స్మృతి లయలు

కొత్త మాటల భాటలో...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారుతున్న ప్రపంచంలో నిత్యం కొత్త పదాలు చేరుతూ ఉంటాయి. నాటి న్యూస్ పేపర్ కార్యాలయంలో ఇలా కొత్త పదాలు ఎగిరి వచ్చి చేరేవి కావు.
ప్రతీ వృత్తికీ ఒక జార్గాన్ ఉంటుంది. ఒక పరిభాషా, పడిగట్టు రాళ్లూ ఉంటాయి. జర్నలిస్టు అనంగానే కొందరు నా వేషం, వాలకం చూసి - ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్సా?’ అనడిగేవారు. మరి కొందరు ‘తెలుగు ఎమ్మేనా?’ అనేవాళ్లు. చాలామందికి తెలుగు దినపత్రికలో పనిచేసే వాడి ‘రథం’ - ఇంగ్లీషు, తెలుగు అనే రెండు చక్రాల మీద నడుస్తుందని తెలీదు. ‘్ఫజిక్సా? తెలుగు పత్రికలోనా ఉద్యోగం?’ అనే వాళ్లు.
అసలు ‘బల్క్‌న్యూసు’ అంతా ఇంగ్లీషులోనే వస్తుంది. దాన్ని కేవలం అను‘వాదం’ చేస్తే - గురువుగారిని చెయ్యబోతే కోతి అయినట్లు ఉంటుంది. ‘డొక్కశుద్ధి’; సంస్కృతం, వ్యాకరణం, ఛందస్సు వగైరా తెలిస్తే కొంతయినా - పులగం మీద పప్పు అవుతుంది గానీ అది చాలదు.
శిష్ట వ్యవహారికంలో రాయడానికి వేరే కృషి కావాలి. ఉత్తరాంధ్ర తెలుగు భాష ‘యాస’లోనూ, ఫార్సీ, ఉర్దూ లాంటి అన్యభాషా పదజాల మిశ్రీతంతో ఉంటుంది. గొప్ప ‘రిచ్’. అలాగే తెలంగాణా మాండలికం నలిగితే భలే కొత్త మాటలు వస్తాయి. ‘కాకినాట్టు’ (అవంత్స సోమసుందరం గారు అలానే అనేవాడు) యాస ఒక్కటే యాస కాదు. రాయలసీమ తెలుగు తిక్కన గారి చిక్కదనంతో రాసింది రాసినట్లే ఉచ్చరించ వీలవుతుంది. అది గ్రేట్! మారిటోరియం, ప్రోరోగ్, అడ్జర్న్‌మెంట్, స్పేస్‌లాంచ్ లాంటి మాటలు వస్తే వాటికి జాగ్రత్తగా తెలుగులో సరియైన ‘మాటలు’ ‘వండు’కోవాలి. ఎడిటోరియల్ హాలులో సాయంకాలం ‘డాక్’ పత్రిక దడదడ రోటరీ మీద పరిగెడుతూ వుంటే - పెద్దలు హాలులో కూర్చునేవాళ్లు. అది పిచ్చాపాటీ మీటింగు కాదు. కొత్తగా వస్తున్న ఇంగ్లీష్ వార్తాపదజాలానికి తేటతెనుగు పదాలను తయారుచేసుకోడం కోసం అన్నమాట!
ఓ చిన్నసైజు స్టేజీ అంత వుండే శ్రీరాములు గారి దాని బల్ల ప్రక్కనే ఉండేది నా చిన్నిబల్ల. దాని మీద అంతలో చదరంగం బల్ల పెట్టేవారు. ‘బంటు’ని త్రోసి ‘బిషప్’ని చంపు - రాణీని తీసి ప్రక్కనపెట్టు - గుర్రాన్ని ఎగరేయ్’ అంటూ పెద్దలు - కాస్సేపు టెలిప్రింటర్ టకటకలకీ, మధ్యమధ్య అది కొట్టే వార్నింగ్ బెల్స్‌కి దూరంగా పారిపోయేవాళ్లు.
ఒక్కోసారి ‘అయ్యవారు’ అలాంటప్పుడు హాల్లోకి వచ్చేవారు. సరిగ్గా చదరంగం బల్లకి సరిగ్గా ఎదుటి బల్ల మీద ఓ పిర్ర ఆన్చి, ఇలా కూర్చొని తీక్షణంగా పరికించి - ఏదో ఎత్తు వేసెయ్యమని సూచించేవారు. అట్లా గడిచేది ఆయనతో సాయంత్రం.
చిత్తూరు నుంచి వచ్చే ఆంధ్రప్రభని మేమూ - అలాగే మా ఆంధ్రపత్రికని వాళ్లూ - గ్రామీణ వార్తల విన్యాసం ఎలా ఉందో చూడటం కోసం తనిఖీ చేసేవాళ్లం. వాళ్లు భద్రతా ‘మండలి’ అంటే, అది కాదు ఐక్య‘రాజ్యమండలి’ అనీ, ‘్భద్రతా సమితి’ అని అనాలి అనేవాళ్లు, సాంబశివరావు గారు మొదలయిన పెద్దలు. దిక్కుమాలిన చైనా రాజధాని అసలు పేరు తెల్దు. ‘బీజింగ్’ కాబోలు - దాన్ని హడావిడిలో పి.ఎస్.గారు ‘పెకింగ్’ చేశాడు. అంతే - మనం అలాగే రాద్దాం. బీజింగూ కాదు, పేకింగూ కాదు - అని పెద్ద తలకాయలు మొండికేస్తే - మేం అలాగే రాసేవాళ్లం. ఇంకేం చేస్తాం? నిత్యం యజ్ఞం అదే సాగాలి.
అర్జెంట్ భాష కావాలి. కూచిపూడి భామా కలాపంలో - భామ ప్రేమలేఖ రాయడానికి పోజు పెట్టినట్లు మీనమేషాలు లెక్కించరాదు. దానికి వ్యావహారిక భాష మనకి బాగా నలగాలి. రష్యావాడు రెండో మనిషిని అంతరిక్షంలోకి త్రోసేశాడు. దాన్ని ఏమనాలి? అంతరిక్ష యాత్రీకుడా? రోదసీ యానుడా? ‘వ్యోమగామి’ అనా? అలాగే - అది చక్కర్లు కొడుతోందా? భూప్రదక్షిణలు చేస్తోందా? భూమికి నూట యాభై మైళ్ల ఎత్తు వో ‘ఎత్తా?’ మనం ‘రోదసీ యానం’ అనే అందాం. చంద్ర మండలానికి పోయే దారిలో వున్న ‘సౌండ్ బారియర్’ని ఏమందాం? లాంచ్‌ప్యాడ్‌ని ‘ప్రయోగ దిమ్మ’ అందామా? - ఇట్లా తర్జనభర్జనలు చేసి కొన్ని మాటలు ఫైనలైజ్ చేసే(వాళ్లం) వారు.
ఇక హెడ్డింగులలోకి వస్తే ఐదు, పది, పదిహేను సెంటీమీటర్ల వెడల్పులో - అనగా సింగిల్, డబుల్, ట్రిబుల్ కాలమ్స్‌లోకి సరిగ్గా అది కూర్చోవాలి. దినపత్రిక కాలమ్ నాలుగున్నర లేదా ఐదు సెంటీమీటర్లుగా ఉంటుంది. నేను వర్కర్లని ‘ఖుషామత్’ కొట్టి -పైసలిచ్చి - ఓ ‘్ఫంట్స్’ అంటే అక్షరాల సైజులు అనుకోండి - బుక్‌ని సంపాదించాను. జి.పి. (ఎంతోమందికి గ్రేట్ ప్రీమియర్ అని తెలిసేది కాదు) కీ, పదహారు పాయింట్‌కీ తేడా ఏమిటి? యివన్నీ ‘టెక్నికల్’ (సాంకేతికం సరియైన తర్జుమా కాదు) క్రమేపీ నేర్వాల్సిందే. పెద్దలు చెప్పరు. వాళ్ల మాటలు ఇంకెక్కడయినా ‘చద్దిమూట’యే గానీ - ఇక్కడ మాత్రం ట్రేడ్ సీక్రెట్‌గా కాపాడుకుంటారు.
ఓసారి ‘్ఫస్ట్ ఫార్వర్డ్’ చేస్తాను.
1969 జులై 20న ‘మనిషి’ చంద్రమండలం మీద అపోలో పదకొండుతో - తొలిసారి ‘పాదం’ మోపాడు. (నిజానికి నీల్‌ఆమ్ స్ట్రాంగ్ మొదట, ఆనక బజ్ ఆల్డ్రిన్ ‘దిగారు’) ఆ రోజు దినపత్రిక, నైట్ డ్యూటీలో నేనున్నాను - నైట్ ఇన్‌ఛార్జిగా. మన టైమ్ ప్రకారం రాత్రి ఒంటిగంటా ముప్ఫయి రెండు నిమిషాలకి ఈ చరిత్రాత్మకమైన సంఘటన భూ మండల జనాల్ని చకితుల్ని చేసింది. సరే.. రెడీగా కూర్చున్నాం. ఫస్ట్ పేజీని విస్తరాకులా పరిచి పెట్టుకున్నా. టిక్కర్ - స్నాప్.. స్నాప్.. ఆనక ఫ్లాష్ ఫ్లాష్.. అంటూ వార్నింగ్ బెల్స్ వాయిస్తోంది. అంతా థ్రిల్లింగ్‌గా బాగుంది. మాలాగే ఇంగ్లీషు పేపరుంది. ఏలూరు కాల్వ అవతల వాళ్లు టెలిగ్రాములు చింపారు. ‘మ్యాన్ ల్యాండెడ్ ఆన్ మూన్’ అన్న మాటల్ని అట్లాగే పేజీల్లోకి ఎక్కించారు. మరి ‘తెనుగు’వాడు? ‘చంద్ర మండలం మీద మనిషి దిగాడు’ అనా? ‘కాలు మోపాడు’ ‘అడుగు వేశాడు’ అనా? (ఆ రోజుల్లో ‘వూహ’ తప్ప మరో ఆధారం లేదు) ఏమని? ‘మానవుని చంద్ర మండల విజయం’ లాంటి హెడ్డింగా? ఏది? పెట్టాలి? సరిగ్గా అనువాదం చెయ్యాలి.
నీల్ ఆమ్‌స్ట్రాంగ్ - ‘నే వేసిన ఈ ‘అడుగు’ మానవ చరిత్రలో ఓ పెద్ద ‘అంగ’ అన్నాడు. దాన్ని అలాగే రాసేవాళ్లం. హెచ్చుతగ్గులు - సొంత పొయిట్రీ రాయకుండా రాసిపెట్టాలి. అసిస్టెంట్ ఎడిటర్ సహా అంతా తన్నుకు చచ్చాం అందరం. అక్కడే వస్తుంది ఇబ్బంది. ఆనాటి రూల్సూ ప్రకారం న్యూస్ రాస్తున్నప్పుడు ‘నో పొయిట్రీ’... యథాతథంగా - విశేషణాలు లేకుండా వచ్చినదాన్ని వచ్చినట్లే పెట్టాలి. కేవలం మక్కికిమక్కికి.. ఐతే ప్రక్కనే - ‘అహో శకోదయమయింది.’ నలుదెసలా ఒకేసారి సూర్యోదయం అయింది’ అంటూ నేను కవిత ఫస్టు పేజీ టాప్‌లో రాశాను. పి.యస్.గారన్నట్లు ‘ఆస్థాన కవి వీరాజీ’గా అనిపించుకున్నాను. ఆ పొయెట్రీ ‘ప్రివిలేజ్’ నాకుంది. అదంతా సరే..
ఇలాంటి ఇబ్బందులు ఇంగ్లీష్ ‘సబ్’లకి రావు. ‘లూనోఖోడ్’ అంటే, దాన్నలాగే దింపేస్తాడు పేజీలోకి. దేని కష్టం దేని బాణీ దానిదే. అంచేతనే, 1961 డిసెంబర్‌లో ‘గోవా విముక్తి దాడి’ జరిగినప్పుడు నేను అనువాదాన్ని జాగ్రత్తగా చేశాను. విముక్తియా? స్వేచ్ఛయా? ఏది గోవాకి లభించింది?.. అది ‘చర్యా’? వారా?’
‘రాయి వీరాజీ! చైనా వాడి మీద, పోర్చుగీసు బుడత కీచుల మీద - నీ ఇష్టం... ‘దంచు’ అనే వాళ్లు పెద్దలు. అట్లాగా, దినపత్రిక నాటి ‘థ్రిల్’ వేరు.
నేడు, ‘నొక్కితే హిస్టరీ అంతా కక్కుతాయి కంప్యూటర్లు. మళ్లీ అదో గొడవ. ఏది? ‘ఎడిట్’ చేసుకోవాలి? ఒక్కోసారి ‘గడ్డివాములో సూది వెదుక్కున్నట్లవుతుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానూ అంటే - ‘నేను రిపోర్టర్’ని అని కాలర్ ఎగరేసే ముందు, చాలా తెలుసుకోవాలి. పాఠకులకు ఇదంతా తెలియదు.
కాని, అదే దినపత్రిక ‘మూస’ పడిగట్టు రాళ్లు పట్టేస్తే సుళువు. మధ్యాహ్నం అర్జెంట్‌గా వార్తలు రాసే వేళ ‘టెలిగ్రాము’ల్ని చేతధరించి, ‘మేం’ అంటే కొత్త కుర్రాళ్లం ఎమర్జెన్సీ - వార్డు’లో నర్సుల్లాగా కంగారు పడుతూ ఉంటే, సాంబశివరావు గారో? ప్రకాశరావు గారో వచ్చి, ఆ టెలిగ్రాముల బొత్తి లాక్కొని, మా బల్ల అంచున, ‘ఇలా’ కూర్చొని ‘రాయి’ అంటూ వార్త డిక్టేట్ చేసేవాళ్లు. ‘టైము ‘సెకెనన్లు’ సహా అంత ముఖ్యం అక్కడ. అలా మొయ్యకపోతే పేపరంతా రైలెక్కదూ, బస్సెక్కదూ - ఉండిపోతుంది’ అనేవారు. ‘కొంపలు మునుగుతాయ్?’
అయ్యో పాపం!
‘పిలకా గణపతి శాస్ర్తీగారే ఆదివారం అనుబంధంలో ఓ ఫుల్‌పేజీ అంతా భారతంతో నింపేవారు. అప్పుడాయన పైన వీక్లీలో సర్క్యులేషన్ డిపార్ట్‌మెంట్‌లో కలిసి వున్న హాలులో ఓ మొల ‘అసిరమ్మంత’ బల్ల వేసుకుని కూర్చునేవారు. పనేం లేదు. కానీ, ప్రేమగా నవ్వుతూ నన్ను పలకరించేవారు. ‘అయ్యో పాపం! అనెందుకన్నానంటే, అది ఆయన ‘ఊతపదం’. ‘సార్! ఇవాళ టాప్‌జెడ్. కొత్త వ్యాసం రాశానోచ్?’ అంటే ‘అయ్యో పాపం!’ అనేవారు.
అలాగే, ‘మధ్యాహ్నం స్పెషల్ స్వీటు తిన్నారా? మీ కిష్టమైన హల్వా వేశాడా? విజయా లాడ్జివాడు? అయ్యో పాపం!’ అనేవారు.
గణపతి శాస్ర్తీగారు ‘ఎర్ర బ్రాహ్మడు’. నెమ్మదిగా కుళ్లు జోకులు వేసేవారు. ‘రాధాకృష్ణ మీ ఫ్రెండటగా? అయ్యో పాపం? ఇబ్బందే మరీ’ అనేవారు.
వారిది ‘విశాలనేత్రాలు’ నవల నా హయాంలోనే వారపత్రికలో పడ్డది.
సరే, దినపత్రికకి వద్దాం. సాయంకాలం ఏదో ఒక అసైన్‌మెంట్ తగిలేది. ఇక వెతుక్కుంటూ పోవడమే.. తిరిగి రావడం తేలికే ‘పారిస్ పోదుమా?’ ‘పారిస్ పోవటం’ అంటూ బస్సులెక్కితే - ఆఫీసుకీ, రూముకీ వచ్చేసేవాణ్ణి నేరుగా.
మద్రాసులో ఇలా సాయంకాలం అసైన్‌మెంట్‌లలో చూసి రివ్యూ చేసిన - అయిదు అమెరికన్ నాటకాలు గొప్పవి. దేనికవే ప్రమాణాలు.
అమెరికా అధ్యక్షుని పేర వున్న సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అమెరికన్ అమెచ్యూర్ నాటిక విశ్వవిద్యాలయాల బృందం వచ్చి - వేసినది ‘మేన్‌మాస్క్’ అనే నాటకం. కదంబం. ఢిల్లీ, బొంబాయి, మైసూర్, హైదరాబాద్‌లలో ప్రదర్శించిన ఐదు నాటికలు వేటికవే అద్భుతాలు! సెట్స్, ఆర్కెస్ట్రా హంగామాలు తక్కువ - నటుల దీక్షా దక్షతలు ఎక్కువ. ప్రఖ్యాత అమెరికన్ నోబుల్ ప్రయిజ్ రచయిత ‘యూజిన్ ఓనీల్’ రాసిన ‘ఆహ్! వైల్డర్‌నెస్’ నాటికతో వీళ్ల ప్రదర్శనలు మొదలై - ‘సన్‌రైజ్ ఎట్ క్యాంప్‌బెల్లో’ (డోర్‌సే - రచయిత) తో ముగిసింది. కానీ, ఇందులో ‘హ్యాపీజర్నీ’ అన్న నాటకం బహు చిత్రం! ఓ కుటుంబం - తల్లీ, తండ్రీ, పిల్లలూ, బామ్మా, తాతా అందరూ ఓ శనివారం సాయంకాలం వాళ్ల వూరికి చేసే ప్రయాణం ఇది. కాని ఉత్తుత్తి ప్రయాణం అది.
ఇందులో పిల్లలు ఆడుకునే ‘బస్సు ఆట’లాగా ఓ బల్లా, దాని ముందు ఓ కుర్చీ వున్నాయి. వూహాజనిత ‘మినీ స్టీరింగూ’ వుంటాయి. ‘జర్నీ’ సాగుతోంది. వెనకాతల దృశ్యాలు తెరలు కదులుతూ వుంటాయి. వీళ్లు రన్నింగ్ కామెంటరీ ఇస్తూ - నవ్వుతూ కేరింతలూ, అల్లర్లతో సాగుతారు. ఖర్చు లేదుగానీ - ప్రేక్షకులకు ‘థ్రిల్’ ఇచ్చిన ఈ డ్రామా అలా కళ్లల్లో వుండిపోయింది. పెద్ద వ్యాసం రాసి వేశాను దాని మీద ‘అంత’ నిడివి అవసరమా?’ అన్నాడు వి.వి.ఎన్. ‘ఔను.. ఇటువంటి ప్రదర్శనలు మన ఔత్సాహికులు ప్రయత్నించాలి’ అన్నాను. ఈ సందర్భంలో అమెరికన్ రిపోర్టర్ పత్రిక ఎడిటర్ బి.ఎస్.ఆర్. కృష్ణ గారు పరిచయం అయ్యారు. అది అలా కొనసాగింది. అట్లా డైరీలో నేను ఎంజోయ్ చేసిన మరో ట్రిప్ అప్పటి ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్ గారితో కోయంబత్తూరు వెళ్లడం.
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 92900 99512 veeraji.columnist@gmail.com