సాహితి

చిన్ననాటి మా వీధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పటి మా వీధి
దుమ్ముపట్టని అద్దంలా తళతళలాడేది
కోడికూత ముందే
వీధిలో గాజుల గలగలలు విన్పించేవి
చీపుర్ల శబ్దాలు నిద్రలేపేవి
కళ్లాపి ధ్వనులు మత్తు వదిలించేవి
మంచం దిగి బయటికి రాగానే
మా వీధి నా మనసుని ‘ముగ్గు’లోకి దింపేది

మా వీధిని సంక్రాంతి మాసంలో చూడాలి
మనుషుల అందాలకన్నా
వీధి శోభలే ఎదల్ని దోచుకునేది
నిత్యం సందడి ప్రవాహమయ్యేది
మా వీధి అనేక కుటుంబాల్లాగాక
వీథైక కుటుంబంలా ప్రవర్థిల్లేది
పక్కింటి వేడుకైతే
తనింట్లో సంబరమని తలచుకునేవారు
ఒకరింట కష్టమొస్తే
వీధి వీధంతా అండగా నిలిచేది
వౌనమెప్పుడు మా వీధినుండేది గాదు
అమ్మా అక్కా బావా మావలంటూ
ఏదో వరసల అలికిడి విన్పిస్తుండేది
టేగలో ఐసులో సంతల చాటింపో
మా వీధిలో ధ్వనిస్తూనే ఉండేది
బుడబుక్కలవాడో గంగిరెద్దులవాడో
సాలుసరి బంధువుల్లా వచ్చి పలకరించేవాళ్లు
కొండదేవర కొండదేవర పలుకంటూ
గుండెలోని కష్టాన్ని తడిమిపోయేవాడు
సోది చెబుతా సోది చెబుతానంటూ
విషాదం గట్టెక్కు సూత్రాన్ని చెప్పిపోయేది

చిన్ననాటి మా వీధి గుర్తొస్తే
పెద్దగా కలత జెందుతాను
అప్పటి అనుబంధాలు ఇప్పుడు లేవు
అప్పటి ఆత్మీయతల జాడల్లేవు
ఆ ఇంటి కాకిని ఈ ఇల్లు సహించదు
పైకి నోళ్లు ప్రేమను పారిస్తాయి గానీ
నొసల్లో విషం వెక్కిరిస్తుంది
ఎవడి స్వార్థంలో వాడే బతుకుతున్నాడు
ఒకడి మురుగు ఇంకొకడికి పులుముతున్నాడు
ఇపుడు మా వీధిలో మురికిగొంతులొచ్చాయి
అంతస్థుల భాషలతో వీధిలో గంతులేస్తున్నాయి
ఇప్పటి మా వీధిని చూస్తే
తినే అన్నం కూడా పక్కన పెట్టేస్తాను
ఒకడింకొకడిని అసూయ కండ్లతో గాయపరుస్తాడు
ఇంకొకడొకడితో కయ్యానికి కాలు దువ్వుతాడు
ఇప్పటి మా వీధిని జూస్తే
మనసు లోతులదాకా ముల్లు గుచ్చుకుంటుంది
నిత్యం గాయాల పాలవడం నచ్చక
అలనాటి వెలలేని మా వీధి జ్ఞాపకాల్లో దాక్కుంటాను
అప్పటి మా వీధి అద్దం నిండా
ఇప్పుడు ఇంట్లో వాడేసిన చెత్తంతా కమ్ముకుంటుంటే
ఏం చేయలేక సతమతవౌతున్నాను
‘స్వచ్ఛ్భారత్’’ ఆచ‘రణం’
మా వీధి నుంచి మొదలైతే ఎంత బాగుణ్ణు
వీధిని కడిగి మళ్లీ తళతళ మెరిపిస్తే ఎంతో బాగుణ్ణు
పనిలో పనిగా
మా వీధి మనుషుల మాలిన్యాన్నీ
తొలగిస్తే ఇంకా బాగుణ్ణు

మా చిన్ననాటి వీధి దర్పణంలో
నన్ను నేను మళ్లీ దర్శించుకోవాలనుంది
మళ్లీ మళ్లీ
ఆనాటి మానవ సంబంధాల్ని చూడాలని వుంది
ఆనాటి హృదయ గంధాల్ని ఆస్వాదించాలనుంది!

- మెట్టా నాగేశ్వరరావు