సాహితి
సౌందర్యం పట్టలేనంత ప్రేమ తపన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నెమిలీకలు పూచే కాలం
(కవిత్వం)
- కుప్పిలి పద్మ
వెల: రూ.100
ప్రతులకు: ముక్త పబ్లికేషన్స్
201, విజయలక్ష్మి అపార్ట్‌మెంట్స్
మెథడిస్ట్ కాలనీ,
బేగంపేట, హైదరాబాద్-500 016
గాజు కుప్పెలో పద్మం లాంటిది హృదయంలోని ప్రేమ. పద్మం వికసించే వుండచ్చు. కానీ గాజుకుప్పెను నిరంతరం భద్రంగా చూసుకోవాలి. హృదయం పట్టుకోవడం, హృదయం పరిరక్షించుకోవడం ముఖ్యం. ఋతువులు మారుతూంటాయి. ప్రకృతి నిత్య నూతనంగా పరివర్తిమవుతూంటుంది.
నువ్వు వొస్తావని కాకపోతే/ తెల్లవరుతోందే సంతోషం యెందుకు
అనే సాహచర్యంకు మించిన అనుభవ దీప్తి ఎక్కడుంది. కుప్పిలి పద్మ కవిత్వం గాజుకుప్పెలో పద్మం లాంటిది. తనది ప్రేమైక రస రసాయనం. ప్రకృతిని గాఢంగా తనలో ఇముడ్చుకున్న ప్రకృతి కృతి ‘నెమలీకలు పూసే కాలం’.
రుతువూ మనసూ కవల పిల్లల్లా/ కలిసి శ్వాసిస్తూ
ఈ ప్రపంచానికి/ అందమైన జీవనాన్ని బహూకరిస్తుంటాయ్
- అంటూ కాన్క పెట్టే - అక్షరాలు తనవి. తన భావనా ప్రపంచంలోకి అడుగుపెట్టడం అంటే క్రిక్కిరిసిన దుర్గమారణ్యంలోకి అడుగుపెట్టిన అమందానందమే! ఆమె ‘ఆంతర్యం’ ‘మళ్లీ మన కోసం’ ‘వూదావల’ పన్నినా ‘బహిరంగ రహస్యం’. నిజమే! ‘పునరావృత దృశ్యాలు’ వుంటాయి. కానీ ‘తెలియదు’. ‘చెప్పుకోండి’ అన్న - ‘కుతూహల వనం’లోని ‘మనసు తలుపు’ ‘వెలుగు కళ్లు’ విప్పి, ‘విసిరి చెదిరే వేళ’ ‘సదా నీతో’ వుంచుకునేందుకు ఓ ‘సెల్ఫీ’ తీస్తుంది. ‘రా’ అనకుండానే, ‘నువ్వూ నేనూ’ ‘వొద్దొద్దు’ అనుకుంటూనే, ‘వానాకాలం పిట్టలు’లా ‘సంతోషం’తో ‘రాత్రికిరాత్రి’ ‘చుంబన హారం’ దాల్చి, ‘జ్ఞాపకమొక పండుగ’ అనుకుంటూ - ‘పరస్పరం’ ‘శతసహస్ర దీపాలు’ వెలిగించుకునే ‘ప్రేమ ఆనవాలు’ చూపుతుంది తన కవిత్వం. అదీ ఆమె మంత్రనగరి సరిహద్దు.
ఆనందం ఏమిటంటే - ‘మా మల్లి మహా పొదుపరి’ అన్నట్లు, కథా రచనలో విస్తరించి, కవిత్వంలో పొదుపరిగానే తొణికిసలాడే పద్మ - ముఖ పుస్తకం అనే ఫేస్‌బుక్ పుణ్యమా అని పొదుపైన కమ్మని మాటల్లా అయినా, రోజూ ఒక కవిత్వ భావనగా ‘మారాకు’ తొడుగుతూనే ఉంది. ఆ రోజు కోసమే అక్కడా ‘రాజుకొనే యెదురుచూపు’ ఎందరిదోనూ!
వొక రోజంటే భూమి తను చుట్టూ తాను తిరిగే కాలం/ వొక రోజంటే యింత పెద్దదని నువ్వే చెప్పావ్...
పద్మ కవిత్వం చదువుతూంటే అతిశయోక్తి ఏం కాదు.. ‘యెవరో తెలీదు కాని - మన ఆప్తులే - వెనుకగా వచ్చి - కళ్లు మూసి - బుగ్గపై ముద్దు పెట్టి చెప్పుకోండి చూద్దాం’ అన్నట్లే వుంటుంది.
తెరిచీ తెరవని/ పుస్తకంలో/ ప్రేమ ఆనవాలునెలా చెప్పటం/ యెవ్వరికైనా - అందుకే పుస్తకం తెరిచి మీరే చదువుకోవాలి. అసంఖ్యాకమైన మాటలు వట్టి శబ్దాలుగా తేలిపోతున్నప్పుడు, తన కవిత్వం ప్రేమ సంబంధంలో మాఘ పౌర్ణమిలా జీవితోత్సవపు ఆనందాన్నీ ఆశ్చర్యాన్నీ కానుక చేస్తుంది. కన్నపు దొంగలా కాలం వచ్చి వెళ్లిపోతున్నా తేనె స్వప్నాలు అందించే పూల వేటకత్తెలు తరం నిరంతరం ఆమె కవిత్వంతో తరుముతూంటారు.
ముళ్లు గుచ్చుకోకుండా/ వొక్క మొగ్గని తెంపకుండా/ వొక్క పువ్వుని వదలకుండా/ యెంత మృదువైన వేట - అని తనియింపచేస్తారు.
‘నిజమైన ప్రేమంటే’ ఏమిటో గ్రహించడానికి తన కవిత్వం చదవాలి. నిరీక్షణ అయినా, బాధ అయినా, భగ్నమయినా యవ్వనమెక్కడిది అన్న గ్రహింపు కయినా, ప్రవేశ ద్వారం తప్ప గట్టిగా తలుపు వేసి యే దారీ లేదు అన్పించినా లోని ఆ స్నిగ్ధ పరీమళాలు, అమందానంద భావనలు, రసఝరీ స్పర్శలు వెలుపలికి దారెక్కడా అని వెతుక్కునేలా భయపెట్టవు. చదివాక దోసిళ్లలోని సంతోషపు దొంతరలను తేనెలూరే పాటలుగా చల్లాలనే లాలస! దిగులు కమ్మిన వేళ ఎవరికో మనం ముఖ్యం అనే ధైర్యం యిచ్చే, ఈ ప్రపంచంతో ఓ సజీవ ప్రేమ సంబంధపు మానవీయతలో ఓలలాడించే శిఖిపింఛ సీమంతిని ఈ కవయిత్రి. ప్రేమంటే రెండు హృదయస్పందనల యేకాకితనమైతే నాకొద్దు అనే అపరిమిత ఆలింగన బంధం ఈ కవిత్వ పఠనానుభవ గంధం.