ఉత్తరాయణం

అపోహలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముస్లిం స్ర్తిలు మసీదుల్లో ప్రవేశం గురించి ఇటీవల కొత్తగా వివాదం తలెత్తింది. అంతేకాక ఇటీవల కేరళలోని ఓ మసీదులో స్ర్తిలను అనుమతించడం వంటి వార్త ఆశ్చ ర్యం కలిగించింది. ఇది కొత్త విషయం కాదు. ఎందుకంటే ముస్లిం స్ర్తిలు మసీదుల్లో ప్రవేశించి నమాజు చేసుకోవడం చాలాచోట్ల జరుగుతున్నదే. అంతెందుకు..హాజ్‌కు వెళ్లినప్పుడు పవిత్రమైన మక్కాలోని ప్రసిద్ధి చెందిన మసీదులో స్ర్తిలకు ప్రవేశం ఉంది. అక్కడ పురుషులతోపాటు స్ర్తిలు కూడా ప్రార్థనలు చేసుకుంటారు. మదీనాలోని పవిత్రమైన మసీదులో స్ర్తి-పురుషులు వేర్వేరుగా తమకు నిర్దేశించబడిన స్థలాల్లో ప్రార్థనలు జరుపుకుంటారు. హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా మసీదుల్లో మహిళలకు ప్రత్యేకమైన ఏర్పాట్లుంటాయి. ఇప్పటికే చాలాచోట్ల మహిళలు మసీదుల్లో ప్రత్యేకించబడిన ప్రదేశాల్లో నమాజు చేసుకునే ఏర్పాట్లు చేశారు. దర్గాలలో కూడా తమకు కేటాయించిన స్థలాల్లో కూర్చొని మహిళలు ప్రార్థనలు చేసుకోవడం పరిపాటి.
మసీదుల్లో ప్రవేశించడం పూర్తిగా నిషిద్ధం కాదు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి మహిళలను ఆహ్వానించడం మామూలే. ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినా పురుషులతో పాటు పరదా పద్ధతిని కల్పిస్తూ మహిళలను కూడా పాల్గొనేలా చేయడం ఆనవాయితీ. ఇంకా కొన్ని చోట్ల మసీదుల్లో కేవలం బాలికల చదువులకోసం తరగతులను నిర్వహిస్తుంటారు.
పురుషులు ఎంతదూరాభారమైనా మసీదుకు వెళ్లి ప్రార్థనలు చేసుకుంటారు. ఇంటి పనులలో సతమతమయ్యే మహిళలకు అలా ఐదుసార్లు వెళ్లడానికి సాధ్యమయ్యేనా? అనేకానేక సమస్యలు. అందుకే ఆడవారు ఇంట్లోనే ప్రార్థనలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అంతేతప్ప వారిపట్ల చిన్నచూపుతో కాదు. నిజమైన భక్తి కలిగినవారు ఎలాంటి వివాదాన్ని తలపెట్టరు. మిడిమిడి జ్ఞానంతో ఏదో కొత్తపోకడలతో అనాదిగా వస్తున్న సంప్రదాయాలను కాలరాయడానికి పూనుకున్నవాళ్లే ఇలాంటివి తలపెడతారు.
-పి. షహనాజ్, అనంతపురం

భ్రష్టుపడుతున్న విద్యాలయాలు
భారత్‌లో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసింది విద్యార్థులు బాగా చదువుకోవడానికేనన్నది యదార్థం. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుకోవడానికి విశ్వవిద్యాలయాలకు పంపుతారు. ఎంతో డబ్బు ఖర్చు చేస్తూ తమవారు బాగా చదవాలని కోరుతుంటారు. కాని ఈనా డు కొన్ని విద్యాలయాలు రాజకీయ స్థావరాలుకావడం చాలా విచారించదగ్గ విషయం. రాజకీయపార్టీల నాయకులు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశించి, అక్కడ విద్యార్థులను రెచ్చగొట్టి, ఉద్యమాలకు పురిగొల్పి, విద్యాలయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. ఇది విశ్వవిద్యాలయాల ఉనికికే ప్రమాదకరం. విద్యార్థులను చెడగొట్టే వారిని కఠినంగా శిక్షించాలి.
- జి. శ్రీనివాసులు, అనంతపురం

స్థానికులకు ప్రాధాన్యం
ఐ.పి.ఎల్. ఎంతోమంది క్రీడాభిమానులను అలరిస్తూ ఎంతోమంది నూతన క్రీడాకారులలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీస్తుంది. మంచి బ్యాట్స్‌మెన్, బౌలర్లు, ఫీల్డర్లు వెలుగులోకి వస్తున్నారు. అయితే వీటిని ఇలాకాక వనే్డమ్యాచ్‌లుగా మార్చి ఏ ప్రాంతం టీమ్‌కు ఆ ప్రాంతపు స్థానిక ఆటగాళ్ళకు అవకాశమిచ్చి, మరిన్ని హంగులు కల్పిస్తే క్రీడాకారులకు సరిగ్గా న్యాయం జరుగుతుంది. ఉదాహరణకు ముంబై టీమ్‌లో మహారాష్ట్ర ఆటగాళ్ళు, హైదరాబాద్ టీమ్‌లో తెలుగు ఆటగాళ్ళు ఇలా తీసుకోవాలి. ఐ.పి.ఎల్. మాదిరిగానే ఈ మ్యాచ్‌లనూ ప్రేక్షకులను ఆకర్షించేలా చేయాలి. అప్పుడే భారత టీమ్‌కు ప్రతిభావంతులు వస్తారు.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్

సికిందరాబాద్-తిరుపతి ప్యాసింజర్ నడపాలి
సికిందరాబాద్‌నుంచి తిరుపతికి కర్నూలు మీదుగా రోజూ ఒక ప్యాసింజరు రైలును నడపాలి. తిరుపతికి చాలామంది భక్తులు తిరుమల వెంకన్నస్వామిని దర్శించుకోవడానికి వెళుతుంటారు. అలాగే కడప అమీన్ దర్గాకు సైతం చాలామంది వెళతారు. సామాన్య ప్రజల సౌకర్యార్థం ప్రతి రోజు ఒక ప్యాసింజర్ రైలును నడిపితే చాలా బాగుంటుంది. దక్షిణమధ్య రైల్వే వారు ప్రతిరోజు ఒక ప్యాసింజరు రైలు నడిపితే రైల్వేశాఖకు ఆదాయం రావడంతోపాటు, సామాన్య ప్రజల డబ్బు కూడా ఆదా అవుతుంది.
- షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్