స్మృతి లయలు
వెండితెరకి ‘బంగారు’ వరం.. యస్వీఆర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రపత్రిక (మద్రాసు) ఎడిటోరియల్ హాలు ప్రక్కనే ఒక నడవ లాంటి చీకటి గది వుండేది. అందులోనే భారతి పత్రిక ‘చూసే’ సాంబశివరావుగారి కుర్చీ ఉండేది. అక్కడ పాత పత్రికల ‘మూటలు’, కొన్ని బీరువా నిండా పత్రిక యొక్క అక్షర కాణాచి అనదగ్గ ఫైళ్లు.. పాత ఉగాది భారతి సంచికలు గట్రా వుండేవి. వాటికి ఆలనా పాలనా లేదు. ఎవరికి అక్కరలేదు. ‘ఏమిటి? మహారచయితగారు ఎప్పుడు చూసినా గదిలో ఎలుకలాగా ‘సెర్చింగ్’ ‘సెర్చింగ్’ అనేవాడు వి.వి.యన్.గారు. నేను నవ్వేవాణ్ణి. ‘సెర్చింగ్ కాదు సార్. రీసెర్చింగ్!’ అది నా రీడింగ్ రూము. చాలావరకు పాత బంగారం అనదగ్గ అంశాలు దొరికేవి. వెతుకులాటా అంతా చాలాకాలం తరువాత... ఒకసారి 1980 ప్రాంతంలో ఆలిండియా రేడియో, విజయవాడ వారు ‘ఆంధ్రపత్రిక’ పాఠకులు - నాటి పంతులుగారు, నేటి శంభుప్రసాద్ గార్ల మీద రెండు భాగాల ప్రసంగం చెయ్యమన్నారు. అప్పుడు ‘ఆంధ్రపత్రికీయం’ అని రాశాను. రికార్డు చేశారు. అటు తరువాత ఈ వ్యాసాలు అప్పుడప్పుడు. ‘రిఫ్రెష్‌డ్ కోర్సులా’గా, ఒక ‘యాద్‌గార్’ లాగా అనిపించేది. అసలు యుగకర్తగా వాసికెక్కిన కందుకూరి వీరేశలింగం పంతులుగారు ‘వివేకవర్థిని’ పత్రికను ఈ పంతులుగారు ప్రేరణగా, ఒరవడిగా తీసుకున్నారుట. ఆ పత్రిక ‘మోటో’ (లక్ష్య వచనం)గా తిక్కనగారి విరాటపర్వంలో నుంచి విదురనీతి పద్యం ఎత్తుకున్నారు...
‘ఒరులేయవి ఒనరించిన నరవర/ అప్రియంబు తనకగు లానొరులకు/ అవిసేవయకునికి పరాయణము/ పరమ ధర్మ పథముల కెల్లన్.. అన్న పద్యం వుండేదిట. అదే పద్యం ఆంధ్రపత్రిక దినపత్రిక ఎడిట్ పేజీలో సంపాదకీయం యొక్క ‘మాస్ట్‌హెడ్’ మీద ‘పత్రిక ఆశయ వచనంగా వుండేది’ చివరిదాకా - ఇది ఆచరణ సాధ్యమా? యోగ్యమా? లాంటి మాటలతో పని లేదు - అది నన్నాకర్షించింది చిన్నప్పుడే. 1973లో నేను రెండోసారి వారపత్రిక సేవలకు దిగినప్పుడు నాకు పూర్తి స్థాయి ‘వెసులుబాటు’ లభించింది. అదంతా తరువాతి వాయనాలలో చెబుతాను. కానీ ఆంధ్రపత్రిక వీక్లీ ఎడిట్ పేజీ ‘మాస్ట్‌హెడ్ మార్చేశాను. సందర్భవశాత్తు చెప్పాల్సిన మాట అది - ఈ ‘పద్యాన్ని’ మకుటంగా చేసి ‘మాస్ట్‌హెడ్’ చేశాను. అసలు జర్నలిస్టిక్ జార్గాన్‌లో పత్రిక తొలి పుట మీద శీర్షిక అంటే అదే ‘్ధ్వజం’ అన్న మాట. ఈ వారపత్రిక క్రొత్త అలంకరణతో మార్కెట్‌లోకి పోంగానే నాకు ‘ఒక ఫోన్‌కాల్ వచ్చింది’. అది స్వాతి సంపాదకుడు బలరామ్ దగ్గర నుంచి. చాలా సంబరంగా అభినందించాడు. తను నాకు చిరకాల మిత్రుడు కూడా. ‘అదరగొట్టేశారు గురువుగారూ’ అద్భుతంగా వుంది.. ఆ ‘ఒరులేవి యొనరించిన ‘మోటో’ని వీక్లీ మీద చూశాక పులకరించి పోయాను. వీక్లీ.. మాకు పోటీ పత్రిక. దానితో మీకు మాకు యుద్ధం - యివన్నీ తీసి ప్రక్కన బెడతా’ అన్న వేమూరి బలరాం మాటలు నాకు ఇంకా చెవుల్లో మధురమంజులంగా ధ్వనిస్తాయి. ఆ శీర్షికా ఫలకంలో పంతులుగారి పేరు, అయ్యవారి పేరు ప్రముఖంగా చేర్చాము. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే నాటి యింటర్వ్యూలు ఎట్లా వుండేవి అన్న కుతూహలం ఒకటి నన్ను పీకింది. ఇప్పటి ‘ఇంటర్‌నెట్’ యుగంలో ఇప్పటి సదుపాయాలతో పోల్చి చూస్తే మా ‘మద్రాస్ పత్రికాభ్యాసం’ రాతియుగం లాంటిది. ‘అందుకేనా? నువ్వెప్పుడు ‘స్టోన్’ మీద వుంటావు’ అని జోక్ చేసేవారు. మిత్రులు కూడా. కానీ అప్పటి స్థితిగతులు సాంకేతిక సదుపాయాలతో పోలిస్తే, ఆంధ్రపత్రిక బొంబాయిలో ఆవిర్భవించే నాటికి ఉన్న పరిస్థితులు ‘పాతరాతి యుగమే’ కానీ ఆ ధర్మాలు సిద్ధాంతాలు నవ నవోనే్వషణం. ప్రగతి దాయకం అయినవి.
కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు 1903లో అమృతాంజన్ మందుల కంపెనీ మొదలుపెట్టి (ఎందరో అనుకున్నట్లుగా) ‘అమితంగా సంపాదించారు’. సంపాదించి వుండొచ్చును కూడా. కానీ ఆ సొమ్ములను ఆయన 1908 వినాయక చవితి నాడు ఆంధ్రపత్రికను స్థాపించి అందులో పెట్టి సద్వినియోగం చేశారు. (ఎంత గ్రేట్!)
అదే ‘ఆంధ్ర’ పేరు మీద అవతరించిన ‘వీక్లీ’ అదేదో ‘అమృతాంజన్’ని ప్రమోట్ చేయడానికి అని అనుకోడానికి ఇంత పిసరు వీలు లేకుండా - ఆ కొత్త మలుపు లాంటి పత్రిక యొక్క అవసరాన్ని ఉటంకిస్తూ దాని లక్ష్యాన్ని - మొట్టమొదటి సంచిక ‘ప్రస్తావన’లోనే అరటిపండు వొలచి చేత పెట్టినట్లు ఇలా రాశారు.
‘ఆంధ్రాభ్యుదయానికి అవసరమైన అనేకానేక ఉద్యమాల్ని అన్ని రకాల వస్తువులను స్వతంత్రమైన విమర్శనాత్మక రీతిలో ‘చర్చించుటకై’ (మైండ్ యూ ‘చర్చించుటకై’ అన్నమాట) ఈ పత్రికను స్థాపిస్తున్నాను.’
ఆదిలోనే కార్టూన్లు, వ్యంగ్యరేఖా చిత్రాలు, ఇంటర్వ్యూలు వున్నాయి - ‘సరస చిత్రకల్పన’ అన్నారు. ఇంటర్వ్యూని ‘సంభాషణం’ అన్నారు. ఇక్కడికి రావడం కోసమే ఈ ప్రస్తావన అంతా చేశాను. ఎందుకంటే? నేను తెర మీద - తెర వెనుక శీర్షికకి - ఎస్.వి.ఆర్.ను ‘ఇంటర్వ్యూ’ చేయడానికి వెళ్తున్నాను. నాటి ఇంటర్వ్యూకి ‘సంభాషణ’ అని పేరెట్టారు. ఆ పద్ధతిలోనే సాగించాలి నేనూ కూడా అనుకున్నాను. అయితే ఓ డౌటు వచ్చింది సహజంగా... కలియుగం భీముడిగా వాసికెక్కిన తెనుగు వెలుగు - విజయనగరం వస్తాదు - సర్కస్ కంపెనీ యజమాని శుద్ధ శాకాహారి, పరమ ఆంజనేయ భక్తుడు, ‘గామా’ పహిల్వాన్‌ని చిత్తు చేసిన వాడని కూడా చెబుతారు. ఆయనతో 1911లో బొంబాయిలో (అక్కడేగా వుంది పత్రిక అప్పుడు) ఇంటర్వ్యూ అనగా ‘సంభాషణ’ జరిగింది. కోడి రామూర్తిగారు లండన్ పర్యటనకు వెళ్లబోతూ ‘ముఖాముఖీ’లో ఓ ‘ప్రీవ్యూ’ లాంటి ప్రదర్శన ఇచ్చారుట నాడు. అప్పుడు బొంబాయిలోని మలబారు కొండ (హిల్స్) మీద ఆయన ‘నివాసం.’
శ్రీ కోడి రామూర్తిగారు ఆంధ్రపత్రిక ‘ప్రత్యేక ప్రతినిధి’ని చూస్తూనే - ఒక్క ఉదుటున లేచి ఎదురొస్తూ ‘ఓహోహో!’ మీరాంధ్రపత్రిక ప్రతినిధులా? మిమ్ములను చూచుట వలన చాలా సంతోషమయినది. ఆంధ్రపత్రిక ఆంధ్రలోకమున ప్రసిద్ధి గాంచుటయేగాక, బర్మాలోను, మధ్యపరగణాలలోను ఆంధ్రులు మిక్కిలిగా చదువుచున్నారు. నాగేశ్వరరావు గారి దేశభక్తికి నిరంతర కృషిని ఇది వెల్లడి చేయుచున్నది. అయ్యా!’ అంటూ హూంకరించారుట. అదే ‘టైమ్’లో ‘హస్త ప్రదర్శన’ మెండుగా చేశారుట. హస్త ప్రదర్శన అంటే కరచాలనం అనగా ‘షేక్‌హ్యాండ్’. అట్లాగా అనుకున్నట్లుగానే యస్.వి.ఆర్. గుమ్మంలోనే హడావిడిగా రండి రండి! ఆంధ్రపత్రిక వారూ - రండి స్వాగతం సుస్వాగతం’ అన్నారు. నా చెయ్యి వదలి అటు తిరిగి ఆనక ఆ చేతనో కుక్క, ఈ చేతనో కుక్క (అవి పెద్ద పులుల్లాగా వున్నాయి) పట్టుకుని వీటిని బంధించేసి వస్తానన్నాడు. మొత్తం నాలుగు కుక్కలున్నాయిట. అందులో ఒకదాని పేరు జూలియస్ సీజర్ ‘అమ్మయ్య’ అనుకున్నాను. నిజం చెప్పానుగా. నాకు కుక్కలంటే మొత్తం మీద ఫోబియా లాంటిదో ‘ఎలర్జీ’ లాంటిదో వుంది.
వినాయక చవితి 1963 ప్రత్యేక సంచికలో యస్.వి.ఆర్. ఫీచర్ వేశాం. సామర్ల వెంకట రంగారావుది గ్రేట్ క్యారెక్టర్ యాక్టర్ - ఫీచర్ తెర మీద - తెర వెనుక.
ఆంఫట్! జై పాతాళభైరవీ!
ఆంఫట్ అన్నది నేపాలీ మంత్రమా? యశస్విగా పేర్గాంచిన రంగారావు మెస్మరిజిమా?
రెండు వారాలు ప్రత్యేక, ప్రయివేటు ఛాయా చిత్రాలతో (ప్రభాకర్‌ది బొమ్మల క్రెడిట్) చేసిన ఆ ఫీచర్ నుంచి కొన్ని సంగతులు చెబుతా. అంతే క్రూ ‘రంగారావు’ గం‘్భర రంగారావు’ ఏ పాత్రతోనైనా అదరగొట్టే సత్తావున్న రంగారావు ఏకైక సినీ రంగారావు. మీ వోటు పాతాళభైరవి ఆంఫట్ మాంత్రికుడికా? మాయాబజారులో ఘటోత్కచుడికా? రంగారావ్ లేకపోతే ‘టిపికల్’ నటన లేదు. ఒక కన్ను మూసి, రెండో కన్ను చివ్వున కెరటంలాగా లేపడం అతడొకనికే సాధ్యం. రంగారావు లేకపోతే పాతాళభైరవి కథ ఇంకొకరకంగా ఉండేది. వేసిందేమో మామల మంత్రాల కిరాతక, కర్కోటక, భయంక‘రంగా’రావు పాత్ర. వొలికించిదేమో హాస్య, శృంగార, రౌద్ర రసాల మేళవింపు. ముందుగా మహానుభావుడు, పింగళి నాగేంద్రరావుగారి కలానికి ‘శభాసులు’ చెప్పి రంగారావు పాల్గొన్న సన్నివేశం ఒకటి (తెరమీద తెర వెనుక శీర్షిక నుంచి) కోట్ చేస్తాను.
అవతల రాకుమారి పెనుగులాడుతూ వుంటుంది - అలాగే మాంత్రికుడి వేపు చూస్తుంది. ‘ఆంఫట్’ రాయుడు. వ్యామోహం, వాత్సల్యం కలగలిపి ఇలా నవ్వుతూ ‘శఠం గిఠం శాయక.. శృంగారమ్ సేయవే బుల్‌బుల్..’ అంటాడు. నిజంగా స్క్రిప్టు మరోలాగా లేకపోతే ఈ ‘గిలిగింతల’ వలపు నవ్వులకి రాకుమారి బోల్తా కొట్టేదేమో? అన్నది ఇంటర్వ్యూ చేసిన నా వ్యాఖ్య. ఎందుకంటే పౌరాణికంగా ఒక కొత్త బాణీలో, సాంఘికంగా ప్రత్యేకంగా డైలాగులు చెప్పడంలో ఒక స్టడీ. ఒక తపస్సు చేసిన యస్.వి.ఆర్. మాయా బజార్ వచ్చేసరికి స్పెషల్ ఎఫెక్ట్సు ఇవ్వడంలో పండిపోయారు. (మళ్లీ పింగళిగారే.) ప్రత్యక్షంగా ‘ఘటోత్కచుడు’ అసలు రాక్షసుడు. బీభత్సరస ప్రదర్శనకి అధిష్టానుడు. కాని యస్.వి.ఆర్. కృష్ణుని వేషంలో వున్న ఎన్.టి.ఆర్.ని ‘తినేస్తానన్న’ స్థాయిలో అద్భుతమైన ఉదాత్తమమయిన ప్రదర్శన ఇస్తాడు.
మాయాబజార్‌లో యస్.వి.ఆర్. ఘటోత్కచుని పాత్రలో ఒక అసురుడిగా కాక, ఒక ధర్మానికి, నీతికి కట్టుబడి ఒక ఆదర్శ నాయకునిగా పాత్రని పోషించాడు. ‘దుష్ట చతుష్టయం’ అన్న మాటని అతని అనుయాయులు నోరు తిరగక ‘దుషట చతుషటయం’ అంటూ విడగొట్టి పలికితే అట్టహాసం చేశాడు. ఘటోత్కచుని పాత్రలో ఎస్.వి.ఆర్. నవ్విన ఆ నవ్వు ‘దుష్‌ట చతు యహా..’ అంటూ పలకడం అనితర సాధ్యం- అని నీరాజనాలు పట్టింది ప్రేక్షక లోకం. అసమదీయులుకి వ్యతిరేక పదం తసమదీయులు అంటూంటే శిష్యులు మాటలు మనం చేయకపోతే ఎవరూ చేస్తారు? అంటూ వీరతాడు వేయించిన ఘటోత్కచుని పాత్ర రంగారావులో జీవించింది. పురాణ పాత్రలు అయిన రాముడు, కృష్ణుడూ కాదు. ప్రతినాయక పాత్రలు అయిన హిరణ్యకశిపుడు, కీచకుడు చివరికి దుర్యోధనుడు, మైరావణుడు కూడా రంగారావు పోషించిన తీరుకు - అందరూ ‘్ఫదా’ అయిపోయారు. అంతవరకు మన నటులు ఎవ్వరికీ రాని అంతర్జాతీయ అవార్డు ఇండొనేషియా ఫిలిమ్ ఫెస్టివల్‌లో యస్.వి.ఆర్.ని వరించింది. పైగా విరోధాభాస ఏమిటి అంటే కీచకుడి పాత్రకి (నర్తనశాల చిత్రంలో) విశ్వవిఖ్యాతి లభించింది. మళ్లీ సత్య హరిశ్చంద్రుణ్ణి కూడా రంగారావు తనలో నిలబెట్టడం తెలుగు వాడికి గర్వ కారణం కాగా అప్పుడు యస్.వి.ఆర్. తెలుగు చిత్రాలలోకన్నా తమిళ చిత్రాలలో టాప్ ర్యాంకులో వున్నాడు. నేనదే ప్రస్తావించితే తెలుగు చిత్రాల పట్ల చిన్నచూపు ఏమీ లేదు. నాదైన పద్ధతిలో వస్తే తెనుగుకే పెద్దపీట వేస్తాను అని చెప్పారు రంగారావుగారు. నిజ జీవితంలో యస్.వి.ఆర్. అపార నాటక అనుభవం అంటే షేక్స్‌పియర్ నాటకాలలో కూడా నటించి ప్రశంసలు అందుకున్న ప్రతిభ గలవాడు. ఆంఫట్ మాంత్రికుడిగా రాణించడంలో, ‘షైలాక్’ పాత్ర పోషణ ఛాయలున్నాయా? అంటే నవ్వేశాడు (కొంచెం వంకరగా.)
‘గివ్ మి మై పౌండ్ అప్ ఫ్లెష్’ అన్న డైలాగు తను నాకు చెప్పి వినిపించడం ఆ ఇంటర్వ్యూకి హైలైట్. హుక్కా పీలుస్తూ కథలు రాయడం గురించి కూడా ఆలోచిస్తాడు. పెయింటింగ్ హాబీగల చిత్రకారుడతను. తుపాకులు ఉన్నాయి గోడ మీద వ్రేలాడుతూ. ఆ సరదా కూడా వుంది. వేట సరదా అదీ వుంది.
మంచోళ్లకి మంచి. చెడ్డోళ్లకి చెడ్డ. వాదోపవాదాలు వస్తే డీఢీక్కికి సై. తెర మీద ఎస్.వి.ఆర్. తన పాత్రలో లీనమైపోతాడు. ఎన్నోసార్లు బ్రేక్‌డౌన్ అయిపోయాడు కూడా.
ఇదే రంగారావు ఓ అరటన్ను ఆహార్యం, కిరీటాలు భుజకీర్తులు, నగలు, వంకీలు, కిర్రు చెప్పులు వగైరా భారంతో నటించే రంగారావు ‘ఆటమ్మా పాటమ్మా! ఈ జగమంతా తోలు బొమ్మలాటమ్మా (బంగారు పాప)’ అంటూ కంట తడి పెట్టించాడు.
‘బాబూ వినరా! ఓ కథ ‘పండంటి కాపురం’లో ఏ ఆహార్యం లేకుండా పాత్రలో లీనమై జీవిస్తాడు.
అలా కలకాలం ఒక ఆరని వెండితెర బంగారు వెలుగులాగ నిలిచిపోయాడన్నది నాటి తెర మీద తెర వెనుక ఇంటర్వ్యూ చేసిన అప్పటి యువ జర్నలిస్ట్ అభిప్రాయం.