సాహితి

సాహితీ సవ్యసాచి... సోబ్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమకాలీన అంశాలను స్పృశించడంతోపాటు సందేశాత్మక రీతిలో రచనా వ్యాసంగం చేయడమే సాహితీ ధర్మం. కేవలం రాయాలని రాయడం వల్ల ఆ రాతల్లో సార్థకత ఉండదు. ప్రతి మాట, ప్రతి పదం సామాజిక చైతన్యం కలిగించినప్పుడే ఏ రచయిత అయినా పదికాలాల పాటు రాణించగలుగుతారు. భారతదేశం భిన్న సంస్కృతుల మేళవింపు. ఇలాంటి అరుదైన సాహితీ సవ్యసాచి కృష్ణాసోబ్తి.
హిందీ సాహిత్యానికి నిరుపమానమైన సేవలందించిన రచయితల్లో కృష్ణాసోబ్తి అగ్రగణ్యురాలు. స్వాతంత్య్రానికి పూర్వం, నాటి పరిస్థితులు, దేశ విభజన నాటి దుస్థితులు, స్వతంత్ర భారతదేశ ఆశలు, ఆకాంక్షలను ఔపోసన పట్టిన కృష్ణాసోబ్తి అంతే స్ఫూర్తితో, అంతే గాఢతతో సాగించిన సాహితీ ప్రక్రియలు సమకాలీన సామాజిక స్థితిగతులకు దర్పణం పట్టేవే. భారతదేశంలో వచ్చిన మార్పులను ఆమె తన రచనల ద్వారా ఆవిష్కరించారు.
భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా సాహితీ భావం ఒక్కటేనన్న విశిష్టత 53వ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకున్న కృష్ణాసోబ్తిది. భారతీయ సాహిత్యాన్ని భిన్న సంస్కృతుల మేళవింపుతో సోబ్తి పరిపుష్టం చేశారు. ముఖ్యంగా జాతీయ భాష అయిన హిందీ ఆమె రచనా వ్యాసంగంలో మరింత కొత్త సొబగులను సంతరించుకుంది. కొత్త శక్తిని, యుక్తిని ఆమె పదజాలం పరుగులు పెట్టించిందనడానికి సోబ్తి రాసిన పుస్తకాలెన్నో ప్రత్యక్ష నిదర్శనం. ఆమె ఎంచుకున్న ఇతివృత్తాలన్నీ కూడా ఆనాటి సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టడంతో పాటు సాహసం, ధైర్యం, మేళవించిన అరుదైన పాత్రలతో కూడుకున్నవే. ముఖ్యంగా హిందీ, ఉర్దూ, పంజాబీ సంస్కృతులను తన రచనల్లో మేళవించడం ద్వారా సోబ్తి సాహితీ భాష మరింత వనె్నలీనింది. కథ అయినా, వ్యాసమైనా, సాహితీ ప్రక్రియ అయినా అందులో తన ముద్ర కచ్చితంగా ఉండాలన్న దృఢమైన సంకల్పం ఆమె ప్రతి రచనలోనూ కనిపిస్తుంది. 1925 ఫిబ్రవరి 18న ప్రస్తుతం పాకిస్తాన్‌లో వున్న పంజాబ్‌లో జన్మించిన సోబ్తి ‘హష్మత్’ పేరుతో కూడా రచనలు చేశారు. రచయితలు, తన సన్నిహితుల గురించి ‘హం హష్మత్’ పేరుతో సోబ్తి రాసిన సంకలనం విశేష ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. మూస పద్ధతులకు, కాలం చెల్లిన రాతలకు భిన్నంగా ఆమె తన రచనలు సాగించడం వల్ల అంతే పదునుతో కొత్త రచనా విధానాన్ని ఆవిష్కరించడం వల్ల ఆమె పుస్తకాలన్నీ విశేషమైన రీతిలో పాఠకుల ఆదరణ పొందాయి. రచయిత గొప్పతనం అన్నది పాత్రలను సృష్టించడంతోపాటు ఆ పాత్రల ద్వారా ఉన్నతమైన భావాలను పాదుకొల్పడంలోనూ, విలువలను ప్రోది చేయడంలోనే ఉంటుంది. ఈ విషయంలో సోబ్తిది అందె వేసిన చెయ్యి. దేశ విభజన నాటి పరిస్థితులను కళ్లకు కట్టే విధంగా ఆమె ఎన్నో రచనలు చేశారు. బంధాలు, బాంధవ్యాలు ఏవిధంగా తెగిపోయాయో వాటి ప్రభావం అటు పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చినవారిలోనూ, ఇక్కడినుంచి పాకిస్తాన్ వెళ్లినవారిలోనూ ఎంత బలీయమైన ప్రభావాన్ని కనిపించాయో ఆమె తన పాత్రల ద్వారా కళ్లకు కట్టారు. అలాగే స్ర్తి, పురుష సంబంధాల గురించి వారి మధ్య ఉండే అనిర్వచనీయమైన అనురాగం, ఆప్యాయత వంటి భావనల గురించి ఎందరో ఎన్నో పుస్తకాలు రాసినా ఈ అంశానికి సంబంధించి సోబ్తి రచనలన్నీ కొత్త కోణంలో కొత్త సాహితీ సంవిధానంలోనే కొనసాగాయి. అలాగే భారతీయ సమాజంలో మారుతున్న పరిస్థితుల గురించి ఆ మార్పుల ప్రభావం యువతీ యువకులపై ఏవిధంగా ఉండే అవకాశం ఉంటుందన్న దానిపైనా ఆమె అద్భుతమైన రచనలు సాగించారు. అన్నింటికీ మించి సమాజం అన్నది మానవ విలువలు ఎప్పటికప్పుడు బలీయమైతేనే ఉన్నతంగా నిలుస్తుంది. అలాంటి విలువలే పతనమవుతున్నాయంటూ ఆమె చేసిన రచనలు అదే స్థాయిలో పాఠకుల్లో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. ముఖ్యంగా డార్ సే బిఛుడీ, మిత్రో మర్‌జానీ, యారోం కే యార్, తిన్ పహాడ్, బాదలోం కే ఘేరే, సూరజ్‌ముఖీ అంధేరేకే, జిందగీనామా, యే లడ్‌కీ, దిలో దానిశ్, హమ్ హశ్మత్ (రెండు భాగాలు), సమయ్ సర్‌గమ్ - వంటి పుస్తకాలు రచయితగానే కాకుండా సరికొత్త రీతిలో పాత్రలను సృష్టించి వాటిద్వారా ఉన్నతమైన భావాలను ఆవిష్కరించడంలో సోబ్తికి ఉన్న సత్తాను చాటాయి. ఆమె పుస్తకాలు అనేక భారతీయ భాషలతో పాటు ఇంగ్లీషు, స్వీడిష్, రష్యా భాషల్లోకి అనువదించబడినాయి. అందుకు కారణం ఈ పుస్తకాలకు కేవలం దేశీయంగానే కాకుండా వాటిలోని భావాల పట్ల అద్భుతమైన రీతిలో సాగిన పాత్రల కల్పనా చాతుర్యం పట్ల ఇతర దేశాల పాఠకుల్లోనూ ఆసక్తి కలగడమే. హిందీ అకాడమీ అవార్డులు, మైథిలీ శరణ్‌గుప్తా సమ్మాన్ అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు భారతదేశ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అవార్డును ఆమె పొందారు.
సాహిత్యంలోనే మమేకమై దానే్న శ్వాసగా మార్చుకుని ఎన్నో కొత్త ప్రక్రియలకు జీవం పోసిన సోబ్తికి జ్ఞానపీఠ్ పురస్కారం రావడం ఆ అవార్డుకే మరింత వనె్న. సాహితీ రచనా వ్యాసంగంలోనే తొమ్మిది పదుల వయసును పండించుకున్న సోబ్తికి ఈ అవార్డు ఆమె సాగించిన వినూత్న రచనా శైలికే కాకుండా సామాజిక కోణంలోనూ, చైతన్య స్ఫూర్తితోనూ సాగించిన రచనలకు ఓ పెద్ద గుర్తింపు.

- బి. రాజేశ్వర ప్రసాద్