స్మృతి లయలు
పీక మీద కత్తి ‘డైలీ రొటీను’!-96
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఎంతో కాలంగా అంధు కోసం ఉవ్విళ్లూరుతూ ఎదురుచూస్తున్న విజయవాడ నుంచి పత్రిక ప్రచురణ ఎట్టకేలకు సాధ్యమైంది. గాంధీనగరం ఐదు రోడ్ల కూడలి ‘ఆంధ్రపత్రిక సెంటర్’ అయింది. జనవరి 24, ఆదివారం తేదీ గల సంచికని శనివారం చేయడంతో కేంద్ర కార్మిక మంత్రిగా వెళ్లిన సంజీవయ్యగారు సందేశంలో (తన) పేర్కొన్నట్లు ‘‘ఆంధ్రుల ఆదిపత్రిక అభిమాన పత్రిక - కృష్ణా తీరం నుంచి కూడా ప్రచురణయైంది. ‘‘ఒక వెలితి తీరింది.’’
సరిగ్గా వారం రోజుల ముందు, నేనీ చారిత్రాత్మకమైన దినం కోసం ఎదుచూస్తూ, ఆంధ్ర పత్రిక కార్యాలయంలో అడుగుపెట్టాను. ఈ శనివారం ‘ప్రెస్’లోకి అడుగుపెట్టి పేజీలు కట్టే ‘ట్రాలీ’ని లాగుకుంటూ సరదాగా వర్కర్లని పలుకరిస్తున్నాను. మరి శనివారం నాటికి విజయవాడ ఎడిషన్ ప్రింటుకు రెడీ చేస్తూ, అయ్యవారి సమక్షంలో సీనియర్స్ అందరిలోకీ సీనియర్ పోలవరపు శ్రీరాములుగారు, (పి.యస్. ప్రకాశరావు ప్రభృతుల సరసన) పనిలో నిమగ్నుడినయ్యాను. అదో థ్రిల్లింగ్ ‘టైమ్’
ముందు సోమవారమే మద్రాసు నుంచి, శ్రీరాములుగారొస్తూనే నవ్వుతూ, భుజం మీద చెయ్యివేసి, ఇలా లాక్కుంటూ ‘‘గేరు మారిందా?’’ అంటూ పలుకరించారు. ‘‘ప్రెస్‌లోకి పోయి ఫస్ట్ పేజీ ‘డమీ’ వేసి, తీసుకుని రండి, పోండి’’ అంటూ నన్ను పంపించివేసి - అటు ప్రకాశరావుగారి వేపు తిరిగి, చర్చలో మునిగిపోయారు.
దినపత్రిక అంటే పేజీకి ఈ కొస నుంచి ఆ కొసకి, ఎనిమిది కాలమ్స్ వెడల్పునా, పెద్ద అక్షరాలలో (72 లేదా 86 లేదా 92 పాయింట్ ఫాంట్స్‌లో) హెడ్డింగ్‌ని పడుకోబెట్టాల్సిందే. అటుతర్వాత మిగతా సైజు అక్షరాలలో వార్తలోని వివరాలను లైనుగా చేర్చాలి. దానే్న ‘బ్యానర్’ అంటారు. సాయంకాలం బయటికి వెళ్లే సంచికని ‘డాక్ ఎడిషన్’ అంటాం. నేను సరదాకి ‘‘బ్యానర్’’కి బదులు ఇటు నాలుగు కాలమ్స్‌కి హెడ్డింగ్ అనక మూడు కాలమ్స్ ‘‘బొమ్మ’’ మిగిలిన రెండు కాలమ్స్‌కీ రెండు లైన్ల హెడ్డింగ్ బొమ్మ కింద ‘‘అమరావతి రైతులకు సాగర్ జలాలు’’ అంటూ ఓ వార్త రాశాను. చాలా బాగా జ్ఞాపకం ఉందా రోజు... పెద్దలు ఇష్టపడరు అని తెలుసు.
అప్పుడు పత్రికకి 12 పేజీలు, వెల పదమూడు పైసలు. పేజీకి ఎడమపక్క కింద డమీ ‘పాకెట్ కార్టూను’ పెట్టా. కుడి చివర బాక్స్ ఐటమ్.
పేజీ ప్రూఫ్ తీయించి పైన ఇన్ఛార్జ్ రూములో ఉన్న శ్రీరాములుగారికి, ప్రకాశరావుగారికి తెచ్చి చూపించాను.
కుర్రవాణ్నే కదా సరదా ఉండదా?
హైదరాబాద్‌కి ఇంకా మద్రాసు నుంచి విమాన సర్వీసు లేదు. రాత్రి 9 గంటలకి విజయవాడ నుంచీ - హైదరాబాద్ ఎడిషన్ ఇక్కడ చెయ్యాలి. ఉదయం సిటీకి దగ్గరగా ఉన్న ఊళ్లకి మార్నింగ్ ఎడిషన్. అదే రాత్రి రెండు గంటలకి ప్రింటింగ్ మెషిన్ ఎక్కిపోవాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు పని పంపిణీశాఖ లేదా సర్క్యులేషన్ డిపార్ట్‌మెంట్‌ది. ఈ కథ అంతా నత్తనడక. టపా మీదా, పొట్టి టెలిగ్రాముల మీదా పి.టి.ఐ సంస్థ, టెలిప్రింటర్ మీదా ఆధారపడి ఉంటుంది.
‘ఆన్లైన్’ లేదు ఆ రోజుల్లో. అంతా ‘‘ల్యాండ్ లైన్’’. మద్రాసు, విజయవాడల మధ్య ఎలక్ట్రిక్ రైలు దాకా ఎందుకూ, ఇంకా డీజిల్ ఇంజనే్ల రాలేదు. కాకపోతే విజయవాడ నుంచి గ్రామీణ ప్రాంతాలకు బస్సులు దండిగానే ఉన్నాయి. పైసలు పెట్టగలిగితే టాక్సీలు ఉన్నాయి. వైర్లెస్ లేదు. అంతా వైడ్ సర్వీసే.
రెండున్నర లక్షల జనాభా, నిత్యం వచ్చిపోయే ఏభై వేల ఫ్లోటింగ్ పాపులేషన్ గల విజయవాడలో అప్పటికే ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి నిలదొక్కుకుని ఉన్నాయి. జ్యోతికి ‘సాయంసంచిక’ (డాక్ ఎడిషన్) ఉంది. ఇకపోతే నగరంలో చూస్తే తాలూకా ఆఫీసు పెద్ద కార్యాలయం. సబ్ కలెక్టర్ ఆఫీసు గొప్ప బిల్డింగ్ బందర్లో హెడ్డ్ఫాసులు, ఇక్కడ క్యాంపు ఆఫీసులు, డి.ఎస్.పి. పెద్ద పోలీసాఫీసర్.
అసలు ‘‘బెజవాడని - విజయవాడగా పేర్లు మార్చడం తప్ప మీరేం చేశారు?’’ అంటూ జనవరి ఇరవై నాలుగు సంచికతో ఎడిటోరియల్ పేజీలోనే సుదీర్ఘమైన ‘తిట్టు కవిత్వం’ అని ప్రకాశరావుగారన్న వ్యాసం మద్రాసుకి పంపించేశాం. అది వచ్చింది.
అయితే మొట్టమొదటి విజయవాడ ఎడిషన్‌లో నాలుగో పేజీలో కనకదుర్గమ్మ బొమ్మ పెద్దది వేసి డా. దాశరథిగారి పద్యాలు ‘టాప్’లో వేశాం. ప్రధానమంత్రి, రాష్టప్రతి వగైరాల సందేశాలు తీసుకోలేదు. సమాచార శాఖా మంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇరవై ఒకటవ తారీఖునే బయలుదేరి అమెరికా, రష్యా, కెనడా పర్యటనకి వెళ్లిపోయారు. ప్రధానమంత్రి లాల్‌బహదూర్ శాస్ర్తీగారు కర్ణాటక పర్యటనలో ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రహ్మంగారిని రమ్మని సంచికని హంగూ, ఆర్భాటంగా తోరణాలు, పందిరీ గట్రా వేసి ప్రారంభించవచ్చును. గానీ అలా చేయలేదు. అయ్యవారు చాలా సింపుల్‌గా, సాదాసీదాగానే బెజవాడ సంచికని బయటికి పంపించారు. ప్రకటనల సేకరణ, పాఠకుల అభిప్రాయ, అభినందన/లేఖావళి/కూడా లేవు. ఒక రెండు పాఠక లేఖలు మాత్రం వేశారు. ఏనాడో రావాల్సింది. ‘ఇది రొటీన్ విషయం’ అన్నట్లుగా వదిలేశారు.
ఆంధ్రజ్యోతి నుంచి ముగ్గురు హుషారైన సబ్ ఎడిటర్లను లాగేసుకున్నాం. ఆల్ రౌండర్ వేంకట్రావ్, పొట్లూరి, దంటు మోహన్ దాస్ గాంధీ చిత్తజల్లు బోసుబాబు, ఎల్.ఎస్.రావు వగైరా అంతా.
బందర్ రోడ్డు మీద నుంచి గాంధీనగర్ సెంటర్‌కి వచ్చేశారు. పత్రికలో జాయిన్ అయ్యారు. ముఖ్యమంత్రి సందేశాన్ని మెయిన్ చేస్తూ సంచికని విడుదల చేశారు. అయ్యవారు పేజీల దగ్గరకు వచ్చి, నిలబడి, పర్యవేక్షించడం నాకు జ్ఞాపకం ఉంది.
రౌటర్ మెషీన్ ఇంకా దారిలో పడలేదు. మొరాయిస్తుంది. కనుక వర్కర్స్ అతిజాగ్రత్తగా తొలివారంతో ప్రింటింగ్‌ని టెన్షన్లో చేశారు. రిపోర్టింగ్స్, ఎడిటింగ్, లేఅవుట్ల మీద, అప్పటికే, నేను అధ్యయనం చేయడం కోసం దొరికిన అమెరికన్ బుక్స్ అన్నీ తిరగేశాను. వీక్లీలో ఉండగానే లండన్, డైలీ మిర్రర్ని ల్యాండ్ మెయిల్లో తెప్పించాము. సంచలనం ‘పాత్ర’ని ఎలా వార్తలకి చేర్చాలి, పేజీలు ఏ భాగానికి ఏ ప్రాధాన్యత లాంటివి ఉండాలీ ఇవన్నీ ముఖ్యంగా చూశాను. లోకల్‌గా ఉన్న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక్కటే కాకుండా, అప్పుడే హిందూస్థాన్ టైమ్స్ ఎయిర్ ఎడిషన్ తెచ్చి ఇవ్వడం మొదలైంది. నండూరి రామమోహన్రావుగారు ‘‘ఎంతైనా మనది టెక్నికల్ వర్క్కదండీ’’, అనే వారు. ‘‘అదో టెక్నిక్లెండి’’ అన్నాడు.
‘‘ప్రెస్ జోర్గాన్’’ బాగానే పట్టుకున్నాను. కానీ, ఓ వారం మధ్యాహ్నం రెండు గంటల నుంచీ, రాత్రి తొమ్మిది గంటల వరకూ ఒక ‘‘షిఫ్టూ’’ మరో వారం నైట్ షిఫ్ట్, రాత్రి ఏడు గంటల నుంచి మొదలు ఆ మలివారం డైలీ ఉదయం నుంచీ సాయంకాలం వరకూ చాకిరీ. ఆదివారం కూడా డ్యూటీ. ఇలా, ఈ మార్పులకి శరీరం అలవాటుపడడం ఎంతో కష్టమైంది. పైగా హైదరాబాద్ నుంచి మా టెలిప్రింటర్‌లో మేటర్ అంతా ‘‘ట్రాన్స్లిటలేషన్’’లో వస్తుంది. 26 ఇంగ్లీషు అక్షరాలలో 56 అక్షరాల తెలుగు భాష వచ్చేది. మద్రాసులో ఈ భారం అంతా జె.బి.శర్మగారు మోసేవాడు. కానీ హైదరాబాద్ ఎడిషన్ డ్యూటీలో ఉంటే, ఈ ‘అవస్థ’ అంతా నాది. అదే టైమ్‌లో రచయితగా కూడా నాకు డిమాండ్ పెరిగింది. కొత్త పత్రిక పెట్టదలుచుకున్న వాళ్లందరూ ‘కథ పంపమనీ, కవిత పంపమనీ, నాకీ ‘కార్డు’ పడేస్తున్నారు. అదో ‘‘గొప్ప’’ నాకు.
అయితే నా మనసూ, మెదడూ కూడా దినపత్రిక యొక్క ఆత్మను అర్థం చేసుకోడంలో మునిగిపోయింది. అమెరికన్ జర్నలిజమ్, బ్రిటీష్ జర్నలిజమ్ మీదా బాగా అడ్వాన్స్డ్ ‘ఫ్రీ’ వెర్స్లాగా ఉండేది. థాంక్స్ టు - బి.ఎస్.ఆర్. కృష్ణ. మద్రాసులోనే జర్నలిజమ్మీద బుక్స్ సేకరించుకున్నాను.కానీ, సన్ డే టైమ్స్ - లండన్ పత్రిక ఎడిటర్ శ్రీ హెరాల్డ్ ఐవాన్స్ ఐదు సంపుటాలుగా రాసిన ‘ఎడిటింగ్ అండ్ డిజైన్’ మాన్యుల్, లే అవుట్ మీద చాలా బాగుంది. సీనియర్ అమెరికన్ జర్నలిస్టులు, అనుభవజ్ఞులు రాసిన వ్యాసాలతో ఉన్న గ్రంథం ఒకటి గాంధీనగర్ పాతపుస్తకాల షాపులోనే సంపాదించగలిగాను. ‘‘రుబ్బడమే’’ పని.
వారపత్రికలో ‘డమీ’ వేయకుండా పేజీలకు వెళ్లే వాళ్లం కాదు. కొలతలు వేసుకుని దుస్తులకి కొలతలతో బట్టని కత్తిరించే ‘దర్జీ’లాగా చేసే అలవాటుంది అక్కడ. థాంక్స్ టు రాధాకృష్ణగారు. కానీ, డైలీకి ‘వంటవాళ్లు’ మాత్రం రోజూ మారుతూనే ఉంటారు.
‘‘అయ్యవారి’’ సమక్షంలో, జనవరి 24 సంచిక విజయవాడ ఎడిషన్ చేసి వదిలాం. అదే తృప్తి 23 సాయంకాలం. లోపలి పేజీలు ముఖ్యంగా ఎడిట్ పేజీ మద్రాసు నుంచే వచ్చిందని జ్ఞాపకం. కనకదుర్గమ్మ - పెద్ద బొమ్మ వేసి ‘‘కనకదుర్గా!’’ అంటూ దాశరథిగారు రాసిన పద్యాలతో చేసిన ఎడిట్ పేజీలో ‘‘ఒక పౌరుడు’’ పేరుతో బెజవాడ దుస్థితి మీద వ్యాసం వచ్చింది. బెజవాడ కార్యాలయం బొమ్మలు ఐదో పేజీలో వేశాము.
స్థానికులు గానీ, రాజకీయ నాయకులు గానీ (గాంధీనగర్ అంటే మా వూరి ‘్ఫలిం నగర్’ అప్పుడు) సదరు ప్రముఖులు, సందడీ, సంబరం, హడావుడిలు లేవు. ఎడిషన్ గప్‌చిప్‌న ‘‘బస్సుల’’కు వెళ్లిపోయింది. గుంటూరు ప్రాంతానికి మాత్రం టాక్సీ ఉంది.
దాశరథిగారి పద్యాలతోనే బెజవాడ ఎడిట్ పేజీ పెట్టడం నాకు నచ్చింది. అక్కినేని ఇంట్లో ఇంటర్వ్యూ సమయంలో, అంటే 63లోనే చూశాను. ‘స్రవంతి’ పత్రిక సంపాదకునిగా, దాశరథిగారిని నేను. 9వ తరగతి నుంచీ ఎరుగుదును. కానీ, ఒక నవలా రచయితగా నన్ను ఆయన గుర్తించి, ’68 జనవరి 16న సంక్రాంతి శుభాకాంక్షలతో ఒక లెటర్ రాశారు. చిరునామా మీద ‘నావలిస్ట్ అండ్ జర్నలిస్ట్’ అంటూ రాసిన మొదటి ప్రముఖ వ్యక్తి కూడా ఆయనే! అప్పటి నుంచీ, నేను అలాగే పేర్కొనేవాడిని. దాశరథిగారు ఆల్ ఇండియా రేడియో, మద్రాసు కేంద్రంలో ఉన్నారప్పుడు.
సరే. ఆయన రాసిన ఈ ఇన్లాండ్ కవర్ చదువుతూంటే నాకు ఇప్పుడు కూడా ఒడలు పులకరించింది.
జర్నలిజమ్‌లో పొట్ట తిప్పలు పడుతూ నీ కీర్తికండూతిని ఒక రచయితగా నిభాయించడం కష్టమనీ అనిపించేది. బెజవాడకి నాకు పెద్దలు రాసే ఉత్తరాల వల్ల నాలో ఒక అత్మవిశ్వాసం పెరిగింది. దాంతోపాటే దినపత్రికలో పని ఒత్తిడి ‘పీక మీద కత్తి’ అయింది.
దాశరథి గారి ఉత్తరం నుంచి కోట్ చేస్తాను. మీ నవల ‘‘ప్రేమకు పగ్గాలు’’ తెరకెక్కుటకు యోగ్యమైనది అని నేను భావిస్తున్నాను. మీ నవలను (డి)రామలింగం గారు, శ్రీ పి.పుల్లయ్యగారికి ఇచ్చియున్నారు. నేను కూడా ప్రస్తావించాను. మరికొందరితో కూడా ప్రస్తావించగలను’’ అని రాశారు. అంతకుముందు జనవరి ఒకటి, 1968న కూడా ప్రముఖ నవలా రచయితలు శ్రీ వీరాజీగారికి’’ అని సంబోధించుతూ దాశరథిగారు కూడా ప్రస్తావించారు. ఇదే అంశాన్ని..
తాను డి రామలింగంగారిని కలిసినప్పుడల్లా తరచూ మీ ప్రస్తావన వస్తుంది. ఆయనకూ, నాకూ మీ ‘ప్రేమకు పగ్గాలు’ ఎంతో నచ్చింది. అది ‘చిత్రం’గా తీయవచ్చును. చక్కని నవల. ‘‘మీరు మద్రాసు వస్తే బాగు’ అన్న అర్థంలో ముక్తాయింపు యిస్తూ నేను విజయవాడ వైపు వచ్చినా ‘‘తమను కలుసుకుంటాను’’ అన్నారు. అంత మృదుమధురశైలి, విశాల హృదయం అనితర సాధ్యం!
నిజమే! ‘ప్రేమకు పగ్గాలు’ నవల ఆంధ్ర సచిత్ర వారపత్రిక ‘‘సీరియల్’’గా నాడు చదువుతున్న కుమారి జమున (నటి) ‘‘ఔను. నేను సురేఖ వేషం వేస్తాను’’ అనడం గుర్తొచ్చింది. కుమారి కృష్ణకుమారి (నటి) కూడా ‘‘నేను ‘పద్మావతి’గా రెడీ’’ అన్నదో మారు. ఈ నవలని ప్రచురణకు తీసుకున్న శేషాచలం అండ్ కంపెనీ (ఎమెస్కోబాస్) కూడా అగ్రిమెంట్ విషయం రాస్తూ, ‘66లోనే మీ నవలని సినిమాగా తీయడానికి ఒకరిద్దరు నిర్మాతలు ‘మొగ్గు’ చూపెడుతున్నారు. ఏమైనా రూపు కడితే మీకు తెలియజేస్తాను’’ అంటూ రాయడం గుర్తొచ్చింది.
అప్పుడు మంజుశ్రీ (అక్కిరాజు రమాపతిరావు) ఎమ్.ఎన్.రావుగారి ‘పుస్తక ప్రపంచం’ పత్రికని పర్యవేక్షిస్తూ మద్రాసులోనే ఉన్నారు. తాను నాకు ప్రేమతో ఉత్తరం రాశాడు. ‘ప్రేమకు పగ్గాలు’ సినిమాకి సరిపోతుంది. ఆ దిశలో ప్రయత్నించు. నేను కూడా ప్రయత్నిస్తాను’’ అంటూ. కానీ ‘రుూడిగిల పడ్డ ఎద్దు’ లాగా నేను, బెజవాడ గాంధీ నగరంలో ఉండిపోయాను.
‘‘పత్రిక కార్యాలయం వదిలితే, కృష్ణమ్మకి కోపం వచ్చి (నా) ఊరుని ముంచెత్తుతుంది’’ అన్నట్లున్నాను.
‘ప్రేమకు పగ్గాలు’ సీరియల్ మూడొందల పేజీల నవలయింది చిన్న అచ్చులో. రావుగారు పుస్తక ప్రియుడు. పాఠకుల పాలిట వరం. ధర ఎక్కువ పెట్టడం. మూడు రూపాయలకు మించి ఇష్టం లేక చిన్న అచ్చుతో (జి.పి.కి బదులు 12 పాయింట్లో) వేశాడు.
ఔను! ‘ప్రేమకు పగ్గాలు’ అన్నమాట నాకూ వర్తిస్తుంది. ‘ప్రేమ’ అంటే, ‘రొమాన్స్’ ఒక్కటేనా? అమ్మా నాన్నల, అన్నా చెల్లెళ్ల సంసార అనుబంధం ఇంకా ముఖ్యమైన బాధ్యత కాదా? కనిపించని పగ్గాలున్న ‘‘ప్రేమ’’ నాది. దిగువ మధ్య తరగతి కుండే అతిశయం తప్ప ‘‘రిస్కు’’ తీసుకుని, మద్రాసు పరుగులు తీయగల స్థోమత లేదు. రిస్క్ తీసుకోలేను అంటూ రచయితగా రాణించే సమయంలో సంకోచించాను. ఒక్క రోజు శలవు కాదు కదా ‘వీక్లీ ఆఫ్’ రోజున కూడా పనిచేసినా మా ఇన్చార్జి ప్రకాశరావుగారికి తృప్తి ఉండేది కాదు. ‘‘వీరాజీ సహకరించడం లేదు’’ అని అయ్యవారికి చెబుతాడేమోనని బెంగ. అసలే హాల్లో నలుగురి మధ్యా కూర్చుని లేదా అలా కూర్చోలేక మధనపడుతున్నాను. ‘‘పూలు అమ్మిన చోట కట్టెలమ్మినట్లు అయిందా? వీరాజీ!’’ నీ పని అనే వి.వి.ఎన్.గారికి నా మీద, సానుభూతీ, వాత్సల్యం పెరగటం కొసమెరుపు...
లోగడ ‘‘నట జీవితాని’’కి మార్గం తెరుచుకున్నారక్కడ. మద్రాస్‌లో కనులు మూసుకుని వదలేశాను. వారపత్రిక నుంచి దినపత్రిక బెజవాడకి వచ్చాకా సినిమా కథకునిగా, రచయితగా వచ్చిన అవకాశాలనూ అందుకోలేకపోయాను. పెద్దలు ‘‘మహ్మద్’’ కొండ దగ్గరికి వెళ్లాలంటారు. కొండ ‘‘మహ్మద్’’ వద్దకి రాదు అంటారు. ఆ సామెతే నిజమైంది నా పట్ల! జీవితమే వైకుంఠపాళీ అట.
(ఇంకా బోలెడుంది)