స్మృతి లయలు

ఔనండీ.. ఔను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ స్విఛ్ వేస్తే మరో లైటు వెలగడం - ఆ స్విచ్ ఆన్ చేస్తే ఈ దీపం ఆరిపోవడం - ఇది జీవితంలోనే జరుగుతుంది. ‘ఖేసరాసరా’ అన్నది నా ‘మోటో’ (నినాదం) అందరూ టాప్‌లో ‘శ్రీరామరామ’ అని రాస్తే, నువ్వేమిటయ్యా’ - అనేవాళ్లు.
ఇంకా, ఎడిటోరియల్ హాల్‌లోకి పూర్తిగా అడుగుపెట్టలేదు. ‘ఖేసరాసరా’ అంటే ‘వాట్ విల్ బి విల్ బీ - ద, ఫ్యూచర్ రుూజ్ నాట్ ‘యువర్స్ ‘యూసీ!’ అన్నాడు ‘నన్ను’ అని వి.వి.నరసింహారావుగారు ఫిర్యాదు. ‘ఇంగ్లీష్ సంప్రదాయంలో ‘యువర్స్’ అంటారు గానీ, ‘అవర్స్’ అనే తాత్పర్యం స్వామీ!’ అన్నాను. ‘ప్రభ’ నుంచి ‘పత్రిక’కి వచ్చాడాయన. ‘గొట్టిపాటి బ్రహ్మయ్యగారి అల్లుడుట’ అన్నాడు. నాలాగే ఈ మధ్య కొత్తగా చేరిన సూరి నాగరాజు.
డైలీ ఎడిటోరియల్ హాలులో శంకర్ అని, ఒక అటెండర్ వుండేవాడు. వి.వి.ఎన్. దగ్గరసా వెళ్లి ‘రాధాకృష్ణ ఫ్రెండు రుూ పయ్యాఁ’ అన్నాడు.
వాడు, తనకి తెలుగు రాదనే నెపం పెట్టుకుని ‘వాడు నీకీమని ఇచ్చింది’ అనేవాడు, ఇన్‌ఛార్జి శ్రీరాములుగారు ఇచ్చిన టెలిగ్రాములు తీసుకొచ్చి నాకు ఇస్తూ.
నాకు వొళ్లు మండిపోయింది. ‘ఒరే, ఓ శంకరా, ఇట్రారా! పోయి రాధాకృష్ణ సారు వందిరికేరేమో, పోయి పాత్తివారా, పోరా!’ అన్నాను.
‘టీ తెచ్చేదానికి పోత్తుండా’ నన్నాడు, కొంచెం జంకి. పైసలు తీశాను. ‘నువ్వొకటి తాగి, నాకోటి పట్రా. అందరితోపాటు’ అన్నాను. వాడూ ఆనక ఫ్రెండయిపోయాడు లెండి. శ్రీరాములుగారు డైలీ ఇన్‌ఛార్జ్ అని వేరే చెప్పనక్కరలేదు. ఎడిటోరియల్ హాలు మొత్తాన్నీ సగం మింగేసేటంత పెద్ద బల్ల ఆయనది. దాని మీద పిరమిడ్స్ కట్టినట్లు - ఫైల్స్, పత్రికలు గుట్టలు - ఇన్విటేషన్ కార్డులు కుప్పలు అన్ని వుండేవి. ఆయన సీట్లో వున్నాడో లేడో దగ్గిరగా పోయి చూస్తేనే గానీ తెలిసేది కాదు.
అదింకా నాకు రెండో రోజు. శ్రీరాములు సారు, ఇలా చిటికె వేసి, నన్ను దగ్గరికి రమ్మని సంకేతించారు. ఆయన మూతి ముద్దుగా, సున్నాలాగా పెడితే, ‘ఓకే’ అన్నమాట. ‘పైకి పోయి, సండే పేజీలు పెడుతున్నారు వర్కర్‌లు, అదేదో చూసి రాండి’ అన్నారు. గుండె ఝల్లుమంది. నవ్వేశాడాయన, ఎంతో వాత్సల్యంగా ‘నాకు తెల్సు రాధాకృష్ణా టోల్డ్‌మి ఎవ్విరిథింగ్. వర్కర్‌లేం చేస్తారో గమనించండి. ‘గ్యాలీ’లు చెక్ చెయ్యండి’ అన్నారు.
ఎడిటోరియల్ హాలులో వెనుక గోడకున్న ‘తలుపు’ త్రోసుకుని, పై అంతస్తు మీదికి వున్న అరడజను మెట్లు ఎక్కాలి. అదే ప్రెస్సు హాలు. ఆ తలుపులు లాగి తీసుకుంటే, మనం పూర్తిగా అటు వెళ్లకుండానే అవి వీపు మీద చరుస్తూ మూతపడిపోతాయ్ - మాగ్నటిక్ డోర్స్ అవి. ఎందుకంటే ప్రెస్‌లో రోటరీ మిషన్ చప్పుడు ‘సబ్బు’ల్ని, ‘ఐటమ్స్’ని రాసుకోనివ్వవు. ‘సబ్బు’ అంటే సబ్ ఎడిటర్, ఐటమ్ అంటే వార్తాంశం - అన్న మాట. ఇదంతా, ఆనక చెబుతాను. చెప్పానుగా, దినపత్రిక కార్యాలయంలో, ఓ ‘జార్గాన్’ వో ‘పరిభాష’ ఉంటుంది.
నేను ‘రాతియుగం’ వాణ్ని. అనగా పత్రికల్లో ‘రాతియుగం’ అనదగ్గ టైములో చేరిన కొత్త ‘సరుకు’ని నేను. అక్షరాలా ‘స్టోన్’ మీద - అంటే ఓ బల్లమీద పెట్టిన నాపరాయి మీద పేజీలు కట్టేవాళ్లం. అలా కట్టిన పేజీకి, తడిపిన కాయితం అద్ది, దాని ప్రూఫ్ (ముద్ర) తీసుకుని, సరిచూసుకుని - మొత్తం పేజీలను ఓ ట్రాలీ మీదకి లాక్కుని తీసుకుపోయే వాళ్లు వర్కర్‌లు. ఎవరేనా అడిగితే ‘స్టోన్’ మీదున్నాడు, ఓ అరగంటలో వచ్చేస్తాడు’ అనేవాళ్లు నా గురించి.
అలాగ దినపత్రిక ఆదివారం సారస్వతానుబంధం పేజీల పర్యవేక్షణతో ప్రారంభమయింది నా సుదీర్ఘమయిన ‘పత్రికా కొలువు’ రచనా ప్రస్థానం. ఇక్కడో ‘కామా’ పెట్టి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్దాం.
* * *
1960లో ‘ఆంధ్రపత్రిక దీపావళి సంచిక ‘వీక్లీ’ ప్రకటించింది - ‘నవల(ల) పోటీకి రచనలు చేరవలసిన ఆఖరు తేదీ జనవరి 31, 1961’ అని. బహుమతి ఎంతో లేదు గానీ అప్పటికి అదే ఎక్కువ. మూడొందలు అనుకుంటాను. నా ‘విడీవిడని చిక్కులు’ నవల ఈ పోటీకి వెళ్లింది. అది ఆ జులై పందొమ్మిది, 1962లో మొదలై వుండేదేమో గానీ ‘సింగరాజు లింగరాజుగారి’ - ఆదర్శాలూ ఆంతర్యాలు’ బహుమతి పొందిన నవలగా ప్రారంభించబడ్డది. నాకు అది ఎలా జరిగింది అంటే?
బెజవాడలో - ఆంధ్రపత్రిక కార్యాలయంగా మారిన ఆ బ్రహ్మాండమయిన దుర్గ్భావన్‌లో - అంతటా నిశ్శబ్దంగా వున్న సమయంలో, పైకి వెళ్లే చెక్కమెట్లు ధన్‌ధన్‌మని చప్పుడవుతూ వుండగా వెళ్లి - శివలెంక రాధాకృష్ణగారిని కలిసేవాణ్ని. చాలా సంవత్సరాలు, ఎందరో రచయితలు, సందర్శకులు చెబుతూ వుండేవారు -‘మేడ మీదికి ఆ చెక్కమెట్లు ఎక్కి వచ్చి మిమ్మల్ని కలిశాం’ అంటూ, ఇప్పటికీ. అదేదో సంతోషకర జ్ఞాపకం అన్నమాట.
ఆంధ్రపత్రిక బెజవాడ ఏజెంటు, ఖద్దరు వస్త్ర దుకాణం నిర్వహించే గాంధీగారి భక్తుడు నిమ్మగడ్డ వేంకట కృష్ణారావు గారి షాపు - ఒన్ టౌన్‌లో పార్కు రోడ్డులో మా స్కూలు వెనుక జంక్షన్‌లోనే ఉండేది. ఆ షాపులో ‘జల్లెడ తలుపులు’న్న బీరువాలో, ఓ పోస్ట్‌కార్డు ప్రదర్శించబడుతూ వుండేది. అది గాంధీగారు రుూయనకి రాసిన కార్డు. అట్లా ఆంధ్రపత్రిక మీద, యాజమాన్యం మీద రుూయనకి ఎనలేని భక్తి గౌరవాలు. వాళ్లబ్బాయి, బాబూ రాజేంద్ర ప్రసాద్ - అంతెత్తు విగ్రహం అయినా, ‘ముడుచుకు’ పోయి వుండి - ఎల్లవేళలా నవ్వుతూ మాట్లాడేవాడు. రాధాకృష్ణ గారొస్తే ‘బాబుగారూ’ అంటూ వొదిలిపెట్టేవాడు కాదు. నా దగ్గరకొచ్చి ‘బాబుగారు రమ్మంటున్నారు’ అని చెప్పేవాడు. అది తెలిసి వెళ్లాను.
కొట్టవచ్చినట్లు ఏలూరు కాల్వ దగ్గర అయిదు రోడ్ల కూడలిలో, ఠీవీగా, నిలిచే ఈ రాతికట్టడాన్ని దేశోద్ధారకులు - నాగేశ్వర్రావు పంతులుగారు - గాంధీగార్కి మొట్టమొదటిసారి ‘బస’గా ఇచ్చారు. దాని ‘గృహప్రవేశానికి’ తొలి ఆస్థాన కవులయిన చెళ్లపిళ్ల వేంకటశాస్ర్తీ గారు వచ్చి, భవనానికి ‘దుర్గ్భావన్’ అని బెజవాడ గ్రామ దేవత అయిన అమ్మవారి పేరు పెట్టారంటారు. కానీ అక్కడే ఆంధ్రపత్రిక అరవై అయిదులో మద్రాసు నుంచి తరలి వచ్చి, దినపత్రికగా మొదలయింది. ఆనక 1973లో ఆంధ్రపత్రిక వీక్లీ, ఇతర పత్రికలూ వచ్చి చేరాయి. ఓ వెలుగు వెలిగి - గ్రహణం పట్టిన సూర్యుడిలా క్షీణించి - చివరికి చరిత్ర గర్భంలో కలిసిపోయింది. పోనీ, అలాగయినా మిగిలిందా? అంటే అదీ లేదు. సీతమ్మవారిలాగ భూగర్భంలో కలిసిపోయింది. ఇవాళ ఆనవాలు కూడా లేదు. అక్కడొక స్మారక ఫలకం అయినా వేయించుకోలేక పోయాడు ఆంధ్ర పాఠకుడు. అకటా!
ఆ భవనంలోకి వెళ్తూంటే ఒక చరిత్ర గుహలోకి వెళ్తున్నట్టనిపించింది. రాధాకృష్ణగారు చెప్పాడు ‘మీరు ఏవో ‘చిక్కులు’ పంపారుగా పోటీకి. అఫ్‌కోర్స్! నేను కూడా చదివాను ఆ నవలని’ అని ముక్తాయింపు ఇచ్చారు.
‘అమ్మకి, అదే, మా అమ్మగారికి, సెంట్ పర్సెంట్ వచ్చింది. కానీ, ‘ముగింపు’ మారిస్తే బాగుణ్ణు’ అన్నారు. ‘నాకూ నచ్చలేదు, ఆ ముగింపు’ అని నవ్వేశారు.
ఈ సందర్భంలో ఓ మాట చెప్పాలి. ముప్ఫయి రెండేళ్ల సర్వీసులో రెండే రెండుసార్లు నేనా పవిత్రమూర్తిని - శ్రీమతి కామాక్షమ్మగారిని సందర్శించుకున్నాను. అయ్యవారి సతీమణి శ్రీమతి కామాక్షమ్మగారు అంటే దేశోద్ధారకుడు కాశీనాథుని నాగేశ్వరరావుగారి కుమార్తె అని వేరే చెప్పనక్కరలేదు. ఒక ‘కర్పూరపు బొమ్మ’లాగా కనబడ్డారు. నన్ను ‘కనిపించని దేవత’లాగా కాపాడారామె - చివరిదాకా.
రాధాకృష్ణగారు కొనసాగించాడు సంభాషణ. ‘మీరు స్ట్ఫాలోకి వద్దామనుకుంటున్నారని అమ్మకి చెప్పాను. అమ్మగారి అంగీకారం, బ్లెస్సింగ్స్ లభించినట్లే. కానీ మీకు పోటీలో ప్రయిజు మాత్రం రాదు. సారీ! ఆ వూసు మర్చిపొండి’ డ్రెమెటిక్‌గా నవ్వుతూ అన్నారు. అర్థం చేసుకున్నాను. పత్రికలో పడ్డాక, ‘మంద’లో ‘మంది’గా అవుతాను. అంచాత ఎవరేనా తమ ఉద్యోగికి బహుమతి ప్రకటిస్తారా? అందుకనే ఖేసరాసరా’ అనుకున్నాను.
రాధాకృష్ణగారు చెప్పారు. ‘పోయిన ఆగస్టులోనే వారపత్రికలో సంపాదక వర్గంలోకి అభ్యర్థులు కావాలని, స్ర్తిలు కూడా రావొచ్చునని ప్రకటన ఇచ్చాం’
‘నేను చూడలేదు.. ఆనెస్ట్లీ సార్’ అన్నాను.
‘కొంతమందిని, ఒక అమ్మాయిని కూడా (ఆమెయే మందరపు లలిత అనుకుంటాను) వేసేసుకున్నారు’ అన్నారు.
నేను నిర్లిప్తంగా నవ్వాను. ‘దినపత్రికలోకి...’ అంటూ నసిగాను. ఆ, ‘దినపత్రికలోకి’ అన్నమాటే - ఆయనకి చాలా కోపం తెప్పించింది. వారపత్రికకి ఆయన అప్పుడే పూర్తి ఎడిటరయినాడు. అయ్యవారి పేరు చీఫ్ ఎడిటర్ అని ‘వేస్తున్నారు’ ఇక మీదట. పాతవాళ్లంతా వెళ్లిపోయారు. తనకి నచ్చినట్లు, కలిసి పనిచేసేవాడు కావాలి ఆయనకు.
నిజానికి అది నేనేనేమో?
నాకు మాత్రం డైలీ మీద గ్లామరు. ‘అబ్బా? గుండా?’ అని అదేదో సినిమాలో శోభన్‌బాబు అన్నట్లు ‘వీక్లీయా?’ అని పైకే అనేశాను.
‘సరే మద్రాసు రాండి, పైవారం, నాన్నగారిని చూద్దురుగాని’ అంటూ లేచాడాయన. సో... అయ్యవారు ఇంటర్‌వ్యూ చేస్తారన్నమాట. నా గుండెలు కొంచెం వడిగా, అలజడిగా...
1961 ఆగస్టు నెలాఖరు అనుకుంటాను. మద్రాసు తంబుచెట్టి స్ట్రీట్ - మొదట మా నాన్నగారి దగ్గరకు, ఆనక వాళ్ల నాన్నగారి దగ్గరకూ వెళ్లాను. ఇద్దరి ఆశీస్సులూ లభించాయి.
ఈ జ్ఞాపకం నిజమైన స్వప్నమే. అయ్యవారు కూడా 1972లో ఆయన ‘ఇహలోక యాత్ర’ చాలించేదాకా, నన్ను స్వతంత్రంగా ఒక జర్నలిస్టుగా ఎదగడానికి దోహదించారు.
అంతవరకూ రాధాకృష్ణగారితో అమృతాంజన్ ఆఫీసుకి తిరుగుతున్నా - తంబుచెట్టి స్ట్రీట్‌లో ఆంధ్రపత్రిక ఎదురుగ్గానే వున్నా - సాయంకాలం పూట నాలుగో అంతస్థు బాల్కనీలో నుంచి - క్రింద ఆంధ్రపత్రిక కార్యాలయ సిబ్బంది బయటకు వస్తున్న దృశ్యాలు తిలకించేవాణ్ని. డాక్ ఎడిషన్ రాగానే, పెద్దలు ఓ కాపీ ధరించి పేజీలు తిరగేసుకుంటూ బయటకు రావడం - సాయంకాలపు జనసమ్మర్థం చూస్తూ వుండటమే తప్ప పత్రిక కార్యాలయంలోకి అడుగుపెట్టలేదు.
పత్రిక డాక్ ఎడిషన్ చైనా బజార్ ఫుట్‌పాత్ మీద, గబగబా పరిచేస్తే - అమ్ముడయిపోతూ ఉండేది. అప్పుడు మద్రాసు తెలుగు వారికీ ‘పత్రిక’ అంటే చాలా ఇష్టం. ఆంధ్రాలో సిటీలకన్నా మద్రాసులో, బంగలూరులో వారపత్రిక కాపీలు ఎక్కువగా అమ్ముడుపోయేవి. క్రిందకు దిగి బోస్‌రోడ్ మీదికి పోయి ఓ కాపీ ఇదీ, ‘మైలు డైలీ’ తెచ్చుకొనేవాణ్ని.
అలా అద్భుతమైన ఆ కార్యాలయంలోకి అయ్యవారిని చూడ్డానికి, మొట్టమొదటిసారి ప్రవేశించాను.

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com