ఉత్తరాయణం

అసలైన స్వాతంత్య్ర దినోత్సవం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వతంత్ర భారతానికి చూస్తుండగానే 70 సంవత్సరాలు గడిచిపోయాయి. ఏటా ఆగస్ట్ 15న జాతీయ జెండాను ఎగురవేసి, స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను జరుపుకోవటం, సమరయోధుల వీరగాధలను స్మరించుకోవడం ఆనవాయితీగా మారింది. ఇదే సందర్భంలో అనేక సంవత్సరాల నుంచి కొంతమందిలో రకరకాల సందేహాలు వుండేవి. ‘నాటి ధీరుల త్యాగం- స్వాతంత్య్ర ఫలం కొంతమంది స్వార్థపరులకు భోజ్యం’ అనే విధంగా నిర్వేదం వ్యక్తపరిచేవారు. ఈ నిర్వేదంలో, అమాయకుల ఆవేదనలో, పేదల ఆక్రందనలో, సగటు జీవుల వైరాగ్యంలో చాలావరకూ వాస్తవం వుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో సర్వస్వం కోల్పోయిన జపాన్, జర్మనీ వంటి దేశాలు త్వరితగతిన- పదేళ్ల కాలంలోనే యథాస్థితికి వచ్చాయి. నేటికీ ఆ దేశాలు సాంకేతిక రంగంలో దూసుకుపోతున్నాయి. రెండు దశాబ్దాల క్రితమే ఆ దేశాలు అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో స్థానం పొందాయి. ఇంకా మనం మాత్రం అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో వున్నామే తప్ప.. ఉన్నత స్థాయికి ఎప్పుడు చేరతామో తెలియని దుస్థితి నెలకొంది.
ఇటీవల మన ప్రధాని నరేంద్ర మోదీ ఉక్కు సంకల్పంతో ఎవరికీ అదరక, బెదరక జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో 370 ఆర్టికల్‌ను రద్దు చేయడంతో నేడు అఖండ భారత్ అనే నినాదానికి సార్థకత చేకూరింది. భారత్‌లోనే మరో దేశంలా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా, ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక సౌకర్యాలు వుండడమేమిటి? ఈ విధంగా ఏటా కశ్మీర్‌లోయలో, జమ్ము కొండల్లో, లద్దాక్ ప్రాంతంలో వందలాది కోట్ల రూపాయలను ప్రభుత్వం కుమ్మరిస్తోంది. కశ్మీర్‌లో కొంతమంది అమాయకత్వంతో, అజ్ఞానంతో పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం, ఇక్కడి రాజకీయ ఆధిపత్యాన్ని అనుభవిస్తున్న నాలుగైదు కుటుంబాలు పరోక్షంగా పాకిస్తాన్‌కు వంతపాడడం వల్ల కశ్మీర్ సమస్య దశాబ్దాల తరబడి రావణకాష్టంలా రాజుకొంటూనే ఉంది. తాజాగా ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని యావత్ ప్రపంచం ప్రశంసిస్తున్నది. పాకిస్తాన్ ఈ విషయాన్ని నేరుగా ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లింది. సమితి పాక్ వాదన తిరస్కరించింది. పక్కనే వున్న చైనా సైతం కనీస స్థాయిలో కూడా పాకిస్తాన్‌కు నైతిక మద్దతు తెలపలేదు. అనేక సందర్భాలలో పాకిస్తాన్ నైజాన్ని వెనకేసుకొచ్చిన అమెరికా కూడా ఈ విషయంలో భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరిగే స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రత్యేక వేడుకలా పరిగణించవలసి వుంది. ఇదే రీతిలో దేశంలో కులవ్యవస్థను, ప్రాంతీయ అసమానత్వాలను, వర్గవైషమ్యాలను, ఆర్థిక వ్యత్యాసాలను నిర్మూలించి సమసమాజస్థాపన నిర్మాణ లక్ష్యాన్ని అందుకున్న రోజు అసలైన స్వాతంత్య్రం సిద్ధించిన రోజుగా భావించవలసి వుంది. రాబోయే నాలుగైదు సంవత్సరాలకు అసలైన స్వాతంత్య్రం దిశగా ఫలితాలు సాధించబోతున్నామనే నమ్మకం ప్రజల్లో కలుగుతున్నది. ప్రధాని మోదీ త్రిపుల్ తలాక్ వ్యవస్థను రద్దుచేయడం ద్వారా ఆ సామాజిక వర్గ మహిళలకు ప్రత్యేక స్వాతంత్య్రం, అసలైన స్వేచ్ఛ, నిజమైన ఆత్మగౌరవం తీసుకొచ్చిన వ్యక్తిగా గుర్తుండిపోతారు. మహిళల గుండెల్లో రాజా రామ్మోహన్‌రాయ్, కందుకూరి వీరేశలింగం లా మోదీ సైతం దురాచారాలను అంతం చేసిన సంస్కర్తలా స్థానం పొందారు. కొన్ని సామాజిక వర్గాలలో ఆర్థిక అసమానత్వ అడ్డుగోడలను తొలగించడానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో నాటి రాజ్యాంగ నిర్మాతలు రిజర్వేషన్ల ప్రక్రియను తీసుకొచ్చారు. అయితే, రిజర్వేషన్ల ద్వారా ఆ వర్గాలలోని కొన్ని కుటుంబాలు మాత్రమే ఫలితాలు పొందుతూ అసలైన పేదలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. అగ్రవర్ణాలలో కూడా ఆర్థిక అసమానత్వం రోజురోజుకూ పెరుగుతున్నదని భావించి, వీరికి కూడా మోదీ 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లు తీసుకువచ్చారు. ఇదే తరహాలో రిజర్వేషన్ల ఫలాలు అందరికీ సమానంగా అందడానికి రొటేషన్ పద్ధతిన క్రీమీలేయర్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయవలసి వుంది. అన్నింటికంటే ముఖ్యంగా సమర్థత, మేధస్సు, సేవాభావం వంటి గుణాలకు కులమతాలతో ముడిపెట్టకూడదు. సమాజంలోని అన్ని వర్గాలు సమాన స్థాయిలో సంతోషించినప్పుడే స్వాతంత్య్ర దినోత్సవానికి సార్థకత చేకూరుతుంది.
-తిప్పినేని రామదాసప్ప నాయుడు 99898 18212

ప్రజాధనం పంచడం భావ్యమా?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 200 యూనిట్ల గృహ వినియోగం ఉచితం అని ప్రకటించడమేగాక, తనవలే విద్యుత్ చార్జీలను తగ్గించే ధైర్యం బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఉందా? అని ప్రశ్నించటం విడ్డూరం. ఇది సొంత ఆస్తులు పంచడం అన్నట్టు భావించరాదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలన్న ఆరాటమే కేజ్రీవాల్‌లో కనిపిస్తోంది. గతంలో ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు, మాజీ మంత్రి మూర్తిరాజు వంటి ఎందరో మహానుభావులు సొంత సంపదను ప్రజానీకం కోసం వెచ్చించినా ఏనాడూ గొప్పలు చెప్పుకోలేదు. నేటి నేతలు ప్రజాధనంతో ఉచిత ప్రచారాలు చేసుకుంటున్నారు. అవినీతి వ్యతిరేకత, సుపరిపాలన వంటి నినాదాలతో రాజకీయాల్లో ప్రవేశించిన కేజ్రీవాల్ వంటివారు- ‘విచక్షణారహిత రాయితీలతోనే అవినీతి, ప్రజల్లో బాధ్యతా రాహిత్యం పెరిగిపోతుంద’ని గ్రహించాలి. వెనుజులా వంటి దేశాల్లో సంక్షోభమే ఇందుకు తాజా ఉదాహరణ. ప్రజల్లో క్రమశిక్షణ పెంచాలి గాని, విచ్చలవిడితనం కాదు. ఏదైనా ఉచితంగానో సమృద్ధిగానో లభిస్తే దాని విలువ సామాన్య జనానికి తెలియదు. వాటి వినియోగం, దుర్వినియోగం కూడ పెరుగుతాయి. ఉచితం అన్న భరోసాతో నిత్యావసరాలు, మందుల వంటి అత్యవసరాలు రాయితీలపై ప్రజానీకానికి అందిస్తే చాలు. పాలకులు ఆదర్శంగా వుంటే గనుక తాయిలాల అవసరం లేకుండానే ప్రజానీకం మద్దతిస్తుందని నవీన్ పట్నాయక్, నితీష్‌కుమార్ వంటి ముఖ్యమంత్రులు నిరూపిస్తున్నారు. ఇక విద్యుత్ విషయానికొస్తే గతంలోవలె పేదలకు 50 యూనిట్ల ఉచిత విద్యుత్ సబబే కాని, 200 యూనిట్లు అంటే ఫ్రిజ్‌లు వంటి గృహోపకరణాలు వాడే వారికి కూడ ఉచితం భావ్యం కాదు. నేటి మన రాజకీయ నేతలు వాటి సొంత ఆస్తులు పంచనవసరం లేదు గాని రాజకీయాల్లోకి రాకముందు ప్రస్తుతం వారివారి కుటుంబ ఆస్తులు సక్రమంగా ప్రకటిస్తే చాలు.
-తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట
అంతరిస్తున్న తెలుగుభాష
ఆంగ్లభాష మోజులో పడి, తెలుగువారు తమ మాతృభాషకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం ఆంగ్లభాషను నేర్చుకోవడంలో ఎలాంటి తప్పులేదు. కానీ తల్లిభాష అయిన తెలుగును నిరాదరణకు గురి చేయడం ఏ విధంగానూ సమంజసం కాదు. నేడు కానె్వంట్ చదువుల పేరిట చిన్నారులను తెలుగుభాషకు తల్లిదండ్రులే దూరం చేస్తున్నారు. కానె్వంట్లలో, కార్పొరేట్ కళాశాలల్లో తెలుగులో మాట్లాడడం నేరంగా భావిస్తున్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో ఎంతటి అభివృద్ధి సాధించినా, తేనెలాంటి తియ్యదనాన్ని అందించే మాతృభాషను విస్మరించడం దారుణం. ప్రభుత్వాలు కూడా తెలుగు భాష పరిరక్షణకు సరైన చర్యలు తీసుకోవడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో అధికార భాషగా ఉన్న మన మాతృభాషకు ఎలాంటి గౌరవం లేదన్నది కాదనలేని నిజం.
అమెరికా వంటి విదేశాల్లో ఉన్న తెలుగువారు తమ మాతృభాష పరిరక్షణ పట్ల ఆసక్తి చూపుతున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్నవారు తల్లిభాషను ఎంతగానో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న తెలుగు భాషను తెలుగు ప్రజలే సంరక్షించుకోవాలి. ఇందులో ప్రభుత్వాలు చేసేది అంతగా ఉండదు. రాబోయే తరాలకు సైతం తెలుగుభాషలోని మాధుర్యం తెలియాలి. ఈ భాష అంతరించిపోకుండా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు దీక్ష వహించాలి. తమిళనాడు, కర్నాటక వంటి రాష్ట్రాల్లో అక్కడి భాషలు, సంస్కృతిని ప్రజలే రక్షించుకుంటున్నారు. మిగతా భాషల ఆధిపత్యాన్ని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరు. అయితే, తెలుగువారిలో ఇలాంటి ధ్యాస లేదు. మాతృభాష పట్ల మమకారం లేనివారుగా తెలుగు ప్రజలు మిగిలిపోతున్నారు. తల్లిభాషను మాట్లాడడం తప్పు కాదని తెలుసుకోవాలి. ఇళ్లలో, పాఠశాలల్లో, కార్యాలయాల్లో తెలుగు భాషలో మాట్లాడేందుకు ఆసక్తిని పెంచుకోవాలి.
-బుగ్గన మధుసూదనరెడ్డి, బేతంచర్ల