మీ వ్యూస్

ఎవరికెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగశౌర్య హీరోగా వచ్చిన ‘అబ్బాయితో అమ్మాయి’ చిత్రం సహనాన్ని పరీక్షించింది. సినిమాలో ఏం చెప్పదలుచుకున్నారో దర్శకుడికి సరైన క్లారిటీ ఉన్నట్టుగా లేదు. హీరోయిన్ ఎప్పటికప్పుడు తన హావభావాలు మార్చుకోవడానికి కారణమేమిటో సరిగా చెప్పలేకపోయాడు. హీరో ఉన్నాడు అంటే ఉండాలికాబట్టి ఉన్నాడు అన్నట్టుగా ఉంది. అబ్బాయితో అమ్మాయి కలిసి చేసే రొమాన్స్‌లు మాత్రమే ప్రధానంగా తీసుకుని సినిమా చుట్టేద్దామంటే కుదరు కదా. దాంతో సినిమాలో పాత్రలన్నీ ఎవరికెవరు అని ప్రశ్నించుకున్నట్లుగానే ఉన్నాయి. కథనం సరిగా లేక తికమకపడిపోయిన చిత్రానికి వెళితే మనకు తికమక గ్యారంటీ.
-ఆచంట శ్రీనివాస్, వెంకటాపురం

ఉత్కంఠ హీరోలు
ప్రస్తుతం పరిశ్రమలో స్టార్ హీరోల లక్ష్యాలు ఉత్కంఠ నేపథ్యంలో నలిగిపోతున్నాయి. చిరంజీవి 150వ చిత్రం ఎప్పుడో, హీరోయిన్ ఎవరో దర్శకుడు ఎవరో, కథేమిటో తేల్చుకోలేకపోతున్నారు. 150వ చిత్రానికి పాపం కథలు దొరకడం లేదు. చివరికి పరభాషపైనే ఆధారపడాల్సి వస్తోంది.
ఊరింపుల మధ్య రీమేక్ కథతో ప్రతిష్ఠాత్మకంగా తీద్దామనుకుంటే వృధానే. ప్రేక్షకులు తప్పించుకుంటారా? అచ్చమైన తెలుగు రచయితల తెలుగుదనం కథతో అవార్డులు, ప్రజాభిమానం సంపాదించే విధంగా నిర్మిస్తే బెటర్. అలాగే బాలకృష్ణ కూడా 100 చిత్రంకోసం కుస్తీలు పడుతున్నాడు. అత్యున్నత స్థాయిలో నిర్మించాలని, ఎప్పటినుంచో ప్రణాళికలు వేస్తున్నా ఇప్పటికీ ఏదీ తేల లేదు. బాలకృష్ణ కొత్తకోణంలో కనిపిస్తే నూరో చిత్రానికి సార్థకత ఉంటుంది.
- పివిఎస్ ప్రసాదరావు, అద్దంకి

బాధ్యత మరిచారా?
ఒకప్పుడు ఉదాత్తమైన విలువలు, సత్సంప్రదాయాలు, కట్టుబాట్లు, నైతిక విలువలతో తెలుగుచిత్రాలను ఒక తపస్సుగా భావించి నిర్మించడంవలన అవి అజరామరం కావడమేకాక తెలుగుభాష, జాతి ఖ్యాతిని దిగంతాలకు వ్యాపింపజేసాయి. కొన్ని సినిమాలు 60 సం.ల తర్వాత కూడా అంతే సజీవంగా తెలుగు ప్రేక్షకుల హృదయాలల్లో వున్నాయి. కాలక్రమేణా పాశ్చాత్య నాగరికతా ధోరణులు ప్రబలి సినిమా కేవలం కాసులు రాల్చే వ్యాపారంగా తయారైంది. ఆదర్శాలు, విలువలకు తిలోదకాలిచ్చి ఎలాగైనా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రేమ-వ్యామోహం మధ్య సన్నటి పొరను చెరిపేసారు. కుటుంబ విలువలు, కట్టుబాట్లు, సనాతన సత్సంప్రదాయాలను హేళన చేస్తున్నారు. చవకబారుతనం, నేర దృక్పథం, అనైతికత, అసభ్యత, హింసాప్రవృత్తితో కూడిన పాత్రలకు రూపకల్పన చేస్తున్నారు.
ఇవన్నీ యువతపై దుష్ప్రభావం చూపడంతోపాటు వారిని పెడదారి పట్టిస్తున్నాయి. దశాబ్దం క్రితం తప్పును ఇప్పుడు ఒప్పుగా, అందరూ అంగీకరించే విధంగా చిత్రీకరిస్తున్నారు. లక్షలాది మందిని ప్రభావితం చేసే సినిమా నిర్మాణంలో తమకు సామాజిక బాధ్యత వుందన్న విషయాన్ని సినీ పరిశ్రమ విస్మరిస్తోంది.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం

నేడు సమాజంపై బాగా ప్రభావితం చేసే అంశాలు చూస్తే ముఖ్యంగా రాజకీయం మరియు సినిమాలుగా చెప్పవచ్చును. ఈ రెండు అంశాలు ప్రజానీకాన్ని శాసించే విధంగా సమాజంలోనికి చొరబడిపోయినాయి. కాబట్టి ఈ విషయంపై దృష్టిపెట్టి సినిమాలు తీసే దర్శక నిర్మాతలు కేవలం లాభదాయకమైన వ్యాపార ధోరణితో మాత్రమే ఆలోచించకుండా సంస్కృతి, సంప్రదాయాలపై కూడా కాస్త దృష్టి పెట్టి సినిమాలను తీస్తే బాగుంటుంది. మంచి సినిమాలు తీయగల ప్రతిభ వున్న దర్శకులు కూడా కొన్ని రకాల ఆంక్షలు వలన అశ్లీలతతో కూడిన వాణిజ్య హంగులు కలిగిన సినిమాలు తీయడం శోచనీయం. అదేవిధంగా కొందరు దర్శకులు తీస్తున్న సినిమాలు బాగున్నప్పటికీ ఆ సినిమాలకు పెట్టే పేర్లు (ఆంగ్లం, తిట్లు) వలన ఆ దర్శకులపై ఉన్న మంచి పేరును పోగొట్టుకుంటున్నారు. దయచేసి మంచి సినిమాలను మంచి పేర్లతో అందించవల్సిందిగా మనవి.
-పెయ్యల శ్రీనివాసరావు, అలికాం

పాండవీయం
శ్రీకృష్ణ పాండవీయం గురించి వెనె్నల్లో బాగా రాశారు. ఈ చిత్రం నభూతో నభవిష్యతిగా ఎన్టీఆర్ నటించి, దర్శకత్వ బాధ్యతలు వహించి అఖండ విజయం సాధించారు. ఇటువంటి పౌరాణిక చిత్రాన్ని వదిలేసి, అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగపతివారి అంతస్థులు చిత్రానికి బంగారు నంది ఇచ్చారు. పాండవీయం చిత్రానికి వెండి నంది బహూకరించగా ఎన్టీఆర్ ఆ అవార్డును తిరస్కరించారు. ప్రేక్షకులందరూ ఆనందించినా ‘పాండవీయం’, అంతస్థులు చిత్రంలో ఏముందని? కేవలం అక్కినేనిని దృష్టిలో వుంచుకొని బంగారు నంది అవార్డు ఇస్తూ తిరిగి మూడో బహుమతి అక్కినేని నటించిన ఆత్మగౌరవానికే ఇచ్చారు. శ్రీకృష్ణపాండవీయంలో రుక్మిణీ కల్యాణం పద్యాలలో కనియన్ రుక్మిణి పద్య రచన సముద్రాల కాదు. భాగవతం నుండి తీసుకున్నది. గమనించగలరు. ఇప్పటికీ వివాహాలలో స్వాగతం సుస్వాగతం పాట వినిపిస్తూనే వుంటుంది.
- ఎస్.శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు

అద్భుతాలు
నాటి దేవదాసు, లైలామజ్ను, మిస్సమ్మ, గుండమ్మ కథ, మాయాబజార్ లాంటి చిత్రాలే అద్భుతాలుగా నిలిచిపోయాయి. అప్పటి పౌరాణికాలు, జానపదాలు కూడా అద్భుత చిత్ర రాజాలుగా మన్ననలు అందుకుంటున్నాయి. మరి నేడు అద్భుతాలు సృష్టిస్తాము అంటూనే తల వాచి, బొప్పికట్టే చిత్రాలను మన మీదకు వదులుతోంది పరిశ్రమ. మన వాళ్లు ఏం చేసినా నేల విడిచి సాము చేయడం బాలేదు. సందర్భాన్నిబట్టి సన్నివేశాలను రాసుకోవాలి గానీ తలా తోకాలేని సీన్లను సినిమాలో ఇరికించవద్దు. బాహుబలి చిత్రానికి సంబంధించిన రెండో భాగం ఉందంటేనే సినిమా చూశారు కానీ, ఉన్నది ఉన్నట్టుగా తీసి మరో భాగం లేదంటే ఢమాల్ అయ్యేదే.
- కురువ శ్రీనివాసులు, హైదరాబాద్