచి, పోషిస్తున్న అమ్మానాన్నలది కూడా. మనమీద మనకెంత హక్కుందో తల్లిదండ్రులకూ అంతే హక్కుంది. యుక్తవయసులో విపరీత ఆలోచనలకు లోనవడం సహజం. అయితే, నిరంతరం కర్తవ్యాన్ని గుర్తుచేసుకుంటూ యువత ముందుకు సాగాలి. ప్రేమైనా, విలాసాలైనా కాస్త ఆగి, ఆలోచించి అందులోని మంచిచెడులను తెలుసుకోవాలి. హత్యలు, ఉన్మాద చర్యలు చేసే స్థాయికి దిగజారిపోకూడదు. అమ్మాయిని హత్యచేయడం వల్ల సాధించిందేమిటి? పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఆ ఆడపిల్ల ప్రేమను పొందగలగడం సాధ్యమా? అకృత్యాలకు పాల్పడితే కుటుంబం పరువు పోవడం, జైలుకు వెళ్లడం తప్ప ఎలాంటి ఫలితం ఉండదు. బాగా చదివితే మంచి భవిష్యత్ ఉంటుందనే ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. జీవితంలో లక్ష్యాలను సాధించే ప్రతి ఆశయాన్ని స్వీకరించాలి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించాలి. ఏ పరిస్థితులలో ఉన్నా కర్తవ్యాన్ని, తల్లిదండ్రుల ఆశలను గుర్తుంచుకొంటే జీవితం సాఫీగా సాగుతుంది. సమస్యలను, సవాళ్లను అధిగమిస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. అలాంటపుడే- ప్రేమైనా, ఇంకేదైనా మన దరికి చేరుతుందని యువత గ్రహించాలి.

-డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి 97039 35321