స్మృతి లయలు

‘జీవితం బళ్లో’ కొత్త పాఠాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను చేరినప్పుడు ఆంధ్రపత్రిక అణా నుంచి ఏడు నయాపైసలుగా మారింది. కానీ దాని విలువ 1953 నుంచీ - చాలాకాలం పరాయి రాష్ట్రం నుంచి వస్తూ వున్నా - ఆంధ్రాలో అమూల్యం, అపురూపమే అయింది. అయితే, ముంబాయి నుంచి వస్తూ ఆంధ్ర లోకం యావత్తునూ మెస్మరైజ్ చేసిన ఈ పత్రిక యొక్క ‘ఆత్మ’ నూటికి నూరుపాళ్లూ తెలుగువారిదే అవడం మామూలు విషయమే అనుకున్నారు జనం.
కర్నూలు రాజధాని అయినప్పుడు అక్కడికి సిబ్బంది మాత్రం మారారు. ఆనక ఆంధ్రపత్రిక - హైదరాబాద్ రాజధాని అయినాక కూడా మద్రాసు నుంచే వెలువడింది.
1961 నుంచీ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు మధ్యాహ్నం ‘్ఫ్లయిట్’లో పేపరు పంపించేవారు. ఎక్కడ నుంచి వస్తేనేం? అది ‘మాది’ - ‘మా కోసం’ అన్న భావం ఏర్పడి ఉంది. ‘వీక్లీ’ గురించి రాధాకృష్ణగారు అంటూ వుండేవాడు - ‘మనం ఢిల్లీ నుంచి చేసి, డిస్పాచ్ చేసినా అది ఓ.కే. వేగానీ డైలీ అలాగ కాదు’ అని.
1960 నుంచీ బెజవాడ నుంచి వచ్చిన ఆంధ్రజ్యోతి మొదలు 1974లో విశాఖపట్నంలో మొదలయిన ఈనాడు పత్రిక, మధ్యలో ఆంధ్రప్రభ దినపత్రిక ఇది రుజూ చేశాయి. కానీ ఆంధ్రపత్రిక అసెంబ్లీ ‘అక్కడా’ - ఎడిటింగ్ ‘ఇక్కడా’ వుంటున్నప్పుడు - మద్రాసుకు పోయి ఆలిస్ ఇన్ వండర్‌ల్యాండ్ లాగ ప్రవేశించిన నేను ఒక ఏడాదిపాటు దినపత్రిక హాలులో - ‘అయిదారేళ్లుగా వున్నానా?’ అన్నంత నాలెడ్జ్, తెలివీ అనుభవం సంపాదించుకున్నాను...
పత్రిక డైలీ అధిపతి దేశోద్ధారకునిగా వాసికెక్కిన విశ్వదాత కాశీనాథునిదే గానీ, ఆయన ఫక్తు కాంగ్రెస్ పార్టీ వాడు. రాష్ట్ర అధ్యక్షుడూ, కోశాధికారీ కూడా ఆయనే గానీ ఆంధ్రపత్రిక మీద ఒక పార్టీ పత్రిక అన్న ముద్ర పడలేదు. 1931లోనే ఉచిత ప్రతులు గ్రామాలలో అన్ని రకాల లైబ్రరీలకు అందేవి. కమ్యూనిస్టు పార్టీ మ్యానిఫెస్టో అలాగే కాపు సంఘం, కమ్మ సంఘం లాంటి వ్యవస్థల కార్యకలాపాలన్నింటికీ సరియైన పాళ్లలో ‘వడ్డన’ చేసిన ‘విందు’ లాంటిది అయింది. ఆంధ్రపత్రిక అన్న పేరు సాధించింది.
అరవైల్లో ప్రభా, జ్యోతీ రెండూ కృష్ణా తీరంలో డేరా వేశాయి. 1974లో ‘ఈనాడు’ విశాఖ తీరంలో పుట్టినా 1978 దాకా విజయవాడకి ‘ఈనాడు’ రాలేదు గానీ ’76లోనే హైదరాబాద్‌కి వెళ్లింది. అంచేత చాలామంది అనుకున్నట్లు ‘ఆంధ్రపత్రికను ఈనాడు తినేసింది’ అన్న మాటలు మము బోంట్లకు రుచించేవి కావు...
దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు పత్రిక ప్రాచుర్యం పదివేల కాపీలు. దేశంలో మొట్టమొదటిసారి ఏ.బి.సి. (ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్) 1948లో ఏర్పడ్డది. ఆంధ్రపత్రికకు లభించిన సర్క్యులేషన్ సర్ట్ఫికెట్ దేశం మొత్తంలోనే 33వ స్థానం పొందింది. ‘కలకత్తా స్టేట్స్‌మ్యాన్’ది సర్క్యులేషన్ 57వ ర్యాంకు కాగా, హిందూ - మద్రాసు 16. మా తరంలో కూడా ఎందరో - హిందూ, ఆంధ్ర పత్రికా ఒక్కళ్లవే అనుకొనేవాళ్లు. ఆంధ్రపత్రిక తెలుగు - ఇంగ్లీషు రెండింటిలోనూ (బైలింగ్వియల్‌గా) కూడా వెలువడింది. అటువంటిది లోగడ కర్నూలు నుంచీ గానీ రాష్ట్ర ముఖ్య నగరాల నుంచి నేరుగా ఎడిషన్‌లు వెలువడక పోవడం పెద్ద లోపం. అది గ్రహించి మొదట 1965 జనవరి 23 నుంచీ ఆంధ్రపత్రిక డైలీని బెజవాడలో మొదలుపెట్టారు. దానికి మాలో నలుగురినీ మద్రాసు నుంచి విజయవాడ పంపేరు.
(ఆ నలుగురూ ప్రకాశరావు, నరసింహారావు, వెంకటేశ్వరరావు, నేను)
మధ్యమధ్య ఇలా ‘్ఫస్ట్ ఫార్వర్డ్’ చేస్తూంటాను విషయం. ఈ తరం పాఠకుల దృష్ట్యా ఫ్లాష్ బ్యాక్‌లు కూడా ఇలాగే - ఇదీ అవసరమే.. సరే.. ఎడిటోరియల్ హాలులో ఆ చివరనున్న ‘గ్రీకువీరుడు’ ‘ఎమ్మెస్స్’ అనగా మద్దాలి సత్యన్నారాయణ శర్మగారు - వారిని గురించి ఇంకా ప్రస్తావించలేదు. ‘గ్రీకువీరుడు’ అన్నానెందుకంటే - (పుత్రవాత్సల్యంతో నాకు ఆ చనువు ఆయనే ఇచ్చాడు) పత్రిక కార్యాలయం కర్నూలుకు పోయినప్పుడు - ఆయనని రిపోర్టర్‌గా వేసి ట్రాన్స్‌ఫర్ చేస్తే - నథింగ్ డూయింగ్’ అంటూ ఎదిరించాడు. కార్యాలయంలో సబ్ ఎడిటర్ (ఉప సంపాదకుడు)గా వున్న వాడికన్నా రిపోర్టర్‌గా వున్నవాడికే ప్రమోషన్ ఛాన్సులు పోతాయి అన్నాడు. ఇదొక ‘టెక్నికల్ పాయింటు’. ఏది ఏమయితేనేం? ఆ కథ అలా వుంచుదాము. ఆయనే, వెనుకటి ఉన్నవాడికన్నా కాలం సెలవులు, సదుపాయాలు, సర్వీస్ వగైరా సహా కేసు గెల్చుకుని - ఇప్పుడు (1961) ఆ కొసని కూర్చొనేవాడు ఈ సీనియర్ మోస్ట్. నేనీ కొసని కూర్చొనేవాణ్ని - జూనియర్ మోస్ట్‌ని నేను-
ఎమ్.ఎస్. మద్రాసు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్‌లో కీలక పాత్ర పోషించే వర్కింగ్ జర్నలిస్ట్ నాయకుడు. ఆయనకి తోకలాగ వెంట తీసుకుపోయేవాడు నన్ను కూడా. ‘మెయిలు డైలీ -‘మీనాక్షీ సుందరంగారు కార్యదర్శి యూనియన్ కాబోలు. నాకు ఇలా పెద్దలతో అప్పుడప్పుడు కలవడంతో కాన్ఫిడెన్స్ వచ్చింది. బల్ల మీద పేపర్ వెయిట్‌లాగా - సిరాబుడ్డీలో బాతుపాళీ కలం లాగా అతుక్కుపోయి వార్తలు రాసే గుమాస్తాగా మారిపోకుండా ‘ఏక్టివ్’ అంటారే.. అట్లాగా బిజీ అయ్యాను..
సదరు ‘్థంకింగ్’కి అలవాటు పడ్డాను. ఎం.ఎస్.గారు ఉదయం ఎనిమిది గంటల వేళ ఉస్సురుస్సురని బుసలు కొడుతూ - తెల్లని గాస్గో దుస్తుల్లో ఆఫీసుకొచ్చేవాడు. పదకొండు గంటలకి ‘ప్రెస్’కి వెళ్లే హైదరాబాద్ ‘ఎయిర్ ఎడిషన్’కి కావల్సిన జాతీయ, అంతర్జాతీయ వార్తలని ఏరి టెలిగ్రాములని వరుసగా పెట్టి, పిన్నులు గ్రుచ్చి - తొమ్మిది గంటల వేళకి వచ్చే - బొమ్మకంటి, ప్రసాద్, జె.బి.శర్మ వగైరాల బల్లల మీదికి పెట్టించడమో, లేదా, లేచి వెళ్లి తనే పెట్టడమో - అతని ‘డ్యూటీ’. ఆయన ‘అనుభవాల కట్ట’ కానీ అవన్నీ నాతో షేర్ చేసేవాడు. చందమామ కథలు వినే - బాలుడల్లే వినేవాణ్ని. ‘నువ్వు రాధాకృష్ణకి ఎంత సన్నిహితుడివో - నేను అయ్యవారికి అంత క్లోజ్‌గా వుండేవాణ్ని’ అనేవాడు. ఓ ‘స్వర్గం’ కోల్పోయినట్లు ఫీలయిపోయేవాడు.
ఆఫీసులో సీనియర్ మోస్ట్ ఫోర్మేన్ త్యాగరాజు. నిక్కరు బనీనులో ఎర్రగా కిల్లీ నములుతూ భలే వుండేవాడు. శ్రీరాములు గారితో అయినా, ప్రకాశరావుగారితోనైనా సరే, అతను ‘పోట్లాడు’తున్నాడో, ‘మాట్లాడు’తున్నాడో చెప్పలేం. అలా అదరగొట్టేవాడు. ‘పేపరు పోవద్దా? శీఘ్రమా పూడ్చలేవేమ్? ఈమీ అవతల మోనో పడుండాది’ అని కాపీ (వ్రాతప్రతి)ని డిమాండ్ చేసేవాడు. ఈ ‘మోనో’ అన్నది మా పాలిట గర్భ శత్రువు. తగరం ‘ద్రవ’ రూపంలో మేట్రిక్స్ (అక్షరాల కంతలు) గుండా దూరి చిన్నిచిన్ని అక్షరాలు పోతపోసే ఒక రకం కొలిమి యంత్రం. దాంతోనే ‘12’ పాయింట్‌తోనే - మధ్యలో హ్యాండ్ కంపోజింగ్ చేసుకుంటూ - రోజూ ఓ యజ్ఞంగా పేపరు (వీక్లీ కూడా) పూర్తి చేసేసరికి - మా మొహాలు ‘నేను సైతం యజ్ఞానికి వో సమిధనయ్యాను’ అన్నట్లుండేవి..
నేను రాధాకృష్ణగారి దగ్గరకు పోలేదు. మొదటి నుంచీ ఇప్పటిదాకా ఆరు దశాబ్దాల పాటుగా పత్రికలతోనే జీవితం గడిపాక కూడా నాలో బిడియం, సంకోచం (దీన్ని అహంకారం, వొళ్లు పొగరు - అంటూ అనేవారు, నిజం తెలియని వాళ్లు) ఎక్కువ వుంటాయి. నేనై ఎవ్వరినీ కలవలేను. పోయి పలకరించడం, కబుర్లు చెప్పడం - ముఖ్యంగా అవసరం వున్నప్పుడు కూడా - చెయ్యలేదు. అదే, డ్యూటీ వేసేరు అనుకోండీ - సినిమా చక్రపాణిగారైనా - పాలిటిక్స్ బ్రహ్మానందరెడ్డిగారైనా దూసుకుపోయి - మా వర్కర్ల భాషలో చెప్పాలంటే - ‘రాంగ్’ వేసుకోడానికయినా రెడీ!...
(అయిపోయింది. జీవితం అవతల గట్టుకి చేరువగా వచ్చేసింది. నా ‘బలహీనతలే’ నా ‘మెరిట్స్’గా - లెట్‌మీద ‘డై’) ‘సగం దూరం నువ్వురా - సగం దూరం నేనొస్తా’నన్న పాలసీ మంచిదే గానీ నేను అమలు చెయ్యలేదు. రాధాకృష్ణగారే - ‘పైకి వోసారి రమ్మనండి’ అంటూ వీక్లీ క్లర్క్ శాస్ర్తీగారితో - కబురెడితే గానీ మెట్లెక్కి ఆయన గదిలోకి వెళ్లలేదు.. (అదే వీక్నెస్)
సునీల్ గావస్కర్‌లాగా ‘బ్యాక్ ఫుట్ బౌండరీ’వా? ముస్టాక్ అలీ లాగ ‘హాఫ్ ద పిచ్’ ముందుకొచ్చి బాదుడా? అంటే - ఏది అయినా నాకు ఓపెనింగ్ బ్యాటింగ్ మాత్రం కావాలి - అనేవాణ్ని. ఇంటర్‌మీడియెట్ అంతా ఈ వోపెనింగ్ ‘పిచ్’తోనే కాలూ చెరుూ్య, ముక్కూ మూతీకి దెబ్బలు తగిలించుకునేవాణ్ని. మాకు కాలేజీలో ఇద్దరు లెజెండరీ సత్యన్నారాయణగారలు లెక్చరర్స్‌గా ఉండేవారు. ఒకరు తెలుగు మాస్టారు. వారి పేరే వారికి అన్నింటికన్నా ఎక్కువ బిరుదు. వెయ్యి పడగలు ఆయనకి. ‘విశ్వ సత్యనారాయణ’ అగ్గిమీద గుగ్గిలం.. అన్నాడు శ్రీశ్రీ.
అలాగే - రెండోసారు జొన్నలగడ్డ సత్యన్నారాయణగారు. ఆయనది అంత పెద్ద విగ్రహం. ప్రక్కవీధిలో కూర్చున్నా వినిపించే గంభీర స్వరం. ‘ట్రావలోగ్స్’ రాయడం (నా మహారాష్ట్ర యాత్ర)లో బెంగాలీ డిటెక్టివ్‌ల్ని ఒరిజినల్స్ అంత ఠీవీగా (‘్ఛన్నహస్తం’ నవల) ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి.
బెజవాడ ఎస్.ఆర్.ఆర్.సి.వి.ఆర్. కాలేజీ ఆవరణలో ఎక్కువగా పచ్చిగడ్డి మొలిచేది కాదు గానీ ఆ వున్నది కాస్తా ఈ ఇద్దరి మధ్య పడి ‘్భగ్గు’మని పోయేది’ అని అనేవాళ్లు - పోట్లపల్లి సీతారామ రావుగారి లాంటి విశ్వనాథ వారి శిష్యులు కూడా. ‘ఆయనకు తెలుగు రాదు’ అని ఈయన (జొన్నలగడ్డ వారు) - ‘ఈయనకన్నా తనకు ఎక్కువ ఇంగ్లీషు వచ్చునని’ విశ్వనాథ వారు చెప్పేవారు. తెలుగు క్లాసులోంచి విశ్వనాథ సత్యన్నారాయణ గారు నన్ను బయటికి పొమ్మని రెండుసార్లు.. ‘ప్చ్‌ప్చ్’మంటూ గదమాయించారు. హుషారుగా - ఆ వెంటనే గవర్నమెంట్ గెస్ట్‌హవుస్ ప్రక్కనున్న మినీ క్రికెట్ గ్రౌండ్‌లోకి - ఫ్రెండ్స్‌తో కలిసి, అదే పరుగు.. అదేదో బోనస్ టైమ్‌లాగా...
* * *
విశ్వనాథ వారు అస్తమించాక - నేను వీక్లీ మొదటి పుటల్ని (‘టేర్‌ఓపెన్’ అంటారు జర్నలిజం పరిభాషలో) కొన్ని పేజీలు అచ్చయినాక ఆపేసి - పేజీల్ని ‘రద్దు చేసి’ వీక్లీ ఎడిటోరియల్‌లో ‘నివాళి’ సమర్పిస్తూ - ‘మాస్టారూ! నేను మీ ‘స్కూలు’ కాదు గానీ మీరు నాకు దైవతుల్యులు. హిమాలయ పర్వతాల్ని ‘టైలర్ టేపు’తో ఎలా కొలుస్తాము? అది భావితరం ‘క్రిటిక్’ పని అని చేతులు జోడించి - తెలుగు విరాట్ స్వరూపునిగా మిమ్మల్ని కొలుస్తాను’ అని కీర్తించాను...
అదంతా చూస్తూ ఉంటే - ఇంత దూరం - దారి పొడుగునా నెత్తురు చిమ్ముతూ, రక్తపు కన్నీళ్లు కారుస్తూ ‘సిరా’ బదులు కన్నీళ్లలో కలం ముంచి రాస్తూ కూడా.. ఇంకా ఎంతో వెలితిగా ఫీలవుతున్నాను. గోపాల్‌దాస్ నీరజ్ - హిందీ ‘ప్రేమ్‌పూజారి పాటల కర్త’ అన్నట్లు - ‘ఆజ్ ఫిర్ జీనేకీ తమన్నా హై - ఆజ్ ఫిర్ మర్‌నేకా ఇరాదా హై’ అనిపిస్తోంది!
(ఇంకా భోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com