వాసిలి వాకిలి

నేను.. విద్యార్థిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-1-
నేను
విశ్వ విద్యార్థిని
వాయుమండల ఆవాసిని
సప్తర్షులు నా సహఆటగాళ్లు
సప్తమండలాలు మా క్రీడామైదానాలు
తారల తళుకులు మా ఆటల అభిజ్ఞలు
అవును, విశ్వం నా గురువు
జీవ వైవిధ్యం నా ప్రజ్ఞా వైదుష్యం
-2-
నేను
అమ్మ విద్యార్థిని
అమ్మ పాలతో వెచ్చబడిన ఆత్మను
అమ్మ స్పర్శతో ఒదిగిన పేగుబంధాన్ని
అమ్మ లాలనతో అల్లుకున్న అనుబంధాన్ని
అమ్మ పాలనతో పెంచుకున్న పరమ బంధాన్ని
అవును, అమ్మ నా తొలిగురువు
ఇంద్రియాలు నా తోబుట్టువులు.
-3-
నేను
నాన్న విద్యార్థిని
నాన్న చూపు హెచ్చరించిన మనసును
నాన్న జీవితం ప్రసవించిన హేతువును
నాన్న బడి ప్రవచించిన బీజాక్షరాన్ని
నాన్న ఒడి దిద్దించిన అక్షరమాలను
అవును, నాన్న నా మలిగురువు
జ్యోతిర్మండలాలు నా వేదికలు
-4-
నేను
హృదయ విద్యార్థిని
హృదయనాడులు మీటిన మనువును
హృదయం వాకిట మెరిసిన హరివిల్లును
హృదయాన జ్వలించిన శక్తిచాలనను
హృదయాన రూపిల్లిన ప్రేమసదనాన్ని
అవును, హృదయం నా నిత్యగురువు
త్రిలోకాలు నే నడయాడే క్షేత్రాలు
-5-
నేను
తనువు విద్యార్థిని
తనువున తరగని ఆరోగ్య సింధువును
తనువు చిందించిన చెమట బిందువును
తనువుకు కేంద్రమైన కుండలినిని
తనువుగా తరగని తపోధనాన్ని
అవును, తనువు నా భౌతికగురువు
షట్చక్రాలు నా సౌందర్య సాధనాలు
-6-
నేను
మనసు విద్యార్థిని మనోధర్మాన్ని
ముఖమండలాన పురివిప్పిన మెదడును
కోరికకు మొదలును కర్మేంద్రియ పాలనను
మనసుగ పరిమళించిన హృదయ స్పందనను
చూపున భావాన్ని చేతన స్వభావాన్ని
అవును, మనసు నా సమర్థగురువు
మూడు నాడుల అడుగుజాడను నేను
-7-
నేను
వయసు విద్యార్థిని మనోవికాసాన్ని
ఉద్విగ్న హృదయాన్ని ఉపయుక్త కౌమారాన్ని
వయసు మీటిన చాపల్యాన్ని జీవపాత్రను
పసితనాన పసిడి పలుకును పవిత్రతను
పసిమితనాన వయసు మాటను నిర్మలతను
నడిమితనాన నగుమోమును లాలసతను
చివరితనాన ఆత్మపిలుపును పరసీమను
అవును, వయసు నా సమ్మోహన గురువు
పంచకోశాల పథగామిని నేను
-8-
నేను
కాలం విద్యార్థిని అచిర చరిత్రని
కలకాల విద్యార్జనను కలికాల తత్వార్జనను
సురుచిర ఖ్యాతిని అనంత చైతన్య భారతిని
కాలం రచిస్తున్న మహాభారత భారమితిని
కాలభైరవ రహస్యాన్ని మృత్యుంజయ ధర్మాన్ని
అవును, కాలం నా చారిత్రక గురువు
యుగసంధ్యల సంయమనాన్ని నేను
-9-
నేను
ప్రకృతి విద్యార్థిని ప్రకృత ప్రవృత్తిని
ప్రకృతి పలికించిన ఋతురాగాన్ని
వౌనం మోసిన శబ్ద పల్లకీని
అచల వౌనాగ్నిని మానస సంచారాన్ని
యమపాశం సడలించిన మృత్యువును
మృత్యువున పవళించిన భౌతికమూలాన్ని
అవును, ప్రకృతి నా పరమ గురువు
చీకటిని చిదిమిన పాలపుంతను నేను
-10-
నేను
ధరిత్రి విద్యార్థిని పుడమి పలవరింతను
ధరిత్రి విరచించిన పాంచ భౌతికాన్ని
పచ్చదనాన ఒదిగిన ఆశ్రమవాసిని
చక్కటి మైదానాల అలసిన చిక్కటి విద్యార్థిని
చదువులమ్మ మెచ్చిన గురుకుల విద్యార్థిని
ఇంద్రియ విగ్రహాన్ని మనసు నిగ్రహాన్ని
అవును, ధరిత్రి నా యశోగురువు
ప్రవహించే జ్ఞాపక జ్ఞానశోభను నేను
-11-
నేను
అక్షర విద్యార్థిని మిత్ర వ్యాఖ్యానాన్ని
అక్షరం దిద్దిన అనంత రహస్యాన్ని
భాషా యాసల అధ్యయన ఆలయాన్ని
అగణిత తారాగణ గుణింతాన్ని
లఘువుకు గురువును గురు వేదికను
కన్పించని పుటల జ్ఞాన పిపాసిని
అవును, అక్షరం నా అక్షయ గురువు
డిగ్రీల కందని చదువును నేను
-12-
నేను
అంతరంగ విద్యార్థిని ఆత్మప్రదక్షిణను
అంతర్యానం ఆవిష్కరించిన శోధనను
గగనం విసిరిన అనంత అణువును
మట్టిన మెరిసిన మానవ క్రతువును
వసుధకు మెరిసిన మనుజ చరిత్రను
చరిత్రకు అందని ఆత్మ ప్రహేళికను
పరసీమల సశేష జీవన యానాన్ని
అవును, అంతరంగం నా అరూప గురువు
గ్రహగతుల గణిత చేతనను నేను

-విశ్వర్షి 93939 33946