స్మృతి లయలు
ఉండలేక.. రాలేక తల్లడిల్లిన చిత్రరంగం!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఫాఠకులు చాలా సెన్సిటివ్‌గా, చురుకుగా వున్నప్పుడు పత్రికా సంపాదకుల మీద వేరే ‘నియంత్రణ’ అక్కరలేదు. గుంటూరు నుంచి ఎన్. సూర్యారావు అనే పాఠకుడు ఓ కార్టూను మీద మమ్మల్ని నిలదీశాడు. అది ఇలా వుంది. ‘మీ వారపత్రిక (17.4.64)లో కాఫీ హోటల్స్‌లో సర్వారాయుళ్లు చేయు ఆలస్యాన్ని హాస్య పూర్వకంగా తెలుపుతూ ఒక కార్టూన్ ప్రచురించారు. సర్వారాయుడు టీ తెచ్చేటప్పటికి ఆర్డర్ ఇచ్చిన మహాశయునికి గడ్డం పెరిగిపోయింది అని చిత్రీకరించారు. మరి సర్వారాయుడికి గడ్డం, జుత్తు ఏల పెరగలేదు? ఇది కార్టూనిస్టు లోపము కాదా?
‘ఆ కార్టూన్ చూసి పాఠకులు నవ్వారో, ఏడ్చారో తెలియదు గానీ, ఈ లెటర్ చూసి మేము ఏడ్వలేక, నవ్వుకున్నాం. నాటి పాఠకులులో ఇలా శల్య పరీక్షలు చేసే రకం వున్నారు. ఈ సంచిక (8.5.1964) విశేషం ఏమిటీ అంటే ‘ఎన్టిఆర్’ వీరాజీ ముఖాముఖీ ఇంటర్వ్యూ మొదటి భాగం వేశాం. అసలు ఎన్టీఆర్‌తో ‘ముఖాముఖీ’ వెనుక చాలా కథ వుంది. రామారావుగారితో ‘తెర మీద - తెర వెనుక’ శీర్షిక ఎందుకు రాలేదు?’ అని ‘అయ్యవారు’ (శంభుప్రసాద్ గారు) నన్ను పిలిచి అడిగారు. వాస్తవానికి తెర మీద - తెర వెనుక ముగిసి అప్పటికి కొంతకాలం అయింది. తెర మీద - తెర వెనుక అప్పట్లో అతి బిజీగా వున్న ఎన్టీఆర్ దొరకడం కష్టమే అయింది. కానీ అప్పటికే ఈ ‘ఇద్దరి’లో ఎవరి పేరు ముందు? ఎవరి ఇంటర్వ్యూ తరువాత అన్న వివాదం కూడా లేకపోలేదు - ఉదాహరణకి గుండమ్మ కథ టైటిల్స్ చూడండి.
నేను ఎన్టీఆర్‌తో ఆరంభించక పోయినా తనతో ‘తెర మీద - తెర వెనుక’ ముగించాలనుకున్నాను. నాకిద్దరూ ఇష్టమే కానీ పర్సనల్‌గా నేను మా బెజవాడ ఎన్టీఆర్‌కి అభిమానిని. పైగా నేను చదువుకున్న స్కూల్లోనే తనూ చదివాడన్నారు. ‘పాతాళభైరవి’ సినిమా విడుదల అయింది. దుర్గా కళామందిర్లో దాని శత జయంతి ఉత్సవానికి నాకూ, ఫ్రెండ్స్‌కి లోపలకి పోవడానికి మా ‘తరం’ కాలేదు. పోలీసుల చేతిలో వీపు సాపు కాకుండా పలాయనం చిత్తగించాం. నేను హనుమంతరాయ గ్రంథాలయం చేరుకున్నాను. అక్కడ అప్పుడు ఎన్టీఆర్‌తో మొదలయిన పాతాళభైరవి నటుల పరిచయం. చిరు సత్కారం వగైరా కార్యక్రమాలున్నాయి. స్కూలు కుర్రాణ్ణి. ముందు వరుసలోనే చేరాను. సరిగ్గా ఎన్టీఆర్ వచ్చి మొదటి వరుసలోనే కూర్చొనేసరికి నేను అతని వెనుక సీటులో తన వీపు తాకుతూన్నంత చేరువగా వున్నాను. తొంగి తొంగి చూస్తున్న కుర్రాణ్ణి - కానీ, ఎన్టీఆర్ కూడా అప్పుడు ‘తోటరాముడే’గా!.. కొత్త హీరోయేగా.
తనూ వెనక్కి వెనక్కి తిరిగి చూసి ‘ఆటోగ్రాఫా? బ్రదర్’ అన్నాడు. తొట్రుపడ్డాను. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ‘నో ‘ఆటోగ్రాఫ్’ బుక్ నాకు - ఆ రోజుల్లో సిగరెట్ పెట్టె నాలికలు తీసుకుని వాటి మీద ఏదైనా నోట్ చేసుకోవడం అలవాటు పెద్దలకి. అయితే వాటి మీద ‘పొయిట్రీ’ రాసేవాడు శ్రీశ్రీ.
ఠక్కున క్రింద పడి వున్న ఒక కార్టన్ అందుకుని అది అందించి ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. నాకు మహదానందం కలిగింది. ఎన్టీఆర్ అంటే ఒక స్పెషల్ ఫీలింగ్ ఏర్పడ్డది. మనసు ఉద్దేలం అయింది.
ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లాను. ఇంగ్లీషు, హిందీ సినిమాలు చూసే నాకు ఎన్టీఆర్ తెలుగు చిత్రాలపై మోజు పెరిగింది.
యూనివర్సిటీలో కూడా మేము వైజాగ్ బొమ్మల కొళాయి సెంటర్లో ఉన్న లక్ష్మీటాకీస్కి ‘మాయాబజార్’ కోసం ప్రత్యేకంగా వచ్చి రెండుసార్లు చూశాం. ‘హాయ్! హాయ్! నాయికా’ అని పలకరించుకునేవాళ్లం. ‘అసమదీయులు తసమదీయులు’ అంటూ పిలుచుకునేవాళ్లం. సరే అదంతా అయిపోయి మద్రాసు పత్రికలో చేరాక (1961) ఎన్టీఆర్‌ని విజయా పిక్చర్స్ ‘రామారావు’తో ఓసారి నేను, ‘ఎస్.ఆర్.గారు’ కూడా వెళ్లి కలుసుకున్నాం. అప్పటికే తను ఇంటి దగ్గరే మేకప్‌లో కృష్ణావతారంలా రెడీగా వున్నాడు. చూశాం. విజయా పిక్చర్స్‌కి. ఆంధ్రపత్రికకి దుర్గా కళామందిరం కారణంగా సాన్నిహిత్యం ఉండేది. వాళ్లకి, శంభూప్రసాద్ గారే కళామందిరాన్ని లీజుకిచ్చారుట. పూర్ణచంద్రరావుగారు ఫ్రెండూ పెద్దమనిషి కూడా.
ఎస్.ఆర్.గారు తెర మీద - తెర వెనుక విషయంలో (కారణాలు అనవసరం) రామారావు ఇంటర్వ్యూ పట్ల అంత ఆసక్తి చూపెట్టలేదు. ఎన్టీఆర్‌తో శీర్షిక మొదలుపెట్టకపోయినా, వెంటనే దానిని వేస్తే బాగుంటుందీ అన్న ‘టాకు’ సినిమా వర్గాల నుంచి వచ్చింది. అది అలా వుండిపోయింది. కాగడా శర్మ ధర్మమా అని తెర మీద - తెర వెనుక ‘అబ్ప్ట్’్రగా ఆపేశాను. కాగడాలో ఎడిటర్ కొక్కెరగడ్డ కామేశ్వరశర్మ ఒక ఎడిటోరియల్ రాశాడు. బడా పత్రిక, వీక్లీ కేవలం పావలాకే అన్ని హంగులతో సినిమా అందిస్తున్న పత్రిక. అందులో రచయిత వీరాజీ తారల ప్రైవేటు బొమ్మలు, ప్రైవేటు కథలు బొమ్మలతో కొత్త శీర్షిక అందిస్తూ వుంటే ‘మా పొట్ట కొట్టినట్లేగా’ అన్న ధోరణిలో వుందా వ్యాసం. చివుక్కుమంది మనసు. రాధాకృష్ణ గారికి చెప్పి ఆపేశాను. ఆయన మన పర్పస్ నెరవేరింది. మనకు అనుకున్న ఫలితాలు వచ్చాయిగా. అనగా ఆపేశాము.
ఎన్టీఆర్ చక్రపాణి, భానుమతి ఈ ముగ్గురిని ఆ శీర్షికలో పెట్టలేకపోవడం బాధగానే ఉంది నాకు. కానీ అది అలా 1964 దాకా అలా వుండిపోయింది.
హిందీ ఫీల్డులో కృష్ణుడిగా సాహూ మోడక్ వేసేవాడు. అతనంటే అందరికీ ప్రేమ, ఇష్టం. కానీ ఎన్టీఆర్ కృష్ణుడు వచ్చాకా అన్ని భాషల రంగాన్ని ప్రభావితం చేశాడు. నవరసాలను చిలికించే కృష్ణ పాత్ర రామారావు కోసమా? అన్నట్లు నప్పింది. బబ్రువాహన ‘సెట్స్’ మీదకి నేను అలా వెళ్లనూ - అదే 1964 మే సంచిక చాలా ‘సిగ్నిఫికెంట్’.
చలనచిత్ర ‘రగడ’
1964 మార్చి మూడో వారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు మద్రాసు వచ్చాడు. చిత్ర పరిశ్రమ అంతా ఆయనని సన్మానించారు. నూట పనె్నండు మంది నిర్మాతలు ఈ సత్కారం చేశారు. సభకి బి.ఎన్.రెడ్డిగారు అధ్యక్షుడు బి.నాగిరెడ్డిగారు సన్మానపత్రాన్ని చదివాడు. ఈ సభ ఒక రకంగా మద్రాసు వదిలి వెళ్లిన అక్కినేని మీద ఫిర్యాదు లాంటిది అని నాడు ఈ మద్రాసు సినిమా వారు సమర్పించిన సుదీర్ఘమైన పత్రం తెలిపింది. దానిని ఎస్.వి.ఆర్.గారు గంభీరంగా చదివాడు. ఈ సమావేశానికి వున్న ప్రాముఖ్యతను బట్టి నేను మొదట కాస్సేపు వున్నా - తిరిగి ఆఫీసుకి వచ్చేసా. కానీ విజ్ఞప్తి పత్రిక మొత్తం తెమ్మని ధర్మారావుకి చెప్పాను. ఆ పత్రం నిడివిని తగ్గించకుండా అంతా ‘అవీ - ఇవీ - అన్నీ’ శీర్షికలో వేశాము. నటీనటుల తరఫున ఎన్టీఆర్ ముఖ్యమంత్రిని సత్కరించగా, మ్యూజిషియన్స్ తరఫున శ్రీమతి లీల సత్కరించగా, ఘంటసాల ప్రార్థనా గానంతో సభ సాగింది. డబ్బింగ్ ఆర్టిస్టుల తరఫున శ్రీశ్రీ, ఆంధ్రా ఫిలిం జర్నలిస్టుల తరఫున ఇంటూరి వెంకటేశ్వరరావు ఇలా అన్ని వర్గాలు కలిసి సన్మానించి ఆయనకి నషాళం అంటేలాగా చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు ఉన్న పళాన రావాలంటే వున్న సాధక బాధకాలను అతి వివరంగా అందించారు. ఆంధ్రప్రదేశ్ ఇవ్వ నిర్ణయించిన యాభై వేల సబ్సిడీ - కేవలం ఒక్క నటుడికి చెందిన నలుగురైదుగురు నిర్మాతలకే అందుతున్నదని ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్, నాగిరెడ్డిగార్లు మాత్రం వచ్చేస్తే చాలా?? ఈ పరిశ్రమ మీద ఆధారపడ్డ వేలాది తెలుగు కుటుంబాల మాటేమిటి? అని ప్రశ్నించారు.
‘తన వ్యక్తిగత అనుకూలం కోసం’ హైదరాబాద్ వెళ్తున్నాను అని చెప్పి ‘నటసామ్రాట్’ నాగేశ్వరరావు పోతూ పోతూ మద్రాసులో ఆంధ్రులకు గౌరవం లేదు అని ఒక మాట వేసి పోయాడు.
తమిళులకు బేధభావం వుంటే దిగ్గజాలయిన తెలుగు నిర్మాతలు దర్శకులు అగ్రశ్రేణి నటీనటులు ఎలా రాణించారు? అని నిలదీశారు. ఆ పత్రంలో - సదరు పేర్లు అన్నీ ఉటంకించారు. ఒక్క కుటుంబంగా వున్నాం. ఎక్కడున్నా మేం ఆంధ్రులమే. మీ వాళ్లమే. సర్వదా మేం ఆశించేది ఆంధ్ర ప్రజల ఆదరాభిమానాలు. మా తెలుగు భక్తి మీద అపోహలు కల్పించడాన్ని మేం ఖండిస్తున్నాం. అదీ...
సరిగ్గా అంతకు ముందు నేను శ్రీ రామారావుని ఇంచుమించు ఆరు రోజులు విస్తరించే సమయంలో ముఖాముఖీ ఇంటర్వ్యూ చేస్తూ దాన్ని ఒక మహానటుని జీవన శైలికి - ఆశయ పుష్టికి - ఇష్టానిష్టాల కళానిరతికి - అతని పద్ధతులకి పర్సనాలిటీకి చిత్రం పట్టే విధంగా మలిచాను.
నేరుగా అక్కినేనితో తన చివరి ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన అన్న మాటలే తప్ప మేము ఏమీ రాయలేదు. ఇది తెలుగు చిత్రసీమకి - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక ఉభయ తారకమయిన వంతెనగా తయారవ్వాలని అక్కడ ఇక్కడ ఉన్న తెలుగు నటులు, తెలుగు వారి అభివృద్ధికి, ఆనందానికి కృషి చేయడం ఖాయం అన్నాము అంతా.
‘పత్రిక’ హైదరాబాద్ ఎడిషన్ రాలేదా? పత్రిక రేపు విజయవాడకి వెళ్లొద్దా? అంటూ ముక్తాయింపు ఇచ్చాను.
అక్కినేని, రామారావులు తెలుగు చిత్రసీమ అభివృద్ధి రథానికి రెండు చక్రాలు లేదా రెండు గుర్రాలు కావాలి అంటూనే అభినందించాను. ముఖ్యమంత్రిగారే ఈ అపోహలను తొలగించాలి అంటూ ఎడాపెడా అందరూ మాట్లాడారు. అక్కినేనికి ‘గుండమ్మ కథ’ తమిళ చిత్రంతోనే శత చిత్రోత్సవం మద్రాసులోనే జరిగిందన్నది చాలా మంది గుర్తు చేశారు. బ్రహ్మానందరెడ్డి గారు సమాధానం ఇస్తూ ఆంధ్ర రాజధాని హైదరాబాద్‌లో తెలుగు సంస్కృతి వాతావరణాన్ని, తెలుగుదనాన్ని కల్పించడమే, తమ లక్ష్యం అన్నారు. ఎవరినీ దృష్టిలో పెట్టుకుని ఈ సబ్సిడీలు ఏర్పాటు చేయలేదు. అందరికీ ఇవి. మీ సలహాలు ఇవ్వండి. రెడీగా స్వీకరిస్తాం అంటూ తన టోపీ తీసి ఇలా త్రిప్పి పెట్టుకుని ముందుకు కదిలారు. సరిగ్గా ఈ టైములోనే మేము ఒక పత్రికగా ఏ కొమ్ము కాయకుండా ఆవేదనా భరితమయిన వివాదాన్ని యథాతథంగా ఇచ్చాము. దీని మీద చర్చలు, ఇంటర్వ్యూలు జరిపి సంచలనం చేయడం కాదు. మొత్తం ‘ఆవేదన’ని అవగాహనా దృష్టితో ప్రెజెంట్ చేశాము. అందుకనే, ఎన్టీఆర్ పూర్తి ఉదాహరణలతో చలనచిత్ర పరిశ్రమ తరలింపునకు చెందిన అంశాలతో రాసిన వ్యాసాలను మూడు వారాలు సీరియల్‌గా వేశాము.
బాబూ! వేషం కోసం వచ్చావా?
సరే, ఎన్టీఆర్‌తో ‘ముఖాముఖీ’ సందర్భంగానే ఎన్టీఆర్ అదే కారులోనే నేన ఏప్రిల్‌లో వాహినీ స్టూడియోకి వెళ్లాను. ‘బబ్రువాహన’ అనే చిత్రం షూటింగ్ అది. కానీ అర్జునుని పాత్రయే ముఖ్యం. అర్జునుడే హీరో. చలం కాబోలు బబ్రువాహనుడు. ఈ సెట్స్ మీద సంఘటన మరపురానిది. ఎన్టీఆర్‌కి భోజన పానీయాలు ఇంటి దగ్గర నుంచే వస్తాయి అని మొదటిసారి నేను నమ్మాను.
‘బ్రదర్! నా డ్యూటీ మైండెడ్నెస్ చూస్తారా?’ అంటూ ‘అర్జునుడు’ ఠీవిగా నన్ను సెట్స్ మీదికి తీసుకువెళ్లేసరికి సెట్స్ మీద చిత్రాంగద మందిరం సిద్ధం ఉంది. చిత్ర దర్శకుడు సముద్రాల సీనియర్. సముద్రాల రాఘవాచార్యులుగారే దీనికి కథ, మాటలు, పాటలు, డైరెక్షన్ అన్నీ చేస్తున్నాడు.
మేం లోపలికి వెళ్తుండగానే ‘అర్జునుడు’ ముందుగా మందిరం లోపలికి వెళ్లిపోయాడు. నన్ను యిలా చెయ్యి పట్టి ఆపి ‘ఆగు నాయినా! ఇటు చూడ్రా నేను సిఎస్ఆర్ని’ అంటూ ఫుల్ మేకప్‌లో వున్న పెద్దాయన ఆపాడు. అవతల ఈ చిత్ర కథానాయిక ఎస్.వరలక్ష్మి గారు కొన్ని క్షణాలు కాబోలు ఆలస్యంగా వచ్చింది అని ఎన్టీఆర్ చిర్రుబుర్రులాడడం నాకు కనపడింది. సమయపాలన అతి ముఖ్యం వరలక్ష్మిగారు అని నేను వేరే చెప్పాలా? అంటున్నాడు. అంత సీజన్డ్ సీనియర్ నటి ఎస్.వరలక్ష్మి ఒక్క మాట అనకుండా వొదిగిపోయింది.
సి.ఎస్.ఆర్. రంగుల దుప్పటి లాంటి గుడ్డతో కుట్టిన గౌను దాని మీద కోటు ధరించి ఉన్నాడు. నేను ప్రశ్నార్థకంగా చూశాను. నా జుట్టు ఇంచుమించు నా గిరజాలు. ఇలా తడిమి - ఏం బాబూ! వేషం కోసం వచ్చావా? చూచాగా.. ఎవరి వెంట వచ్చావో? రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే.. నంటూ నవ్వాడు. చెప్పాను. నేను ఆంధ్రపత్రిక ప్రతినిధిని.
‘అమ్మో! అలాగా!.. పోనీలే.. చూశావా? ఈ కంబళ్లతో కుట్టిన ముదురు రంగుల దుస్తులు? ఇలా వుంటే గానీ కెమెరా స్పష్టంగా లాక్కోదుట. తెర మీద మీకీ దుస్తులు చీనీచీనాంబరాలుగా కనపడతాయి’ అంటూ ఆప్యాయంగా కబుర్లు చెప్పాడాయన.
అంతలో ఎన్టీఆర్ అవతల ‘క్లోజప్స్’ ఇస్తుండగా సముద్రాలగారు కూడా వచ్చారు. ‘ఏం సార్! కుడి ఎడమయితే పొరపాటులేదోయ్! వోడిపోలేదోయ్’ అంటూ రాశారూ.. గూఢార్థం ఏమైనా ఉందా? అంటూ మాటలు కలిపాను. నవ్వేశాడు నిండుగా. తాగుబోతు మాటలకు పాటలకి అర్థాలు ఏముంటాయి? అబ్బాయి’ అని భుజం తరిచాడు. అది సరే లెండి. ఆ పాటలో ఫిలాసఫీ చాలా వుంది అన్నాను నేను.
(ఇంకా బోలెడుంది)