శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

సీతను దుర్భాషలాడిన రావణుడు, రావణుడిని నిష్ఠూరాలాడిన సీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాసుదాసు వ్యాఖ్యానం
*
అరణ్యకాండ
*
తన భర్త జగత్తులో గొప్పవాడని, మనుష్యులలో ప్రసిద్ధుడని సీతాదేవి చెప్పిన మాటలకు, తన పేరు వింటే దేవతలు, దైత్యులు కూడా గడగడలాడుతారని తన ప్రతిష్ఠను చెప్పుకున్నాడు రావణుడు సీతతో ఇలా. ‘ఎవని పేరు చెప్తే మనుష్యులు మాత్రమే కాకుండా దేవతలు, దైత్యులు కూడా గడగడలాడుతారో, అలాంటి వాడిని రాక్షసుల నాయకుడిని, నా పేరు రావణాసురుడు. నీకు మేలు కలుగుగాక. నిన్ను చూసింది మొదలు నా భార్యల మీద ప్రేమ కలగడం లేదు. నాకు స్ర్తిల కరవు లేదు. ఉత్తమ స్ర్తిల నెందరినో బలాత్కారంగా తెచ్చాను. అట్లా అయితే నువ్వెందుకు అని అడుగుతావేమో? వారందరికీ నువ్వు ప్రభువై వుండు. నా గృహం లవణ సముద్రం మధ్యలో కొండ శిఖరం మీద ఉంది. దాన్ని లంక అంటారు. అక్కడికి వచ్చి నాతో కలిసి ఉండు.’
‘ఆ లంకలో వున్న బంగారు మేడల మీద, నందనవనం లాంటి అందమైన ఉద్యానవనాలలో, అక్కడి తెల్లటి మేడల వరండాలలో, విలాస సంచార యోగ్యమైన ప్రదేశాల్లో, అతిశయంగా, పెంపు-సొంపు రాణించగా వుంటే ఇక్కడి అరణ్యాలు నీకెలా రుచిస్తాయి? నువ్వు నా భార్యవైతివా సమస్త్భారణాలతో అలంకరించబడిన ఐదువేల మంది ఉత్తమ వంశంలో పుట్టిన స్ర్తిలు శ్రద్ధ్భాక్తులతో నిన్ను సేవిస్తారు.’
రావణుడిలా చెప్పగా, అంతవరకూ వాడికి చేస్తున్న ఉపచారాలను వదిలి, సీతాదేవి అమితమైన కోపంతో, రాక్షసులకు ప్రభువైనా రావణుడిని లెక్కచేయకుండా, గట్టి మనస్సుతో జవాబిచ్చింది ఇలా.
‘స్థైర్యం, ధైర్యం కల శ్రీరామచంద్రుడు నా హృదయేశ్వరుడు. నేను రాముడికి అనుకూలమైన వ్రతం కలదాన్ని. రాముడు ఇంద్రుడి లాంటి వాడు. సముద్రం లాగా కలతపెట్ట సాధ్యపడని వాడు. పూజ్యుడైన గుణాలనే చిహ్నంగా కలవాడు. ప్రపంచమంతా తన స్వరూపంతో, గుణంతో, వ్యాపించిన వాడు. గొప్ప తేజస్సు కలవాడు. సత్యమంటే మితం లేని అనురాగం ఉన్నవాడు. అలాంటి రాముడికి నేను అనువ్రతను. నువ్వు దుష్కీర్తితో కూడిన వాడివి. నువ్వు చెడు నక్కలాగా వంచకుడివి. క్షుద్ర జంతువివి. నేను ఆడ సింహాన్ని.. లభించేదాన్ని కాదు. ఇలాంటినన్నా నువ్వు కోరుతున్నావు? సూర్య తేజస్సును పట్టుకోలేనట్లు, నువ్వు నన్ను స్పృశించడమైనా సాధ్యమా? బలవంతంగా నువ్వున్న చోటుకు ఎండ వస్తుందా? ఇలాంటి రామచంద్రుడి భార్యను కోరడం వల్ల నీకు మరణకాలం ఆసన్నమైంది.’
‘అమితమైన ఆకలితో వేగంగా పోతున్న సింహం, పెనుపాము కోరలు తీయడానికి ప్రయత్నించడం, మందర పర్వతం అరచేతిలో బంధించడం ఎలాగో, అలాగే, పురుష శ్రేష్టుడైన శ్రీరామచంద్రమూర్తికి ఆత్మ అయిన ఆయన భార్యను అపహరించడం. రెండూ సమానమే పాపాత్ముడా! కాలకూట విషాన్ని తాగి సుఖం జీవించాలనుకోవడం, సూది కొనలతో కళ్లలో గుచ్చుకోవడం, పెద్ద బండ మెళ్లో వేసుకుని సముద్రాన్ని ఈదడం ఎలా అపాయకరమో, యుద్ధంలో మహాబల పరాక్రమ సంపన్నుడైన శ్రీరాముడి భార్యను కోరడం అలాంటి అపాయకరమే! సూర్యచంద్రులను అరిచేత పట్టుకోవడం ఎలాంటిదో, భయంకర బాణాలు కల శ్రీరాముడి ప్రియురాలైన నన్ను పట్టడం అలాంటిదిగా భావించు.’
‘రాముడే శూరుడా? మగవాడా? నువ్వు శూరుడివి కావా అంటావేమో? సింహానికీ, నక్కకూ; సముద్రానికీ, వీధుల వెంట పారే చిన్న నీటి కాలువకూ; గరుత్మంతుడికీ, చిన్న కాకికీ; ఏనుగుకీ, ఎలుకకీ; నెమలికీ, నీరుకాకికీ; శ్రేష్టమైన సారాయికీ, పుల్లటి కడుగు నీళ్లకీ; శ్రీగంథానికి, బురద నీటికీ ఎంత తారతమ్యం ఉందో శ్రీరామచంద్రుడికీ, నీకూ అంత తారతమ్యం ఉంది. బంగారానికీ, సీసానికీ; రాజహంసకీ, గద్దకూ గల భేదమే సుగుణశ్రేష్టుడైన శ్రీరాముడికీ, మోసగాడివైన నీకూ ఉంది. బంగారు పిడుగుల బాణాలతో ప్రకాశించే విల్లు ధరించే రామచంద్రుడు యుద్ధంలో బ్రహ్మాండంగా పోరాడగలవాడు నాకు రక్షకుడై ఉండగా, ఇది ఆడది - ఏం చేయగలది? అని నువ్వు నీ భుజ బలంతో అపహరించినా, ఈగతో నెయ్యి తాగితే నెయ్యితో సహా ఈగ ఎలా వాంతి పుట్టించి నెయ్యిని జీర్ణం కాకుండా చేస్తుందో, అలాగే నువ్వు నన్ను జీర్ణించుకోలేవు. నువ్వు నీ వాళ్లతో సహా చెడిపోతావు.’
అని గట్టి మనస్సుతో కఠినమైన మాటలు అన్నప్పటికీ భయంతో, భీకరమైన గాలికి వణికే అరటి చెట్టులాగా గడగడ వణికింది. అది చూసి సీతను మరింత భయపెడుతూ, రావణాసురుడు తన కులం, బలం వర్ణించసాగాడు.
-సశేషం

*
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690
*

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12