స్మృతి లయలు

అమ్మాయిగారి కృష్ణుఢు నేనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంచిపేట మొత్తానికి ఇస్మాయిల్ కిరాణా కొట్టు పెద్దది. అదో సూపర్ మార్కెట్టు. కానీ దుకాణంలో ఎప్పుడూ సుభాన్ భాయి మాత్రం ఉంటాడు. జనం అంతా నాలాంటి పిల్లకాయలే.. కిటకిటలాడేది షాపు. అమ్మ కాని మామ్మ కానీ - నన్ను చిన్న సామాన్లు - ముఖ్యంగా కొబ్బరికాయ - చక్కెర, బెల్లం, సగ్గుబియ్యం గట్రా తెమ్మంటే - జటకా మీద టకాటకా గుర్రాన్ని లొట్టలు వేసి అనుకరిస్తూ తోలుకుంటూ వెళ్లిపోవడమే. నడవడం లేదు.. అంటే నిజం జటకా కాదు - నా కాళ్లే చక్రాలు ప్లస్ గుర్రం కూడా నేనే.. ఉత్తుత్తి కళ్లెం.. గుర్రపు డెక్కల చప్పుడు లొట్టలతో భలే చేసేవాణ్ణి. జవహర్‌లాల్ నెహ్రూ గారు మనం ‘సైకిల్ ఏజ్’లో వున్నాం అనేవాడు కాని జటకాల సంగతి ఆ బ్రాహ్మడికి తెలియదు. నార్త్‌లో అన్నీ ‘టాంగాలే’గా.. వైజాగ్‌లో ‘పెట్టె బండ్లు’ అని ఒంటెత్తు బండీలుండేవి. వాటిని గుర్రబ్బళ్లు కొట్టేశాయ్.. కాని బస్సులొచ్చి బండి వాళ్ల పొట్ట కొట్టేసేయి.
విశాఖపట్నం వాళ్లు ‘గుడి’ అనరు - కోవెల అంటారు - చిత్రమే.. అసలు గుడిలేని ‘బురుజుపేట’లో సీతారామస్వామి కోవెలకి వెళ్లే దారిలో వున్న కనకమాలక్ష్మి చాలా పాపులర్ - కాని కనక మహాలక్ష్మి అమ్మవారికి గుడి లేదు ఆ చిన్ని లోగిలినే గుడి అంటారు.
మా అమ్మమ్మల ఇంటికి తీసుకుపోయేది మా అమ్మ. పెద్ద రీడింగు రూం ప్రక్క రోడ్డులో పోతే, చెవుల వారి వీధిలో వున్న రాతిమేడ లాంటి ఇల్లు ఎంత పెద్దదో? - మా సొంత అమ్మమ్మనీ - యలమంచిలిని మేం ఎరుగం (అమ్మ ఎనిమిదో ఏట పెళ్లి చేసి మరీ పోయిందట అమ్మమ్మ) - ఊహించను కూడా లేము. కాని మా అమ్మ అదృష్టం వాళ్ల అమ్మమ్మగారు మేము పెద్ద అయ్యేదాకా ఉండింది. - రాంభట్ల అమ్మమ్మ దిట్టంగా కోపంగా వుండేది. ‘అమ్మాయిగారి కృష్ణుడు’ మాత్రం (నేనే) ఆ సర్కిల్స్‌లో అందరికీ ఇష్టమే - మా చిన్న అమ్మమ్మ (సోమేశ్వరమ్మ కాబోలు పేరు) ‘జుట్టు ముడి’ (అయితే టాప్లెస్) వేసుకొని వుండేది - మొగుడు లేకపోతే -మాత్రం గుండుతో ఎందుకు వుండాలి..? మా మామ్మకి జుట్టు వుండాలి అంటే, మా అమ్మ నవ్వేసేది. పెద్దయ్యాక నీకు తెలుస్తుంది. అదో ఆచారం అంతే.. కాని, చిన్న అమ్మమ్మతో - ఆమెకన్న చిన్నది రాజు అమ్మమ్మ వున్నది - ఈమె ‘నేమాని’ వారి కోడలు - ఇద్దరికీ కేశ సంపద ఎక్కువే. ఈ ఇద్దరు కాక మరో ఆఖరి అమ్మమ్మ చిట్టి అమ్మమ్మ పసుపూ కుంకుమలతో, మెడ నిండా నిజం బంగారం నగలతో వుండేది విజయనగరంలో.. యాత్రలకి పోతూ మా ఇంటికి వచ్చేది. నలుగురు అప్పచెల్లెళ్లకి ఒక్క అప్ప - మా అమ్మమ్మ మాత్రమే ఈ లోకం నుంచి వెళ్లిపోవడం -చిత్రమే. నా పేరు వాళ్ల బావగారి పేరు కదా? (కృష్ణమూర్తి) అంచేత ‘మేటర్నల్ గ్రాండ్ మదర్స్ అందరూ - నన్ను ‘బావా’ అని పిలిచేవారు.. (నాకు సిగ్గు) మా రాజమ్మమ్మ - ఏరా బావా? నీకూ నాకూ కూడా ఉంగరాల జుట్టే రంగూన్ పోదామా? అనేది.. జాకెట్టు కూడా వేసుకొనేది తను. ఎర్రంచు గ్లాస్కో చీరలు కూడా కట్టేది. ఇదంతా ఇక్కడ ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలీ అంటే - దీనికో కథ ఉంది. మున్ముందు తెలుస్తుంది. చెవుల వారి వీధిలో వున్న - లేట్ అడ్వొకేట్ రాంభట్ల సూర్యనారాయణ ది గ్రేట్ గారి రాతిమేడ నాకు ఇష్టం (అది నా నవల చదివితే తెలుస్తుంది) - నా అతి బాల్యం నుంచీ గూడు కట్టుకుని గుర్తుగా ఉండిపోయింది. భూత్‌బంగ్లా అనే వాళ్లు మా నాన్నగారు. నేను నాకు తెలియకుండానే కొంచెం కొంచెం రచయితగా - అదే, మున్ముందు రాయబోయే (మరి పదహారు ఏండ్లకి) ఒక రొమాంటిక్ నవలకి అంకురార్పణ జరిగిపోయింది! -సరే, అక్కడ నన్ను ఎటూ వెళ్లిపోకుండా వీణ్ణి ఆడించమని అమ్మాయి అంటే మా అమ్మ వాళ్లకి అప్పజెప్పి వెళ్లిపోయింది - బెజవాడ కన్నా ఆమె ఆడిపాడి అష్టకష్టాలు పడ్డప్పటికి - ఇల్లాలై, తల్లీ ఐన ఏరియా అది. తనకి ఎంతో ఇష్టమైన బంధువులు చుట్టాలను ఓ రేవు పెట్టేసి చూసి వచ్చేదిట. మా తమ్ముడికి ఓ మూకుడు దానితో ఓ బొమ్మ పొయ్యి అట్లకాడ ఇస్తే చాలుట - ‘హేచి.. హేచి..’ (వేచి) అని వాడు వేపుడు ఆట ఆడుకొనే వాడుట - కాని నేను - పారిపోయి ఎటేనా పోతానన్న భయంతో - నన్నో కాఫీ మెషీనుకు కట్టేసేవారుట. కాని దాన్ని కూడా ఈడ్చుకుంటూ నేను రోలూ కృష్ణుడు లాగ.. అదీ కథ ఓ ఒక్కోసారి వేసంగిలో.
నెల రెండు నెలలూ ‘ఇస్కూలు’ వొదిలేస్తే బాగుండదు... పిల్లవాడు. అందుకుని ఒక ఎండాకాలంలో మా చిన్న అమ్మమ్మ (రాంభట్ల అమ్మమ్మ గారు స్వర్గం వెళ్లిపోయారుట లెండి) వాళ్ల పాత పురానీ మేడ ప్రక్కనే వున్న చిన్న స్కూల్లోకి రారా! బావా.. నీ ఆట కట్టిస్తాను - అని తీసుకుపోయింది.
-చూడు నరసింహమ్మూర్తీ! మా వాణ్ని మూడో క్లాసులో కూర్చోబెట్టుకో. ఎక్కాలైనా వస్తాయి - అని అప్పజెప్పింది. ఆ రోజుల్లో గంగాభాగీరథీ సమానురాలైన బ్రాహ్మణ స్ర్తిలకి బయట ఎంతో గౌరవం - పలుకుబడి... వుండేవి కాబోలు. దురదృష్టవశాత్తు - ముక్కు నరసింహమూర్తి గారి క్లాసులో పడ్డాను.. ఆయన, మొట్టికాయల మాస్టారుగా వాసికెక్కాడుట. నషాళం అంటిపోయింది.. ఓ మొట్టికాయ వేశాడు - ఇదిరా అబ్బీ నా పరిచయం’ అన్నాడు. -రేపు.. అంటూ ఓ హోంవర్క్‌గా ఎక్కాలబుక్కు చేతబెట్టాడు.
(ఇంకా బోలెడుంది)
*
చిత్రం..వైజాగ్‌లో పాత కురుపాం మార్కెట్.
దీని వెనుక సందులోనే మా నాయనమ్మ, బాబాయిల అద్దె ఇల్లు

వీరాజీ.. 92900 99512 veeraji.columnist@gmail.com