స్మృతి లయలు
లోపల జర్నలిస్టు.. బయట నోవలిస్టు! - 101
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘కాలగర్భం - ఇవాల్టి ఇంటర్‌నెట్ కన్నా ఫెద్దది, గొప్పది. సన్నివేశాలు, సంఘటనలు ఇవన్నీ అందులోకి ఎన్నైనా వెళ్లిపోతాయి. గానీ వాటిని అక్కణ్నుంచి ఇవతలికి తీసుకురావడం అన్నది బిడ్డని కనడానికి తల్లి పడే ప్రసవ వేదనలాంటిది. అమ్మ కడుపులోంచి ఈ నేల మీద పడుతున్నప్పుడు అమ్మ పడే వేదన లాంటిదే శిశువుకి కూడా కలుగుతుంది. కానీ అదేదో చెప్పలేదా శిశువు.. కాలగర్భంలోంచి తిరిగి ఒక్కొక్క మెట్టూ ఎక్కి వస్తున్నట్లనిపిస్తోందిప్పుడు. ఉత్తరాలే నేడు వెంటాడే జ్ఞాపకాలని తట్టి లేపే అద్భుత సాధనాలు.!
బెజవాడ డైలీలో నిర్విరామంగా పని ఒత్తిడి ఉన్నప్పటికీ నాలోని రచయితకి అది దోహదించిందే.. గానీ అడ్డం పడలేదు. స్కూలు మిత్రులు, కాలేజీ ఫ్రెండ్స్ ‘తొలిమలుపు వీరాజీ’ - తాపీగా, సిస్టమేటిక్‌గా ‘ఆంధ్రపత్రిక వీరాజీ’గా రూపాంతరం చెందడాన్ని గమనించి, హర్షిస్తూనే ఉన్నారు. బెజవాడలో నాడు అరవైలలో ఏర్పడ్డ సాహితీ పరిచయాలు తిరిగి వికసిస్తున్నాయి. చేతికొచ్చిన కట్టలో నుంచి ఒక్క ఉత్తరం ‘యిలా’ లాగినా శిథిల మందిరంలో పదిలంగా ఉన్న ‘స్మృతి’ శిల్పంగా మాట్లాడుతోంది. ఎప్పుడూ ‘‘కార్డు మీద రాయండి’’ అంటూ ఉండే బెజవాడ మిత్రుడు కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ మొదట సైనికుడు. ఆనక బ్యాంకు మేనేజరు, పిదప పేర్గాంచిన అడ్వొకేటు. కానీ, ఎప్పుడూ రేడియో నాటక కర్తగా ‘టాప్’ సృజనాత్మక రచయితగా లబ్దప్రతిష్ఠుడైనవాడే! అతని ఉత్తరం ఒకటి తగిలి వీణతంత్రిలాగా మ్రోగింది. అందులో ఇలా ఉంది.
‘‘మీ ఉత్తరాలు విరామ సమయంలో అప్పుడప్పుడు మళ్లీ, మళ్లీ చదువుతుంటాను. ఉత్తరాల విలువ ఉత్తరాలదే కదా! కొన్ని ఉత్తరాలు డాక్యుమెంటుతో సమంగా ఉంటాయి. (మీ) మొన్నటి ఉత్తరం అలాటిదే. మీ ఆత్మీయత ఒక జలపాతం... ఒక ఝరివేగం... మాటలు జలతరంగిణిల్లాగా ఆహ్లాదంగా ఉంటాయి.’’ అలా కొనసాగే ఈ ఉత్తరంలో ఒక హెచ్చరిక కూడా ఉన్నది. ‘‘ఎప్పుడూ శత్రువులు లేకుండా ఉండండి!’’ అన్నది.
ఎంచుకున్న వృత్తి - ప్రవృత్తీ రెండూ పరస్పర వైరంతో పిల్లీ, ఎలుకా అయిపోతాయనుకున్న చోట కలం మీది సాము కత్తిమీద సాము కాకుండా ఉండాలి అన్న ప్రయత్నం నన్ను మానసికంగా ఎల్లవేళాల ‘బిజీ’గా ఉంచింది. కనబడని ‘ఆంక్షలతో’ పోటీ పత్రికకి రాయకూడదూ అని ఉన్నది. కానీ, ఉన్న పోటీ పత్రికలేవి? నాడు ‘ప్రభ’, ‘జ్యోతి’ కాక మిగతా ప్రముఖ పత్రికలు యువ, జయశ్రీ, జ్యోతి దాకా వార్షిక సంచికల ద్వారా తెనుగు సాహిత్యంలో ‘ఆణిముత్యం’ అన్న నవీన ప్రక్రియ ‘కథ’ లేక ‘కథానిక’ను పెంచి పోషిస్తున్నవే! విశాలాంధ్ర వీకెండ్ సారస్వతానుబంధి (నాటి విశాలాంధ్ర సుమా) ఒక నిత్య నూతన రచయితలకు వేదిక అయిన దానికి ఒకప్పుడు, ‘కలం చిందులు’ అన్న పొయిట్రీ కాలమ్ రాసిన నేను, ఇప్పుడు రాయలేకపోతున్నాను.
మార్క్సిస్టు పెద్దలంతా అటు చుట్టుగుంట, చంద్రం బిల్డింగ్‌లోకి ఇటు జైహింద్ టాకీస్ పక్క బిల్డింగ్ ప్రజాశక్తి పత్రికకి విడిపోయినా అందరూ మీటింగ్‌లలో ఫంక్షన్స్‌లో దర్శనం ఇస్తూనే ఉన్నారు. నా చేతిలో సినిమా పేజీ ఉండటం చేత శంకరయ్య, సుబ్బయ్య, చినరామప్ప, మల్లిక్, శ్రీకాంత్‌ల దాకా ఈ తరం అభ్యుదయ వీరులు అందరూ నాకు కలగాపులగం అయ్యేవారు.
గాంధీనగర్ న్యూఇండియా హోటల్ అటుపక్క తాజ్‌మహల్ హోటల్ అన్న పేరున్న చిన్న హోటల్, ఇటుపక్క మధ్యలో స్టేట్ గవర్నమెంట్ సమాచారాధికారి భండారు పర్వతాలరావు, కేంద్ర సమాచార అధికారి (పి.ఐ.బి) రెడ్డి గారు ఉండటం చేత జర్నలిస్టు మిత్రులకి ఒక సమాగమ కేంద్రం అన్నట్లు ఏర్పడిపోయింది.
‘ప్రెస్ క్లబ్’ లాంటిది లేదు అప్పుడు. ఐతే యువకుడు ఉత్సాహవంతుడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అంబటి ఆంజనేయులు ఆది నుంచీ ఆలిండియా వర్కింగ్ జర్నలిస్టుల నాయకుడయ్యే దాకా కూడా అయినా కాకుండా నాకు అత్యంత సన్నిహితుడు, ఆత్మీయుడు అయినాడు. వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఒకటి ఉంది గానీ ‘‘ప్రెస్ క్లబ్’’ లాంటిది, ఎక్కడా? అని వెదికాం.
ఈ విషయంలో మా పి.ఎస్.ఆర్.గారు మద్రాసులో ఆయనకి ‘యూనియన్’లో బాగా అనుభవం అవగతం ఉండటం చేత ప్రెస్ క్లబ్ మీద ‘ఆరా’ తీశాం. ఎక్స్‌ప్రెస్ కరస్పాండెంట్ గంటి మహదేవన్‌గారు (మా అమ్మకి బంధువట కూడా. ‘జున్నుపంతులు’ అతని నిక్‌నేమ్) హిందూ కరస్పాండెంట్ ఐ.ఆర్.కె. శాస్ర్తీగారు మెయిల్ రామారావు లేదా డక్కన్ క్రానికల్ రామారావుగా వాసికెక్కిన రామారావుగారు పి.టి.ఐ. మ్యానేజర్ కమ్ విలేకరి శ్రీనివాసన్‌ల ‘జూబీ సంస్థ’గా (ఇది మా ప్రకాశరావుగారి మాలు) ఉన్నది ప్రెస్‌క్లబ్. దీన్ని తీసి జాతీయం చేయాలనుకున్న ప్రయత్నంలో, మా పొట్లూరు వేంకట్రావు, పుల్లయ్య, బాలకృష్ణ, ఉపేంద్రబాబు, తూర్లపాటి, ఇంకా విశాలాంధ్ర మిత్రలు, ప్రభృతులు అందరూ స్పీడ్ వర్క్ చేశారు.
కాలక్రమంలో గాంధీనగర్ దుర్గా కళామందిరం (సినిమా హాలు) వెనుక పక్క కాల్వగట్టుకి శోభాయమానంగా ‘ప్రెస్‌క్లబ్’ దానికి పక్కనే ‘కోరాపార్కు’ లాంటి ల్యాండ్‌మార్క్స్ ఏర్పడ్డాయి. చిన్న సెలయేల్లే పెద్ద జీవ నదీ స్రవంతులవుతాయి. అన్నట్లు బెజవాడ పత్రికా రచయితల ఉద్యమానికి సహజసిద్ధమైన కేంద్రం అయింది. ఆ కూడలి ఆ భవనం. అదంతా, ఒక చరిత్రాత్మక గాథ అనిపిస్తుంది. తల్చుకుంటుంటే!
పోతుకూచి సాంబశివరావుగారి ‘నవ్య సాహితీ సమితి’ కాలనాథభట్ట వీరభద్రశాస్ర్తీ, పెద్దిబొట్ల సుబ్బరామయ్య, బందరు సాహితీ మిత్రుల పూనికతో, బెజవాడలో (బ్రాంచి)గా రూపుదిద్దుకుంది.
1967 జనవరిలో కృష్ణాజిల్లా రచయితల మహాసభలు మొట్టమొదటిసారి జేగీయమానంగా నిర్వహించగలిగారు. ఆంధ్ర సచిత్ర వారపత్రికకి మణిపూసల్లాంటి కథలందించిన ఆ తరం వీరులు ఎందరో ఉన్నారు. విహారి, ఆదివిష్ణు హవిస్, అక్కల సరస్వతి, వేములపల్లి శోభనాదేవి, చంద్రవౌళి, ఉమారాజేశ్వర్రావు, నిడమర్తి, హరికిషన్, ఓరుగంటి రామకృష్ణప్రసాద్, ఇలా ఎందరో మహారథులు నడుం బిగించారు.
ఈ మహాసభలలో వీరాజీని ఆంధ్రపత్రిక వీక్లీ, డైలీలకు చెందినవాడుగా కాక, ఒక రచయితగా పెద్దపీట వేసి గౌరవించారు. నండూరి రామమోహనరావు, మావాడు, కె.రామచంద్రమూర్తిల సంపాదకత్వంలో ఒక మంచి ‘స్మారక సంబర సంచికను’ తీసుకు వచ్చారు. కాశీనాథుని నాగేశ్వరరావు, ముట్నూరు కృష్ణారావు, రామస్వామి చౌధురి, కాటరు వేంకటేశ్వరరావు, అంతకుముందే చెప్పాల్సిన మహనీయులు వేలూరి శివరామశాస్ర్తీ, విశ్వనాథ సత్యన్నారాయణ, తాతాజీ, మల్లాది రామకృష్ణశాస్ర్తీ, జలసూత్రం, పైడిపాటి సుబ్బరామశాస్ర్తీ, ప్రభృతులు ఈ ప్రాంతం పేరునీ, ప్రతిభనీ శాశ్వతం చేశారు. ఇవన్నీ ఇన్వాల్వ్ చేశారు.
మా ‘‘లత’’గారు సభాముఖంగా అంటూండేది. ‘‘విశ్వనాథ సత్యన్నారాయణగారి దగ్గర్నుంచీ వీరాజీ దాకా తెలుగు నవలలను పరిపుష్టం చేసింది మేమేనయ్యా!’’ అంటూ గుంటూరులో ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల (మహిళామణుల) మహాసభలలో ఉద్ఘాటించింది.
వర్కింగ్ జర్నలిస్టు అంటే ‘‘రచయిత ప్లస్ సమ్‌థింగ్’’ అన్న సంగతి నాకు అవగతం అయిపోయింది. ఆగని వేగమే కాలం. దాన్ని వెంటాడాలి జర్నలిస్ట్. రచయిత అంటే తన ఉపజ్ఞతతో దార్శినిక దృష్టితో పాత్రలను తయారుచేసి నన్నయ్యగారు అన్నట్లు జగద్ధితంగా రాణింపజేసేవాడు, తాపీ, తరుణం రెండూ ఉంచుకోవలసినవాడు. కాల్పినిక సాహితీ కర్త, రచయిత ఇద్దరూ నాలో ద్విపాత్రాభినయం చేయడానికి చాలినంత మనోవికాసం కావాలి’’ అని గ్రహించాను.
విడీవిడని చిక్కులు, ప్రేమకు పగ్గాలు, తొలిమలుపు పేరుకు సానబట్టాయి. సాహితీ దిగ్గంతులైన విమర్శకాగ్రేసరులు నా నవలల్ని గీటురాయి మీద వేసి గీసి ఓ.కే. చేయడంతో అటు రచయితగా నా బాధ్యత పెరిగింది. నిభాయించాల్సిందే.
ఈ రచయితల సమారోహంలో ‘జరుక్‌శాస్ర్తీగారు’ (ప్యారడీ కింగ్) ప్రాచీన కవిత్వం మీద, రెంటాలగారు, ఇంకా తుమ్మలగారూ ప్రసంగించాలన్నారు. బ్రహ్మాండంగా ఉంది. దానికి ఊతంగా పత్రికా విమర్శ మీద నాగుళ్లగూరు ప్రసాదరావుగారు ప్రసంగించాలి. బాగుంది. గానీ, తెలుగు నవల మొత్తాన్ని మూడు భాగాలు చేశారు. ఒక భాగం ‘నేటి తెలుగు నవల’ మీద నివేదిక, ప్రసంగం (పేపర్ సబ్‌మిషన్) బాధ్యత నాకు అప్పగించారు. ఇద్దరు రామ్మోహనరావుల మధ్య లేగదూడని నేను. ఆ ఇద్దరూ నండూరి, మహీధరగార్లు. వాళ్ల పేర్లు చెబితేనే చాలు వేరే పరిచయం అక్కరలేదు. చిత్రం ఏమిటీ అంటే, ఈ పెద్దలిద్దరితోనూ నాకు భావోద్వేగ అనుబంధం ఉంది. అదే సంతోషం!
మహీధర వారు నా ‘లిటరరీ మెంటార్’ అని, నేనే కాదు. బెజవాడ సాహితీ సమకాలీకులందరూ ఎరుగుదురు. పత్రికలో నండూరి వారి తర్వాత నేను ప్రవేశించాను. రాధాకృష్ణగారు చాలా సందర్భాలలో రామ్మోహనరావుగారి ‘రిఫరెన్స్’ తెచ్చి నన్ను పోల్చి మాట్లాడేవారు.
పొలిటికల్ నవలకు ఆయనా అనువాద నవలకి ఈయన చరిత్ర రాస్తున్నారప్పుడు. సబబుగా ఉన్నది.
ఆ టైమ్‌లో ఎమెస్కోబాస్, అమృత హృదయుడు, ఎమ్.ఎన్.రావుగారు, ‘‘సుఖం కోసం’’ నవలని మార్కెట్‌లోకి పాకెట్ బుక్స్ ఉద్యమంలో ఒక బావుటాలాగా ఎగరేస్తున్నాం అంటూ ఉత్తరం రాశారు. అప్పటికేనా విడీవిడని చిక్కులు పత్రిక సీరియల్‌ని రావుగారు, ఇంటింటి గ్రంథాలయ పథకంలో చేర్చారు. తర్వాత ఎన్నో పరిస్థితులు తరుముకొచ్చాయి. ఆనందవాణి మీదుగా ఆంధ్రపత్రిక కొలువులో చేరాను. కానీ ఈ ‘సుఖం’ అన్న కథ థీము నన్ను వెంటాడింది. మద్రాసు లొకేల్‌గా దీన్ని నవల చెయ్యాలనుకున్నాను. ఎక్స్‌ప్లోయిటేషన్ ‘‘్ధనస్వామిక వర్గం’’లో ఎలా ఉంటుందీ? ప్రోలిటరేట్ పేద వర్గాలు మోసపోడం - విశ్వాసంతో కరిగిపోడం - ఎలా ఉంటుందీ? అంటూ పెద్దలు సీనియర్‌గారు, బలరామ్మూర్తిగారు, నిడమర్తి, పరకాల ప్రభృతులు చాలా ‘చర్చ’ చేశారు. కానీ, నాకు తెలిసిందీ, కావల్సిందీ - పుష్టిగల పాత్రలు. ఆ థీము అట్లా గుడి లోపలి విత్తనం లాగ మొక్క అయింది. మొక్క చెట్టు ఉండగానే దీన్ని రావుగారి పాకెట్‌బుక్ సిరీస్‌కి అందించే టైము వచ్చింది. ఎమ్.ఎన్.రావుగారు ‘బాపు’కి ముఖచిత్ర రచనకు పంపించాలి - పంపమంటూ - పదిహేను వందల కాపీల మీద రాయల్టీకి గాను - అగ్రిమెంట్, దానితో ఐదొందల కాపీలకు అడ్వాన్స్ చెక్కు పంపించారు.
‘సుఖం కోసం’ అన్న శీర్షిక ఎక్కువ మందికి నచ్చింది. ‘ప్రేమ కోసం’ అంటూ అంతకుముందు నేను నవల రాశాను. తొలిమలుపు (విద్యార్థి జీవితం)కు సీక్వెవ్‌గా - కానీ కొందరికి ఆ పేరు నచ్చలేదు. ‘‘పగా - ప్రేమ’’ అంతా బాగు’’ అన్నారు. ‘‘ఓకే’’ అన్నాను. తొలిమలుపుకు రెండో ఎడిషన్‌తో పాటు, దీన్ని కూడా విశాలాంధ్ర వారు వేశారు. కానీ, ఈసారి ‘సుఖం కోసం’ అన్న టైటిల్ నవలలోని అక్షరం అక్షరం ప్రతీ పాత్రకీ సూటైంది అన్నారు. ‘‘్ధన్యోస్మి’’ అనుకున్నాను.
దీని మీద కేంద్ర సెన్సారు బోర్డు ఆఫీసరు శ్రీ డి. రామలింగం గారు దాశరథిగారి ద్వారా ప్రేమకు పగ్గాలు నవల చదివినవారు ఆయన. ఆ నవలంటే చాలా ‘‘మోజు’’ పడిపోయినవారు - ఆయన యిలా లెటర్ రాశారు - ఎమెస్కో సిరీస్‌గా వచ్చిన మీ నవల సుఖం కోసం, కొమ్మూరి హవుస్ సర్జన్, నాకు విశిష్టమైనవిగా కనిపించాయి... అయితే, మీ నవల ‘కానె్సప్షన్’, కథని ‘నిర్మించుకు’ని పోయిన తీరు, పాత్రలకు మీరిచ్చిన ‘‘ట్రీట్‌మెంట్’’, స్ర్తి పాత్రల నిర్మాణంలో మీరు చూపించిన ‘సహజత్వం’ వీటన్నింటిలో నాకు ఒక ప్రత్యేకత గోచరించింది. మొన్న ‘‘బాపూ’’తో మాట్లాడుతూ మీ, రుూ ‘‘నవల’’ గురించి ఏమిటేమిటో చెప్పాను. ఆయన ఒక చక్కని ‘చిత్రం’ వేశారు.’’ అంటూ రాస్తూ, మురిసిపోయిన రామలింగంగారి ‘‘అస్సెస్‌మెంట్ ’’ కరెక్ట్ అయింది. దీని అట్ట మీద థీమ్‌తో టైటిల్ వేయడమే కాక ‘‘స్వామి భృత్యుల కథనం’’ అంటూ వ్యాఖ్య కూడా రాశాడు ‘‘బాపు’’గారు. ఇక నా ‘సుఖం కోసం’ మీద - నా స్మృతిలయలకు ఒక ‘కామా’ పెడతానిక్కడే. ఆనక సందర్భం వస్తుంది కనుక...
రామలింగం గారు ఎంత సాహితీ ప్రియడూ అంటే శంభుప్రసాద్‌గారితో కూడా సాహిత్య గోష్ఠిలో తరచూ పాల్గొనేవారు. ‘కావ్యప్రియ’ అన్న కలం పేరు ఆయనది. గవర్నమెంట్ ఆఫీసర్ కనుక అసలు పేరు దాచి, రాసేవారు.
‘‘నేనే ప్రేమకు పగ్గాలుకి స్క్రిప్టు రాసి మీ చేత (నా చేత) డైలాగులు రాయించి శతదినోత్సవ చిత్రం తియ్యాలని ఉందంటూ’’ మురిసిపోయారు.
దాశరథిగారు లెటర్ రాస్తూ ‘‘మీరు ముందుగా ‘ప్రేమకు పగ్గాలు’ నవలను రేడియో నాటకంగా రాయండి’’ ఆదేశపూర్వకంగా రాశారు. అప్పుడాయన మద్రాసు కేంద్రం, ఆకాశవాణిలో ఉన్నారు. ‘‘మీరు విజయవాడ వెళ్లిపోయారు కనుక విజయవాడ రేడియో జోన్‌లోకి వస్తారు. ఐనా, మీరు ముందు నాటకం రాయండి. అదంతా నేను చూసుకుంటాను. ఆకాశవాణిలో ప్రసారం చేస్తాము’’ అని స్పష్టంగా రాశారు.
దానికి ముందు ‘‘ప్రేమకు పగ్గాలు’’ నవలలోని కథని ఇంగ్లీషులో గానీ, తెలుగులో గానీ సంక్షిప్తంగా ‘‘సినాప్సిస్’’గా రాసి పంపించండి అని కూడా నొక్కి రాశారు వాత్సల్యమూర్తి దాశరథిగారు.
అప్పుడే కృష్ణాజిల్లా రచయితల మహాసభ కోసం అరవై పేజీల ఆధునిక నవలల మీద థీసిస్ రాస్తున్న నాకు ఈ శ్రవ్య నాటకం కోసం సినాప్సిస్ రాసి పంపటం కష్టమా? అంటే ‘బుద్ధిః కర్మానుసారిణి’ అంటారు పెద్దలు. అలా నేను అప్పుడు ఆ సినాప్సిస్‌ను పంపనే లేదు అనుకుంటున్నాను.
(ఇంకా బోలెడుంది)