స్మృతి లయలు

హై‘కోర్టు’లో గల్లీ క్రికెట్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూమ్‌లో నాన్నగారు తన బల్ల మీధ అప్పుడది ఆఫీసు బల్ల కాదు గనుక, దాని మీదనే పడుక్కునేవారు. అది ఏడడుగులు పొడవు, నాలుగడుగులు వెడల్పు వుంటుంది. సరిగ్గా కిటికీ అంటే, ఆరు, ‘మడత తలుపులు’న్న కిటికీ అది. దానికి ఎదురుగ్గా ఉంటుంది ‘ఆకాశ చౌకీదార్’లాగ - వెలుతురు చేతులు చాపుతూ గిరగిరా తిరిగే బ్రహ్మాండమైన లైట్ హవుస్ అది - ఉండుండి ఛళ్లుఛళ్లున వెల్తురు దెబ్బలు తీస్తూ వుంటే - ఆ బల్ల మీద నాన్నగారు ‘మూడంకె’ వేసుకుని మూడు దిండ్లు తలక్రింద పెట్టుకుని పడుకునేవారు - చిన్నపిల్లాడిలా.. నాకు దాని మీద పడుక్కోవాలని సరదా వుండేది. కానీ, దొర్లి క్రింద పడిపోతానేమోనని నాన్నగారికి భయం.
* * *
నాకు నిద్ర పట్టలేదు.
అమ్మ జ్ఞాపకం వచ్చింది. అమ్మ రాసిన ఉత్తరం జేబులో నుంచి తీసుకున్నాను. లైటు వేసుకోలేదు. నాన్నగారికి ‘డిస్టర్బెన్స్’ అనుకుని. అవతల బస్సుల రొద ఆగిపోయింది. అంటే, పదకొండయిందన్న మాట. టార్చిలైటు వేసుకుని ఉత్తరం మరోసారి చదువుకున్నాను. ‘నువ్వు ఉద్యోగంలో చేరి రెండు వారాలవుతోంది. నీ కోసం కందిపొడి, నూల పొడి, కరివేపాకు పొడి చేశాను. చిన్న గాజు సీసాలో పెట్టి, ‘నిమ్మకాయ’ పంపనా? నీకు ఇష్టం కదా!.. గోపాలం (నా రూమ్మేటు - మా అమ్మకి ‘రెండో పెద్ద కొడుకు’) బెంగుళూరు వెళ్తూ అక్కడ దిగి (మద్రాసు) నిన్ను చూసి వెళ్తానంటున్నాడు. తమ్ముడు శాస్ర్తీబాబు తిరుపతి వెళ్లి, అట్నుంచి, నీ దగ్గరకొచ్చి, నీ దగ్గర ఓ రోజు వుంటానంటున్నాడు. వెన్న కరగబెట్టి నెయ్యి కాచాను. ఓ సీసాలో వేసి, పంపేదా? నీకు కోపం వస్తుందేమోనని భయం. కానీ, కృష్ణా! నీ కోసంఒక తెల్లని షర్డు గుడ్డ (కట్‌పీస్) కొన్నాను. దాంతో నీకు ఆఫ్ హ్యాండ్సా? లేక ఫుల్ చేతులా? ఏది కావాలంటే అది సత్తార్‌భాయ్ కిచ్చి వెంటనే కుట్టి, అర్జెంటుగా ఇవ్వమని - నీకు పంపాలనుంది నాన్నా!’
దూరంగా వినబడే ఎలక్ట్రిక్ రైలు కూతలు ఆగిపోయాయి. టైము రెండున్నరయిందన్న మాట. మనసు అమ్మ దగ్గరికి వెళ్లిపోయింది. మహానగరం అర్ధరాత్రిలో ఏర్పడ్డ ‘నిశ్శబ్దం’లో ప్రయాణం చేస్తూ, ఇంచిపేటకి వెళ్లిపోయాను. ‘ఎందుకమ్మా, నా ఆకలి మీదా, నా సుఖం మీద నీకింత బెంగ?’ (అర్ధరాత్రి లేచి వచ్చి నాన్నగారు నాకు దుప్పటి కప్పుతారు? నేను ఆయన్ని, పడుక్కునే ముందు, ఒక్కసారైనా ‘ఆర్ యూ కమ్‌ఫర్టబుల్? అనడిగానా? ‘మీ యవ్వనంలో, మీరు పడ్డ ఒక్కరాత్రి సుఖానికి మీ పాలిట ‘శిక్ష’లుగా పుట్టామా? అమ్మా! మేము - నీ పిల్లలం?’ అడుగుతున్నాను అమ్మని. ‘ఏం చేయలేదమ్మా మీకు’ - నవ్వేసింది అమ్మ. అర్ధరాత్రి చటుక్కున వెలిగిన అగ్గిపుల్లలా చురుక్కుమన్నదా నవ్వు. ‘అమ్మా! తిన్నావా?’ అని నేనడగక్కరలేదు. మా అమ్మకి నేను కడుపులో వున్నప్పుడు మాత్రమే అన్నం తినే యోగం. ఆనక ప్రతీ కాన్పుకీ ‘వేవిళ్లే’. ఒక్క అన్నం మెతుకు ఇమిడేది కాదు. తిన్న వెంటనే భళ్లున ‘వాంతి’ అయిపోయేదిట.
మా మామ్మ, అమ్మనే - ‘అమ్మారుూ, వెళ్లి మార్కెట్ నుంచి వారం రోజులు సరిపడా - దుంపకూరలు ఎక్కువగా తీసుకురావే’ అనేది.
అమ్మకి నేను ‘తయినాతు’. అమ్మ చేతిరిక్షా ఎక్కదు. మరో మార్గం లేదు. ఇద్దరం నడుచుకుంటూ కాళేశ్వర్రావు మార్కెట్‌కి వెళ్లేవాళ్లం. కూరలన్నీ కొన్నాకా, ఓ పిల్లాడు గంప తెస్తాడు. వాడి నెత్తి మీదనే గంప పెట్టి, కూరలన్నీ ఆ గంపలో వేసేవాళ్లం. తిన్నగా, ఆ ‘గంప బాలుడి’తో ఇల్లు చేరేవాళ్లం. అమ్మకి మెత్తని పకోడీ ఇష్టం. నాకేమో ‘కరకజ్జం’ ఇష్టం. రెండూ కొని, పొట్లాలు నిక్కరు జేబులో దాచాను. ‘మామ్మ’ చూడకుండా అమ్మతో మునగచెట్టు డాబా మీదికి వడియాలు ఎండబెట్టే నెపంతో వెళ్లి అవి లాగించేశాం అమ్మా, నేనూ. ఒకసారి గిరగిరా తిరుగుతూ, ఆనందంగా, నేను క్రిందికి దిగి వచ్చేసరికే అమ్మ బాత్‌రూమ్‌లోంచి, వాంతి చేసుకుని మొహం తిరిగిపోగా - బయటికి వచ్చి, ‘చీడీ’ (వరండా) మీద కూలబడ్డది.
‘మామ్మ’ ఎత్తిపొడిచింది. (అత్తగారు కదా) - ‘ఏ రహస్యం అయినా దాగుతుంది గానీ, అమ్మారుూ! తిండిదొంగతనం మాత్రం నీకు చెల్లదే. నీ ‘కడుపు’ నిన్ను బయట పడేస్తుందీ!’ అని.
మా మామ్మ అంటే నాకు ‘పిచ్చి ఇష్టం’ కానీ, ఈ సంఘటన జ్ఞాపకం వస్తే మాత్రం - మామ్మ మీద కోపంతో - నాకు, నా పీక పిసుక్కోవాలనిపిస్తుంది...
* * *
చిన్న బీడీ కంపొచ్చింది. తెలివొచ్చింది. నాన్నగారు లేచేరన్న మాట. అవతల కిటికీలోనుంచి నగరం వొళ్లు విరుచుకుంటూ ఆవలిస్తున్నట్లు - ఉదయం సందడి మొదలైంది. ‘అమ్మా! చూడమ్మా! మేం నీకు మెడ తిరగని కట్టుకాసుల పేరైతే పెట్టలేం గానీ- మా పేరు ప్రఖ్యాతులతో గర్వాతిరేకంతో నీ మెడ తిరగకుండా చేస్తాం’ అంటూ ఉద్వేగంగా లేచాను.. దిక్కుమాలిన కీర్తికండూతికి కూడా అమ్మనే సాకు చేసుకోవాలా? అనుకున్నాను - నవ్వొచ్చింది. ‘బాత్’లో నుంచి నాన్నగారొచ్చేలోగా, కాగితం కలం తీశాను ‘అభిలాష’ అన్న శీర్షిక పెట్టాను.
కొత్త కీర్తి కిరీటాల వీపు
మీదకెక్కి స్వారీ చెయ్యాలనుంది!
తెగ ఉబలాటపడుతోంది మనస్సు
దొంగ తిమింగిలాలుంటాయని, ఒక దెబ్బ
తీస్తాయని తెలుసు కాని పెంకి
గుఱ్ఱం లాంటి కొత్త కెరటాల శిఖ
రాగ్రాన ఉద్దేలంగా పోయి వ్రాలాలనుంది!
అంటూ రాశాను. నాన్నగారి బల్ల సొరుగు లాగి, ఒక కవరు తీసి, దాన్నో కవరులో పెట్టి అంటించాను. తమ్ముడు (వించిపేట) అడ్రసు రాశాను. దాన్ని నాన్నగారికిస్తే ఆఫీసు నుంచి పోస్టు చేయించేస్తారు. వాడు దాన్ని ఏదో ఒక పత్రికకి పంపుతాడు.
కాఫీ ఫ్లాస్కు తెచ్చి, అక్కడ పెట్టిపోతున్న ‘లచ్చి’ అను లక్ష్మీనారాయణ - ‘యిహీ’మన్నాడు. మా ఎదురుగుండానే మోడరన్ కేఫ్ పెద్ద హోటలు.
వాడి చేతిలో ఓ పాత క్రికెట్ బ్యాట్ ఉంది. ‘నేనూ రానా?’ అంటూ సైగలు చేశాను. ‘హైకోర్టులో ఆడుతున్నాం. కవాలంటే రావొచ్చు’నంటూ వాడు పారిపోయాడు.
‘సార్! వాకింగ్‌కి పోతున్నా.. కాఫీ తాగేశా.. ఫ్లాస్క్‌లో వున్నది మీకే’ అంటూ కేకేశాను.
మెట్ల మీది నుంచి క్రిందికి దొర్లించేసిన గుమ్మడికాయ లాగా నాలుగంతస్తులూ డబడబా దిగేసి - జీబ్రాలైన్‌ల దాకా పోకుండానే రోడ్డు క్రాస్ చేసి - అతి పెద్ద కోటంత వున్న హైకోర్టు ఆవరణలోకి చేరుకున్నాను.
లచ్చి, వెంకటి, వాళ్ల ఫ్రెండ్స్ పది మంది దాకా అందరూ ఆఫీసు సెక్యూరిటీ స్ట్ఫా పిల్లలే... ఫీల్డింగ్, డైవింగ్ రన్నింగ్ లాంటివి అయితే చెప్పులు తెగిపోతాయ్. ఆఫ్ స్పిన్నర్‌ని కాబట్టి బంతులు విసురుతూ పిల్లకాయల మధ్య - వాళ్లకేవో మెళకువలు చెబుతున్నట్లు కాస్త బ్యాటింగ్ చేసి ‘బులపాటం’ తీర్చుకునే సరికి ఎండెక్కింది. ఓ రాయి విసిరితే పిట్టలు ఎగిరిపోయినట్లు పిల్లలందరూ బిల్డింగ్స్ వేపు పరుగులు తీశారు. కారణం? ఏడున్నర అయింది టైము.
‘లచ్చి’ అయిదో క్లాసు, వెంకటి పదకొండో క్లాసు - ఇద్దరి మధ్యా వున్న ఆడపిల్ల కౌసల్య తొమ్మిదో తగరతి. చిత్రం! వీళ్లు కూడా తెలంగాణా వాళ్లే. మా ఇంట్లో పనమ్మాయి మా బుచ్చమ్మ కూతురు కూడా కౌసల్యే. ఇక నర్సయ్య సంగతి చెప్పాలి. ఆరడుగుల పొడుగు పోత విగ్రహం లాగ వుండే చౌకీదారు. 337 నెం. బిల్డింగ్ క్రింది ‘్ఫ్లర్’లో వున్న ఆంధ్రా ఇన్‌స్యూరెన్స్ కంపెనీ వారి పెద్ద ఆఫీసుకే కాదు బిల్డింగ్ మొత్తానికే ‘రక్షకుడు’. కాఖీ కోటు వేసుకుని నిలబడితే భయం వేసేలాగా కనబడేవాడు. అతని భార్య ‘మంగమ్మ’ టిపికల్ తెలంగాణా ఆడపడుచు. కాలికి కడియాలు, చేతులకి కడియాలు చెవులకు ‘నాగరింగులు’. చీరకట్టు, నడక, మాట అన్నీ ‘హన్మకొండ’ టైపు. మంగమ్మ నర్సయ్యకి రెండో భార్య. పెద్దామె దేశం (గ్రామం)లోనే ‘వుంటది’. కానీ, పెద్దకొడుకు ‘లక్ష్మణ్’ మాత్రం డాలర్ మందుల కంపెనీలో అటెండర్‌గా - ఇదే బిల్డింగ్‌లో పనిచేస్తాడు.
తమ్ముళ్లిద్దర్నీ పెద్ద చదువులు చదివించమనీ - బంట్రోతుల్ని చెయ్యొద్దనీ తండ్రితో, సవత్తల్లితో ‘తగాదా’ పెట్టుకుంటూ వుంటాడు. ఇప్పుడు వాడికి పెళ్లి చెయ్యాలన్నదే నర్సయ్య కోరిక - మంగమ్మ ప్రయత్నం కూడా అదే...
మంగమ్మ పెద్ద గంపలు రెండు ఒకదానిలో ఒకటి పెట్టి తెచ్చి, ఒకటి వెంకటికిచ్చేది. లచ్చికి కౌసల్యకి చిన్న తట్టలు, చీపుళ్లు ఇస్తుంది. పెద్దపెద్ద ఆఫీసుల్లోని చిత్తుకాయితాల బుట్టలన్నీ మంగమ్మ కాంట్రాక్టు తీసుకుంది. అన్ని రకాల చిత్తుకాగితాలు ఎత్తుకుని, గదులూడ్చి, ఆ మొత్తం చిత్తునంతా చేర్చి, పెద్ద అంగడిలో ‘వేస్తుంది.’ ఈ తంబుచెట్టి వీధి ఆంధ్రా ఇన్‌స్యూరెన్స్ బిల్డింగ్ మొదలు ‘కూవమ్ నది’ వంతెన దాటి మవుంట్ రోడ్ మొదటి దాకా వున్న ఆఫీసుల్ని వూడ్చి, చిత్తుకాగితాల్ని గంపలకెత్తుకుని - తల్లీబిడ్డలు తిరిగి ‘ఇల్లు’ చేరేసరికి ఎనిమిదిన్నర గంటలవుతుంది.
వాళ్లుండే ఈ ఆఫీసు (వాచ్‌మేన్‌గా) చాలా పెద్దది. (ఆంధ్రా ఇన్‌స్యూరెన్స్ వారిది) స్నానాలూ అవీ చేసి, పిల్లలు స్కూలు డ్రెస్సులేసుకుని, సిల్వర్ ‘టిఫినీ’లు పట్టుకుని వాళ్లు స్కూలు కెళ్లిపోతారు.
‘ఇదేమిటీ చెత్తపని చేస్తున్నాం’ అన్న న్యూనతా భావం లేదు. స్వచ్ఛ భారత ఉద్యమానికి ‘ఆది కుటుంబం’ అదే అనిపిస్తుంది. చక్కగా ఫీజులు కట్టి పిల్లలకి చదువులు చెప్పిస్తోంది మంగమ్మ... ఈ కుటుంబమే ఇప్పుడు మాకు ఫ్రెండ్స్. మంగమ్మకీ నాన్నగారు అన్ని పన్లూ చెబుతారు. ఇస్ర్తికి బట్టలు పంపాలంటే, విజయా లాడ్జి నుంచి క్యారేజీ రోజూ తేవాలంటే, గదిలో ఏవయినా రిపేర్లు వస్తే - ఇలా ఏవయినా ‘మంగమ్మా!’ అని పిలిస్తే చాలు - ‘విశ్వనాథమ్‌గారు చెప్పిండురా!’ అంటూ పిల్లలి చేత చేయించేది. లక్ష్మీనారాయణ, వెంకటేష్ నాన్నగారిని విశ్వనాథమ్‌గారు అని పిలిచేవారు. నన్ను విశ్వనాథమ్‌గారి ‘అబ్బాయి’ అనే పేర్కొనేవారు.
‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ అన్నది ప్రాణం పోసుకు లేచి వస్తే - ఇదిగో ఇలా వుంటుంది’ అనేవారు నాన్నగారు.
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com