శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

సౌందర్య లక్ష్మితో కూడిన పంపా పుష్కరిణి( కిష్కింధకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరణ్యకాండలో దీన సంరక్షణ అనే ధర్మాన్ని రామచంద్రమూర్తి అనుష్టించి చూపించాడు. కిష్కింధాకాండలో మిత్ర రక్షణ, అనుష్టించి చూపుతున్నాడు. పూర్వకాండలో జటాయువు లాంటి వారికి మోక్షమిచ్చి తన పరాత్పరత్వాన్ని వెల్లడి చేశాడు. ఈ కాండలో ఆయన అసంఖ్యాకమైన కళ్యాణ గుణాలలు చెప్పడం జరుగుతుంది. ప్రథమ కాండలో శరణాగతి మంత్రం అందులోని సీతాకళ్యాణం ద్వారా వివరించబడింది. అరణ్యకాండలో పంచవటీ వాస పర్వంత వృత్తాంతంతో మునిజనులు చేసిన కైంకర్యం చెప్పడం వల్ల ‘నారాయణాయ’ అనే పదంలోని చతుర్థీ విభక్తి అర్థం చెప్పడం జరిగింది. ఖరాది రాక్షసుల వధతో మంత్రంలోని ఉత్తరార్థంలో ‘నమ’ అనే మూడో పదం అర్థాన్ని విశదీకరించి మారీచ దర్శనం మొదలు జీవుడు ఉజ్జీవించే ఉపాయం చెప్పడం జరుగుతుంది. శ్రీరామచంద్రమూర్తి సీతను వెతికాడు అనే కథ వల్ల భగవంతుడు జీవుడిని ఉజ్జీవింప చేసే ఉపాయ చింతన చెప్పడం జరిగింది.
కిష్కింధాకాండలో ఆ జీవుడే దగ్గరకు ఆచార్యుడు పంపించడం జరిగిందని చెప్పబడింది. శ్రీరామచంద్రమూర్తి విలాపం పేరుతో, నిత్య కైంకర్యపరులైన నిత్య శూరులను చూసి, అయ్యో! జీవులందరూ వీరిలాగానే భోగానికి అర్హులై కూడా ఎందుకు కొందరు నన్ను చేర రావడం లేదనే భగవంతుడి క్లేశం ప్రథమ సర్గలో వర్ణించడం జరిగింది. కమలాల, కలువల, మీనాల సమూహంతో మిక్కిలి ప్రకాశించే సౌందర్య లక్ష్మితో కూడిన పంపా పుష్కరిణిని చూసి రామచంద్రమూర్తి తమ్ముడైన లక్ష్మణుడితో తన దుఃఖం చెప్పుకొని ఇలా పలికాడు.
(ఇక్కడ పంపను పుష్కరిణి అని అనడం జరిగింది. అరణ్యకాండలో చెప్పిన దాన్నిబట్టి, ఇది పోల్చుకుంటే, పంప అనేది సరస్సా? నదా? అనే సందేహం కలగవచ్చు. ఏదేమైనా, ఇప్పుడిది ఎక్కడ వుందనేది తెలుసుకోవాలి. దీనికి దగ్గరలోనే కిష్కింధ వుండాలి. పంప నదా? సరస్సా? అనే విషయం రామాయణాన్నిబట్టి పరిష్కరించడం సాధ్యపడకపోవచ్చు. బహుశా అది కొంత భాగం నదనీ, కొంత భాగం సరస్సనీ నిశ్చయించవచ్చు. స్థలం పరిశీలించితేగానీ ఈ ఊహకు బలం చేకూరుతుంది. పంప హంపి కూడా కావచ్చు. ఈ హంపి ఇప్పుడు బళ్లారి దగ్గర హోస్పేట్‌లో వుంది. ఇప్పుడు తుంగభద్ర అని పిలిచే నదినే ఒకప్పుడు పంప అని పిలిచారంటారు కొందరు. తుంగభద్రా నదీ తీరంలో వున్న ఒకానొక శివక్షేత్రంలో వున్న ఈశ్వరుడిని పంపాపతి అని పిలుస్తారు. హంస సందేశంలో శ్రీరామచంద్రమూర్తి తానుండేది మాల్యవంతమనే పర్వతం అని చెప్పాడు. మాల్యవంతం బళ్ళారి దగ్గరలోనే వుంది. ఇది చూసుకుంటూ తూర్పు పర్వతాల వెంట పోతే వేంకటాద్రి కనపడుతుందని హంసతో చెప్పినట్టు కథ వుంది.)
పంపను చూసిన సంతోషంతో శ్రీరామచంద్రమూర్తికి సీతాదేవి జ్ఞాపకానికి వచ్చింది. సీతాదేవి కోసం తానెంత శోకిస్తున్నాడో, వెలవెలబోయి వున్నాడో అనే విషయాన్ని తనలాగే ముఖ చిహ్నాలున్న తమ్ముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు. ‘వికసించిన కమలాలు, ఎర్ర కలువలు, వైడూర్య కాంతి కల నిర్మల జలాలు, ఆ నీటి ఒడ్డున నానా విధాలైన వృక్షాలు కల పంపను చూశావా సౌమిత్రీ? శిఖరాలతో కొండలుండే రీతిగా ఎతె్తైన కొమ్మలతో పంప చుట్టూ వున్న అడవుల్లోని చెట్లు పొగిడే విధంగా వున్నాయి. ఊరి బయట కుటీరంలో ఉపవాసాలు, వ్రతాలు చేస్తూ కృషిస్తున్న భరతుడి కొరకు, సీత రాక్షసుల చేతికి చిక్కి బాధపడుతున్నందుకు, శోకపీడితుడనైన నన్ను వసంతుడు అధిక దుఃఖంలో ముంచాలని చూస్తున్నాడు. దుఃఖించే వాడికి సర్వం అసహ్యంగా కనిపించినట్లే, సీతా భరతులకై ఏడ్చే నాకు కూడా ఈ కొలను విచిత్ర వనంతో చుట్టబడి, తాపం హరించి, దేహకాంతి కలిగించి, చల్లటి నీటితో మిక్కిలి సంతోషంగా ఉంది. పాములతో చుట్టబడి, మృగాలతో పక్షులతో కూడి, కమలాలు, కలువలతో కప్పబడిన కొలను కనబడుతుంది చూశావా లక్ష్మణా? అవే పచ్చిక పట్టులు. నీలం, పసుపు రంగుతో వుండడంతో, వాటి మీద చెట్ల నుండి పూలు రాలడం వల్ల రత్న కంబళాల లాగా వున్నాయి.’
‘దండిగా పూసిన పూలతో వృద్ధి పొందిన కొనకొమ్మలు కల చెట్లను, వికసించిన పూలుకల కొనలున్న తీగెలు ఆపాదమస్తకం కౌగిలించుకున్నాయి. చూశావా? సువాసనతో నిండిన వాడై, సుఖం కలిగించే విధంగా స్పృశించే వాయువు కలవాడై, విజృంభించిన మన్మథుడు కలవాడై, ఫలాలతో, పూలతో మనస్సును ఆకర్షించేవాడై, వసంతుడు ప్రకాశిస్తున్నాడు. మేఘాలు నీళ్లు కురిపిస్తున్నట్లే పూల చెట్లు పూల వర్షం కురిపిస్తున్నాయి. చూడు ఈ సౌభాగ్యం. కఠినమైన రాళ్లలో అడవి చెట్లు పూలు రాల్చాయి. గాలి వీస్తుంటే రాలిన, రాలుతున్న పూలతో కలిసి పిల్లగాలి ఆడుకుంటున్నది. గాలి పూలతో అందమైన కొమ్మలను తాకి, వాటి నుండి వచ్చే ధ్వనితో తుమ్మెదల ఝంకారం పేరుతో పాటలు పాడుతున్నది. కోవెలల మనోజ్ఞమైన పంచమధ్వనితో సంతోషంగా చెట్ల కొమ్మలను ఆడించే విదంగా కొండ గుహ వదిలి బయల్దేరి పాట పాడుతున్న దానిలాగా గాలి కనిపించింది. గాలి రివ్వున వీచడం వల్ల పూచిన కొమ్మలు ఒకదానితో మరొకటి పెనవేసుకొని ఇంపైన పూలదండలాగా చెట్ల సమూహంలో ప్రకాశిస్తున్నది. మందానిలుడు శ్రీగంధంలాగా చల్లగా, మంచి పరిమళాన్ని అన్ని చోట్లా కలిసేట్లు స్పృశించిన వారికి వేడి పోయేట్లు సుఖ స్పర్శుడై చక్కగా విసిరాడు. తేనెల వాసనలు కొట్తున్న అడవుల్లో మదించిన తుమ్మెదల మనోహర ధ్వనుల వల్ల చెట్ల గాలి అతిశయంతో ఆడింది, పాడింది.’
-సశేషం
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12