ఉత్తరాయణం

ప్రభుత్వం శ్రద్ధచూపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చి దశాబ్దం దాటుతున్నా క్షేత్రంలో అమలు ప్రాథమిక దశలోనే ఉంది. చట్టం లక్ష్యం ఇంకా ఆమడ దూరంలోనే ఉంది. కాగా తాజాగా ఈ చట్టంపై నడుస్తోన్న వ్యాజ్యంలో సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశం.. చట్టం యొక్క అసలు స్ఫూర్తికి, ఆదివాసుల హక్కులకు ఏ మాత్రం మేలుచేసేదిగా లేదు. లక్షలాది గిరిజనుల్ని నిలువనీడ లేనివారిగా చేసేదిగా ఉంది. అటవీ హక్కుల చట్టం రాజ్యాంగ బద్ధతపై కొనే్నళ్లుగా సుప్రీంకోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. కేసును విచారిస్తున్న న్యాయమూర్తుల బెంచీలు మారుతూ వస్తున్నాయి. వారి తాజా తాఖీదు ప్రకారం ఇంకో నాలుగు నెలల్లో అన్ని రాష్ట్రాలూ వారి వారి పరిధిలో అటవీహక్కులకై వినతులు పెట్టి, పెట్టిన దరఖాస్తులు తిరస్కరింపబడినవారిని అక్కడినుండి ఖాళీ చేయించాలి. అలా తిరస్కృతుల్ని ఖాళీ చేయించడంలో ప్రగతిని కోర్టువారికి తెలియజెయ్యాలి. స్థూలంగా చూస్తే అనర్హులని తొలగించడంలో తప్పేమిటి? అనిపించొచ్చు. కానీ వాస్తవంగా చూస్తే అర్హులై ఉండీ అన్యాయం జరిగినోళ్లే ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే అటవీ హక్కుల చట్టం ప్రకారం పక్కాగా అర్హుల్ని గుర్తించడం అన్న ప్రక్రియ లోపరహితంగా జరగడం లేదన్నది ప్రభుత్వమే ఒప్పుకొంటున్న సత్యం. హక్కు కల్పించబడాల్సిన వారు నిరుపేదలు. ఇలాంటి చట్టమొకటి ఉన్నట్టే తెలియనివారు, తెలిసినా దాన్ని సాధించుకునే దారులు తెలియనివారు, రుజువులు, సాక్ష్యాలు, లెక్కాపత్రాలు లేనివారు ఎందరో.. పైగా దేశవ్యాప్తంగా నలభై రెండు లక్షల కేసుల్లో దాదాపు ఇరవై లక్షల వినతులు తిరస్కరింపబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో అరవై ఆరువేలు, తెలంగాణలో ఎనభైవేల తిరస్కరణలు జరిగాయి.
అందులో ఎన్ని అన్యాయంగా తిరస్కరింపబడ్డాయి, ఎన్ని సరైనరీతిలో జరిగాయి అన్నది తేల్చడం కష్టం. ఏది ఏమైనా లక్షలాదిమంది పేదలు ఒకేసారి రోడ్డున పడడం ఖాయం. ఇది సహజ న్యాయానికి విరుద్ధం. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వం పేదల తరఫున సరిగ్గా వాదన వినిపించలేకపోయిందన్నది వినిపిస్తోన్న వాదన. ప్రభుత్వం వెంటనే సమర్థవంతంగా వాదన వినిపించేలా చర్య తీసుకోవాలి. ఈలోగా అటవీ హక్కు చట్టం స్ఫూర్తి దెబ్బతినకుండా, అర్హులకు అన్యాయం జరిగే అవకాశం లేకుండా చర్యలు తీసుకొనే సమయం, వెసులుబాటుకోసం ఆర్డినెన్స్ తీసుకురావాలి. న్యాయస్థానాలైనా, ప్రభుత్వాలైనా గాంధీజీ మాట గుర్తుకుతెచ్చుకోవాలి. అదేమిటంటే- ‘‘ఏదైనా పనిచేసేటప్పుడు సరైనదేనా అని సందేహం వస్తే అత్యంత దీనుడి మొహం గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ పనివల్ల అతడికి కొంచెం మేలు జరుగుతుందనిపించినా అది కరెక్ట్ పనే. అర్హులకు ఎట్టి పరిస్థితిలోనూ అన్యాయం జరగరాదు’’ అన్న కోణంలో చూస్తే చెయ్యాల్సిన కార్యాచరణ బోధపడుతుంది.
- డా. డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం