శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం (అరణ్యకాండ-18)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శస్త్ర సాంగత్య దోష ఇతిహాసాన్ని
శ్రీరాముడికి చెప్పిన సీత
*
వాసుదాసు వ్యాఖ్యానం
*
సీత శ్రీరాముడికి శస్త్ర సాంగత్య దోషాన్ని తెలియచేసే ఇతిహాసాన్ని చెప్తూ ఇలా అంటుంది: ‘ప్రాణేశ్వరా! రామచంద్రా! పూర్వకాలంలో సత్యం, ధర్మం అంటే ఆసక్తిగల ఒక ముని వుండేవాడు. అడవిలోని మృగాలన్నా, పశు పక్ష్యాదులన్నా మిక్కిలి ప్రేమ కలవాడాయన. ఆయన తపస్సుకు విఘ్నం కలిగించడానికి ఒకనాడు ఇంద్రుడు భటుడి వేషంలో వచ్చి, ఒక కత్తిని ఇచ్చి, ఇది నీ దగ్గర ఉంచుకొమ్మని చెప్పి వెళ్లాడు. దాన్ని కాపాడాలన్న ఆసక్తితో ఆ ముని ఎక్కడికి పోయినా ఆ కత్తిని వెంట తీసుకుపోయేవాడు. అలా దానికి అలవాటు పడ్డాడు. కత్తి చేతుల్లో ఉంచుకొని పోవడానికి అలవాటుపడ్డ మునికి దాని మీద ప్రేమ పుట్టుకొచ్చింది. లోగడ కాయలు, కూరలు చేతితో కోసే ముని ఇప్పుడు కత్తితో కోయసాగాడు. అగ్నిహోత్రానికి సమిధలు చేత్తో విరిచేవాడల్లా కత్తితో కొమ్మలు కోయసాగాడు. అడవి మృగాలను కత్తితో తరమసాగాడు. ఆ తరువాత హింసనే ప్రారంభించాడు. ఈ క్రూర వినోదాలకు అలవాటుపడి తాను చేయాల్సిన నిత్యకృత్యాలను ఉపేక్షించాడు. ఆ కారణాన వాడు అధోగతుల పాలయ్యాడు. ఆయుధం చేతిలో వుండడాన ఎంత అనర్థం కలిగిందో చూశారా? ఆయుధం చేతిలో ఉంటే దేన్నైనా కొడ్దామన్న ఆలోచనే కలుగుతుంది.’
‘ఇప్పుడు నేను చెప్పిన ఇతిహాసం నా కల్పితం కాదు. పూర్వకాలంలో జరిగిన చరిత్రే. ఇది శస్త్ర సంయోగం వల్ల కలిగే కీడు గురించి తెలియజేస్తుంది. అగ్నిహోత్రుడు దేనిని (కట్టెలను) ఆశ్రయిస్తాడో, దానే్న దహించి వేస్తాడు. అలాగే శస్త్రం కూడా తనె్నవరు ధరిస్తారో వారికే కీడు చేస్తుంది. ఇదంతా నీకు తెలియదని, నువ్వు అజ్ఞానివనీ, నేను నేర్పడంలేదు. మీరు నాకిచ్చిన చనువు కారణాన, నన్ను సగౌరవంగా చూసి నా మాట మన్నించడం వల్లా, నాకు స్వభావసిద్ధంగా మీమీద స్నేహభావం ఉండడం మూలాన, నేను మీరు మరచిన దానిని జ్ఞప్తికి వచ్చేట్లు చెప్పాను. కాని నీకు తెలియని కొత్త విషయం నేర్పడానికి రాలేదు. కాబట్టి నన్ను క్షమించు. నేనెంత దూరం ఆలోచించినా ఇప్పుడు, ఇక్కడ, మీ ప్రయత్నం నాకిష్టం కావడంలేదు. నువ్వు సుజన శేఖరుడివే. కాని ఏదో ప్రమాదవశాత్తు సుజన కృత్యాన్ని మరచావు. ముని వృత్తిలో వుండే వారికి ఆయుధాలతో పనిలేదు. కాబట్టి ఆయుధాలను మీరు ధరించడం సరైన పని కాదు. ఆపైన మనం బలవంతులం. మనకు ఎవరడ్డమని బలగర్వంతో పగ లేకపోయినా దండకారణ్యంలోని రాక్షసులను చంపడం మరో సరికాని పని. నేనెంతో ఆలోచించా. రాక్షసులైనా నిరపరాధులను దండించడం నాకిష్టం లేదు. నాకు కొంచెమైనా తృప్తి కలగడంలేదు. ప్రాణేశ్వరా! శ్రీరామచంద్రా! అడవుల్లో మునులు తిరగడానికి, శస్త్రాలను ధరించడానికీ ఏం సంబంధం? మునివృత్తి శాంతి ప్రధానం. ఆయుధ ధారణ కౌర్య ప్రధానం. ఒకటి శుద్ధ సాత్త్వికం.. ఇంకొకటి శుద్ధ తామసం. ఇక నీకులోచితమైన క్షత్రియత్వం ఎక్కడ? బ్రాహ్మనోచితమైన తపస్సెక్కడ? రెండింటికీ పొంతన ఎలా కుదుర్తుంది? నువ్వు చేయబోయే ఈ పని పరస్పర విరుద్ధ గుణాలున్నది. నువ్వే ఆలోచించు. కాబట్టి రెండింటిలో ఒకటి వదులు. శస్త్రాన్నైనా వదులు.. క్షాత్రమైనా వదులు.. తపస్సైనా వదులు. అలా కాకుండా ఎందుకు రెంటా చెడాలి?’
‘ఏ దేశంలో మనం వుంటామో, ఆ దేశాల ధర్మం ప్రకారమే మనం నడచుకోవాలి. కాబట్టి ముని మార్గంలో వున్న నువ్వు మునుల పనైన అహింసను అవలంబించడం సరైన కార్యం కదా? శస్త్రాన్ని ధరించడమే జరిగితే, దాన్ని ఉపయోగించాలన్న పాపపు బుద్ధి పుడ్తుంది. కాబట్టి నువ్వు అడవుల్లో వున్నన్నాళ్లు శస్త్రం ధరించవద్దు. నాకులోచిత ధర్మాననుసరించి శస్త్రాన్ని ధరించాలనుకుంటే, అయోధ్యకు నువ్వు మరలిపోయిన తరువాత, మళ్లీ గృహస్థ ధర్మంలో వున్నప్పుడు, ధర్మసంరక్షణార్థం శస్త్రాన్ని ధరించవచ్చు. అనుభవించాల్సిన ఐశ్వర్యం, పాలించాల్సిన భూమి, వదిలిపెట్టి, మునిలాగా అడవుల్లోకి వచ్చిన నువ్వు, మునిలాగానే తపస్సు చేస్తే, రాముడు యదార్థ వాది - నాతో చెప్పినట్లే చేస్తున్నాడని కైక సంతోషిస్తుంది. నా కొడుకు ఎక్కువ శ్రమ పడకుండా సుఖంగా వున్నాడని కౌసల్య సంతోషిస్తుంది. వీరే కాకుండా స్వర్గంలో వున్న నా మామగారు కూడా తన కొడుకు తనను సత్యవాదిని చేస్తున్నాడని సంతోషిస్తారు. కాబట్టి అలాగే చేయి. ధర్మంతో ధనం లభిస్తుంది. ధర్మం వల్ల సుఖం కలుగుతుంది. ధర్మంతో చేసే సత్కర్మలు మంచి ఫలితాలను ఇస్తాయి. ధర్మహీనుడు చేసే సత్కర్మలు ఫలించవు. కాబట్టి, శర్మకరా ప్రపంచం ధర్మమే సారంగా కలది. ధర్మం చెడితే జగమంతా చెడుతుంది. రామచంద్రా! ఈ ఋషీశ్వరుల వెంట హాయిగా నువ్వు ఈ ఆశ్రమానికి, ఆ ఆశ్రమానికి తిరుగుతుంటే సుఖం లేదు. పరలోకంలో సుఖం కావాలనుకునేవారు కఠిన వ్రతాలను, నియమ నిష్ఠలను అనుసరించాలి. మనస్సు జయిస్తే లోకోత్తరమైన ధర్మ ఫలం లభిస్తుంది. కాబట్టి దానికొరకు కృషి చేయి. నీ సౌజన్యం, సాధుత్వం, లోకమంతా గౌరవిస్తాయి. మనస్సు నచ్చిన ప్రకారం నడచుకోకుండా, నిష్కల్మషమైన బుద్ధితో కార్యం సాధించగలవాడివి. ఇలాంటి నీకు మూడు లోకాలలో తెలియందేదీ లేదు. ప్రాణేశ్వరా! నీకు నీతులు చెప్పేటంత దాన్ని కాదు. నువ్వు అడవుల్లో తిరిగినంత కాలం హింసా వ్యాపారం లేకుండా ఉండకూడదా? ఇదే నేను కోరేది. నువ్వు సజ్జన వందితుడవు. హింసారతుడవైతే సజ్జనులు మెచ్చరేమో? రాముడు క్రూరుడు అంటారేమోనని విచారిస్తున్నాను. స్ర్తిలకు స్థిరబుద్ధి లేదు. ఇతిమిత్థమని నిశ్చయించలేరు కాబట్టి నాకు స్వభావ సిద్ధమైన బుద్ధి చపలత వల్ల తోచింది చెప్పా. నీకు ధర్మం చెప్పగల సమర్థులెవరు? కాబట్టి, నువ్వు, నీ తమ్ముడు ఆలోచించి ఏది మేలని తోస్తే అదే చేయండి.’

-సశేషం
*
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా.. 7036558799 - 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12