సాహితి

లంచగొండులు - లాభ ప్రలోభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎలచ్చన్లో మా వూర్కి వచ్చిండు. అందరం తమ పార్టీకే జేకొట్టి ఓటేసి గెలిపిస్తిమి.. డప్పులు కొమ్ములతో ఊరేగిస్తిమి. అయాల్టి ధావతుకు మీరు సార బొట్టు పంపితిరి. నేనొక యాటపిల్లనిస్తిని. ఊరంతా ఓట్ల పండగ సేస్తిమి..’ ఇదీ గొఱ్ఱెల పెంపకందారు వీరప్ప పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ దగ్గర చెప్పుకున్నది. అతను గొఱ్ఱెలు కనుక్కోవటానికి దరఖాస్తు పెట్టుకున్నాడు, అప్పుకోసం. ‘నీకెప్పుడినా పని వుంటే నా దగ్గరకిరా! మీ కోసమే మా పదవులు’ అని చెప్పిన ప్రసిడెంట్- యిప్పుడు ఇవ్వటానికే దుర్లభం అయిపోయింది.
శ్రీ బోయ జంగయ్య రాసిన కధానిక ‘దొంగలు’లో తటస్థపడే సన్నివేశం ఇది. సాధారణంగా ‘దొంగలు’ అంటే యితరుల వస్తువులను, సొమ్మును తాము కైవశ్యం చేసుకున్నవాళ్లు అనుకుంటాం.. అయితే దొంగతనం అనేక రకాలు. పనిదొంగలు, చిన్న చిన్న లంచాలు- కానుకలు తీసుకునే వాళ్లు కూడా ‘దొంగలే’. దొరికినవాళ్లనే దొంగలు అనుకుంటాం. కాని దొరకకుండా తప్పించుకు తిరిగే వాళ్లుకూడా ‘దొంగలే’. ఉద్యోగస్తులు మాత్రమే కాదు- రాజకీయ నాయకులు కూడా రుూ కోవకు వస్తారని రుూ కథానిక చెప్పుతుంది.
గ్రామాలు తిరిగి అందరినీ అనేక ప్రలోభాలలో పెట్టి ఓట్లు సంపాదించుకుని, పదవులు కైవసం చేసుకున్న అధికారులు - ఆ అధికారం చేతికి వచ్చిన తరువాత ప్రవర్తించే తీరు ఎలా వుంటుంది? ప్రతి మనిషినీ తమకు ఏదోరకంగా ‘లంచం’ ఇచ్చేవాడుగానే చూచే మనస్తత్వం వున్న చిరుద్యోగుల ధోరణి ఎలా వుంటుందో రుూ కథానిక దృశ్యంగా చూపుతుంది.
బీరప్ప అనే అతను మేనేజరును చూడవలసి వస్తుంది, ప్రెసిడెంట్‌గారిని చూచిన తరువాత. ఆ మేనేజరు, అతని అధికారులు యనతడి ఒక గొఱ్ఱెను లంచంగా ఇచ్చుకోవలసి వచ్చింది. అప్పుడుగాని ‘అప్పు మంజూరు అయన కాగితం’ అతనికి అందలేదు. అతని కష్టాలు అంతటితో తీరిపోలేదు. పోలీసు కానిస్టేబుల్, జమేదారు అతన్ని వెంటబడి వేధిస్తారు. అతడు దాచుకున్న పొగాకు చుట్టలు తస్కరించేస్తారు. ‘ఓ చుట్ట తాగి అందర్నీ పరేషాను చేస్తావురా? దొంగ నాయాలా? పద స్టేషన్‌కు’ అని కానిస్టేబుల్ అతడిని మరికొంత ఇబ్బందిలో ముంచుతాడు.
‘లోన్ శాంక్షన్ ప్రొసీడింగ్స్’ చేతిలో పెట్టిన ఎకౌంట్ గుమాస్తా, అతని ప్రేరణతో ట్రెజరీలో గుమాస్తా కూడా అతనికి డబ్బు ఇవ్వకుండా ‘లంచం’ అడుగుతారు. తన దగ్గర డబ్బు లేదు కనుక చేతికున్న వెండి కడియం అమ్ముదామని ప్రయత్నం చేసినా- కంసాలి కుదువ దుకాణాలకు వెళ్లినా అతన్ని స్వంతదారుగా గుర్తించరు. నకిలీ వస్తువు అమ్మజూపే దొంగగానే భావిస్తారు. ఏమయితేనేం, వెండి కడియానే్న ఎకౌంట్ గుమాస్తా దగ్గర తాకట్టు పెట్టి అతను ఎలాగయితేనేం తనకు మంజూరు అయిన అప్పు ధనాన్ని చేతికి తెచ్చుకోగలుగుతాడు. ‘గొర్రెల్ని కొనాలి. కాలం మంచిగైతే సంవత్సరానికే రెండింతలయితయి. బీరప్ప దేవునికో గొర్రె పొటేల్ని యిడవాలి!’- యిదీ అతని ఆలోచన. తమకు ఇవ్వవలసిన లంచం డబ్బు ఇవ్వకుండానే, స్వగ్రామానికి ప్రయాణం అయి వెళ్లబోతున్న బీరప్పను ఎకౌంట్ గుమాస్తా, ట్రెజరీ గుమాస్తా ఇద్దరూ జాయింటుగా దండయాత్ర చేసి- బస్సు దగ్గర పట్టుకోగలుగుతారు. తన దగ్గర వున్న కడియం పైకి చూపించి వీరప్పను దబాయిస్తాడు గుమాస్తా. బీరప్ప ‘నీ అయ్యకేమన్నా బాకీయా?’ అని అప్పటికి ధైర్యం తెచ్చుకుని ఎదురించగలుగుతాడు. కడియం కోసం పోరాటంలో గుమాస్తాలు ఇద్దరూ, బీరప్ప తగాదా పడుతూ వుండడం బస్సులో తోటి ప్రయాణికులు కూడా చూచి, బీరప్ప ‘దొంగలు దొంగలు’ అని అరవడంతో, గుమాస్తాలు ఇద్దరినీ పట్టుకుని చితకతంతారు.
‘బస్సు కదిలింది.. బీరప్ప చేతికి కడియం మెరుస్తోంది’ అన్న శుభ వర్తమానంతో కథ సమాప్తం అవుతుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా గాంధీ పటాన్ని అన్ని ప్రదేశాల్లో - గవర్నమెంటు ఆఫీసుల్లో- పార్కుల్లో ప్రదర్శించి ఆదర్శంగా చెబుతున్న రోజుల్లో కూడా ‘బీరప్ప’ లాంటి చదువుకోని, కులవృత్తిని నమ్ముకుని బతుకుతున్న వాళ్ళకు ఎలా న్యాయంగా చెల్లవలసిన మూల్యం చెల్లకపోవడం- ప్రతి పనికీ కొంత లంచం ఇస్తే తప్ప కదలని కాగితాల సమాచారం- రుూ కథానిక స్పష్టపరుస్తుంది.
బీదసాదలకు, గ్రామీణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు గురించి శ్రీ జంగయ్య అనేక కథలు వ్రాశారు. కథలతో పరిస్థితులు అకస్మాత్తుగా మారిపోకపోవచ్చుగాని, చదువరులను ఆలోచింపచేస్తాయి. అన్యాయాలను అరికట్టేట్లు చేస్తాయి. అందరూ ‘తమ దాకా వస్తేనే మేలుకుంటారు’ అనలేం. కధా సాహిత్యం మానసిక వికాసానికి, వ్యక్తిగత పరివర్తనానికి దోహదం చేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

- శ్రీవిరించి, 09444963584