స్మృతి లయలు

మూడు నవలలు.. ఆరు కథలుగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఫ్పుడే ఏణ్ణర్ధం అయిపోతోంది - ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణం వొదిలిపెట్టి. ఉద్యోగం లేదు. సంపాదనా లేదు. సంపాదకత్వమూ లేదు. కాకపోతే ఆనందవాణి నుంచి - అది వదిలి వచ్చేశాకా, బెజవాడలో సినిమాల పరిచయం, పత్రికల పరిచయం - మా వూరు జంక్షన్ కనుక - అటూ, ఇటూ తిరిగే రచయితలతో కబుర్లూ, కాలక్షేపం. ఒకప్రక్క రాస్తున్న, వెలువడిన నవలల సంఖ్య పది దాటింది. కథలు పడుతూనే వున్నాయ్.
కవిని, కథకుణ్ణి, పైగా నావలిస్టుని అన్న ముద్ర పడిపోయాను. హైదరాబాదు రచయితల సమావేశాలకు పోయి రావడంతో - వారపత్రికలు మొదలు, వార్షిక పత్రికల దాకా కథలు అదే పనిగా అచ్చవుతూ వుండటంతో చిన్న పిసరు ‘కీర్తివలయం’ ఒకటి - ‘ఓరా’ అంటామే అలాంటిది ఆయాచితంగా ఏర్పడిపోయింది.
మా బెజవాడ ఎండలకీ, కొండలకీ మాత్రం ప్రసిద్ధం కాదు. ఇది ఉద్యమాలకీ అభ్యుదయ వాదుల ప్రభంజనానికీ, నవలల విజృంభణకీ కొత్త సినిమాల ఆవిర్భావానికీ కొత్తకొత్త ట్యుటోరియల్ కాలేజీల ద్వారా విద్యా విజృంభణకీ ఆలవాలమని అర్థం అయిపోయింది.
‘ఎదిగీ ఎదగని మనుషులు’ నవలలో - అరవైల నాటి మా బెజవాడ కనబడుతుంది. స్టేషన్ వంతెన దిగి తూర్పు దరి, దిగంగానే రైల్వే ఆసుపత్రి ఎడం ప్రక్క వుండగా కుడిప్రక్క కాలిబాటల మీద (్ఫట్‌పాత్) రకరకాల దుకాణాలు, గాజులు, పూసలు మొదలు కొత్తగా వస్తున్న బైనాక్యులర్లు, డబ్బా కెమెరాలు, పింగాణీ, కొత్తగా వస్తున్న ప్లాస్టిక్, ఎబొనైట్ వస్తువులు మాత్రమే గాక - దారంట, వారంట అంతా మూడు ముక్కల ‘ఆట’ - పేకముక్కల ట్రిక్కులు దండిగా వుండేవి. మూలికలు - హిమాలయాల నుండి నేరుగా త్రవ్వి తెచ్చామని చెప్పే నిలువెత్తు దుంపలు - చిన్నచిన్న గారడీలు, కోతులాటలు అన్నీ ఉండేవి. అదొక ఎగ్జిబిషన్ - అదో సర్కస్ - అదో కార్నివాల్!
పృథ్వీరాజ్ కపూర్ తన సంతానంతో - తన ‘్థయేటర్స్’ తీసుకువచ్చి, ఇక్కడ నాటకాలు వేశాడు. పగలంతా తన నాటకాల రిహార్సలు - అసిస్టెంట్‌లకు అప్పగించి భార్యామణితో - కలిసి ఈ భారీకాయుడు గవర్నర్‌పేటలోని ‘షహన్‌షా మహల్’ (అదే చివరికి ‘నవరంగ్’ అయింది - ఇప్పుడు అదీ పోయింది) నుంచి స్టేషన్ దాకా నడుచుకుంటూ వచ్చేవాడు. వింతగా చూసేవాళ్లం. నవలల్లో ఈ ‘బెజవాడ’ దర్శనమిస్తే - కొన్ని కథలలో నేనా ఫుట్‌పాత్‌నే నేరుగా, నా లొకేషన్‌గా వాడుకున్నాను. ముష్టివాళ్లు, జేబుదొంగలు లేనిదే కాలంలో ‘చావు ఖరీదు’ అని మరో కథ రాశాను. కృష్ణాపత్రికలో వచ్చింది. ఓ గ్రూపు లేదా ఓ గ్యాంగు (ముఠా అననులెండి) ఈ గాంధీ నగరాన్ని - రోజుకో చిత్రవిచిత్రంగా ఆక్రమించుకుంటూ వుండేవారు. ఓ రోజు - వారంలో, ఈ ఆవారాగాళ్ల బృందంలో ఒకడు చావకుండానే, శవం అయి పడుకుంటే మిగతా వాళ్లు దారి కడ్డంపడి, వాడి అంత్యక్రియలకి అంటూ పైసలు దండుకునేవారు. గోల్డెన్ కేఫ్ సెంటర్ దాకా ఇదే తంతు. ‘శవం’ పాత్రని - సజీవంగా, అమోఘంగా పోషించే సదరు శాల్తీ వోనాడు నిజంగానే ‘గుటుక్కు’మన్నాడు. ఆనక ఏమైందీ? అన్నది కథ - తెనాలి నుంచి ఆర్టిస్ట్ గోలి శివరాం దీనికి ‘వాష్’ టెక్నిక్‌లో బొమ్మ వేశాడు. అదో స్పెషల్. అట్లా ఎందరో పెద్దలు, పిన్నలు - రావూరు సత్యన్నారాయణ రావుగారు, శార్వరి, కొండముది హనుమంతరావు, లత, నవయుగ నర్సయ్య గారి ద్వారా మద్రాసు నుంచి వచ్చే ప్రతిభా శాస్ర్తీగారు, ఏచూరి, సినీ నటులు రచయితలు ఇలా ‘బాబాయి హోటల్’ దగ్గర, న్యూ ఇండియా హోటల్ (అదే తర్వాత ప్రభ సెంటర్) ఇప్పుడు ఐలాపురం హోటల్ సెంటర్ అయింది. కొలకలూరి, మసూన, మంజుశ్రీ, వాకాటి ప్రభృతులు విజిటర్లుగా, కోలాహలంగా సాహితీ చర్చలుగా కాలం దొర్లిపోతోంది.
‘కనువిప్పు’ నవల ప్లాట్ తయారైంది. నాకు దిగులు పట్టుకుంది. ఏదో ‘కనువిప్పు’ అయినట్లనిపించింది. అభిమానుల సంఖ్య, ఉత్తరాలు - ఇబ్బడిముబ్బడిగా రావడం - ముఖ్యంగా ‘ఎద్దు’, ‘మునగచెట్టు’ ‘కోతీ-్భతీ’ ‘చావు ఖరీదు’ వగైరా కథలు పెద్దలను - ఫ్యాన్స్ చేస్తే ‘ప్రతీకారం’ ‘రేపు దొరికింది’ ‘చదువుకున్న అమ్మాయి’ ‘ఒప్పందం’ ‘పెళ్లాంతో షైరేమిటీ?’ లాంటి కథలు ఆడపిల్లల్నీ, మగపిల్లల్నీ కూడా మెస్మరైజ్ చేశాయి. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ మీద (నా తొలి ఇంప్రెషన్) రాసిన - పెళ్లాంతో షైరేమిటీ?’ కథని - రిపీట్ ప్రచురణ అంటే - వేర్వేరు పత్రికలు వేసుకోవడం - ఇలా సాగుతూ వుండగా-
బెజవాడలో కూడా హేమంతం తొంగి చూసింది. చలి సాయంకాలాల - గాంధీనగర్ మొగన సమావేశాలు బాగా తగ్గాయి. రేడియో స్టేషన్ - బందరు రోడ్డు మొగ కబుర్లు తగ్గేయి. ఓ రోజు మహీధరరావు ప్రొద్దునే్న వారి ఇంటి దాకా నేను పోకుండానే - డోర్నకల్ రోడ్డు - నక్కల రోడ్డు ప్రాంతంలో కలిశారు ఒకసారి - ‘సార్, మీ దగ్గరకే’నన్నాను. ‘ఉద్ధరించేవ్ గానీ... పద, గవర్నర్‌పేట బిసెంట్ రోడ్ మోడ్రన్ కేఫ్‌కి పోదాం పద’ అంటూ, స్టేషన్ వదిలిన ఎక్స్‌ప్రెస్‌లాగా ముందుకి నడిచారు.
వెంట పడ్డాను నేను.
ఆయనతో, ఆ మాటకొస్తే, ఆ తరం రావూరుగారు, రెంటాల, జనతా శాస్ర్తీగారి లాంటి వాళ్లతో మేం యువకులం అయినా కూడా అంగలు వెయ్యలేకపోయేవాళ్లం.
ఎన్.ఆర్.చందూర్ గారు (మాలతీచందూర్ గారి శ్రీవారు) సున్నితంగా మాట్లాడుతూ, స్ఫురద్రూపి లాగా కనబడతారు. ‘తొలి మలుపు వీరాజీ అంటే ఇలా వుంటాడన్న మాట’ అసలే నాకు చెమటలు ఎక్కువ. చేత వెల్లవేళలా వుండే రుమాలుతో మొహం అద్దేసుకుంటున్నాను. ‘మాలతి మీ నవల గురించి చాలా చెప్పింది. షీరుూజ్ వెరీమచ్ ఇంప్రెస్స్‌డ్’ అన్నారు. అలా అంటూ మహీధర వారి వేపు తిరిగి, ‘వో చిన్న మాట, ఎందుకయినా మంచిదని, ఓవర్ ది వైర్ చెప్పలేదు’ (అంటే టెలిఫోన్ మీదన్న మాట) మీకు - ఈ అబ్బాయి రాసిన ‘రావిచెంత బావి’ అన్న కథ చదివాను. దాని గురించి మీకు చెప్పాలనీ - మీ ‘వార్డు’ గదా?’ అన్నారు, నన్ను చూస్తూ... వాత్సల్యంగా.
నా వొళ్లంతా కనులూ, చెవులూ చేసుకున్నాను. ఈసారి చెమటలు పట్టినా అవి మరో రకం స్వేద బిందువులు.
అది ఓ ఫోర్ డైమన్షనల్ కథ సార్...’ అంటూ చెప్పారు. అది విజయ సాహితీ సమితిలో మహీధర గారు కాచి వడబోసినదే గనుక, ఆ కథ మీద చర్చించారు పెద్దలు. ప్రభ వారి కథల పోటీ న్యాయ నిర్ణేతలలో నేనూ ఒకణ్ని - ఫుల్‌మార్క్స్ - టాప్ ‘ఫైవ్’లో వుంది అది’ అంటూ చెప్పి - చూపుడు వేలు తన పెదాల మీదుగా ముక్కు మీద పెట్టుకుని - ఇష్’ అన్నారు చందూర్‌గారు నా వేపు చూసి. చాలాసేపు సాగాయి వాళ్లిద్దరి కబుర్లు. ఆ కథ పేరు ‘రావిచెంత బావి’
నేనింటికి వస్తూనే - ప్రభ డైలీకి నైట్‌డ్యూటీకి వెళ్తున్న తమ్ముడికి చెప్పాను. రాత్రి వాడు తిరిగొస్తూనే రెండు గంటల వేళ ‘నీ కథ ‘రావిచెంత బావి’ - ఫస్ట్‌ప్రయిజుకు వచ్చింది - అనుకుంటాను. రావూరుగారీ మాట అన్నాడు - సంబరంగా చెప్పాడు.
ఇద్దరం తెల్లారిపోయిందన్నట్లు ‘వెల్తురు’ పంచుకున్నాం గానీ బయటపడలేదు మర్నాడంతా. నడుస్తున్నానో, ఎగురుతున్నానో తెలీదుగానీ - మళ్లీ రాత్రయింది. అమ్మకి తప్ప ఈ వార్త మరెవ్వరికీ చెప్పలేదు. ‘నయం.. ఆ బోరు దక్కింది’ అనుకున్నాను. ఆనక, రాత్రి డ్యూటీ నుంచి తమ్ముడు వచ్చాడు.
‘సారీ’ అన్నాడు. ‘నీ కథ కంపోజ్ అయింది. కానీ చీఫ్ జడ్జి అయిన స్వామి శివశంకర శాస్ర్తీగారు దీన్ని తప్పించేశారు. ‘దానిమ్మపండు’ అన్న కథకి ఫస్ట్‌ప్రయిజ్ ఇచ్చారు’ అన్నాడు.
నేను క్రుంగిపోలేదు.
‘కమ్యూనిస్టు వీరాజీ అని రిమార్కు రాశారా?’ అన్నాను.
‘కాదు. ఏభై అయిదు మార్కులు వచ్చిన నీ కథ చివర అడ్డంగా ‘ఇంటూ’ పెట్టి ఉంది’ అన్నాడు. వ్రాతప్రతి ప్రూఫ్ రీడింగ్ సెక్షన్ నుంచే వెనక్కి వెళ్లింది.
‘టూ లెంగ్దీ’ అన్నది రిమార్కు. ‘నిబంధనల ప్రకారం ‘నిడివి’ ఎక్కువ. కావున బహుమతి ఇవ్వబడదు. తర్వాతి మార్కులు తెచ్చుకున్న కథ ‘దానిమ్మపండు’కి ఫస్ట్ ప్రయిజు అయిదు వందలు - ప్రకటించవచ్చును’ అన్నది నిర్ణయం’ అన్నాడు. ‘నిడివి’ ఆ విధంగా నా ప్రయిజ్‌ని తినేసింది.
నేనంటూ వుండేవాణ్ని ఎప్పుడూ - ‘బిట్వీన్ ద కప్ అండ్ లిప్ దేర్ మే బి ఏ స్లిప్’ అని. అదో ఊతపదం నాకు.
అమ్మ ఒకసారి అడిగింది, దాని అర్థమేమిటని, చెప్పాను.
‘ఆ మాట ఇంకెప్పుడూ అనకురా, పెద్దవాడా! అశ్వినీ దేవతలు ‘తథాస్తు’ అంటారుట. మా అత్తగారు అంటే మీ ‘మామ్మ’ చెప్పారు’ అన్నది. రావిచెంత బావి అన్న ఈ కథ తర్వాత ఫిబ్రవరిలో అచ్చయింది. ఎక్కువ పారితోషికం కూడా పంపారు.
ఐతే, అదే... నేను, ఏదేనా ఒక కథల పోటీకి కథని పంపడం. మరి లేదు, తర్వాత, ఎందుకంటే, అటు తర్వాత ఆంధ్ర సచిత్ర వారపత్రిక నిర్వహించే కథల పోటీలకు నేనూ ‘పౌరోహిత్యం’ వహించక తప్పలేదు - న్యాయ నిర్ణేతలలో (?) ఒకణ్ని.
అట్లాగే విడీవిడని చిక్కులు నవల - నేను, ఆంధ్ర పత్రికకి ఇచ్చానని చెప్పాను కదా - పోటీకి పంపిన నా మొట్టమొదటి - చిట్టచివరి ‘నవల’. కానీ ఈ ‘విడీవిడని చిక్కులు’ నా ఉద్యోగానే్వషణకి ‘్ఫల్‌స్టాప్’ పెట్టేసింది. అదో చిత్రం. అది ఎట్లనినన్.

(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com