ఈ వారం కథ

‘సాయం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘హమ్మయ్య! ఈ రోజుకి మొదటి అధ్యాయం పూర్తయ్యింది’’ వాషింగ్ మిషన్‌లో మూడో రౌండ్ బట్టలను ఉతకడం పూర్తిచేసిన భువన నిట్టూర్చింది, నుదుటన అలముకున్న స్వేదబిందువులను తుడుచుకుంటూ.
ఆసరికే పిల్లలు స్కూలుకి, భర్త ఆఫీసుకు వెళ్లిపోయారు. తను కూడా తెమిలిపోయి బ్యాంకుకి వెళ్లడమే మిగిలి ఉంది. ‘‘ఇదిగో ఈ బట్టలారేసి గబగబ తయారై వెళ్లిపోవాలి’’ తనలో తను స్వగతంలా అనుకుంటూ బట్టల బకెట్ చేతిలోకి తీసుకుని టెర్రస్‌మీదకెళ్లింది భువన.
అక్కడ తాను కట్టుకున్న తీగెలమీద ఇంకెవరివో బట్టలారేసి ఉండడం చూసి ఉసూరుమనిపించింది. ‘‘ఈ తీగలమీద బట్టలారేయద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరెవరూ. కిందన వీటినారేయడానికి జాగాలేదు. అసలలా లేదనే కదా.. మేడమీద ఇలా తీగెలేర్పాటుచేసుకున్నదీ! ఆ సంగతి అర్థం చేసుకోకుండా తీగె కనబడితే చాలు కొందరు బట్టలారేస్తారు.. భూబకాసురులు భూముల్ని కబ్జా చేసినట్లుగా.. ఇక్కడివాళ్ళకి తీగె దొరికితే చాలు.. ఎవరిదా? అని కూడా ఆలోచించకుండా కబ్జా చేసేస్తారు...’’ అక్కసుగా అనుకుంటూ అటు ఇటు చూసింది వాటినారవేసినవారు ఎక్కడన్నా కనిపిస్తారేమోనని.
అబ్బే! చుట్టుప్రక్కల పిట్ట మనిషి లేడు. వాచ్‌మెన్‌ని అడిగి ఆ బట్టల సొంతదారులెవరో కనుక్కుని తీసేయమని చెబ్దామంటే బ్యాంకుకి టైమైపోతోంది. ఇపుడా వివరాలు సేకరించడానికి తన సమయం సరిపోదు. ఏదైతే అదైంది.. తన పని కావడం ముఖ్యం.. అనుకుంటూ ఆ బట్టల్ని తీసేసి ఓ పక్కగా కుప్ప పోసి తన పని చూసుకుని కిందికి దిగింది భువన.
మనసులో ఏ మూలో పీకుతూనే వుంది.. తాను చేసిన పని ఎవరినన్నా నొప్పిస్తుందేమోననీ... కాని, తప్పదు.. ‘తన్ను మాలిన ధర్మం... మొదలు చెడ్డబేరం’ కూడదన్నారు పెద్దలు. వెళ్ళేముందు వాచ్‌మెన్‌తో చెప్పేసి వెళ్తే సరిపోతుంది.. అనుకుని గబగబా నోట్లో టిఫిన్ కుక్కేసుకుని, తయారై ఇంట్లోంచి బయటపడింది భువన.
సెల్లార్‌లో వున్న స్కూటీ తీస్తూ వాచ్‌మెన్‌ని కేకేసి, తాను తీసేసిన బట్టలెవరివో కనుక్కుని, వాళ్ళకి ఆ విషయం తెలియజేయమని చెప్పడం మరవలేదామె.
అసలు ఈ అపార్ట్‌మెంట్ జీవితాల్లో ఉండే చిక్కులిలాంటివే. ఇక్కడ నోరున్నవాడిదే రాజ్యం. ఇపుడు తాను చేసిన ఈ పనివల్ల ఎంత దుమారం రేగుతుందో! భయపడుతూనే ఉంది భువన. ఆ తరువాత బ్యాంకులో పని ఉండడంవలన ఆ విషయం తాత్కాలికంగా మరుగునపడిపోయింది ఆమె మస్తిష్కం నుంచి. భువన వాళ్ళుండేది ఇరవై ఎనిమిది ఇళ్ళున్న ఒకానొక గృహ సముదాయం.
అసలు భువనకి అపార్ట్‌మెంట్ జీవితమంటేనే నచ్చదు. భర్త కుమార్ అపార్ట్‌మెంట్లో ఫ్లాట్ కొంటానన్నప్పుడు వ్యతిరేకించింది కూడానూ.
‘‘ఎందుకండీ.. అపార్ట్‌మెంట్ అంటూ చిందులు వేస్తారు.. ఆ గోడలు మనవి కాదు, నేల మనది కాదు, ఇంటి పైకప్పు మనది కాదు.. గట్టిగా నవ్వినా, మాట్లాడినా ఆఖరుకి తుమ్మినా సరే పక్కవాళ్ళకి వినబడుతుందేమోనన్న భయం. వాళ్లకి మనవల్ల డిస్ట్బ్రెన్స్ అవుతుందన్న బాధ.. ఎందుకీ తలనొప్పంతా! చిన్నదైనా సరే ఇండివిడ్యువల్ హౌసే కొనుక్కుందామండీ’’ అంది కుమార్ ప్రతిపాదనతో విభేదిస్తూ.
‘‘నిజమే భువనా.. కాని, ప్రస్తుతం మనమున్న పరిస్థితుల్లో ఇండివిడ్యువల్ హౌస్ అంటే క్షేమదాయకం కాదు. మనమిద్దరం ఉద్యోగస్థులం.. పొద్దున్ననగా బయటకు పోతే ఏ సాయంత్రానికో గూటికి చేరతాము. మనం ఇంటి దగ్గర ఉండమని కనిపెట్టిన ఏ దొంగ వెధవో పట్టపగలే ఇల్లు దోచుకుపోయే ప్రమాదం లేకపోలేదు. పైగా సిటీలో ఇండివిడ్యువల్ హౌస్ కొనడమంటే మాటలు కాదు. మనం కూడబెట్టినదంతా ఊడ్చిపెట్టినా కనీసం.. జాగా కూడా కొనలేము. అలాగని ఎక్కడో ఊరికి దూరంగా కొనుక్కుంటే ఇదిగో.. నేను చెప్పిన దొంగ భయాలతోపాటు ట్రాన్స్‌పోర్టుకి కూడా ఇబ్బందౌతుంది’’ నచ్చచెప్పాడు కుమార్.
అతడు చెప్పింది సబబుగా అనిపించడంతో అతడి అభిప్రాయాన్ని బలపరచక తప్పలేదు భువనకి. అదుగో అప్పటినుండీ మొదలయ్యాయి ఈ పాట్లు.
ఎనిమిదివందల అరవై చదరపు అడుగుల ఫ్లాట్ ఏ మూలకీ చాలలేదు వాళ్లకి. హాలు ఓ మోస్తరుగా ఉన్నా బెడ్‌రూమ్‌లు బాగా చిన్నవి. రెండు గదులలో మంచాలు వేస్తే నడవడానికి మాత్రమే చోటు మిగిలింది.
ఇక యుటిలిటీ, బాల్కనీ అంతా ఒకటే.. అంట్లు తోముకునేందుకు, బట్టలుతికి ఆరవేసుకునేందుకు.. ఇలా అన్నింటికీ ఒకటే చోటు కావడంతో భువనకి బాగా ఇబ్బందయ్యేది. రోజువారీ బట్టలకి ఫరవాలేకపోయినా బెడ్‌షీట్లు, పిల్లల యూనిఫారాలు అన్నీ ఉతికిననాడు మాత్రం ఆరవేసుకునేందుకు చాలా యాతనయ్యేది. ఈ బాధపడలేని భువన ఆ ఇబ్బందిని అధిగమించడానికి టెర్రస్‌మీద ఇనప రాడ్లు పెట్టించి వాటికి ఇన్సులేటెడ్ ఇనుపతీగలు కట్టించుకుంది. సమస్య తీరిందని ఊపిరి పీల్చుకున్నంతసేపు లేదు, కొత్త సమస్య వచ్చిపడడానికి.
తన సౌకర్యార్థం కట్టించుకున్న ఆ తీగెలమీద ఎవరో ఒకరు వచ్చి బట్టలారేసిపోవడం ప్రారంభించారు. ఆ బట్టలు ఎవరివో కనుక్కుని, వాటిని తీయించి తన బట్టలారేసుకునేసరికి తలప్రాణం తోకకొచ్చేది ఆమెకి.
ఈ ప్రహసనంతో బ్యాంకు వేళ దాటిపోయిన సందర్భాలు లేకపోలేదు. అలాంటప్పుడు మానేజర్ చేత తలవాచేలా చీవాట్లు తినాల్సి రావడంతో ఆమెకు చాలా బాధనిపించేది. ఇలా లాభం లేదని అపార్ట్‌మెంట్‌లో అసోసియేషన్ మీటింగ్ జరుగుతున్నపుడు వెళ్లి నలుగురితో చెప్పింది.
తన అవసరం కోసం కట్టుకున్న ఆ తీగెలమీద ఎవరినీ బట్టలారేయద్దని, కావాలంటే వాళ్లని కూడా నాలుగు తీగెలు కట్టుకోమని కూడా చెప్పింది.
భువన చెప్పినదాన్ని కొంతమంది సక్రమంగా అర్థం చేసుకుంటే మరికొందరు మూతులు ముడిచారు. ‘‘ఒక చోటున్న తరువాత కోపరేట్ చేసుకోకపోతే ఎలా!’’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు.
దానికి భువన ‘‘నిజమేనండీ.. నలుగురం కలిసి ఉంటున్నపుడు ఒకరికొకరు సాయం చేసుకోవాలి. కాని, నా పరిస్థితి కూడా ఆలోచించండి.. నేను ఉద్యోగస్థురాలిని, బయటకెళ్ళక జరగదు. రోజూ రన్నింగ్ రేస్ చేస్తే తప్ప ఆఫీసు వేళకి అందలేను. అలాంటపుడు ఇలా ఎవరు పడితే వాళ్లు నేను కట్టుకున్న తీగెలమీద బట్టలారేసి నన్ను ఇబ్బందిపెడితే ఎలా! కోపరేషన్ అంటే సాటివారికి అసౌకర్యం కలిగించడం కాదని నా అభిప్రాయం’’ అంది కాస్త పదునుగానే.అప్పటికా గొడవ సద్దుమణిగింది. మళ్లీ ఇవాళ అదే పరిస్థితి. దీనికెంత అల్లరౌతుందో తలచుకున్న భువన గుండె బేజారైంది. ఆమె ఊహించినట్లే జరిగింది.
సాయంత్రం ఆమె ఇంటికొచ్చేసరికి సెల్లార్‌లో పంచాయితీ జరుగుతోంది. భువన స్కూటీ పార్క్ చేశాక ఆడవాళ్లందరూ మూకుమ్మడిగా ఆమెమీద మాటల దాడి ప్రారంభించారు.వాళ్లలోనుంచి ఒకామె ముందుకొచ్చి ‘‘మేము ఇక్కడికి కొత్తగా వచ్చామండీ.. ఆ తీగెలు అందరికీ సంబంధించిన కామన్ తీగెలనుకొని బట్టలారేశాను. ఎవరారేసారో కనుక్కుని వాచ్‌మన్‌తో అలా ఆరేయద్దని చెప్పించి ఉంటే సరిపోయేది కదా! తీసి అలా కింద బురదలో పారేస్తే ఎలాగండీ...’’ అంటూ దురుసుగా మాట్లాడింది.
‘‘నిజమేనండీ.. నేను అలా తీసిపారేయడం తప్పే.. నాకు తెలుసు. కాని గత్యంతరం లేదు. అందుకే తీసేయాల్సి వచ్చింది. నేను అవి ఎవరివో కనుక్కుని, వాచ్‌మన్‌తో చెప్పి తీయించేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. మా మేనేజర్ చేత చీవాట్లు తినాలి. అందుకే అలా చేశాను. అయాం సారీ.. అయినా అక్కడ బురదగా లేదే!’’ క్షమాపణ చెప్పింది భువన.
కొత్తగా వచ్చినావిడ కాస్త శాంతించినట్లే కనబడింది. కాని, అగ్నికి ఆజ్యం పోసినటుగా ఆ అపార్ట్‌మెంట్‌లో ఉన్న మిగతా మహిళామణులూరుకోలేదు. అందరికన్నా ముందు ఐదో ఫ్లోర్‌లో ఉండే అమ్మాజమ్మ రెచ్చిపోయింది. ఆవిడదొక తరహా. ఈ ప్రపంచంలో అందరికన్నా తానే కరెక్ట్ పర్సన్ అని భావిస్తూ... అడగకపోయినా అందరి గొడవల్లో తలదూరుస్తూ, ‘ఆడ మర్యాదరామన్న’లా తీర్పులు చెబుతూ ఉంటుంది.
ఇప్పుడూ ఆవిడే కలుగజేసుకుని ‘‘బురదగా లేకపోవడమేమిటండీ.. మొన్న కురిసిన వర్షానికి నీళ్ళు నిలవై అక్కడంతా ఆకుపచ్చటి నాచుపట్టేసింది. అయినా మీకేమిటండీ అంత గర్వం! ఎవరితో కలవకుండా ఒక గిరి గీసుకుని బతుకుతారు. మీకు, మీవారికి సంఘజీవనం తెలియదు. కాబట్టే అలా ప్రవర్తిస్తున్నారు..’’ అంటూ సందు దొరికింది కదాని అవాకులు చవాకులు పేలడం మొదలెట్టింది.
అంతవరకు తనని దోషిగా చూసి ఎన్ని మాటలాడినా బాధపడని భువన భర్తననేసరికి మాత్రం భరిస్తూ ఊరుకోలేకపోయింది.
‘‘మాటలు తిన్నగా రానీయండి అమ్మాజమ్మగారూ.. ఇందులో తప్పేదన్నా వుంటే నాది. మధ్యలో మా ఆయన్ను అనడం దేనికి! అసలాయన్ని అనడానికి మీరెవరు? మీరేమన్నా ఆయన అక్కచెల్లెలా? లేకపోతే స్నేహితురాలా! అందరిమీదా నోరు పారేసుకోవడానికి మీకే అధికారముందసలు? అయినా మంచి మర్యాదలు, సంఘజీవనం అంటే ఏమిటో మీ దగ్గర నేర్చుకునే స్థితిలో నేను లేను. నేను చదువుకున్నాను, సంఘంలో గౌరవప్రదమైన స్థానంలో వున్నాను. ఎదుటి వ్యక్తిని కించపరచడం మానేయండి..’’ ఆవేశపడింది భువన.
అమ్మాజమ్మ ఊరుకుంటుందా! ‘‘మీరు చదువుకున్నారన్నమాటేగాని నలుగురితో ఎలా మెలగాలో మీకు తెలియదు.. అందుకే మన బిల్డింగ్‌లో ఏ ప్రాబ్లం వచ్చినా, వినాయకుడిని పెట్టినా, మరే సందడి జరిగినా పట్టించుకోరు..’’ అంటూ వాగ్బాణాలు విసిరింది పరుషంగా.
భువనకి దుఃఖం ముంచుకొచ్చిందెందుకోగాని, అప్పటివరకు బ్యాంకులో చాకిరీ చేసి వచ్చిందేమో మనసు, శరీరం కూడా అలసిపోయి ఉన్నాయి. ఇంటికిపోయి కాస్సేపు విశ్రాంతిగా వాలదామంటే ఈ తద్దినం తలకి చుట్టుకుందేంటబ్బా! అని వాపోయింది మనసులోనే.
తనవల్ల బాధపడ్డ వ్యక్తి ఊరుకున్నా ఆవిడని రెచ్చగొడుతున్న అమ్మాజమ్మ వైఖరికి ఆమెకి అసహ్యం కలిగింది. ఇంకా ఆవిడతో వాదులాడి తన శక్తిని వృధా చేసుకోదలచుకోలేదు.
తాను తీసిపడేసిన ఆ బట్టల స్వంతదారునికేసి చూసి, రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ ‘‘అమ్మా.. నావలన ఏదైనా పొరపాటు జరిగుంటే నన్ను క్షమించండి. దయచేసి ఇకమీద నాకు అసౌకర్యం కలిగించే పనులు చేపట్టకండి..’’ ఉప్పెనలా పొంగుకొస్తున్న ఏడుపుని అక్కడే ఆపేసే ప్రయత్నం చేస్తూ తన ఫ్లాట్‌కేసి దూసుకుపోయింది భువన.
వెనక అమ్మాజమ్మ ఇంకేదో అంటూనే ఉంది. ఎర్రబారిన కళ్లతో ఇంట్లోకొచ్చిపడ్డ తల్లికేసి బిక్కముఖాలేసుకుని చూడసాగారు పిల్లలిద్దరూ. ఇంతలో కుమార్ కూడా ఇంటికొచ్చాడు.
ముఖం వేలాడేసుకుని దిగులుగా కూర్చున్న భార్యను చూసి ఏమైందంటూ ప్రశ్నించాడు. భోరుమంది భువన. కుమార్ కలవరపడ్డాడు. అతడు పదే పదే అడిగినమీదట అసలు విషయం బయటపెట్టింది భువన.
‘‘నన్నందుకు నాకు బాధగా లేదండీ.. కాని, మిమ్మల్ని అనేందుకు ఆవిడకేం హక్కుంది! ఒక చదువు సంధ్య లేని మనిషి చేత సంస్కారం గురించి, సంఘజీవనం గురించి చెప్పించుకునే ఖర్మ పట్టింది నాకు! అందుకే ఈ అపార్ట్‌మెంట్ లైఫంటే నాకిష్టం ఉండదు. ఎవరి బతుకు వారిని బతకనివ్వరు.. ’’ వెక్కిళ్లమధ్య అంది భువన ఉక్రోషంగా.
‘‘పోనీలే భువనా.. నువ్వే అంటున్నావుగా ఆమెకి చదువు సంధ్య లేదని.. బాగా చదువుకొన్న కొందరు వ్యక్తులకే సంస్కారం ఉండదు. అసలు చదువుకి, సంస్కారానికి సంబంధమే లేదు. నువ్వు ఆ సంగతి మనసులోనుంచి తుడిచేయి’’ అనునయంగా చెప్పాడు కుమార్.
‘‘ఆవిడ ననే్నదో అందని కాదండీ నా ఏడుపు.. ఈ సంఘటనతో ఏ సంబంధమూ లేని మిమ్మల్నెందుకు అనాలి చెప్పండి! అసలు.. మిమ్మల్ని ఎత్తిచూపే అర్హత ఆమెకేముందని’’
‘‘పోనీలే భువనా.. అది ఆమె నైజం.. ఆమధ్యన మన బిల్డింగ్‌లో వినాయకుడిని పెట్టినపుడు నన్ను పాల్గొనమని అడిగారు. నాకు ఇంట్రస్ట్ లేదని చెప్పేశాను. అందుకు వాళ్లాయన కాస్త దురుసుగా మాట్లాడాడు. దానికి తగిన సమాధానం ఇచ్చి నేనాయన నోరు మూయించాను. బహుశా ఆ కోపం మనసులో పెట్టుకుని ఆవిడ అలా మాట్లాడి ఉండొచ్చు..’’ సాలోచనగా అన్నాడు కుమార్.
‘‘ఆయనకి కోపముంటే ఆయన అనాలి. మధ్యలో ఈమెకేం అవసరం! తగుదునమ్మా అంటూ అన్నింటిలో వేలు పెడుతూ మనుషులని నొప్పిస్తూ ఉంటుంది’’ భువన కోపం ఇంకా చల్లారలేదు.
కుమార్ రెట్టించలేదు. కాస్సేపు వౌనంగా ఊరుకుంటే భువన తానే మామూలైపోతుందని అతడికి తెలుసు. అందుకే వౌనంగా ఉండిపోయాడు. స్ర్తి కావడం మూలానేమో.. జరిగిన సంఘటనను ఓ నాలుగు రోజులదాకా మరువలేకపోయింది భువన. కావాలని చేయకపోయినా చేసిన తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పినా సరే తానన్ని మాటలు పడాల్సి రావడం ఆమె హృదయాన్ని గాయపరచింది. అందుకే కాస్త వౌనంగా ఉంటూ తన మనసుకి సాంత్వన కలిగించుకోసాగింది.
****
మరి పది రోజుల తరువాత ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ ఎస్సైతో గొడవపడుతున్న ఆ నలుగురు టీనేజ్ పిల్లలను చూసి స్కూటీ ఆపింది భువన. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆమెకు పరిచయస్తుడే. అతడు ఆమె పనిచేస్తున్న బ్యాంకు కస్టమర్.. అప్పుడప్పుడు బ్యాంకులో చూడడం నుంచి అతడామెకి తెలుసు.
అక్కడున్న నలుగురు పిల్లల్లోనూ ఒకరు అమ్మాజమ్మ కొడుకు. ఇంకొకరిని తమ కాంపౌండ్‌లో తరచుగా చూస్తూనే ఉంటుంది కాని, అతడెవరో ఆమెకి తెలియదు. తక్కిన ఇద్దరితో అసలు ముఖపరిచయం లేదు.
‘‘ఏంటి సర్.. ఏమైంది? ఎందుకీ పిల్లలని అలా ఆపేశారు?’’ ఆశ్చర్యంగా ప్రశ్నించింది భువన.
‘‘మీరా మాడమ్... వీళ్ళు మీకు తెలుసా!’’ అడిగాడు కానిస్టేబుల్.తెలుసన్నట్లుగా తలూపింది భువన.
‘‘వీళ్ళ సాహసం చూడండి.. నిండా పద్దెనిమిదేళ్లన్నా లేవు.. ఇంత పెద్ద బైక్ డ్రైవ్ చేయడమే కాకుండా దీనిమీద నలుగురు వెళ్తున్నారు.. ఏమైనా ప్రమాదాలు జరిగితే అధికారుల నిర్లక్ష్యం అంటూ మమ్మల్ని నిందిస్తారు. అసలు వీళ్ళని కాదు అనాల్సింది.. మైనారిటీ తీరని వీళ్ళకి ఇంతింత పెద్ద బళ్ళిచ్చి ఊరిమీదికి విడిచిపెట్టే వీళ్ల అమ్మా నాన్నలని అనాలి’’ ఆవేశపడ్డాడు ఆ కానిస్టేబుల్.
అతడన్న మాటల్లో వాస్తవాన్ని అర్థం చేసుకుంది భువన. అంత చిన్న వయసులో వాడి స్థాయికి మించిన బండి వాడికిచ్చి వాడిని ప్రమాదంలో ఇరికించడమే కాకుండా, బాధ్యత మర్చి ప్రవర్తిస్తూ వాళ్ల భవిష్యత్తును పాడుచేస్తున్నారు.. ఎందుకో భువన మనసంతా చేదు మింగినట్లుగా మారింది.
కానిస్టేబుల్ ఎదురుగా బిక్కముఖం వేసుకుని నిలబడ్డ అమ్మాజమ్మ కొడుకును చూస్తూ ‘‘ఇలా బైక్‌మీద నలుగురు రైడ్ చేయడం తప్పని మీకు తెలియదూ!’’ అడిగింది భువన సూటిగా.
‘‘తెలుసాంటీ.. కాని, రోజు మేమిలాగే వస్తాం... ఎవరూ మమ్మల్ని అడ్డుకోరు. ఒకవేళ అడ్డుకున్నా ఏ యాభయ్యో, వందో చేతిలో పెట్టేస్తే ఊరుకుంటారు.. కాని, ఇవాళ ఇతనే...’’ గొంతు తగ్గించి రహస్యంగా భువన చెవిలో చెప్పాడా కుర్రాడు.
‘‘తప్పు నాన్నా.. నువ్వు చేస్తున్నదెంత పెద్ద తప్పో నీకు తెలియదు. వయసు రాకుండా ఇంత పెద్ద బైక్ తీయడం ఒక తప్పైతే, దానిమీద ఇంతమందిని ఎక్కించుకోవడం ఇంకో తప్పు.. నిన్ను పట్టుకున్న అధికారికి లంచం ఇవ్వడం అంతకన్నా పెద్ద తప్పు...’’ నెమ్మదిగా చీవాట్లు పెట్టింది భువన.
‘‘తప్పైపోయిందాంటీ.. ఇంకెప్పుడూ ఇలా చేయము. మమ్మల్ని విడిచిపెట్టమని చెప్పండాంటీ..’’ ప్రాధేయపడ్డాడు అమ్మాజమ్మ కొడుకు.
‘‘వదిలేయండి సర్.. ఏదో కుర్రాళ్ళు తెలియక చేశారు..’’ అంది భువన కానిస్టేబుల్‌తో.
‘‘అమ్మమ్మమ్మా.. ఎంతమాట! అలా చూసీ చూడనట్లుగా వదిలేస్తేనే వీళ్లిలా బరితెగించి తిరుగుతున్నారు. బండి లాక్కుని కేసు బుక్ చేస్తే కాని వీళ్ళ తిక్క కుదరదు..’’ అన్నాడు కానిస్టేబుల్ భువనతోవున్న పరిచయాన్ని పక్కనపెట్టేసి.
‘‘బండి లాక్కుంటారా! అమ్మో! నాన్న చంపేస్తారు...’’ అమ్మాజమ్మ కొడుకు గొంతు రుద్ధమైంది.
‘‘ఆ.. మీకు నాన్న చంపేస్తాడన్న భయమే ఉంటే ఇలా పెద్ద బళ్ళతో ఇంత రెక్లెస్‌గా రోడ్లమీద ఊరేగరు’’ వెటకారంగా అన్నాడు కానిస్టేబుల్.‘‘ప్లీజ్ సర్.. ఇకమీద ఇలా జరగదు. నేను గ్యారంటీ. వీళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడి ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను....’’ అభ్యర్థనగా అంది భువన.
‘‘ఓకె మాడమ్.. మీరింతగా అడుగుతున్నారు కాబట్టి వదిలేస్తాను. కాని వీళ్ళు మళ్లీ ఇలా చేయకుండా ఉండాలంటే వీళ్లకి బుద్ధిరావాలి. కాబట్టి ఐదువందలు ఫైన్ కట్టమనండి..’’ చెప్పాడు కానిస్టేబుల్.‘‘విన్నారుగా.. ఐదువందలు ఫైనట.. కట్టేస్తారా మరి?’’ అడిగింది భువన అమ్మాజమ్మ కొడుకువైపు తిరిగి.‘‘మా దగ్గర అంత డబ్బు లేదాంటీ..’’దీనంగా సంయుక్తంగా చెప్పారు ఆ పిల్లలు.
భువనకి జాలేసింది. గుండె కరిగి నీరైపోయింది. ముఖాలు వేలాడేసుకుని నిలబడ్డ ఆ పిల్లల్లో తన పిల్లలు కనబడ్డారాక్షణాన.
‘‘ఓ.కె. ఆ డబ్బు నేనిస్తాను. కాని ఎప్పుడూ ఇలా బైక్‌తో రోడ్డుమీద నాకు కనబడనని మాటియ్యి’’ అంది భువన.
‘‘ప్రామిస్ ఆంటీ.. ఇంకెప్పుడూ ఇలా చేయం..’’’ బేర్‌మన్నారు వాళ్ళు.
భువన తన హ్యాండ్ బ్యాగ్‌లోంచి ఐదువందల నోటు తీసి కానిస్టేబుల్ చేతికి ఇచ్చింది. అతడు చలాన్ రాసి ఇచ్చాడు. దాన్ని అందుకుని బ్యాగ్‌లో పెట్టుకుంది.
‘‘ఇంతకీ ఈ కుర్రాడు ఎవరు...’’ పరిచయమున్న ముఖంలా అనిపించిన కుర్రాడి గురించి అడిగింది భువన.
‘‘మన ఫ్లాట్స్‌లోకి కొత్తగా వచ్చారాంటీ...’’ చెప్పాడు అమ్మాజమ్మ కొడుకు.‘‘సర్సరే.. నువ్వు, ఈ అబ్బాయి కలిసి తిన్నగా ఇంటికి పదండి.. వీళ్ళిద్దరినీ ఆటోలో వెళ్లమను. ఆటోకి డబ్బులున్నాయా ఇయ్యమంటారా!’’ అడిగింది భువన.
ఆ పిల్లలు ఉన్నాయన్నట్లుగా బుర్రూపారు. బండి తీసేముందు ‘‘్థంక్స్ ఆంటీ..’’ అంటూ చెప్పేసి తుర్రుమన్నారు ఆ కుర్రాళ్ళు.వాళ్ళ వెనుకే ఫాలో అయింది భువన. అపార్ట్‌మెంట్ చేరాక వాళ్ళనుద్దేశించి అంది భువన. ‘‘మీరు మళ్లీ బైక్‌మీద కనిపించారంటే ఈసారి.. నేనే పోలీసులకి పట్టిస్తాను.. అందరూ పదో పరకో తీసుకుని ఊరుకుంటారనుకోకండి..’’ఆమె మాటల్లో పదును గ్రహించిన వాళ్ళలా తలాడించారు ఇద్దరు కుర్రాళ్ళూ, మరోసారి థాంక్స్ చెప్పేసి వెళ్లిపోయారు. ఇంట్లోకి వెళ్లిన భువన గృహకృత్యాల్లో మునిగిపోయింది. స్నానం చేసి పొయ్యిమీద కూర పెట్టి కలుపుతున్నదల్లా కాలింగ్ బెల్ మోగడంతో ‘‘చిన్నూ... ఎవరో చూడు... నాన్నివాళ లేటవుతుందన్నారు..’’ అంది భువన కూతురితో.
తలుపు తీసిన చిన్నూ తల్లిదగ్గరకు వచ్చి ‘‘అమ్మా.. మరే.. అమ్మాజమ్మ ఆంటీ, అత్త, తేజూవాళ్ల అమ్మ వచ్చారు’’ చెప్పింది.
‘‘తేజూ అంటే..’’ అడగబోయి ఏదో స్ఫురించి ఆగిపోయింది భువన. పిల్లలకన్నీ వేగమే తెలిసిపోతాయి. ‘‘లోపలకొచ్చి కూర్చోమను.. వస్తున్నా...’’ అంది స్టవ్ మంట తగ్గిస్తూ... ఆమె పెదవులు గులాబీ పువ్వుల్లా విచ్చుకున్నాయి.
భువన వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ గుమ్మానికవతలే నిలబడి ఉన్నారు. ‘‘అక్కడే నిలబడ్డారేం! లోపలికి రండి’ పిలిచింది భువన.
చిన్నబుచ్చుకున్న వదనాలతో లోపలికి వచ్చారు వాళ్ళు.
‘‘మా అబ్బాయి అంతా చెప్పాడు.. మీరు చేసిన సాయానికి చాలా థాంక్సండీ... మీరే గనుక ఆదుకోకపోతే... ఇకమీదట అబ్బాయికి బైక్ ఇవ్వము..’ అవనతవదనంతో పలికింది అమ్మాజమ్మ.
‘‘అవునండీ.. నిజంగా ఇవాళ మీరు కనుక వాళ్ళని చూసి ఉండకపోతే.. చాలా ఇబ్బందై ఉండేది. మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు రియల్లీ అయాం వెరీ సారీ...’’ సిగ్గుపడుతున్నట్లుగా అంది బిల్డింగ్‌లోకి కొత్తగా వచ్చిన ఆవిడ.
‘‘ఫరవాలేదండీ.. ఒకచోటున్న తరువాత ఆపాటి సాయం చేసుకోకపోతే ఎలా!’’ చిరుమందహాసం చిందించింది భువన. *

-- రచయిత్రి సెల్ నెం: 8096738953

--కె.కె.బాగ్యశ్రీ