బిజినెస్

వీడ్కోలు-2015

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది ఆర్థిక, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో చోటుచేసుకున్న కీలక అంశాల
సమాహారమే ఈ ‘వీడ్కోలు-2015’. స్టాక్, రూపాయి, బంగారం, ముడి చమురు
మార్కెట్ల వివరాలతోపాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలన్నింటినీ
ఒక్కచోటికి చేర్చుతూ మీకందిస్తున్నాం
========================
స్టాక్ మార్కెట్లు డీలా
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ ఇప్పటిదాకా 1,660.71 పాయింట్లు కోల్పోగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 421.65 పాయింట్లు పడిపోయింది. ఈ ఏడాది 27,499.42 పాయింట్లతో మొదలైన సెనె్సక్స్.. ప్రస్తుతం 25,838.71 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ సైతం 8,282.70 పాయింట్ల నుంచి ఆరంభమై.. నేడు 7,861.05 వద్ద ఉంది. నిజానికి ఈ ఏడాది మార్చిలో సెనె్సక్స్ 30,000 పాయింట్లను, నిఫ్టీ 9,000 పాయింట్లను అధిగమించి ఆల్‌టైమ్ హై రికార్డును స్థాపించాయి.
అయితే పలు ప్రతికూల పరిస్థితుల మధ్య విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో సూచీలు చారిత్రాత్మక స్థాయిల నుంచి పడిపోవాల్సి వచ్చింది. ఆగస్టు 24నైతే ఏకంగా సెనె్సక్స్ మునుపెన్నడూ లేనివిధంగా 1,624.51 పాయింట్లు దిగజారింది. నిఫ్టీ సైతం 491 పాయింట్లు కోల్పోయింది. ఈ ఒక్కరోజే సెనె్సక్స్ మార్కెట్ విలువ 7 లక్షల కోట్ల రూపాయలు, నిఫ్టీ మార్కెట్ విలువ 2 లక్షల కోట్ల రూపాయల వరకు ఆవిరైపోయింది.
ఇకపోతే బిఎస్‌ఇ సంస్థల మార్కెట్ విలువ ఒకానొక దశలో 100 లక్షల కోట్ల మార్కును కోల్పోగా, ఆయా రంగాలవారీగా లోహ షేర్లు 32 శాతం, నిర్మాణ షేర్లు 15 శాతం, బ్యాంకింగ్ షేర్లు 10 శాతం, ప్రభుత్వరంగ సంస్థల షేర్లు 18 శాతం క్షీణించాయి. అయితే హెల్త్‌కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్ల విలువ స్వల్పంగా పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్షలు, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి), చైనా స్టాక్ మార్కెట్లు, కరెన్సీ పతనం ఈ ఏడాది అధికంగా భారతీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయి. మొత్తంగా ఈ సంవత్సరం నాలుగేళ్ల కనిష్టానికి సూచీలు పతనమయ్యాయి.
ఎఫ్‌పిఐల నిరాసక్తి
భారతీయ మార్కెట్లలో ఈ సంవత్సరం విదేశీ మదుపరుల పెట్టుబడులు గత సంవత్సరంతో పోల్చితే భారీగా తగ్గిపోయాయ. 2014లో రెండున్నర లక్షల కోట్ల రూపాయలకుపైగా తీసుకొచ్చిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరు (ఎఫ్‌పిఐ)లు.. 2015లో మాత్రం అందులో నాలుగో వంతుతో సరి పెట్టారు. పోయన సారి ప్రభావం చూపిన నరేంద్ర మోదీ చరిష్మా, ఈసారి చూపలేదనే చెప్పాలి. అటు స్టాక్ మార్కెట్లు, ఇటు రుణ మార్కెట్లు కలిపి మొత్తం 67,000 కోట్ల రూపాయల పెట్టుబడులను మించలేదు.
ఈ ఏడాది ఆరంభం నుంచి గమనిస్తే ఏప్రిల్ వరకు దేశీయ మార్కెట్లలో నెలసరి విదేశీ పెట్టుబడులు క్రమేణా తగ్గుతూ వచ్చాయ. ఆ తర్వాత కూడా ఆటుపోటులకు గురయ్యాయ. జనవరిలో 33,688 కోట్ల రూపాయలుగా ఉన్న ఎఫ్‌పిఐ పెట్టుబడులు.. ఫిబ్రవరిలో 24,564 కోట్ల రూపాయలుగా, మార్చిలో 20,723 కోట్ల రూపాయలుగా, ఏప్రిల్‌లో 15,333 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. మే, జూన్ నెలల్లో పెట్టుబడులు రాకపోగా, వెనక్కి వెళ్లిపోయాయి. మే నెలలో 14,272 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలిపోయాయ. జూన్‌లో 1,608 కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు లాగేసుకున్నారు. జూలైలో మళ్లీ పెట్టుబడుల రాక మొదలైనా.. ఆగస్టులో తిరిగి పెట్టుబడుల పోకడే మిగిలింది.
జూలైలో 5,323 కోట్ల రూపాయల పెట్టుబడు లను తేగా, ఆగస్టులోనైతే ఏకంగా 17,524 కోట్ల రూపాయలను గుంజేసు కున్నారు. సెప్టెంబర్ లో 5,784 కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు వెనక్కి తీసుకోగా, అక్టోబర్‌లో మళ్లీ స్టాక్, రుణ మార్కెట్లలోకి తిరిగి 22,350 కోట్ల రూపాయల (3.44 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను పట్టుకొచ్చారు. ఫలితంగా అక్టోబర్ నెలలో ఏడు నెలల గరిష్ఠానికి ఎఫ్‌పిఐ పెట్టుబడులు చేరినట్లైంది.
మార్చి (రూ. 20,723 కోట్లు) తర్వాత మళ్లీ అక్టోబర్‌లోనే భారీగా విదేశీ పెట్టుబడులు తరలివచ్చాయ. నవంబర్‌లో స్టాక్ మార్కెట్ల నుంచి 7,000 కోట్ల రూపాయలకుపైగా లాగేసుకోగా, డిసెంబర్‌లో 4,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పట్టుకుపోయారు. దేశ, విదేశీ ప్రతికూల ఆర్థిక పరిస్థితులు, పార్లమెంట్‌లో కీలక బిల్లుల ఆమోదంపై కొనసాగుతున్న సందిగ్ధత విదేశీ పెట్టుబడులను అడ్డుకున్నాయ. మొత్తానికి ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ దాదాపు 16,000 కోట్ల రూపాయలుగా ఉంటే, రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ సుమారు 51,000 కోట్ల రూపాయలుగా ఉంది.
ఎగుమతుల క్షీణత
దేశీయ ఎగుమతులు ఈ ఏడాది అంతకంతకూ దిగజారాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న మందగమనం భారతీయ ఎగుమతులను తీవ్రంగా దెబ్బతీశాయి. దిగుమతులు సైతం తగ్గుముఖం పట్టినప్పటికీ, ఎగుమతుల క్షీణతతో వాణిజ్య లోటు నమోదవుతూనే ఉంది. గత ఏడాది ఆఖరు నుంచి మొదలైన ఎగుమతులు.. ఇంకా కొనసాగుతూనే ఉంది. 20-25 బిలియన్ డాలర్ల దిగువకు ఎగుమతులు పడిపోవడం పారిశ్రామిక రంగాన్ని కలవరపెడుతోంది. ఎగుమతుల వృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తుండగా, ప్రభుత్వం సైతం చొరవ చూపిస్తున్నప్పటికీ మారని అంతర్జాతీయ పరిణామాల మధ్య ఇవేమీ ఫలించడం లేదు. మొత్తానికి ఈ ఏడాది దేశీయ ఎగుమతుల రంగానికి తీవ్ర నిరాశనే మిగిల్చింది.
బంగారం వెలవెల
బంగారం, వెండి ధరలు ఈ ఏడాది మరింతగా తగ్గుముఖం పట్టాయి. గత ఏడాదితో పోల్చితే 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర 1,510 రూపాయలు పడిపోగా, కిలో వెండి ధర 2,700 రూపాయలు క్షీణించింది. ఈ ఏడాది ఆరంభంలో పుత్తడి ధర 27,200 రూపాయలుగా ఉండగా, వెండి ధర 37,000 రూపాయలుగా ఉంది. ప్రస్తుతం బంగారం ధర 25,690 రూపాయలుగా, వెండి ధర 34,300 రూపాయలుగా ఉంది. నిజానికి స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కదలాడితే మదుపరులు ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనంగా బంగారంపై పెట్టుబడులు పెడతారు.
దీంతో ధరలు పెరుగుతాయి. అయతే ఈ ఏడాది అందుకు విరుద్ధంగా అటు స్టాక్ మార్కెట్లు, ఇటు బంగారం ధరలు రెండూ క్షీణించాయి. గ్రీస్ రుణ సంక్షోభం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనైన క్రమంలో బంగారం ధర 28,000 రూపాయల స్థాయిని తాకినప్పటికీ మళ్లీ దిగజారింది. 2013 ఆగస్టు 28న పసిడి ధర 33,790 రూపాయలు తాకి ఆల్‌టైమ్ హైని సృష్టించింది. కాగా, అంతర్జాతీయంగానూ ఈ ఏడాది బంగారం, వెండి ధరలు పతనం దిశగానే పయనించాయి.
రూపాయి ఒడిదుడుకులు
దేశీయ రూపాయి మారకం విలువ ఈ ఏడాది మరింతగా పతనమైంది. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ ఈ ఏడాది ఇప్పటిదాకా 3 రూపాయలకుపైగా పడిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో 63.03తో మొదలైన రూపాయి పయనం తీవ్ర ఆటుపోటులకు గురైంది. ప్రస్తుతం 66.20 వద్ద కదలాడుతోంది. అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా చైనా కరెన్సీ యువాన్ విలువ పతనం భారతీయ కరెన్సీ రూపాయిపై పడింది. దేశీయ ఎగుమతులు క్షీణిస్తుండటంతో తగ్గిన విదేశీ మారకద్రవ్య నిల్వలు సైతం రూపాయి పతనానికి దారి తీసింది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడంతో రూపాయికి ఆదరణ కరువైంది. ఫలితంగా రూపాయి విలువ మరింతగా దిగజారింది.
చౌకగా ముడి చమురు
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఈ ఏడాది దారుణంగా పడిపోయాయి. పరిస్థితి ఇలాగే ఉంటే అతి త్వరలోనే బ్యారెల్ ముడి చమురు ధర 20 డాలర్లకు దిగి వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయంటే చమురు ధరల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డిమాండ్‌కు మించి మార్కెట్‌లోకి జరుగుతున్న సరఫరానే దీనికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతుండగా, చమురు ఉత్పాదక దేశాలు ఉత్పత్తిని కొనసాగిస్తుండటం.. ధరల పతనానికి దారితీస్తోంది. అయితే చమురు దిగుమతులపైనే ఆధారపడిన భారత్ వంటి దేశాలకు ధరల క్షీణత కలిసి వస్తుండగా, దేశీయ దిగుమతుల్లో అత్యధికంగా ఉన్న చమురు దిగుమతుల విలువ ఈ ఏడాది గణనీయంగా తగ్గింది. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా దిగిరాగా, ప్రభుత్వ పన్నుల భారంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చేకూరుతున్న ప్రయోజనం వినియోగదారులకు దక్కడం లేదు. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 35 డాలర్ల వద్ద కదలాడుతుండగా, గత ఏడాది ఇది 100 డాలర్లపైనే ఉండటం గమనార్హం.
పప్పు ధరల మోత
పప్పు్ధన్యాల ధరల మోత మోగింది. మునుపెన్నడూ లేనివిధంగా కిలో పప్పు ధర 200 రూపాయలను దాటిపోయింది. ప్రభుత్వం విదేశాల నుంచి సైతం దిగుమతులు చేసుకోవాల్సి రాగా, దేశీయంగా కృత్రిమ కొరతను సృష్టిస్తున్న అక్రమార్కుల నుంచి వేల టన్నుల పప్పు నిల్వలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కందిపప్పు, మినపపప్పు ధరలు కిలో 200 రూపాయలు పలకగా, పెసరపప్పు 150 రూపాయలను తాకింది. శనగపప్పు సైతం 100 రూపాయలు దాటింది. అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో మార్కెట్ డిమాండ్‌కు తగ్గ సరఫరా జరగలేకపోయింది. మరోవైపు ఉల్లిగడ్డ ధరలు కూడా కిలో 100 రూపాయలను తాకాయి.
టమాటా ధర కూడా కిలో 100 రూపాయల దరిదాపుల్లోకి వెళ్లగా, ప్రస్తుతం అదుపులోకి వచ్చాయి. అయితే పప్పు్ధన్యాల ధరలు మాత్రం కాస్త తగ్గుముఖం పట్టాయి అంతే. మరోవైపు ఇంత జరిగినా ద్రవ్యోల్బణం గణాంకాలు ఈ ఏడాది అదుపులోనే ఉండటం గమనార్హం. రిటైల్ ద్రవ్యోల్బణం ఇటీవల కాస్త పెరిగినప్పటికీ, టోకు ద్రవ్యోల్బణం గత ఏడాది నుంచి మైనస్‌లోనే కొనసాగుతోంది. గత ఏడాది వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 4.38 శాతంగా ఉంటే, ఈ ఏడాది నవంబర్‌లో 5.41 శాతంగా ఉంది. అలాగే టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ప్రస్తుతం మైనస్ 1.99 శాతంగా ఉంది.
ఆర్‌బిఐ కోతలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఈ ఏడాది కీలక వడ్డీరేట్లను ఆశించిన దానికంటే అధికంగానే తగ్గించింది. రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను 1.25 శాతం చొప్పు దించింది. ఈ ఏడాది ఆరంభంలో 8 శాతంగా ఉన్న రెపో రేటు.. ఇప్పుడు 6.75 శాతంగా ఉంది.
అలాగే రివర్స్ రెపో రేటు సైతం 7 శాతం నుంచి 5.75 శాతానికి దిగివచ్చింది. నిజానికి గత ఏడాది ఆర్‌బిఐ.. ద్రవ్యోల్బణం అదుపు పేరుతో వడ్డీరేట్ల తగ్గింపు దిశగా వెళ్ళలేదు. అయితే ఈ ఏడాది ఆరంభం నుంచి అటు రిటైల్ ద్రవ్యోల్బణం, ఇటు టోకు ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండటంతో రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను ఆర్‌బిఐ తగ్గించగలిగింది. అయితే బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని రుణ గ్రహీతలకు ఇవ్వకపోవడంపై పారిశ్రామిక, వ్యాపార వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేయగా, దీనిపై ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ సుధీర్ఘకాలం అనంతరం వడ్డీరేట్లు పెంచింది కూడా ఈ సంవత్సరమే.
మ్యాగీ దుమారం
నెస్లే మ్యాగీ నూడుల్స్ వ్యవహారం ఈ ఏడాది ఎఫ్‌ఎమ్‌సిజి రంగాన్ని కుదిపేసింది. మ్యాగీ నూడుల్స్ వాడకం వినియోగదారుల ఆరోగ్యానికి హానికరమని భారతీయ ఆహార, ప్రమాణాల సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ మ్యాగీ నూడుల్స్‌పై నిషేధం విధించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పలు ల్యాబ్‌లలో చేసిన పరీక్షల్లో లెడ్, మోనోగ్లూటమేట్ పరిమాణం మోతాదుకు మించి ఉన్నాయని తేలిందంటూ మ్యాగీ నూడుల్స్ అమ్మకాలను నిలిపేయాలని ఆదేశించింది. దీంతో ఇతర సంస్థల నూడుల్స్ అమ్మకాలపైనా ప్రభావం పడగా, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ నిర్ణయంతో నెస్లే సంస్థకు భారీ నష్టమే వాటిల్లింది. 450 కోట్ల రూపాయల మేర నష్టపోగా, 30,000 టన్నులకుపైగా నూడుల్స్ ప్యాకెట్లను నాశనం చేయాల్సి వచ్చింది.
అంతేగాక పదిహేనేళ్లలో తొలిసారిగా ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నెస్లే 64.40 కోట్ల రూపాయల స్టాండలోన్ నష్టాన్ని నెస్లే ఇండియా నమోదు చేసింది. అయితే వివిధ ల్యాబ్‌లలో చేసిన పరీక్షల్లో మ్యాగీ నూడుల్స్ వాడకం ప్రమాదం కాదని తేలిందంటూ నెస్లే బాంబే హైకోర్టును ఆశ్రయించడంతో మ్యాగీ నూడుల్స్ తిరిగి మార్కెట్‌లోకి వచ్చాయి. దీనిపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని చెప్పినప్పటికీ ప్రస్తుతానికైతే మ్యాగీ అమ్మకాలు కొనసాగుతున్నాయి. మరోవైపు యోగా గురువు బాబా రామ్‌దేవ్ కూడా తమ పతంజలి గ్రూప్ ద్వారా ఇటీవలే ఆటా నూడుల్స్‌ను మార్కెట్‌లోకి తెచ్చారు.
మరికొన్ని..
ఈ ఏడాది మార్కెట్ రెగ్యులేటర్ సెబీలో ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్ (ఎఫ్‌ఎమ్‌సి) విలీనం జరిగింది. అలాగే గూగుల్ సిఇఒగా భారతీయుడైన సుందర్ పిచాయ్ నియమితులయ్యారు. దేశీయ పారిశ్రామిక రంగం ఈ ఏడాది 20 బిలియన్ డాలర్ల విలువైన విలీనాలు, కొనుగోళ్లు, అమ్మకాలను చూసింది. ప్రభుత్వరంగ సంస్థలలో షేర్ల అమ్మకం ద్వారా ఖజనాకు 35,000 కోట్ల రూపాయలకుపైగా ఆదాయం సమకూరింది. వివిధ రంగాల్లోకి కొత్తగా నరేంద్ర మోదీ ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ)కు ఆమోదం తెలిపింది. అలాగే నూతన మొబైల్స్, టూవీలర్లు, కార్లు పరిచయమయ్యాయి. కాగా, హీరో గ్రూప్ వ్యవస్థాపక అధినేత బ్రిజ్‌మోహన్ లాల్ ముంజాల్ నవంబర్‌లో కన్నుమూయగా, చెన్నైలో సంభవించిన భీకర వరదలు ఐటి, బీమా వ్యాపార రంగాలకు తీవ్ర నష్టం కలిగించాయి.