బిజినెస్

నిజాం డెక్కన్ షుగర్స్ కార్మికులకు జీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫలించిన ఆందోళన
బోధన్, డిసెంబర్ 5: తమకు రావాల్సిన మూడు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని నిజాం డెక్కన్ షుగర్స్ (ఎన్‌డిఎస్‌ఎల్) కార్మికులు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆందోళన బాట పట్టారు. దీంతో ఎట్టకేలకు జీతాల చెల్లింపు విషయంలో యాజమాన్యం దిగివచ్చింది. ఆస్తుల వివరాలు అంచనా వేసేందుకు ఐడిబిఐ బ్యాంకు అధికారులతో ఇక్కడికి వచ్చిన ఎన్‌డిఎస్‌ఎల్ చీఫ్ ఫైనాన్స్ అధికారి విఆర్ చారిని కార్మికులు దిగ్బంధించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమకు యాజమాన్యం నుండి రావాల్సిన మూడు నెలల వేతనాలు చెల్లించిన తర్వాతనే బ్యాంకు వారి లెక్కలు చూడాలని వారు జిఎం చాంబర్ క్రింద బైఠాయించి ఆయనను అడ్డుకున్నారు. తమకివ్వాల్సిన వేతనాలు ఇవ్వకుండా యాజమాన్యం బ్యాంకు అధికారులచే ఇక్కడి ఆస్తుల గురించి అంచనాలు వేయించడం సమంజసం కాదని, ముందు మా సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అయతే తానేమి చేయలేనని సదరు అధికారి సమాధానం చెప్పడంతో ఎవరు చెబుతారో తేల్చాలన్నారు. ఒకానొక సమయంలో సదరు అధికారి పోలీసులకు సమాచారం అందించగా, స్థానిక ఎస్సై గంగాధర్‌రావ్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఎస్సై గంగాధర్ చొరవ చూపి కార్మికులను సముదాయించగా, సమస్య పరిష్కారానికి యాజమాన్యంతో మాట్లాడాలని ఎన్‌డిఎస్‌ఎల్ అధికారికి సూచించారు. దీంతో సదరు అధికారి ఫోన్‌లో యాజమాన్యాన్ని సంప్రదించి కార్మికులు సమ్మె చేసిన కాలానికి సంబంధించిన పదకొండు రోజుల వేతనాన్ని వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్నట్లు ప్రకటించారు. అయతే మూడు నెలల వేతనాలు చెల్లించాలని, అలాగే సీజనల్ కార్మికులను పర్మనెంట్ చేసే విషయమై స్పష్టత నివ్వాలని పట్టుబట్టారు. ఫైనాన్స్ ఆఫీసర్ మరోమారు యాజమాన్యంతో మాట్లాడి మరో నెల రోజులకు సంబంధించిన వేతనాన్ని ఈ నెల పదిహేనవ తారీఖు వరకు కార్మికుల ఖాతాలలో వేసేందుకు బ్యాంకుకు పంపిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు శాంతించి ఆందోళన విరమించారు. మిగిలిన రెండు నెలల వేతనం విషయమై యాజమాన్యంతో సంప్రదించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టం చేయడంతో కార్మికులు చల్లబడ్డారు. ఈ ఆందోళనలో కార్మిక నాయకులు కుమారస్వామి, ఈరవేణి సత్యనారాయణ, రాజారామ్ తదితరులు పాల్గొన్నారు.
(చిత్రం)ఎన్‌డిఎస్‌ఎల్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్‌ను దిగ్బంధించి నిలదీస్తున్న ఫ్యాక్టరీ కార్మికులు