క్రైమ్/లీగల్

నగరంలో డీడీ గ్యాంగ్ హల్‌చల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 10: గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటుపడి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ నగరంలో హల్‌చల్ చేస్తున్న డేరింగ్ అండ్ డేషింగ్ (డీడీ) గ్యాంగ్‌కు నగర పోలీసులు బ్రేక్ వేశారు. ఈ ముఠాపై ఇప్పటికే వివిధచోట్ల పలు కేసులు నమోదయ్యాయి. తమ వికృత చేష్టలతో నగర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అలజడి సృష్టిస్తున్న ఈ ముఠాలో సభ్యులు పాత నేరస్తులే కావడం గమనార్హం. డీడీ గ్యాంగ్‌కు చెందిన ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 650గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని, ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. సూర్యారావుపేట పోలీసు కాంప్లెక్స్‌లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అదనపు డీసీపీ, ఇన్‌ఛార్జి డీసీపీ నవాబ్‌జాన్ వివరాలు వెల్లడించారు. భవానీపురం ప్రియదర్శిని కాలనీకి చెందిన గుంటూరు ప్రవీణ్‌కుమార్ అలియాస్ ప్రవీణ్(27), ముత్యం నాగరాజు(21), ప్రస్తుతం రామవరప్పాడు బల్లెంవారి వీధిలో నివాసముంటున్న పెద్దిశెట్టి సాయిదుర్గావరప్రసాద్(21), పెద్దిశెట్టి శివరామకృష్ణ(20), హెచ్‌బి కాలనీకి చెందిన మేడిశెట్టి విజయబాబు(21) అనే ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రవీణ్‌కుమార్‌పై భవానీపురంలో పోలీస్టేషన్‌లో రౌడీషీటు, క్రైం సస్పెక్ట్ షీటు, నాగరాజుపై క్రైం సస్పెక్ట్ షీటు ఉన్నాయి. సాయిదుర్గాప్రసాద్, శివరామకృష్ణ ఇదే పోలీస్టేషన్‌లో పాత కేసుల్లో నిందితులుగా ఉండగా, విజయబాబుపై పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పోలీస్టేషన్‌లో పాత కేసులున్నాయి. వీరంతా కూడా ఆయా కేసుల్లో అల్లర్లు, దోపిడీలు, బెదిరింపులు, చోరీలకు పాల్పడినవారేనని డీసీపీ తెలిపారు. ఈ గ్యాంగ్ సభ్యులు నిత్యం గంజాయి సేవిస్తూ ఈ తరహా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. నిందితులు విద్యార్థులకు కూడా గంజాయి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఈ ఐదుగురు పాత నేరస్తులను అరెస్టు చేసిన పోలీసులు అందరి వద్ద నుంచి మొత్తం 650 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. విలేఖరుల సమావేశంలో వెస్ట్ ఏసిపి గుణ్ణం రామకృష్ణ, భవానీపురం సీఐ రాజాజీ, తదితరులు పాల్గొన్నారు.

లెనిన్ సెంటర్‌లో వస్త్ర దుకాణాలు దగ్ధం
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 10: నగరంలో ప్రధాన వాణిజ్య కేంద్రమైన బీసెంటు రోడ్డు సమీపంలోని లెనిన్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి సంభవించిన ఈ ప్రమాదంలో రోడ్డు వెంబడి ఉన్న పలు వస్త్ర దుకాణాలు దగ్ధమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలా ఉన్నాయి. లెనిన్ సెంటర్‌లోని పూలకొట్లు పక్కనే ఉన్న బట్టల షాపులు సోమవారం రాత్రి 11గంటలకు మూసేసి సిబ్బంది ఇంటికి వెళ్లిపోయారు. తర్వాత అర్ధరాత్రి అకస్మాత్తుగా చందు గార్మెంట్స్ అనే బట్టల దుకాణంలో ఒక్కసారిగా పొగలు అలముకుని మంటలు ఎగసిపడ్డాయి. క్షణాల్లో పక్క షాపులకు వ్యాపించడంతో నాలుగు షాపుల్లోని దుస్తులు, ఇతర సామగ్రి కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్, గవర్నర్‌పేట పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో గంటల తరబడి ప్రయత్నించి ఎట్టకేలకు మంటలు అదుపు చేశారు. అయితే మొత్తం నాలుగు షాపులు కాలి బూడిద కాగా, మరికొన్ని షాపులు మాత్రం పాక్షికంగా దెబ్బతిన్నాయి. చందు గార్మెంట్స్ షాపులో ఏర్పడిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మొత్తం నాలుగు షాపులు ఆగ్నికి ఆహుతి కాగా సుమారు 45లక్షల 70వేల రూపాయల మేర నష్టం జరిగినట్లు అంచనా. కాగా ఏదైనా విద్రోహ చర్య వల్లనైనా అగ్నిప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లికి చెందిన చందు గార్మెంట్స్ నిర్వాహకుడు గౌర ధనుంజయరావు ఫిర్యాదు మేరకు గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.