శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం
‘వాచం హృదయ హారిణీమ్’ ( కిష్కింధకాండ)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
చిలకపాటి విజయ రాఘవాచార్యులు గారి ఉపోద్ఘాతం: శ్రీరామ జయరామ కోదండరామ! కళ్యాణ గుణధామ! సీతారామ! సురవైరిగణభీమ! పట్ట్భారామ! శ్రీరామ జయరామ జయజయ రామ!!
ఇది శ్రీ జ్వాలా నరసింహరాయల వారి మందార మకరంద ‘మందర’ రామాయణానికి అనువచనం. ఇప్పటికే బాల, అయోధ్య, అరణ్య, సుందర కాండలను రుచి చూపించే ‘వాచవి’గా, ‘అనువక్త’గా ‘వాసుదాస’ స్వామివారి ‘మందరా’న్ని అందంగా చక్కని చిక్కని సంభాషణా శైలిలో, సంక్షిప్త సుందరంగా తెలుగువారికి అందించిన మాధుర్యవచో విలసన్మణి ఆయన. ఇప్పుడు కిష్కింధాకాండను మనకు విన్పిస్తున్న ‘కల్యాణమిత్రుడు’. భారతీయులకు శ్రీరామాయణం - భాగవతం పవిత్ర పారాయణ గ్రంథాలు. భారతం ఇతిహాసం. కాలక్షేప గ్రంథం. పురాణ పరిమళం. ఇవి సనాతన ధార్మిక త్రివేణి స్థావరాలు. వాల్మీక, వ్యాసాదులు అనుగ్రహించిన వరాలు. దారి దీపాలు. భారతీయ ఆధ్యాత్మిక ఔన్నత్యానికి దివ్య జ్యోతులు. ఇందులో వాల్మీకి రామాయణాన్ని ‘ఆదికావ్యం’ అంటారు. మహర్షి వాల్మీకిని ‘ఆదికవి’ అంటారు. వారి అనుగ్రహ ప్రసాదమే ఈ వేళ కోట్లాది భారతీయులకు శ్రీరామాయణం ఆజీవ పారాయణమైంది. భారత జాతి సమైక్యతకు మూలకందమైంది. సామాజిక జీవన సౌందర్యానికి ‘కౌముది’ అయింది. అక్షర సంపద గలవారికి ‘శ్రీరామాయణం’ కల్పవృక్షమైంది. జ్ఞానపీఠమైంది.
మహర్షి వాల్మీకి విశ్వ, వాఙ్మయానికి అందించిన సంస్కృత రామాయణం ‘ఆంధ్ర వాల్మీకి రామాయణం’గా, ఆంధ్ర తాత్పర్య విశేషాలతో ‘అపర వాల్మీకి’గా, ‘ఆంధ్ర వాల్మీకి’గా పండిత పామరులచే సంభావించబడిన శ్రీ వైకుంఠ వాసులైన వావిలికొలను సుబ్బారావుగారి చేత ‘మందరం’గా మలచబడి, అశేష ఆంధ్ర లోకంచే సమాదరించబడి, నిత్యపారాయణ గ్రంథంగా ఆరాధించబడుతోంది. ఆ మహా మహానుభావులు సప్తకాండ సంశోభితమైన వాల్మీకంలోని 24వేల శ్లోకాలకు 24వేల పద్యాలతో తెలుగు అనువాదం యథాతథంగా చేశారు. శ్రీరామానుగ్రహ ప్రేరణతో తాము వ్రాసిన 24 వేల పద్యాలకు ‘మందరం’ అనే పేరుతో విశిష్ట విశేష విపుల వ్యాఖ్యానాన్ని అందించారు. మందరం 9 సంపుటాలలో ఆవిష్కరించబడింది. (వారి అవతార సమయం 23.01.1863 నుండి 01.07.1936). తమ 68వ ఏట తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూనే మందరాన్ని ప్రారంభించారు. ‘ఆంధ్ర వాల్మీకి’ రామాయణం 1904లో ప్రారంభించి 1908 నాటికి పూర్తి చేశారు. రోజుకు 24 గంటలు శ్రమించారు. శ్రీవారి ‘మందరా’నికి సంక్షిప్త రూపమే వనం జ్వాలా నరసింహారావుగారి ‘మందర మకరందం!’
* * *
ఇది కిష్కింధాకాండ. శ్రీరామాయణంలో ఏమున్నదో, ఎందుకు చదవాలో వాసుదాస స్వామి వారి పీఠికతో బాటు తనదైన నిరుపమాన శైలిలో జ్వాలాగారు చక్కగా వివరించారు. శాబ్దిక విశేషాలనూ, శ్రీరామావతార వైభవాన్నీ, వైలక్ష్యాన్ని తెలియజేశారు. కావ్య ‘అంతర ధ్వని’ని విగ్గడించారు. ‘అవతారిక’లో అరణ్యకాండను కిష్కింధాకాండతో సందర్భాన్ని సూచిస్తూ అనుసంధించారు. కిష్కింధకాండ ప్రధానంగా ద్వయమంత్రమండలి ‘చరణౌ’ పదానికి వివరణమని పెద్దల నిష్కర్య. ఇది జ్ఞానకాండ. అరణ్యకాండ దీన సంరక్షణమనే ధర్మాన్ని శ్రీరామచంద్రమూర్తి ఏ విధంగా అనుష్ఠించారో వివరిస్తుంది. మిత్రరక్షణమనే ధర్మాన్ని ఆవిష్కరిస్తుంది. శ్రీరామచంద్రమూర్తి అసంఖ్యేయ కల్యాణ గుణాలను చక్కగా వివరిస్తుంది.
సరిగ్గా కాండ ప్రారంభంలోనే మహాద్భుతమైన, తాత్త్విక శబ్ద, ఆర్ద్రసంభరితమైన ‘పంపా’ వర్ణనతో మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. బుద్ధిమతాంవరిష్ఠుడైన ఆంజనేయ స్వామి పరివ్రాజక రూపురేఖా విలాసాలతో దర్శనమిస్తాడు. కొందరు మహానుభావులు కిష్కింధాకాండను ‘హనుమ’కాండ అనవచ్చునంటారు. ఈ కాండలో వర్ణనలు విశేషంగా కన్పిస్తాయి. వర్షఋతు వర్ణనము (28 సర్గ), నాలుగు దిక్కులలో ఉన్న భౌగోళిక ప్రదేశ వర్ణనలు (40-44 సర్గలు), భాషా ప్రియులకు, ఆలోచనామృతాన్ని అందిస్తాయి. శ్రీరామ - సుగ్రీవ మైత్రి, వాలివధ విషయమై ‘్ధర్మ’ చర్చ, సుగ్రీవునికి మొదటి యుద్ధములో వాలి వల్ల పరాభవం, తార ధర్మ, లౌకిక ధర్మ వివరణం, లక్ష్మణస్వామి భ్రాతృ భక్తి - ఇలాంటివెన్నో ధర్మ సముచ్ఛయాలు కిష్కింధాకాండలో గ్రహిస్తాము.
వదినెగారి పట్ల మరిది ఎలా ప్రవర్తించాలో లక్ష్మణస్వామి పలికిన మాటలు మనస్సును ఆర్ద్రం చేస్తాయి. సీతమ్మ గిరిపై పడవేసిన నగల మూటను చూచి, ఇవి మీ వదినెవేమో చూడమన్న రాముల వారితో లక్ష్మణస్వామి అన్న మాటలు.
శ్లో॥ నా హం జానామి కేయూరే నా హం జానామి కుండలే
నూపురేత్వభి జానామి నిత్యం పాదాభివందనాత్॥
సనాతన ధర్మ ప్రతిపాదితమైన భారతీయ సంస్కృతికీ, సంప్రదాయాలకూ ఇది మణిద్వీపం. ‘అన్నా! ఈ కేయూరాలను, కుండలాలను నేను ఎరుగను. కానీ నిత్యమూ మా వదినెమ్మకు పాదాభివందనం చేస్తాను గనుక, ఈ కాలి అందెలు వదినెమ్మవే అని చెప్పగలను.’
ఈ వేళ జాతీయ స్థాయి పరిపాలక శిక్షణ సంస్థలలో సైతం శ్రీరామాయణాన్ని సోదాహరణగా వివిధ సందర్భాలను, సన్నివేశాలను శిక్షణాంకాలుగా స్వీకరిస్తున్నారు. అందులో ప్రధానంగా సున్నితమైన నైపుణ్యాలను శ్రీరామాయణం నుంచే సేకరించి, శిక్షణాంశాలుగా బోధిస్తున్నారు. శ్రీ ఆంజనేయస్వామి వారిని ‘సంభాషణా కౌశలాలు’ అనే శిక్షణాంశానికీ (కమ్యూనికేషన్ స్కిల్స్), శ్రీరామచంద్ర స్వామిని ‘జట్టు కట్టడం’ అనే అంశానికీ, ఇరు వర్గాల మధ్య సయోధ్యకూ, జాంబవంతుని ‘ప్రేరణ’కూ, ధర్మమీమాంస - మానవీయ విలువలకూ ఇలా ఎన్నో. శిక్షణాంశాలకు కిష్కింధా, సుందరకాండలు అద్భుతమైన శిక్షణ సామాగ్రిని అందిస్తున్నాయి.
కిష్కింధాకాండలో ప్రస్తావించబడిన ధర్మ సూక్ష్మాలు ఈనాటి సమాజానికీ ఎంతో ప్రయోజనకరం. వావి వరుసలు, సభ్యతా సంస్కారాలు క్షీణించిపోతున్న కాలంలో చక్కని శైలిలో పామరులకు సైతం హాయిగా చదువుకునేందుకు దీనిని మలిచారు. ఉదాహరణకు వాలిని ఎందుకు చెట్టు చాటున నుండి వధించాల్సి వచ్చిందో శ్రీరామచంద్ర స్వామి వాలికి వివరిస్తాడు.
శ్లో॥ ఔరసీం భగినీం చాపి భార్యాం వాస్యమ జస్యయః
ప్రచరేత నరః కామాత్ తస్య దండో వధఃస్మృతః॥
(ఎవడు కూతురు, చెల్లెలు, తమ్ముని భార్య మొదలైన వారి పట్ల కాముకుడై ప్రవర్తిస్తాడో వానిని వధించడమే సరైన దండన అని ధర్మశాస్త్ర వచనం) వాలి అంగీకరిస్తాడు. క్షమించమంటాడు. అలాగే వాలి తన చరమ దశలో తన ప్రియ పుత్రుడైన అంగదుడితో ఇలా అంటాడు.
శ్లో॥ నచాతి ప్రణయః కార్యః కర్తవ్యో ప్రణయశ్చతే
ఉభయం హి మహాన్ దోషః తస్మాదంతర దృర్ఛవ॥
(నాయనా ఎవ్వరినీ ఎక్కువగా ప్రేమించకు. ఎవ్వరిపైనా ద్వేషం పెంచుకోకు. ప్రేమ ద్వేషం రెండూ పెద్ద దోషాలే! కాబట్టి అంతర్ముఖుడవై జాగ్రత్తగా ప్రవర్తించు)
తప్పు చేసిన వారు చివరకు ఎలా అధోగతి పాలై అప మృత్యువాత పడిపోయారే, మిగిలిన అలాంటి వారు జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఈ విషయమై సుగ్రీవుడితో అన్న మాటగా లక్ష్మణస్వామి చేసిన హెచ్చరిక.
శ్లో॥ నచ సంకుచితః పంధాః యేన వాలీ హతో గతః
సమయే తిష్ఠ సుగ్రీవ మా వాలి వధ మన్వగాః॥
(సుగ్రీవా! మీ అన్న వాలి వెళ్లిన ద్వారం ఇంకా మూత పడలేదు. అన్న మాట నిలుపుకో! మీ అన్న వాలి పోయిన త్రోవనే ప్రయాణం చెయ్యకు!) సీతానే్వషణ కర్తవ్యాన్ని మరచి భోగలాలసుడవై వుండదలిస్తే నీకూ చావు తప్పదని అంతర ధ్వని!)
అనేకానేక ధర్మ మర్మాలను, లౌకిక వ్యవహారాలను, మహా విషయాలను, మహామంత్ర అంతరార్థాలను నింపుకున్న కిష్కింధాకాండ జ్వాలా పాలిట ‘కలకండ’గా మారి మనకు అందిస్తోంది. చాలా కష్టమైన పదాలతో నడిచే కాండ ఇది. వాసుదాస స్వామివారు ‘గోవింద రాజీయ’ వ్యాఖ్యానాన్ని అనుసరించి, దానిని మరింత పరిమళ భరితంగా తెలుగు భాషలో తెలియపరచటం, తొమ్మిది సంపుటాలలో విస్తరించిన విశేష వ్యాఖ్యానాన్ని క్లుప్త సుందరంగా మనకు రుచికరంగా అందించటం జరిగింది. -సశేషం
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690