స్మృతి లయలు
మేటి విలక్షణ నటులు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఒక వర్కింగ్ జర్నలిస్టుగా - సృజన రఛనకి చాలినంత సమయం కుదరకపోయినా అనుభవాలు అవకాశాలు ఎన్నో దొరుకుతాయి.. కేవలం రచయితగా వుండి సోమేసెట్ మాంలాగా నవల రాయడానికి ముందు ఇండియా టూర్ చేసి వెళ్లి రాయడం సాధ్యం కాదుగా.. రెక్కాడాలి.. డొక్కాడాలి - కలం కదలాలి.. కొత్త అనుభవాలు అనుభూతి కావాలి. నేను తెర మీద - తెర వెనుక ప్లాన్ చేసినప్పుడు - అదీ యాభై అరవై ఏండ్లు ఇలా ఆకర్షకంగా ఉండిపోతుంది అనుకోలేదు. తెలుగు వెండి తెర ప్రియులు వారి వారి అభిమాన తారలు ఇంతకాలం కూరిమి కలిగి ఉంటారు - అన్నది ఆశ్చర్యమే. దేశం అంటే ‘తెలుగు లోకం’ ఇక్కడ సినిమా నటులు ఉండరు ఎక్కడో తమిళనాడులో ఉంటారు - అంచేత నిజంగా నాటి నటీనటులు - అందని గగన తారలే అయినారు. నా కథలకి హీరోతారున్యపు తొలి రోజుల రేపటి పౌరుడు. ఇక మధ్యతరగతి మందహాసమూర్తి నాకు అప్పటి దాకా ముడిసరుకు. కానీ వాళ్ల వృత్తిలో పండిపోయిన, ఆరితేరిన మహానటులు - చక్రపాణిగారి లాంటి పర్సనాలిటీస్ - ఒక ఫినామిన అనదగ్గ ఎన్టీఆర్ లాంటి నటుడు వీళ్లని - టేకిల్ చెయ్యాలి - మా ఏమ్మేస్స్ శర్మగారంటూ ఉండేవాడు - బొడ్డూడని పిల్లకాయవి - అని.
మా చిన్నప్పుడు - సాయంకాలం ఆకాశవాణి - పార్కు బాకాల్లో నుంచి - ఆలిండియా రేడియో, తెలుగులో వార్తలు చదువుతున్నది కొంగర జగ్గయ్యా అని వినబడగానే మా స్టూడెంట్స్ సహా అందరి చెవులు అటు పరుగులు తీసేవి. మరో పేరు పన్యాల రంగనాథరావు.. ఢిల్లీ వెళ్లి అక్కడ నుంచి ఇలా వార్తలు చదవడం.. కంచుగంట లాంటి ఆ గొంతు - ఫిదా అయిపోయేవాళ్లం నేనూ మా ఫ్రెండ్సూ. కానీ నేను అరవై మూడు జూన్‌లో ఫీచర్ చేసిన జగ్గయ్య - చేతిలో ఏడెనిమిది భారీ చిత్రాలు - చేతబెట్టుకుని ముమ్మరంగా నటిస్తున్న నటుడు - నాటకం రాజకీయం - రెండు రంగాల్లోనూ రాణిస్తున్న నలుగురు పిల్లల తండ్రి - నిజానికి జగ్గయ్యని సినిమా రంగం ‘ప్రియురాలు’ పిలిచినప్పుడు - జాగ్రత్తగా ఆలిండియా రేడియోకి కామా అంటే సెలవు పెట్టి చేరాడు - హీరో లేదా హీరోలాంటి - సైడు హీరో అంటారు సినీ పరిభాషలో - అట్టి పాత్రలకి మస్ట్ అయిపోయాడు. కొన్ని భాగాలు అలనాటి ఇంటర్వ్యూ నుంచి మచ్చుకి. ‘టాగూర్ పద్యాలంటే ఇష్టపడతాడు. ఆయనకి (అప్పటికి) వున్న పథకాలలో రవీంద్రుని పొయెట్రీ తెనుగు చెయ్యడం ఒకటి.. జగ్గయ్య అప్పుడు రాజకీయ పారిభాషిక పదకోశం ఒకటి కూర్చుతున్నట్టు చెప్పాడు.
నాటకాలను ఆడటం చిన్ననాటి విద్యయే.. అందులోను మనోహర అదరగొట్టే నాటకం - అతనికి కొట్టిన పిండి - తెనాలిలో మనోహర నాటకం ఆడి రెండు లక్షల రూపాయలు సేకరించి స్థానిక కళాశాలకి విరాళంగా ఇవ్వడం - నాటక కళకు ఒక ఉన్నతమైన ప్రయోజనాన్ని సాధించాను అన్న తృప్తిని ఇచ్చింది - ఒక నటుడిగా తెనాలి పౌర సన్మానం చేసి సత్కరించింది. జగ్గయ్య రెండుసార్లు అదే నాటకం చూసి మురిసిపోయింది ఆంధ్ర పారిస్‌గా పేరుగాంచిన తెనాలి. వరంగల్ మెడికల్ కాలేజీకి విరాళం కోసం అక్కడ నాటకం వేసి లక్ష రూపాయలు సేకరించాడు. అప్పట్లో ‘రక్త తర్పణం’ అన్న నాటికను వ్రాసి వేసినవాడు జగ్గయ్య - అదీ దేశ రక్షణ నిధికి విరాళం కోసం.
బై ది బై - మీరు నాస్తికుడా? అంటే ఆ ప్రమాదం తప్పింది - అనే్వషణ సంఘర్షణా ముగిసాయి. అయ్యా, నేను ఆస్తికుడనే.. ప్రతిభ కల్పన రెండు వున్న జగ్గయ్యతో మాట్లాడుతూ వుంటే - ఏదో సాహితీ జగత్తులోకి పోయి చర్చిస్తున్నట్లుగా ఉంది. నిర్మాతగా అతని అభిరుచికి ముందడుగు చలనచిత్రం ఒక గీటురాయి - అతని కీర్తి కిరీటంలో కలికితురాయి.
జగ్గయ్యకి మొహమాటం లేకుండా రాజకీయాలంటే మక్కువ వుంది. ఇంటి నిండా పుస్తకాలున్నాయి - రిలీజియన్ ఎథిక్స్ మొదలు - ఎరల్ స్టేన్లీ గార్దేనేర్ దాకా బీరువాలలో పుస్తకాలు కులుకుతున్నాయి. పక్క గదిలో సన్మాన పత్రాలు - మెమొంటోలు విడిసివున్నాయి. ఆయనకి నూరు సినిమాలు లేవు గానీ - నూర్రోజులు చేసుకున్న సినిమాలు ట్రోఫీలు ఉన్నాయి. చాలా స్పీడుగా అర్ధ సెంచరీ చేసిన విలక్షణ నటుడిగా అభినందిస్తూ - ఈ ఫీచర్ చేశాను. సినిమా వాళ్లకి రాజకీయ పరిజ్ఞానం ప్రమేయం రెండూ వుండాలని తన నమ్మకం. చివరికి అటే తిరిగే కృషి వుంది. డాక్టర్లు యాక్టర్లు ఎవరి మట్టుకి వాళ్లు - మాకు రాజకీయాలు వద్దు వద్దు అంటే ఎట్లా? ప్రజా పాలన కొంచెం మంది చేతిలోకి జారిపోతుంది. తాను నమ్మిన దైవాన్ని కొలిచే స్వేచ్ఛ వుండాలి అని మనిషి కోరుకున్నట్లే - తానూ నమ్మిన సిద్ధాంతానికి ప్రచారం చేసే హక్కు కూడా ఉండాలి. కాకపోతే సినిమా నా కెరీర్ - అయితే దీనితోనే జీవితం పరిపూర్ణమవుతుందా? తృప్తి లభిస్తుందా? అని ఎదురుప్రశ్న వేశాడాయన.. బంగారు పాప.. అర్ధాంగి చిత్రాలు - పరిణతి నందిన నటనకి గీటురాళ్లు అన్నారు క్రిటిక్స్. సినిమా నటులు ఉత్త చెకీ బొమ్మలు కాకూడదు అంటాడాయన - అన్నట్లు శ్రీ జగ్గయ్యకి ఎక్కడైనా - ముఖ్యంగా బహిరంగ సభలలో - సినిమా పరిశ్రమలోని వారిని వెనకేసుకొచ్చి ఉద్ఘాటించడం అలవాటు.
సినిమా కెరీర్‌లో వున్నా వారి భవిష్యత్తుకు గల సెక్యూరిటీ ఏమిటి? వాళ్లకి ప్రావిడెంట్ ఫండా? పెన్షన్‌నా? లేక రిటైర్‌మెంట్ దాకా ఉద్యోగం హామీయా?.. అని వాదిస్తాడాయన. పైగా టాక్సులు పీడిస్తాయి మమ్మల్ని అంటాడు. అసలు జగ్గయ్య వాగ్ధాటికి మురిసిపోయి వస్తారు జనాలు. అతని డైలాగులు శివాజీ గణేశన్‌కు తెలుగు కీర్తిబావుటాని అందించింది అంటారు. సినిమాల మీద ఈగ వాలనివ్వరు - ఓసారి వినోబాబావే గారు సినిమా వాల్‌పోస్టర్లను తిట్టాడు. ఈయన ఆయన మీద విరుచుకు పడ్డాడు.
అమితాబ్ బచ్చన్ సరసన శశికపూర్ కొన్ని విలక్షణమైన పాత్రలు పోషించి గొప్పగా రాణించినట్లు - జగ్గయ్యా అక్కినేనితో - చిరస్మరణీయమైన నటన ప్రదర్శించాడు. జగ్గయ్య ఫీచర్ పడ్డ తరువాత - మా ఉత్తరాల శీర్షికలో - సినిమా వాళ్లు ఉపాధి భద్రతా వగైరాల మీద ఘాటు చర్చలు కొనసాగాయి. ప్రభాకర్ చేత ప్రత్యేకంగా తీయించిన ఫొటోని ముఖచిత్రంగా వేశాము. హీరో కాకపోయినా ఇంపార్టెన్స్ ఫెర్ఫార్మెన్స్ వున్న విలక్షణ నటుడు గుమ్మడిగారు.
సమర్థతకు మారుపేరు గుమ్మడి
అప్పటికి తొంభై నాలుగు చిత్రాలు పూర్తి చేసుకున్నా గుమ్మడి ముఖచిత్రంతో వీక్లీని వదలలేకపోయాము. మనకి వున్న సకుటుంబ సలక్షణ నటుడు గుమ్మడి. పాత్రని అర్థం చేసుకుని - దానికో ప్రత్యేకతని సంతరింపజేసి చిరకాలం జ్ఞాపకం వుండేలాగా చేసిన ఘనత గుమ్మడి వెంకటేశ్వరరావు గారిది. నవలలు ఇతర పుస్తకాలు బాగా చదివి ఎంజాయ్ చేస్తాడాయన. జీవితం నెరవేరిన మధుర స్వప్నం ఆయనకీ. (నాటి ఫీచర్ నుంచే కోట్ చేస్తున్నా ఇదంతా) ముప్పై ఆరో లేక ముప్పై ఏడో వసంతాల వయస్సున్న గుమ్మడి ఇప్పుడు కడుతున్న వేషాలు, జీవిస్తున్న పాత్రలు చూస్తే, అతనికి గల భవిష్యత్తు లెక్క ఇంకా చాలా ఎక్కువ వుంటుంది. మరో ముప్పై ఏండ్లు - రాబోయే తరాల హీరోలకి తండ్రి వేషం వేసి వాళ్లని మరిపించే నటన ప్రదర్శించవచ్చును - గుమ్మడి కేరక్టర్యాక్టర్..
నిజ జీవితంలో ఏడుగురు పిల్లలూ సంసారం సొంతిల్లు - సగర్వంగా చెప్పుకోగల కేరీరు - ఎన్నో తీరిన ఆశలు - కొన్ని సాధించిన ఆశయాలు ఇదీ గుమ్మడి -96 - నాట్ అవుట్ కథ.
అప్పుడాయన నా సీరియల్ చదువుతున్న ఒకే ఒక్క మగ సినీతార - పిన్నిగారి పాత్రకి అన్యాయం జరిగిపోతోంది - అది ఉదాత్తమైన పాత్ర - ఆమెకి ఇంకా బూస్ట్ ఇవ్వండి అంటూ సంభాషణల మీద సన్నివేశాల కల్పనల మీద చర్చిస్తూ లెటర్స్ రాసేవాడాయన. కాకపోతే ఎప్పుడూ అగ్నిహోత్రం ధరించే వుండేవాడాయన. ఇదే అలవాటు జగ్గయ్యకి ఉంది సిగరెట్టుతోనే ఫొటోకి పోజులు ఇవ్వడంలో నాటి సినిమా నటులు ఉత్సాహం చూపించేవారు. కలుపుగోలుతనంగా కబుర్లు చెప్పే మంచి సంభాషణాశీలి - గుమ్మడి. అప్పటి చెలిమిని ఆయన మరిచిపోలేదు. 2006లో అనుకుంటాను విజయవాడలో సిద్దార్థ కాలేజీ వాళ్లు వేటూరికి గుమ్మడికి సన్మానం చేశారు. నేనూ నండూరి ఇద్దరం కనపడితే చాలు ప్రక్కప్రక్కన సెటిల్ అయిపోతాము. మా ఇద్దరికీ ఆంధ్రపత్రిక నాస్టాల్జియా చాలా ఉంటుంది. వేటూరి సుందర్రామ్మూర్తి - మోకాలి నొప్పుల వల్ల వేదిక మీదికి పోవడం కష్టమైంది. కానీ ఆ ఇద్దరూ కూడా - వేదిక మీ నుంచి మమ్మల్ని - మైక్రోఫోను అందుకుని మరీ గ్రీట్‌చేసి గుమ్మడి తన ప్రసంగంలో సెంచురీలు చెయ్యమన్నారు చేశాను కానీ వీరాజీ బాబు - ఓ సంగతి చెప్పాలి. ఈ మధ్య నేనూ అక్కినేని ఓ సభకి వెళ్లాము - అక్కడ హాలులో గ్యాలరీలో ప్రముఖుల చిత్రపటాలు చూస్తూ - మన పటం కూడా ఈ వరుసలోకి వస్తుందా అని అక్కడైతే బెటర్ - కాదులే ఇటు వరస బాగుంటుంది అనుకున్నాం అంటూ నవ్వాడు - రోజులు మారాయి మనకి చోటు వుండాలిగా ముందు.. అన్నాడు అక్కినేని అంటూ గుమ్మడిగారు సరదాగా మాట్లాడాడు. అదే ఆఖరుసారి.. మొత్తానికి ఈ మహానటుడు అయిదు వందల దాకా పాత్రలు పోషించాడు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాటి నటుల ప్రత్యేకత.
సరే నా ఇంటర్వ్యూ నాటికి కులగోత్రాలు, తిమ్మరుసు, సిరిసంపదలు, ఆ మూడు గొప్ప చిత్రాలు ఢిల్లీ సత్కారం అందుకున్నాయి. అప్పాజీ అంటే తెలుగు వాళ్లకి గర్వంగా వుంటుంది. ఆ పాత్రలో గుమ్మడి జీవించాడు. సదరు చిత్రానికి ’62లో ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది. నాటికీ వరసగా నాలుగుసార్లు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డులు అందుకున్న గుమ్మడి తనకి నాటకాల అనుభవం తక్కువే అని అంటూ అక్కడ కంటిన్యుటీ వేరు ఇక్కడ నటన వేరు అన్నాడు. గుమ్మడికి పౌరాణిక సాంఘిక చారిత్రక చిత్రాలు మూడూ ముచ్చటగా నప్పుతాయి. అయిదు వందల చిత్రాల క్లబ్‌లో గుమ్మడి వెంకటేశ్వరరావు గారిది స్పెషల్ సీటు. తెనుగు వెండి తెర మీద అతనిది బంగారు స్థానమ్!
(ఇంకా బోలెడుంది)