శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమంతుడితో
తమ వృత్తాంతాన్ని చెప్పిన లక్ష్మణుడు
*
వాసుదాసు వ్యాఖ్యానం
*
కిష్కింధకాండ
*
రామలక్ష్మణులు కార్యార్థమై సుగ్రీవుడిని చూడడానికి, కలవడానికి, స్నేహం చేయడానికి వచ్చారని సంతోషపడ్డ హనుమంతుడు, సుగ్రీవుడిని తలచుకుని, ఇక అతడి పని చక్కబడినట్లే అనీ, ఆయనకు రాజ్యం లభించడం సత్యమే అని అనుకుంటాడు. ఇలాంటి వారు పూనుకుంటే పని జరక్కుండా ఆగుతుందా? అని కూడా అనుకుంటాడు. ఆంజనేయుడు ఈ విధంగా ఆలోచించి, సుగ్రీవుడితో వీళ్లకేం పనుందో? అది ఆతడి వల్ల సాధ్యమవుతుందా? కాదా? తెలుసుకుందా మనుకుంటాడు. రామచంద్రుడిని చూసి ‘అయ్యా! నువ్వు తమ్ముడితో ఈ భయంకర అరణ్యాలలో తిరగడానికి కారణం ఏంటి?’ అని అడిగాడు. వెంటనే, రామచంద్రుడి ఆజ్ఞానుసారం లక్ష్మణుడు శ్రీరామచంద్రుడి చరిత్ర ఆది నుండి ఇలా చెప్పాడు.
‘తేజోవంతుడు, గొప్ప మతిమంతుడు అయిన దశరథ మహారాజు ధర్మం అంటే ప్రేమతో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు వర్ణాల వారిని వారి వారి స్వధర్మం చెడకుండా సర్వదా రక్షించేవాడు. ఆయన ఎవరికీ విరోధి కాకుండా, ఎవరి మీద ఆయనకు విరోధి భావం లేకుండా, రెండవ బ్రహ్మలాగా రక్షించేవాడు. నియమం చెడకుండా అగ్నిష్టోమమ్ లాంటి యజ్ఞాలను దక్షిణలతో సహా నెరవేర్చేవాడు. ఆయన కొడుకుల్లో పెద్దవాడు శ్రీరాముడనే పేరు కలవాడు. పరాక్రమంలో ప్రసిద్ధి కెక్కిన వాడు. సర్వభూతాలను రక్షించే యోగ్యత కలవాడు. తండ్రి మాటను పాటించేవాడు. రాజచిహ్నాలతో కూడిన వాడు. ఆయనే ఈ రామచంద్రుడు. ఈయన రాజ్యాన్ని పోగొట్టుకుని అడవులకు పోవడానికి సిద్ధపడగా నేను కూడా ఆయనకు తోడుగా వచ్చాను. నేను ఒక్కడినే కాకుండా, ఆయన భార్య భూపుత్రి సీతాదేవి కూడా ఆయన వెంట అడవులకు వచ్చింది. ఆమె భార్య కాబట్టి రావడం న్యాయమే. నేనెందుకు వచ్చానంటావా? ఈ మతిమంతుడికి నేను జన్మతః తమ్ముడిని. ఆయన గొప్ప ధర్మబుద్ధికి, సద్గుణ సంపదకు వశపడి దాస్యం చేస్తున్నాను’
‘నా పేరు లక్ష్మణుడు. నా యోగ్యతకు అది తగ్గపేరు. చేసిన మేలు మరువనివాడు, సుఖపడడానికి అర్హుడు, గొప్ప యోగ్యత కలవాడు, ప్రాణికోటిని రక్షించడంలో ఆసక్తి కలవాడు, రాజ్యం లేనివాడు అయిన ఈ రాముడి ప్రియురాలిని, సీతాదేవిని, కామరూపైన రాక్షసుడు ఎవడో అడవుల్లో భయం లేకుండా దొంగిలించాడు. మేం ఆమెను వెతుక్కుంటూ అడవుల్లో తిరుగుతుంటే, ఒకచోట, శాపం వల్ల రాక్షసుడైన ఒకడు, సీతాదేవి జాడ తెలుసుకోవడానికి సుగ్రీవుడనే వానర రాజు సమర్థుడని, అతడి సహాయం తీసుకోమనీ చెప్పాడు. ఇలా చెప్పి అతడు స్వర్గానికి పోయాడు. ఇది వాస్తవంగా జరిగిన విషయం. ఈ కారణాన నాకు, రామచంద్రమూర్తికి సుగ్రీవుడే ఇక దిక్కు వానరేంద్రా! సర్వలోక రక్షకుడై, పూర్వం అనేక దానాలు చేసి, దాత అని పేరెన్నికగన్న రామచంద్రుడు ఇప్పుడు తనకు సూర్యుడి కొడుకు దిక్కని అనుకుంటున్నాడు.’
‘దీన రక్షకుడు, అనేక ధర్మాలను రక్షించిన వాడు దశరథుడు. అలాంటి వాడి కుమారుడు రక్షకుడైన వాడు కీసరాజు శరణుజొచ్చాడు హనుమంతా! లోకాలన్నిటికీ రక్షకుడు, శరణు చోరయోగ్యుడు, నా గురువు అయిన ఈ రామచంద్రమూర్తి సూర్య పుత్రుడు శరణు కోరగా వచ్చాడు. ఎవరి అనుగ్రహం వల్ల ఈ భూలోకంలోని జనులందరికీ సుఖం కలుగుతుందో, అలాంటి ప్రభువు శ్రీరామచంద్రమూర్తి వినయంగా కోతిరాజు అనుగ్రహం కోరుతున్నాడు. సమస్త సద్గుణ సంపత్తితో పూజ్యులైన రాజులు ఎవరితో గౌరవించబడుతున్నారో అలాంటి ఉత్తమ దాత దశరథ నందనుడు, రాముడు అని లోకంలో కీర్తికాంచినవాడు, కోతిరేడు శరణు కోరుతున్నాడు. మంచి కీర్తి సంపాదించిన యితడు శోకవశుడై సుగ్రీవుడి శరణుజొచ్చాడు.’
లక్ష్మణుడు ఇలా చెప్పగానే, రెండు కళ్లల్లో నీళ్లు కాలవల్లాగా కారుతున్న అతడిని చూసి, హనుమంతుడు, ‘ఈ పరాక్రమం, ఈ ఇంద్రియ జయం, ఈ బుద్ధి సంపద, ఇలాంటి సదాచార సంపత్తిగల మిమ్మల్ని తన అదృష్టం కొద్దీ సుగ్రీవుడు చూశాడు. సజ్జన స్తోత్ర పాత్రమైన నడవడి కలవారా! ఇక సుగ్రీవుడి చరిత్ర చెప్తాను వినండి’ అంటూ చెప్పసాగాడు. ‘తన అన్న అయిన వాలి పగపట్టి, బాధపెట్టి, ఊరు వెడలగొట్టి అతడి భార్యను అధర్మ పద్ధతిలో హరించడం వల్ల అడవుల్లో కీడు దశ అనుభవిస్తున్నాడు సుగ్రీవుడు. సీతాదేవిని వెతికే పనిలో మాలాంటి కోతులను రంగంలోకి దింపి మీకు తప్పక సహాయం చేస్తాడు.’
ఇలా చెప్పి సుగ్రీవుడిని చూడడానికి పోదాం రమ్మని రామలక్ష్మణులను అడిగాడు. అప్పుడు లక్ష్మణుడు సంతోషంగా హనుమంతుడిని పొగిడి, రామచంద్రమూర్తితో ‘అన్నా! హనుమంతుడు యధార్థం చెప్తున్నాడు. సుగ్రీవుడికి నీతో పని ఉంది. కాబట్టి సంతోషించు. నీ కార్యం కూడా నెరవేరిందని భావించు. ఇతడు చెప్పింది ఎంతవరకు నిజమని, నమ్మడం ఎలాగని అంటావేమో? మోసగాళ్లలో వుండాల్సిన గుణం ఒక్కటి కూడా ఇతడిలో లేవు. మోసపు మాటలు చెప్తే, ఇంగితంతో వాస్తవ విషయం తెలుసుకోవచ్చు. ముఖంలో వికారం కనిపించలేదు. ఒకవేళ యితడు చెప్పింది అబద్ధమైతే దానివల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. పనైతే అయింది.. లేకపోతే లేదు’
‘ఇప్పుడు మనం వున్న స్థితి కంటే తక్కువ స్థితికి పోము. ఆయన మాట్లాడేటప్పుడు ముఖం ఒక విధంగా ప్రసన్నంగా ఉంది. మాటలేమో సంతోషంగా కార్యసాధకుడిలాగా వున్నాయి. సందేహించడానికి తావు లేకుండా స్పష్టంగా సాధు భావంతో ప్రసంగిస్తున్నాడు. ఈ ఇంగితాల ఆధారంగా యితడు మోసగాడు కాదని నా అభిప్రాయం. కాబట్టి హనుమంతుడు కోరినట్లు మనం సుగ్రీవుడి దగ్గరికి పోదాం’ అని లక్ష్మణుడు చెప్పగా రామచంద్రమూర్తి అలాగే చేద్దామన్నాడు. అప్పుడు ఆంజనేయుడు తన సన్యాసి రూపాన్ని వెంటనే వదిలాడు. తన కోతి రూపాన్ని ధరించి రామలక్ష్మణులను ఇద్దరినీ భుజాల మీద ఎక్కించుకుని, తాను వచ్చిన సుగ్రీవుడి కార్యం నెరవేరింది కదా అనుకుని, సంతోషంగా, నిర్మలమైన మనస్సుతో మహావేగంగా తీసుకుని పోయి, సుగ్రీవుడు తిరుగుతున్న చోట దించాడు.
-సశేషం
*
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12