వాసిలి వాకిలి

నేను.. మట్టి పుట్టను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను
మట్టి పుట్టను పుట్ట మనిషిని
మనిషి మనసును మృణ్మయ పాత్రను
మనసు శక్తిని శక్తి పీఠాన్ని.
*
నేను
పుట్టిన నేలనే గిట్టవలసిన వాడిని
మరి, ఈ నేల నాది కాక మరెవరిది
ఈ మట్టి నాది.. ఈ మట్టి వాసన నేను
అవును, మట్టి మనీషిని నేను.
*
అణువులను అల్లుకున్న ఈ నేల
నా కణాలను కప్పుకుంటోంది - జీవకళ కోసం
రత్నాలను దాచుకున్న ఈ నేల
నా శ్వాసను నిలుపుకుంటోంది - ప్రాణకళ కోసం
జలాలను నింపుకున్న ఈ నేల
నా మాటను తలకెత్తుకుంటోంది - ఆత్మకళ కోసం
అవును, సృష్టి క్షాత్రం నా పుడమి
విశ్వనేత్రం నేను.
*
నా ఈ జీవితం విలువ ఆరడుగులు
అగ్ని సంస్కారంతో అర అడుగు
ఆత్మ సంస్కారంతో అందరి అడుగు.
మనీషిగా మనగలిగితే
ప్రతి అడుగు సంస్కార సంతకమే
ప్రతి అడుగు మార్గ దర్శకమే.
అవును, నేలకు నిలువెత్తు సంకేతం నేను
నాకు మట్టి సంతకం ఈ నేల బ్రతుకు.
*
నదులు పారినా, నెర్రెలు విచ్చినా ఈ నేల నాదే
పల్లె తరిగినా నగరం పెరిగినా ఈ మట్టి నాదే
గెలిచినా ఓడినా కడపటి ఆరడుగులు నావే.
లెక్కకు అందీ అందని నా మూల కణం ఈ మట్టిదే
అమ్మ పంచిన అమృతమూ ఈ భూమాతదే
నాన్న పెంచిన మందలింపూ ఈ నేలదే
మనసు పలకరింపూ ఈ భూమిదే
వయసు కదలికా ఈ క్షేత్రానిదే
అవును, ఈ క్షేత్ర క్షాత్రాన్ని నేను
ఈ భూగోళ నేత్రాన్ని నేను.
*
దేహమైనా దేశమైనా ఈ నేలదే
ఎదిగినా ఎగిరినా ఈ నేలనే
ఒదిగినా ఒరిగినా ఈ నేలనే
విరిగినా విరిచినా ఈ నేలనే
గెలిచినా గెలిపించినా ఈ నేలనే
ప్రసవించినా ప్రసరించినా ఈ నేలనే
ప్రభవించినా ప్రబోధించినా ఈ నేలనే.
అవును, నేను అంటే ఈ నేలనే
నేనుంటే ఈ నేలున్నట్టే.
*
ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు
విడివడిన మనసు ముక్కలే కదా?!
రెక్కలు విప్పిన మానవ తాపత్రయాలే కదా!?
భూమి ఒక్కటే.. భూధర్మం ఒక్కటే..
భూమి సంతానంగా మన ధర్మమూ ఒక్కటే.
అవును, మనం ఒక్కటయితేనేగా
ధర్మమూ ఒక్కటే కావటానికి.
మనిషి మనీషి కావటానికి
భూగర్భం నిలబడటానికి
*
నేనూ ఈ మట్టి విశ్వాస ప్రతీకలమే
ఉచ్ఛ్వాసలో ప్రక్షాళన నిశ్వాసలో క్షాళన
తొలిలో ప్రణయం మలిలో ప్రళయం
ప్రణయ ప్రళయ ప్రయాణంలో ప్రణవం
అవును
నా మట్టి ఉచ్ఛ్వసిస్తే ప్రవృత్త ప్రకృతి
నా పుడమి నిశ్వసిస్తే వికృత ప్రకృతి
అవునవును
మట్టి శ్వాసిస్తేనే మనిషి.
*
పుడమి శ్వాసిస్తేనే క్షేత్రం మొలకయ్యేది
క్షేత్రం శ్వాసిస్తేనే మనిషి వృక్షమయ్యేది
అవును,
నేను శ్వాసిస్తేనే వటవృక్షమయ్యేది
నా ఊపిరితిత్తులు శమీపత్రాలయ్యేది
నా గుండె కమండల మయ్యేది
నా నాభి తామరతూడయ్యేది
అవునవును, నేను
ఇహంగా తామరాకు మీది నీటిబొట్టును
పరంగా మథనంలోని అమృతాన్ని.

-విశ్వర్షి 93939 33946