స్మృతి లయలు

కవిత్వం ఒక ఆరని జ్వాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతి స్వతంత్ర స్రవంతి మొదలు బెజవాడలోని- ములుకోల, నెల్లూరు జమీన్ రైతు, ఢంకా, చిత్రగుప్త- వాహిని, ప్రజారాజ్యం, ప్రజాసేవ లాంటి పత్రికలూ - కొత్తగా వచ్చిన కమ్యూనిస్టూ డైలీ విశాలాంధ్ర దాకా - కవితలు ఖండికలు - గల్పికలు స్కెచ్‌లు ప్రచురించేవాళ్లు. ఇవైతే ఫిల్లర్స్ లాగ కూడ పనికొస్తాయని కాబోలు. ఏది ఏమైతేనేం కవిత్వమొక తీరని దాహం.. ఆంధ్రజ్యోతి మాసపత్రిక వచ్చేది.. అందులో నార్లగారు ఓ కాలం రాసేవారు. చక్రపాణి గారి యువ పత్రిక ఒకటి మాకు పెద్ద ఆకర్షణ.
మా తెలుగు మాస్టారు కృష్ణమాచారి గారు పిలక, అర్ధగుండు తిరునామం ఖద్దరు ధోవతి జుబ్బా - ఎప్పుడు చూసినా ‘మాకేమీ డొక్కశుద్ధి లేదని - మేమంతా వుత్త వెధవాయిలమని- తీసి పడేస్తూ ఉండేవాడు. ‘ఓ అమ్మో! పద్యాలు రాయాలంటే ఛందస్సు రావాలి’ ‘పిల్లకాయలు మీరు గోలీ కాయలాడుకొండిరా’
‘్ఛందస్సు దేముంది సారూ - మీ దగ్గర పట్టేస్తాం.. ఓస్.. నజభజ జజరా, భభ రన మయవా.. ఇంతేగదా మాస్టారూ..’ అనేసేవాళ్లం.
‘మీ బొంద.. నా బోలె - సంస్కృతం రావాలిరా’ అనేవాడు. ఈలోగా నేనూ నారాయణా, త్వమేవా హమ్ - మాస్టారికి చూపించి ‘ఇందులో గణ విభజన చెయ్యండి సార్’ అన్నాం. ‘బండసున్న పెట్టేస్తాను వెధవల్లారా, ఓ అంటే డం రాదు కాని.’ ‘సార్! అది నిజమే గాని శ్రీశ్రీ చంధోబందోబస్తులన్నీ - పటాపంచల్ - చెయ్యమన్నాడని’ మేమూ ఆలోచిస్తున్నాం...
ఇట్లా ఎలకా పిల్లి చెలగాటం నాకు - నాకు సపోర్ట్‌గా కాకర్ల గాడికి మా మాస్టార్లతో - గిడుగు సీతాపతిగారు - వాళ్ల నాన్నగారు గిడుగు పిడుగు గారిని మించిన భాషా సాహితీ కృషి చేశారని లైబ్రరీ చూడమని మా మాస్టారు దేవరకొండ సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. పెద్దలు అనేవారు ఎన్ని రకాల సంస్కృత ఛందస్సులున్నాయో అవి అన్నీ క్రోడీకరించి - ఓ బుక్కు తెచ్చారు ఆయన... ‘నా తరమా ‘్భవ’ సాగారములీదగ - అన్నట్లుంది నాకు.
ఆంధ్ర పత్రిక వీక్లీపై అప్పట్లో మాకు పెద్ద మోజు లేదు గాని - అందులో ఎవరో పెద్దాయన ప్రశ్నలూ జవాబులు ఇస్తున్నాడు. ప్రశ్న పంపించాను.
‘నేను స్వేచ్ఛగా పొయెట్రీ రాయాలి తెలుగు మాస్టారికి - నా సత్తా చూపెట్టాలి’
ఆరుద్ర అన్నట్లు - ఇప్పుడు శబ్దమంజరి - భట్టీయం వేస్తూ వరూధినీ ఊర్వశి అని లొట్టలు వేస్తూ కూర్చుంటే నా పని ఫినిష్’.. నువ్వు ఎక్కదలుచుకున్న రైలు - ఒక్క జీవితం కాలం పాటు లేటు- అన్నట్లు అయిపోవచ్చు... అటు ఎస్సెసెల్సీ.. కొండెక్కేస్తుంది - బెటర్ వేకప్ - సరే పత్రికలో - సలహా వచ్చింది. ‘ఆధునిక కవిత్వం చదవండి - సౌభద్రుని ప్రణయ యాత్ర (నాయని సుబ్బారావు) లాంటివి రుబ్బండి’ అన్నట్లు ఆయన్గారెవరో- పిల్లి అంటే మార్జాలం.. అన్నట్లు చెప్పాడు.
‘మాత్రా ఛందస్సులున్నాయిగా?’ ‘మరీ తాడూ బొంగరం లేనట్లు వద్దు.. అభ్యాసం కూసువిద్య..’ అంటూ లైబ్రరీలో ఓ అంకుల్ సూచించాడు. ఈ రోజుల్లో - పాండవోద్యోగ విజయాలు తప్ప మిగతా ‘ఓల్డ్’ పొయెట్రీ అంతా ‘కవిత కరక్కాయ’ సుమీ అనిపించింది. ఎంకి పాటలూ గొప్ప పొయెట్రీయే.. దువ్వూరి వారి పానశాల పొయిట్రీయే.. బసవరాజు అప్పారావుగారు, గురజాడ అప్పారావుగారు ఎంత సింపుల్‌గా రాశారు? సరే, చీమల రాజ్యంలో సీత (బాల)తో మమ్మల్ని చిన్నప్పుడే బుట్టలో వేసుకున్నాడు, ఆరుద్రగారు బ్రెయిన్‌లో బ్రెన్గన్ - ఆలోచనల ట్రైన్.. ట్రైన్లో థర్డ్‌క్లాస్ బోగీలో’ అన్నాడు కాదా? సంస్కృతం మాటకి బదులు ఇంగ్లీషు మాటల్ని తెనుగైజ్ చేసి పెరిషింఛి, చరిషించి - అన్నాడు.. రనండి.. రనండి అంటూ ఇంగ్లీషు ‘రన్’ మీద తెనుగు ఫనే్చర్చాడు కాదా? అప్పటికే, స్వతంత్ర స్రవంతి లాంటి పత్రికల ధర్మమాని - ఆధునిక కవులు - కృష్ణశాస్ర్తీగారు కవికొండల గారు మొదలు - పఠాభి, బైరాగి, శ్రీరంగం నారాయణబాబు గారు, సోమసుందర్‌గారు, శ్రీశ్రీ, కుందుర్తి, ఆరుద్రలు సరేసరి.. ఎందరో మహానుభావులు. ‘కాళోజీ’ స్పెషల్ ఎందుకంటే ఆయన పేరులో ‘జీ’ వుంది ఆయన గొడవలో ‘పస’ వుంది నాదీ గొడవేగా - సణుగుడే... అనుకున్నాను. అందర్నీ చదవడం ఓ సరదా (హాబీ) అలవాటు అయింది.
‘కళ్లెం లేదే.. నా ఊహలు భావాలవుతాయేమిటి? ఆ.. నా మాటలు ఈటెలుగా మారాలి. నా బాటలు రేపటి మేడకి మెట్లు గావాలి’ అంటూ రంగంలోకి దిగిపోయాను. స్రవంతికి ముందుగా నారాయణరెడ్డి గారు, ఆనక దాశరథిగారు సారథ్యం వహించారని జ్ఞాపకం. ఇద్దరితోను ఈ హైస్కూలు బోయ్‌కి ఉత్తరాలు రాసి జవాబులు అందుకునే చొరవ ఏర్పడ్డది.
1960లో నేను హైదరాబాద్‌లో జరిగిన పోతుకూచి వారి అఖిల భారత తెలుగు రచయితల మహాసభలకి - డెలిగేట్గా వచ్చాను (కర్టసీ మహీధర రామమోహన్‌గారు) నేనట్లా బిక్కుబిక్కుమంటూ వచ్చినప్పుడు సినారె గారు ఇలా నా చెయ్యట్టుకొని - బిడ్డా! ఇంత యంగ్‌బోయ్‌వా? నువ్వు వీరా..’ అంటూ భుజం మీద చెయ్యి వేసి సభా వేదిక రెడ్డి హాస్టల్ భవనాల దగ్గర నుంచి మెయిన్ గల్లీలోకి బుక్స్ అవీ వున్న దుకాణం (నుక్కడ్) - దాకా తీసుకుపోయిన ఆప్యాయత మరిచిపోలేను. సదరు కథాకమామీషు ఆనక.. చూద్దాం.. (ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com