స్మృతి లయలు

నేను, గంగా జమునా.. దిలీప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడి ఒక కోనలో పిల్లలొక కోనలో అన్నట్లుగా ఎడం, దూరం అయిపోయింది బాగా ఆంధ్రపత్రిక - ఆంధ్రప్రదేశ్‌కి. నేను చేరేటప్పటికి ఆరు పేజీలు ఏడు నయాపైసలకి - పది పేజీలు ఆదివారం నాడు - పదమూడు నయా పైసలకి దొరికే పత్రికని, అందితే తెలుగువాడున్న ప్రతీ గ్రామం, ప్రతీ మూలా కళ్లకద్దుకుని అందుకునే వాళ్లే గానీ - అది అందటమే ప్రధాన సమస్య. అవతల రష్యా వాడు రెండోసారి మనిషిని అంతరిక్ష యానానికి - భూ పరిభ్రమణానికి పంపాడన్న మాట కరెక్టే గానీ, మన దేశంలో అభివృద్ధి ‘సైకిల్’ నడకే నడుస్తోంది.
మద్రాసుకి బెజవాడే దూరం - ఈ ఏడు పైసలలో ఏజెంట్‌కెంత? ‘వెండార్’కెంత? వార్తలు సేకరించే వార్తాహరుడికి - కార్యాలయంలో పనిచేసే సిబ్బంది వంద మందికి పైగా వున్న వర్కింగ్, నాన్ వర్కింగ్ జర్నలిస్టులకీ అందేదెంత? యజమానికి మిగిలేదెంత?
ఓ, ‘రిఫరెన్స్’ సెక్షనా? ‘ఇండెక్స్ డిపార్ట్‌మెంటా?’ అంది విడిగా రేడియో కూడా ఉండదు.
వార్తల వేళకి పార్కుల్లోకి, హోటల్స్ మొగల్లోకి పరుగులు తియ్యాలి జనాలు. ఆ ‘టైమ్’లో, మద్రాసులో బయటకు పోతే? ప్రత్యేక ద్రవిడనాడు ఉద్యమాలు - ఎం.ఆర్.రాధా, శివాజీ గణేశన్‌ల నాటకాలు, కామరాజ్ నాడార్ గారి మీటింగులే ఎక్కువ కవర్ చేయాలి.
అయినా మద్రాసు నగరం నాకు తెలుగుదనంతోనే కనపడ్డాది. ముఖ్యంగా తెలుగు వాడి పత్రికలు, తెలుగు సినిమా పరిశ్రమ, ఇవి పూర్తిగా, ఇక్కడే కాళ్లు విరిగిన ఏనుగుల్లాగా పడి వున్నాయి. అదే కారణం.
టి.నగర్, పానగల్ పార్క్, పాండీబజార్, మైలాపూర్, జార్జిటవున్‌లు మన ‘కళ’తో కళకళలాడేవి. కనీసం డైరెక్ట్ డయలింగ్ టెలిఫోన్‌లేనా లేవు. ఆంధ్రపత్రికని నీలంరాజు వారు, పండితారాధ్యుల వారు ఇంకా అలాంటి వాళ్లు వదిలేసినా - ఎందరో మంచి ఏజెంట్లు, తలలు నెరిసిన అనుభవంతో, పండిన విలేఖరులు ఉండటం చేత - పత్రిక కోసం ఇంకా ఎన్నో ఎదురుచూపులున్న రోజులవి.
పత్రిక కేవలం వార్తలకే కాదు - సంస్కృతి, సంప్రదాయం, విద్యా వ్యాపారాల అభివృద్ధికీ ఒక ‘వేదిక’ అనుకోవడం చేత - ‘గుడివాడలోనూ, అనకాపల్లిలోనూ కూడా తిరుగులేని సర్క్యులేషన్ మాది’ అని పెద్దలు ‘హాలు’లో అనుకొనేవారు.
‘ఆదివారం’ సంచిక ఆంధ్రపత్రికకి సేవ చేసే అవకాశం దొరకటం, నాకు ఉభయ తారకం అయింది. చాలాకాలం ఆదివారం పత్రిక విడిగానే ప్రత్యేకంగానే వచ్చేదిట. ఆదివారం మామూలు దినపత్రికకి సెలవు. కనుక సోమవారం పత్రికలో ఎడిటోరియల్ ఉండేది కాదు.
నా కర్థం అయిపోయింది. సిబ్బంది పాండిత్యం, రచనా పాటవం లాంటివేమీ ఒక దినపత్రికకి ఒక రూపు తేలేవు. అది ఒక సాంకేతికపరమైన మూస. దాని టెక్నాలజీ దాని గడుసుదనం - దానికి ఉండాలి. ఓసారి ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం... డాక్టర్ దాశరథిగారు ఆస్థాన కవి మాత్రమే కాదు. ఇంటింటి కవిగా కూడా రాణిస్తున్న అమృతమూర్తి. ఆయనకీ, నాకు మధ్య ఒక ఉత్తరాల మమతల వంతెన ఏర్పడిపోయింది. అంత చక్కని దస్తూరీలో, భాషలో, ఉత్తరాలు రాసే సహృదయ మదురకవి మరొకరు లేరు. నాలాగే నండూరి రామమోహనరావుగారికిన్నీ లేఖానుబంధం ఉండే ఉంటుంది కదా! ఓసారి దాశరథిగారు నాకు లెటర్ రాశారు. ‘ఆంధ్రప్రభలో వాళ్లడిగారు. చేరుతున్నాను. మీరేమంటారు?’ అంటూ.
సరే, రామమోహన్‌గారూ, నేనూ రోటరీ క్లబ్ లేదా హనుమంతరాయ గ్రంథాలయం వేదికలలో మీటింగులలో కలిసే వాళ్లం. ఎన్.ఆర్.గారి దగ్గర ఏదో అట్రాక్షన్ ఉంది. ఇద్దరం జంటగా ఏర్పడిపోయి ఓ వారన కూర్చునే వాళ్లం. ఇంకేముంది? మాకు కామన్ సబ్జక్ట్ - ఆంధ్రపత్రిక రాధాకృష్ణగారు. రామ్మోహన్ గారికి ఆంధ్రపత్రిక మీద కోపం మమకారం పోలేదు. ఆయన అన్నారు - ‘దాశరథిగారు ప్రభలో చేరారుట?’ ‘అవును రాశారు’ అన్నాను నేను.
‘అది సరే.. పత్రికలో అంటే ఇదో టెక్నికల్ విద్య కదా - సింగిల్ కాలమ్స్, డబుల్ కాలమ్స్, లీడ్స్, ఫాంట్స్, హెడ్డింగ్స్ - ఇలా సాంకేతికమయిన ‘నో హౌ’ ఉండాలిగా?’ ‘ఉండాలి సార్!’ నా జవాబు.
ఇలా మాట్లాడుకున్నాం. ఆపాటికే, ఆదివారం ప్రభలో దాశరథిగారు - సంజీవయ్య గారితో చేసిన ఇంటర్‌వ్యూ వచ్చింది. చదువుకుని ఆనందించాం. అభినందించాం. ఐతే, దాశరథిగారు ఎక్కువ రోజులు ప్రభలో ఇమడలేక పోయారు. అట్లాగా, ముందా ‘మూస’ ఆ ‘యాస’, ఆ ‘్ఛందస్సు’, అక్షరాల సైజులు, చట్రాలు, వార్తని పొదగటం, వ్యాసాన్ని కుదించటం - ఇదంతా వో సముద్రం. సాక్షాత్తూ కాళిదాసుగారు దిగొచ్చినా - అప్రంటీస్‌షిప్ చేసి నేర్వాల్సిందే - ఆ ‘మతలబు’ పట్టాల్సిందే...
1974 తరువాత ‘పేపర్ల వాళ్లు’ వాళ్లక్కావల్సిన కుర్రాళ్లని ఎంపిక చేసుకుని, స్కూలు పెట్టి, తర్ఫీదు ఇచ్చి పని చేయించడం గట్రా వచ్చేయి గానీ, మా రోజుల్లో రాళ్లెత్తడం దగ్గర్నుంచీ భవన శిఖరం మీద తోరణాల దాకా ప్రాక్టికల్స్ ద్వారా తెల్సుకునే వాళ్లం. అందులో వున్న థ్రిల్ శాశ్వతం సుమా!
మా శ్రీరాములు గారికి నా మీద అంత భరోసా ఉంది. నిజానికి మేము సాయంకాలం ఫంక్షన్స్, అసెంబ్లీ వగైరాలు ‘కవర్’ చేయనక్కరలేదు. కృష్ణమూర్తి అనీ, వడివేలు అనీ అన్ని రకాలుగా పనికొచ్చే మరో వేరే విలేఖరులు వుండేవాళ్లు, కానీ ‘సినిమా’లో తెలుగువారి కల్చరల్ ఈవెంట్స్. ఇవి మా ‘సత్తా’కి పరీక్షలు. పత్రికలో పడితేనే దేశమంతా సినిమాల గురించి తెలిసేది. నాకు ఒక్క ముక్క ‘అరవం’ తెలియకపోయినా గెస్చర్స్‌ని బట్టీ లేదా గురుప్రసాద్‌నో, రాజేంద్ర ప్రసాద్‌నో సతాయించీ, నేర్చుకుని తమిళనాడు ఇండస్ట్రియల్ మినిస్టర్‌తో టూర్‌కి వెళ్లిపోయి, ఒకసారి కార్ల ఫ్యాక్టరీ అంతా చూసి వచ్చాను.
‘దుఃఖపడితే ఇలా నువ్వు నీ రాష్ట్రానికి కార్ల ఫ్యాక్టరీ కాదు కదా, గుండుసూదుల కర్మాగారం కూడా రాదు నాన్నా! ఫైట్ చెయ్యాలి. దానికి నిధులు కాదు అన్ని కావాలి అంటే పత్రికలే వేదికలు’ అనేవారు మా నాన్నగారు - నాన్నగారి చేత ఓ ఇంగ్లీష్ ఫిక్షన్ బుక్ ఉండేది ఎప్పుడూ. తంబుచెట్టి స్ట్రీట్ ఎదురు బస్ క్యూలో నిలబడి క్యూతోబాటే తానూ కదులుతూ - స్టాన్లీ గార్డనర్ - ‘లేజీ మస్కిటో’ని, సగం పేజీలు చదివేసేవారు. సాయంకాలం వస్తూ చైనా బజార్‌లో వున్న అద్దె బుక్స్‌షాప్‌లో - ఒక బుక్ ఇచ్చేసి - మరోటి (అద్దెకు) తీసుకునేవారు.
వాళ్ల ఆఫీసులో వి.వి.గిరిగారి అల్లుడు సూర్యారావుగారు మేనేజర్. వారి భార్య సరళగారు అంటే గిరిగారి కూతురు పెర్రీమాసన్ ఫ్యాన్. ఆమె ఎన్నో పుస్తకాలు, మోడరన్ లిటరేచర్ సహా కొని, చదివేసి - ‘అబ్బాయి కివ్వండి’ అని నాన్నగారికిచ్చి, నాకు పంపేది. అట్లా గిరిగారి సతీమణి కూడా మద్రాసులో - వారి - ఇంట సంగీత కచేరీలు పెడితే -నన్ను తప్పక రమ్మనేవారు. కాకపోతే ఆమె, రచయిత్రి పద్యాలు రాసేవారు. అవి నేను చదవాలి, వినాలి (వీలయితే) వెయ్యాలి. (వీక్లీలో వేసేవాళ్లం లెండి)
ఎందుకు చెబుతున్నానూ అంటే, మొదట వర్కర్‌ల దగ్గర, ప్రూఫ్ రీడర్ల డస్క్ మీద చాలా నేర్చుకోగలం. ఆదివారం సంచిక సేవ నాకు ఒక వరం అన్నానుగా. చేరుతూనే, ఓ వారం కథ, మరో వారం ఒరిజినల్ కథ, ఇంకోసారి వ్యంగ్య వ్యాసం -ఇలా రాస్తూండటమే గాక, మాకు, దినపత్రికలో ఆరుద్ర వాళ్ల అన్నయ్య - అన్నారుద్ర అనేవాళ్లం - ‘్భరవి’ అనే కలం పేరుతో రాసేవాడు. శేషాచార్లు గారు పొయిట్రీ ఎక్స్‌పర్ట్. మరొకరు జియాలజీ పోస్ట్‌గ్రాడ్యుయేట్. ‘స్కిట్స్’ రాయడం సరదా ఆయనకి. ఇలా, వాళ్లందర్నీ వాళ్ల హుషారుని వాడేసుకునేవాణ్ని. కొత్త కుర్రాళ్లు సూరి నాగరాజు, ఏ.బి.వి. కూడా సినిమా రివ్యూలు - ఎక్కడో వూరవతలికి పోయి, స్టూడియోల్లో ప్రీవ్యూ చూసొచ్చి రాస్తే - వాటిని ‘హైలైట్’ చేస్తూ ప్రెజెంట్ చేసేవాణ్ని - మంచి ఫ్రెండ్స్ ఐనారు.
అదృష్టం ఏమిటీ అంటే, భారతిలో ‘ఎందుకు?’ అన్న కథ వీక్లీలో - వాళ్ల దగ్గర, లోగడ నేను పంపి, ఆమోదం పొందిన కథలు వరసగ్గా వస్తూండటంతో - ఎడిటోరియల్ హాల్లో పెద్దలు ‘నీకు ‘ముకుతాడు’ వేస్తే తప్ప స్పీడు తగ్గదు’ అనే వాళ్లు నవ్వుతూ.
దిలీప్‌కుమార్ గంగా - జమునా (1961 డిసెంబర్) మద్రాసులో ప్రీమియర్ షో - ఓడియన్ థియేటర్లో - దిలీప్, వైజయంతి మాల, నాసర్‌ఖాన్‌లు సహా యూనిట్ అంతా హాజరవుతున్నారు. ‘పోయిరాగలవా? మిడ్‌నైట్ అవుతుంది’ అన్నారు. ‘శ్రీరాములు సారు ‘చేటంత’ ఇన్విటేషన్ కార్డు అందిస్తూ - తలూపాను.
‘అదెక్కడో దిక్కుమాలిన రాయపేట హైరోడ్డు కార్నర్‌లో వస్తుంది, ఓడియన్ థియేటర్’ అన్నారు.
‘్ధర్యే సాహసే’ అనుకుంటూ ఎనిమిది గంటలకే బస్సు నంబరు తెల్సుకుని వెళ్లిపోయాను. గంగా జమునా ‘టెక్నికలర్’ రంగుల చిత్రం. దిలీప్ సొంత చిత్రం - సొంత ప్రతిష్ఠగల చిత్రం. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు - ‘ఎలైట్ ఆఫ్ ది టవున్’ మాత్రమే ప్రేక్షకులు! నితిన్ బోస్‌గారు డైరెక్టర్. నౌషాద్ గారు సంగీతం. ప్రెస్ గ్యాలరీలో - టక్ చేసుకుని, దిలీప్‌కుమారంత జుట్టూ ధరించి వున్న నాకు బాగానే ముందు వరస ఛాన్సు దొరికింది. సినీమాలో - దిలీప్ అంతా, ‘దేహాతీ’ భాష ‘యాస’ మాట్లాడాడు. కొంత ఇబ్బందయింది గానీ - ఇంటర్‌వెల్‌లో - ‘హీరో’ ప్రెస్ వాళ్ల దగ్గరికి వచ్చి - పరిచయం చేసుకున్నాడు. షేక్‌హ్యాండ్ ఇచ్చాను. అందుకున్నాడు. దబ్బపండు ఛాయలో మెరిసిపోతున్నాడు. సినిమాల్లో ట్రాజెడీ కింగే కానీ, బయట హుషారుగా కామెడీగా వున్నాడు. ఇంగ్లీష్ దంచేస్తున్నాడు.
‘ఆప్ ఇదర్ బైఠియేనా!’ అంటూ బాల్కనీలో ఛెయిర్స్ దగ్గరికి తీసుకుపోయాను. ‘కామెడీలో మీరు ‘కింగ్’ అవుతారు’ అన్నాను. ‘మేకప్ అక్కర లేదేం మీకూ?’ అన్నాను. ‘అక్కరలేదు. మేం సవుత్‌లోలాగా, గ్రీసు, పెయింట్‌లు పూసుకోం. ఎలా వుంటే అలా సెట్స్‌కి పోతాం’ అన్నాడు గర్వంగా.
అవతల నిర్వాహకులు సతాయిస్తున్నారు - ‘టామిల్ ప్రెస్’ వెంటాడుతూనే ఉన్నారు. దిలీప్‌కుమార్ చేత ‘్భజం తట్టించుకుని’ ‘శభాష్ యంగ్‌మాన్! ఖాస్ రివ్యూ దేదేనా’ అంటూ నవ్వాడు. ‘ఖుదాహఫీజ్ (అలవాటు కాబోలు) చెప్పాడు (ఓహోయ్!)
సరే, అంతా బాగుంది. సినిమా అయిపోయింది. ఒంటి గంట కావస్తోంది. ఏదో చెబుతారే, అట్లా - కాళ్లల్లో వణుకు - మొదలయింది. ‘్ఫనిష్’ - వూరుగాని వూరు. అరవ భాష - అర్ధరాత్రి - అడిగావాడు ‘నై’ చెప్పేవాడు ‘నై’. ఐతే అర్ధరాత్రి డబుల్ రేటు బస్సులు - వుంటాయి గానీ - వాటి మీదికి జనం - గింజల మీద వాలే పావురాల్లాగా దూసుకుపోతున్నారు. ‘ఏ బస్ ‘ప్యారిస్’ పోతుందో తెలియాదే?’
‘పోనీ - పోలీసుస్టేషన్ దగ్గరికి పోయి ‘హెల్ప్’ అడుగుదామన్నా - ‘ఏముంది? ఐ.డి.కార్డు? నా దగ్గర. సినిమా ఇన్విటేషన్ కార్డే
ఏమని అడగాలి? అనుకుంటూ వుంటే ఓ ‘ఆటో’ ఆగింది - థియేటర్ ముందుకి. దాని మీదికి అక్షరాలా ఇలా దూకాను. ‘పారిస్ పోవటం’ అన్నా కానీ, అటు నుంచి ఓ కోటూ, సూటూ ఆయన దూరేశాడు. ‘సార్! నేను పారిస్ కార్నర్‌కి పోవాలి సార్!’ అన్నాను. జాలిగా తెలుగులోనే, అప్రయత్నంగా-
‘అరె! తెలుగువారా?’ అంటూ పలకరించాడు. ‘ఆంధ్రపత్రిక’ అంటూ చెప్పాను. అయామ్ ఏ రైటర్ సార్! అయామ్ వీరాజీ’ ఎండిపోతున్న గొంతుతో అంటున్నా.
‘ఎక్కండి సార్! నేనూ తెలుగువాణ్నే. ‘ఎగ్జిబిటర్’ని. ఆంధ్రపత్రిక నిండా మాకు సొంత ఇష్టం’ అంటూ ఎక్కించుకున్నాడు. త్రోవలో కబుర్లు చెప్పాడు. తన కార్డు ఇచ్చాడు. ‘ఏదైనా ‘పడం’ (సినిమా) వచ్చి చూడుమీ’ అన్నాడు.
తిన్నగా తంబుచెట్టి స్ట్రీట్ దగ్గర, మా బిల్డింగ్ ముందు దింపేశాడు. అర్ధరాత్రిగా వన్‌వేలోనే తిన్నగా, ఆటోని మట్టించేశాడు. కలా? నిజమా?
(ఇంకా భోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com